private financiers
-
గిరిగిరి.. కిరికిరి
వేములవాడకు చెందిన రాజు చిరువ్యాపారి. గతేడాది శివరాత్రి జాతర సందర్భంగా టాయ్స్(బొమ్మలు) విక్రయిస్తే మంచిలాభం వస్తుందనే ఆశతో ఫైనాన్షియర్‌ను సంప్రదించాడు. రూ.లక్షల్లోంచి రూ.15వేలు కోత విధించిన సదరు ఫైనాన్షియర్.. రాజుకు రూ.85 వేలు అప్పు ఇచ్చాడు. రోజూ రూ.వెయ్యి చొప్పున వందరోజుల్లో బాకీ తీర్చాలని నిబంధన విధించాడు. కాలం కలిసిరాలేదు.. వ్యాపారం సక్రమంగా సాగలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడం రాజుకు కష్టంగా మారింది. అప్పు ఇచ్చిన వ్యక్తి రోజూ దుకాణానికి వచ్చి వాయిదా చెల్లించాలని పరుషపదజాలంలో దూషించాడు. దీంతో రాజు బాకీ తీర్చేందుకు షాపు అమ్మేశాడు.. చివరకు భార్యపై ఉన్న బంగారం విక్రయించి ఊరు వదిలి పెట్టి వెళ్లిపోయాడు. ఇట్లాంటి వారు వేములవాడ రాజన్న గుడి ఎదుట వందల సంఖ్యలో ఉన్నారు. సిరిసిల్లలోనూ గిరిగిరి చిట్టీలు, ఫైనాన్స్ బాధితుల వేదన వర్ణణాతీతం. సిరిసిల్లక్రైం: వడ్డీవ్యాపారులు, గిరిగిరి ఫైనాన్స్ నడిపేవారు జిల్లావ్యాప్తంగా సుమారు 450 వరకు ఉంటారని అంచనా. ఒక్క వేములవాడలోనే 300 – 400 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. జిల్లాకేంద్రం సిరిసిల్లలో 50 – 100 మంది వరకు ఉంటారని సమాచారం. అనుమతిలేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ వ్యవహారం నడుపుతున్న వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడురోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. దీంతో వడ్డీవ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అధిక మిత్తికి ఆశపడి ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుందా? లేదా? అని భయపడుతున్నారు. ఫైనాన్స్‌లు, గిరిగిరి చిట్టీలు నిర్వహిస్తూ వడ్డీల పేరిట వేధిస్తే నేరుగా పోలీస్ కార్యాలయాలకు రావాలని ఎస్పీ ప్రకటించడంతో వ్యాపారుల్లో వణుకు పుడుతోంది. పైగా ఫైనాన్స్ దందా నిలిపి వేశారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా రూ.కోట్లు అప్పు తీసుకుని చిరువ్యాపారులు వ్యాపారం చేసేవారు. కానీ మహాశివరాత్రికి వారంరోజుల ముందు నుంచే జరుగుతున్న పోలీసుల దాడులతో అప్పులిచ్చే వారు, తీసుకునే వారికి బ్రేకులు పడ్డాయని తెలిసింది. కానరాని వసూళ్లు.. జిల్లాలోని ప్రధాన పట్టణాలు సిరిసిల్ల, వేములవాడలో ఇప్పటి వరకు 14 మంది వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వడ్డీవ్యాపారం ఒక్కసారిగా స్తంభించింది. దాడులకు ముందు గిరిగిరి (డైలీ) అప్పు ఇచ్చి రోజూవారిగా వసూలు చేసేవారు ఇప్పుడు బయటకు వెళ్లడంలేదని సిరిసిల్లలోని ఓ షాపు నిర్వాహకుడు తెలిపారు. వే ములవాడలో అప్పులిచ్చిన వారికి ఫోన్ చేసి.. వాయిదా చెల్లిస్తామని బాకీదారులు చెప్పినా ఫైనాన్షియర్లు ముందుకు రావడంలేదని తెలిసింది. కొందరైతే ఏకంగా తమ మైబైల్స్‌ను స్విచ్ఆఫ్ చేసినట్లు తెలిసింది. మూడురోజులుగా ఇదేపరిస్థితి కొనసాగుతోంది. చితికిపోతున్న చిరువ్యాపారులు.. నిబంధనల ప్రకారం వడ్డీవ్యాపారాలు చేయాలని, అలాకాని పక్షంలో చట్ట పరిధిలో చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించడాన్ని కొందరు చిరువ్యాపారులు సమర్థిస్తున్నారు. అదేసమయంలో తమ వ్యాపారాలు సాగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారాలు చేసేందుకు బ్యాంకర్లు అప్పులు ఇవ్వరని, ఒకవేళ కొందరు అధికారులు ఇచ్చేందుకు అంగీకరించినా ఏవేవో కుంటిసాకులు చెబుతారని, సాక్షులు, డిపాజిట్ అడుగుతారని పేర్కొంటున్నారు. అందుకే కాస్త ఎక్కువ మిత్తి అయినా, అడిగిన వెంటనే అప్పులిచ్చే ఫైనాన్షియర్స్‌ను ఆశ్రయిస్తున్నామని అంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వడ్డీవ్యాపారులు జలగల్లా పీక్కుతింటున్నారని ఆవేదన చెందుతున్నారు. దక్షిణకాశీగా పేరున్న వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా పదిరోజులపాటు వ్యాపారం చేసేందుకు రూ.10 చొప్పున అప్పు చేసినా.. దేవుడి దయవల్ల వ్యాపారం బాగా నడిస్తే వాటిని తీర్చేవాళ్లమని, పోలీసుల వరుస దాడులతో ఇప్పుడు అప్పు పుట్టడడమే గగనంగా మారిందన్న ఓ చిరువ్యాపారి అన్నారు. వడ్డీల పేరిట రక్తాన్ని పీల్చే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలంటూనే, అక్రమంగా ఉన్న డబ్బును బ్యాంకుల్లో చేర్చి వారికి ఆస్తిపన్ను పడేలా చూడాలని, వ్యాపారులకు బ్యాంకులు రుణాలు అందించేలా చూడాలని కోరుతున్నారు. కొనసాగుతున్న దాడులు.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వడ్డీ, చిట్టీల నిర్వహణ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత బుధవారం సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేటలో ఏకకాలంలో దాడులు చేసి 11 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఇద్దరిని, శుక్రవారం మరొకరిని అరెస్డ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ సీఐ బన్సీలాల్ నేతృత్వంలో వరుస దాడులు సాగిస్తున్నారు. శుక్రవారం వేములవాడ సాయినగర్‌కు చెందిన వ్యాపారి ఖమ్మం గణేశ్ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అతడి నుంచి 22 ప్రాంసరీ నోట్లు, 3 బాండు పేపర్లు, 4 చెక్కులు, 9 నోట్బక్కులు, ఒక రిజిష్టర్, 4 చెక్కుబుక్కులు, 8 చిట్టీబుక్కులు, 1 గాయత్రీ బ్యాంకు పాస్బుక్కు, నగదు లెక్కించే యంత్రం, రూ.2.21 లక్షల నగుదు, రెవెన్యూ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందంలో ఎస్సైలు సత్యనారాయణరెడ్డి, చీనానాయక్ పాలుపంచుకుంటున్నారు. గిరిగిరి చిట్టీ వ్యాపారం ఇలా.. ఒకరికి రూ.లక్ష అవసరం ఉంటే.. రూ.15 వేలు ముందుకుగా కట్‌చేసుకుని మొగతా రూ.85 వేలను ప్రైవేట్ ఫైనాన్షియర్ చెల్లిస్తాడు. బాకీదారు రోజూ రూ.వెయ్యి చొప్పున వందరోజుల పాటు చెల్లించాలి. ఇలా చెల్లించిన సొమ్ము రూ.లక్ష వరకు చేరుతుంది. అంటే.. బాకీదారు రూ.85 వేలకు వంద రోజుల్లోనే రూ.15 వేల వడ్డీ చెల్లిస్తున్నాడన్నమాట. ఇలాంటి వ్యాపారులు రోజూ కనీసంఇరవై మందికి ఫైనాన్స్ ఇస్తున్నారు. రోజూవారీగా వసూలు చేసే సొమ్మును మళ్లీ ఇతరులకు అప్పుగా ఇస్తున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించే బాకీదారుకు రూ.6 – రూ.8 వరకు వడ్డీ పడుతుండగా, ఆలస్యమైన వారు రూ.10కి మించి చెల్లించాల్సి వస్తోంది. రోజూ దాడులు.. నిబంధనలు అతిక్రమించి, ప్రజలను హింసించి వ్యాపారాలు చేసేవారిపై పోలీస్‌శాఖ రోజూ దాడులు చేస్తూనే ఉంటుంది. వడ్డీ వ్యాపారులు, చిట్టీల నిర్వాహకులు తమ పద్ధతి మార్చుకోవాలి. లేనిపక్షంలో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత దాడుల ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నాం. – విశ్వజిత్ కాంపాటి, ఎస్పీ -
నడ్డి విరుస్తున్న వడ్డీ!
కరీంనగర్‌క్రైం: ఫైనాన్స్.. ఈ పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధిక వడ్డీకి అప్పు ఇస్తూ.. ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్నారు. ఆ అప్పు చెల్లించలేని పక్షంలో తాకట్టు పెట్టిన ఆస్తులను జప్తు చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రైవేట్, డైలీ ఫైనాన్స్ మాఫియాగా మారాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలను పిప్పి చేస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థలకు అనుమతి అటుంచితే.. అదుపులేని వడ్డీతో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. వీరి బారిన పడుతున్న పేదలు ఇళ్లు, భూములు గుల్ల చేసుకుంటున్నారు. అక్రమ వ్యాపారాన్ని నియంత్రించాల్సిన అధికారులు వ్యాపారులకే వత్తాసు పలుకుతుండడంపై అనుమానాలకు తావిస్తోంది. ఇలా అధిక వడ్డీలు వసూలు చేసేక్రమంలో పలువురి మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతం బయటకు వచ్చిందిగానీ.. అతడి స్థాయిలోకాకున్నా.. అదే పద్ధతిలో జిల్లావ్యాప్తంగా పలువురు ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వహిస్తూ.. పేదల కష్టార్జితాన్ని లాగేసుకుంటున్నారు. సిరిసిల్లలో కలకలం: రాజన్నసిరిసిల్ల జిల్లాలో పలువురు వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో వడ్డీవ్యాపార బాగోతం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో పోలీసులు దాడులు చేసి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల రికార్డులు స్వాధీనం చేసుకున్నా.. విచారణ మాత్రం అడుగు ముందుకు పడలేదు. రూ.25కోట్ల పైమాటే.. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ రూ.25 కోట్లమేర ప్రైవేట్, గిరిగిరి, డైలీ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. చాలామంది రూ.10వేలు మొదలు.. రూ.50లక్షల వరకూ అప్పు ఇస్తున్నారు. ముందుగానే రూ.10 నుంచి రూ.15 వడ్డీని పట్టుకుంటున్నారు. (రూ.వెయ్యి అప్పుగా తీసుకుంటే రూ.150 పట్టుకుని రూ.850 ఇస్తారు) ఇందుకు ఖాళీ చెక్కులు, ప్రామిసరినోట్లు, తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారు. బాధితుడు సకాలంలో అప్పు చెల్లించినా.. కాగితాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. మరికొందరు భూములను తాకట్టు పెట్టుకుని దాని విలువలో 40 నుంచి 60 శాతం అప్పు ఇస్తున్నారు. అనివార్య కారణాలతో ఆలస్యమైతే.. అప్పుఇచ్చే సమయంలో రాయించుకున్న కాగితాల ప్రకారం.. యజమానికి సమాచారం ఇవ్వకుండానే అమ్ముకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆస్తిని హామీగా ఉంచితే 9 శాతం, హామీ లేకపోతే 12శాతం వడ్డీ తీసుకునే అవకాశం ఉంది. కానీ.. జిల్లాలో మాత్రం 40నుంచి45 శాతం వసూలు చేస్తున్నారంటే వ్యాపారుల అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. భూములు తాకట్టు పెట్టుకుని అప్పు ఇచ్చేవారు కరీంనగర్ నగరంలోనే 30మంది, ప్రైవేట్ ఫైనాన్స్‌లు, డైలీ, గిరిగిరి ఫైనాన్షియర్లు 70 మంది వరకూ ఉన్నారు. పోలీసులూ.. ఫైనాన్షియర్లే.. మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతం బయటకు రావడంతో అధిక వడ్డీలకు అప్పు ఇస్తున్నవారిలో పోలీస్ అధికారులూ ఉన్నట్లు అవగతమవుతోంది. కరీంనగర్‌లోనే పలు ఠాణాలు తీరుగుతున్న ఓ కానిస్టేబుల్ తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున రియల్ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు కూడబెట్టడంతోపాటు పలు వెంచర్లలోనూ భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. విభజిత జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో ఉంటున్న సుమారు 20 మంది వరకూ అప్పులిస్తారని, వీరు కూడా 5 నుంచి 8 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని సమాచారం. వీరు సొంతశాఖలోని సిబ్బందికే అప్పు ఇచ్చి.. చెల్లించడంలో ఆలస్యమైతే అధికారి ద్వారా ఒత్తిడి తెచ్చి వారివేతనం నుంచి తీసుకుంటున్నట్లు తెలిసింది. వీరిబారిన పడినవారు చాలామంది ఉన్నా.. బయటకు చెప్పుకోలేకపోతున్నట్లు సమాచారం. గతంలో పలువురు వడ్డీ విషయంలో హెడ్‌క్వార్టర్‌లోనే పలు గొడవలు కూడా జరిగాయని సమాచారం. నిర్లక్ష్య ఫలితం..? అప్పు తీసుకునే వ్యక్తినుంచి ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకోవడం చట్టరీత్యా నేరం. దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే ఫైనాన్షియర్లలో పోలీసులే ఉండడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ఒకవేళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. చిన్నచిన్న కేసులు పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు ఫిర్యాదు చేయాలంటే జంకుతున్నారు. ఆదాయపన్ను శాఖ ఏం చేస్తోంది..? నిబంధనల ప్రకారం చేబదులుగా అప్పు ఇస్తే అనుమతి అవసరం లేదు. వ్యాపారంగా చేస్తే మాత్రం లైసెన్స్ ఉండాలి. కానీ.. జిల్లావ్యాప్తంగా అప్పు ఇస్తున్న ఫైనాన్స్ సంస్థలు ఎలాంటి అనుమతి లేకున్నా.. ఆదాయపన్నుశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నా.. ఐటీ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదో అంతుచిక్కని ప్రశ్నగామారింది. గతంలో అదాయపన్ను శాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి అధికంగా భూములు కోనుగోలు చేస్తున్న సమాచారం సేకరిస్తుండగా.. ఓ వ్యక్తి కరీంనగర్ మండలంలో రూ.30 కోట్లు పెట్టి భూమి కొనుగోలు చేశాడని తెలిసి అవాక్కయ్యారు. కోట్ల రూపాయలు డైలీ, గిరిగిరి ఫైనాన్స్‌లు నడిపిస్తున్నవారిలో 95 శాతంమంది కనీసం రూ.లక్ష కూడా ఆదాయపన్ను చెల్లించడం లేదని సమాచారం. వివరాలు సేకరిస్తున్న పోలీసులు సిరిసిల్లలో పోలీసులు దాడులు చేసి.. పలువురు వ్యాపారులను అరెస్ట్ చేయడంతో మిగిలిన మూడు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్రమంగా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఫైనాన్షియర్ల బారినపడిన వారి వివరాలు సేకరించాలని పోలీసుల అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న సీపీ కమలాసన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
నడిరోడ్డులో చితకబాదారు
హైదరాబాద్: అప్పుతీసుకున్న వ్యక్తిపై ప్రైవేటు ఫైనాన్షియర్లు దాడికి దిగిన ఘటన సరూర్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. వడ్డీ కట్టలేదన్న కారణంతో నడిరోడ్డులో జయశంకర్‌పై అనే వ్యక్తిపై ప్రైవేటు ఫైనాన్షియర్లు దేవేందర్ రెడ్డి, జంగారెడ్డి దాడికి దిగారు. జయశంకర్‌పై పిడిగుద్దులు కురిపించారు. బ్యాటుతో విచక్షణారహితంగా బాదారు. అడ్డొచ్చిన జయశంకర్ తల్లిపై కూడా దాడి చేశారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రెండు నెలల్లో అప్పు మొత్తం తీర్చేస్తానని చెప్పినా వినకుండా తనపై దాడి చేశారని బాధితుడు జయశంకర్ మీడియా ముందు వాపోయాడు. అసలు వద్దని వడ్డీ మాత్రమే కట్టాలని తనను వేధించారని తెలిపాడు. రోజూ తనను వెంబడిస్తున్నారని, కారులోంచి బయటకు లాగి తనపై పది మంది దాడి చేశారని వెల్లడించాడు. తన తల్లిని కూడా విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అనుచరులుగా దేవేందర్ రెడ్డి, జంగారెడ్డి చెప్పుకుంటున్నారని తెలిపాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశారు.