గిరిగిరి.. కిరికిరి | vemulawada police raid on finances for not having valid papers | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 10 2018 3:52 PM | Last Updated on Sat, Feb 10 2018 3:52 PM

vemulawada police raid on finances for not having valid papers

వేములవాడకు చెందిన రాజు చిరువ్యాపారి. గతేడాది శివరాత్రి జాతర సందర్భంగా టాయ్స్‌(బొమ్మలు) విక్రయిస్తే మంచిలాభం వస్తుందనే ఆశతో ఫైనాన్షియర్‌ను సంప్రదించాడు. రూ.లక్షల్లోంచి రూ.15వేలు కోత విధించిన సదరు ఫైనాన్షియర్‌.. రాజుకు రూ.85 వేలు అప్పు ఇచ్చాడు. రోజూ రూ.వెయ్యి చొప్పున వందరోజుల్లో బాకీ తీర్చాలని నిబంధన విధించాడు. కాలం కలిసిరాలేదు.. వ్యాపారం సక్రమంగా సాగలేదు. ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించడం రాజుకు కష్టంగా మారింది. అప్పు ఇచ్చిన వ్యక్తి రోజూ దుకాణానికి వచ్చి వాయిదా చెల్లించాలని పరుషపదజాలంలో దూషించాడు. దీంతో రాజు బాకీ తీర్చేందుకు షాపు అమ్మేశాడు.. చివరకు భార్యపై ఉన్న బంగారం విక్రయించి ఊరు వదిలి పెట్టి వెళ్లిపోయాడు. ఇట్లాంటి వారు వేములవాడ రాజన్న గుడి ఎదుట వందల సంఖ్యలో ఉన్నారు. సిరిసిల్లలోనూ గిరిగిరి చిట్టీలు, ఫైనాన్స్‌ బాధితుల వేదన వర్ణణాతీతం. 

సిరిసిల్లక్రైం: వడ్డీవ్యాపారులు, గిరిగిరి ఫైనాన్స్‌ నడిపేవారు జిల్లావ్యాప్తంగా సుమారు 450 వరకు ఉంటారని అంచనా. ఒక్క వేములవాడలోనే 300 – 400 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. జిల్లాకేంద్రం సిరిసిల్లలో 50 – 100 మంది వరకు ఉంటారని సమాచారం. అనుమతిలేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్‌ వ్యవహారం నడుపుతున్న వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మూడురోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. దీంతో వడ్డీవ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

అధిక మిత్తికి ఆశపడి ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుందా? లేదా? అని భయపడుతున్నారు. ఫైనాన్స్‌లు, గిరిగిరి చిట్టీలు నిర్వహిస్తూ వడ్డీల పేరిట వేధిస్తే నేరుగా పోలీస్‌ కార్యాలయాలకు రావాలని ఎస్పీ ప్రకటించడంతో వ్యాపారుల్లో వణుకు పుడుతోంది. పైగా ఫైనాన్స్‌ దందా నిలిపి వేశారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా రూ.కోట్లు అప్పు తీసుకుని చిరువ్యాపారులు  వ్యాపారం చేసేవారు. కానీ మహాశివరాత్రికి వారంరోజుల ముందు నుంచే జరుగుతున్న పోలీసుల దాడులతో అప్పులిచ్చే వారు, తీసుకునే వారికి బ్రేకులు పడ్డాయని తెలిసింది.

కానరాని వసూళ్లు..
జిల్లాలోని ప్రధాన పట్టణాలు సిరిసిల్ల, వేములవాడలో ఇప్పటి వరకు 14 మంది వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వడ్డీవ్యాపారం ఒక్కసారిగా స్తంభించింది. దాడులకు ముందు గిరిగిరి (డైలీ) అప్పు ఇచ్చి రోజూవారిగా వసూలు చేసేవారు ఇప్పుడు బయటకు వెళ్లడంలేదని  సిరిసిల్లలోని ఓ షాపు నిర్వాహకుడు తెలిపారు. వే ములవాడలో అప్పులిచ్చిన వారికి ఫోన్‌ చేసి.. వాయిదా చెల్లిస్తామని బాకీదారులు చెప్పినా ఫైనాన్షియర్లు ముందుకు రావడంలేదని తెలిసింది. కొందరైతే ఏకంగా తమ మైబైల్స్‌ను స్విచ్‌ఆఫ్‌ చేసినట్లు తెలిసింది. మూడురోజులుగా ఇదేపరిస్థితి కొనసాగుతోంది.

చితికిపోతున్న చిరువ్యాపారులు..
నిబంధనల ప్రకారం వడ్డీవ్యాపారాలు చేయాలని, అలాకాని పక్షంలో చట్ట పరిధిలో చర్యలు తప్పవని పోలీస్‌ అధికారులు హెచ్చరించడాన్ని కొందరు చిరువ్యాపారులు సమర్థిస్తున్నారు. అదేసమయంలో తమ వ్యాపారాలు సాగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారాలు చేసేందుకు బ్యాంకర్లు అప్పులు ఇవ్వరని, ఒకవేళ కొందరు అధికారులు ఇచ్చేందుకు అంగీకరించినా ఏవేవో కుంటిసాకులు చెబుతారని, సాక్షులు, డిపాజిట్‌ అడుగుతారని పేర్కొంటున్నారు.

అందుకే కాస్త ఎక్కువ మిత్తి అయినా, అడిగిన వెంటనే అప్పులిచ్చే ఫైనాన్షియర్స్‌ను ఆశ్రయిస్తున్నామని అంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వడ్డీవ్యాపారులు జలగల్లా పీక్కుతింటున్నారని ఆవేదన చెందుతున్నారు. దక్షిణకాశీగా పేరున్న వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా పదిరోజులపాటు వ్యాపారం చేసేందుకు రూ.10 చొప్పున అప్పు చేసినా.. దేవుడి దయవల్ల వ్యాపారం బాగా నడిస్తే వాటిని తీర్చేవాళ్లమని, పోలీసుల వరుస దాడులతో ఇప్పుడు అప్పు పుట్టడడమే గగనంగా మారిందన్న ఓ చిరువ్యాపారి అన్నారు. వడ్డీల పేరిట రక్తాన్ని పీల్చే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలంటూనే, అక్రమంగా ఉన్న డబ్బును బ్యాంకుల్లో చేర్చి వారికి ఆస్తిపన్ను పడేలా చూడాలని, వ్యాపారులకు బ్యాంకులు రుణాలు అందించేలా చూడాలని కోరుతున్నారు. 

కొనసాగుతున్న దాడులు..
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వడ్డీ, చిట్టీల నిర్వహణ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత బుధవారం సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేటలో ఏకకాలంలో దాడులు చేసి 11 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఇద్దరిని, శుక్రవారం మరొకరిని అరెస్డ్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ బన్సీలాల్‌ నేతృత్వంలో వరుస దాడులు సాగిస్తున్నారు. శుక్రవారం వేములవాడ సాయినగర్‌కు చెందిన వ్యాపారి ఖమ్మం గణేశ్‌ ఇంటిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. అతడి నుంచి 22 ప్రాంసరీ నోట్లు, 3 బాండు పేపర్లు, 4 చెక్కులు, 9 నోట్‌బక్కులు, ఒక రిజిష్టర్, 4 చెక్కుబుక్కులు, 8 చిట్టీబుక్కులు, 1 గాయత్రీ బ్యాంకు పాస్‌బుక్కు, నగదు లెక్కించే యంత్రం, రూ.2.21 లక్షల నగుదు, రెవెన్యూ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ బృందంలో ఎస్సైలు సత్యనారాయణరెడ్డి, చీనానాయక్‌ పాలుపంచుకుంటున్నారు. 

గిరిగిరి చిట్టీ వ్యాపారం ఇలా..
ఒకరికి రూ.లక్ష అవసరం ఉంటే.. రూ.15 వేలు ముందుకుగా కట్‌చేసుకుని మొగతా రూ.85 వేలను ప్రైవేట్‌ ఫైనాన్షియర్‌ చెల్లిస్తాడు. బాకీదారు రోజూ రూ.వెయ్యి చొప్పున వందరోజుల పాటు చెల్లించాలి. ఇలా చెల్లించిన సొమ్ము రూ.లక్ష వరకు చేరుతుంది. అంటే.. బాకీదారు రూ.85 వేలకు వంద రోజుల్లోనే రూ.15 వేల వడ్డీ చెల్లిస్తున్నాడన్నమాట. ఇలాంటి వ్యాపారులు రోజూ కనీసంఇరవై మందికి ఫైనాన్స్‌ ఇస్తున్నారు. రోజూవారీగా వసూలు చేసే సొమ్మును మళ్లీ ఇతరులకు అప్పుగా ఇస్తున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించే బాకీదారుకు రూ.6 – రూ.8 వరకు వడ్డీ పడుతుండగా, ఆలస్యమైన వారు రూ.10కి మించి చెల్లించాల్సి వస్తోంది.

రోజూ దాడులు..
నిబంధనలు అతిక్రమించి, ప్రజలను హింసించి వ్యాపారాలు చేసేవారిపై పోలీస్‌శాఖ రోజూ దాడులు చేస్తూనే ఉంటుంది. వడ్డీ వ్యాపారులు, చిట్టీల నిర్వాహకులు తమ పద్ధతి మార్చుకోవాలి. లేనిపక్షంలో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత దాడుల ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నాం. 
– విశ్వజిత్‌ కాంపాటి, ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

గిరిగిరి చిట్టీదారుల వ్యాపార కేంద్రాలు ఇవే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement