న్యూఢిల్లీ: అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల కూటమి పార్టీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు గురువారం తిరస్కరణకు గురైంది. వాస్తవికత లోపించిందని, వ్యక్తిగత దాడిని ఈ నోటీసు ప్రతిబింబిస్తోందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ నోటీసు మొత్తం తప్పుల తడకగా ఉంది.
ప్రామాణిక విధానంలో రూపొందించ లేదు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రతిష్టను దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా నోటీసును సిద్ధంచేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ప్రవేశపెట్టిన నోటీస్ ఇది’’ అంటూ హరివంశ్ ఈ నోటీసును తిరస్కరించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత వివరాలున్న మూడు పేజీల రూలింగ్‌ను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోడీ గురువారం సభ ముందు ఉంచారు.
పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ధన్‌ఖడ్‌పై తాము విశ్వాసం కోల్పోయామని, ఆయనను ఆ పదవిని తప్పించాలని కోరుతూ 60 మంది విపక్ష పార్టీల ఎంపీలు డిసెంబర్ పదో తేదీన సంతకాలుచేసి ఆ అభిశంసన తీర్మాన నోటీసును రాజ్యసభలో అందించిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు వీలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) కింద విపక్షాలు ఈ నోటీసును ఇచ్చాయి.
‘‘ నోటీస్ ద్వారా విపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతి అధికారాలను తక్కువ చేసి చూపించే అనవసర సాహసం చేశారు. పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్న ఈ నోటీసు డిప్యూటీ ఛైర్మన్ అభిప్రాయాలను కించపరిచేలా ఉంది. అయినా ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి.
డిసెంబర్ 10న సభ ముందుకొచ్చిన ఈ నోటీస్‌పై తీర్మానం, అనుమతి అనేవి నిబంధనల ప్రకారం డిసెంబర్ 24వ తేదీ తర్వాతే సాధ్యం. మంత్రిమండలి నవంబర్ ఆరో తేదీన నోటిఫై చేసిన ప్రకారం ప్రస్తుత రాజ్యసభ 266వ సెషన్ నవంబర్ 25న మొదలై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ లెక్కన తీర్మానం తేదీ(డిసెంబర్ 24)కంటే ముందుగానే రాజ్యసభ సెషన్ ముగుస్తోంది. ఇలాంటి సందర్భంలో తీర్మానాన్ని ఆ తేదీలోపే అనుమతించడం కుదరదు’’ అని హరివంశ్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment