ఎగువ సభ చరిత్రలో తొలిసారిగా విపక్షాల నోటీసు
రాజ్యసభ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్
డిప్యూటీ చైర్మన్ ఆమోదిస్తే ఓటింగ్ నిర్వహించే అవకాశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న ధన్‌ఖడ్‌ను రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందేనని తేల్చిచెప్పాయి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆమ్ ఆద్మీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
రాజ్యసభ చరిత్రలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం గట్టిగా పోరాడుతామన్న సందేశం ఇవ్వడానికే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. ఆయన అన్ని పరిధులు అతిక్రమించారని, అందుకే నోటీసు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యనాయకులపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నా ధన్‌ఖఢ్ పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ మేరకు జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ధన్‌ఖఢ్ విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. సభను ఆయన నడిపిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. ప్రతిపక్షాలపై ఆయన వివక్ష చూపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. ధన్‌ఖఢ్ కేవలం ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు తప్ప రాజ్యసభ చైర్మన్‌గా నిజాయతీగా పనిచేయడం లేదని తప్పుపపట్టారు. ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తప్పించడానికి అవసరమైన బలం తమకు లేదని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు సాగరికా ఘోష్ చెప్పారు. అయినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసమే పోరాడుతున్నారని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తేలి్చచెప్పారు.
ధన్‌ఖడ్‌ను చూసి గర్వపడుతున్నాం: రిజిజు
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తొలగించడానికి విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం చాలా విచారకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ధన్‌ఖడ్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు. ఆయన చాలా హూందాగా, పక్షపాతానికి తావులేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఎంతమాత్రం లేదని, రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉందని రిజిజు గుర్తుచేశారు.
లోక్‌సభలో మూడుసార్లు నోటీసులు
లోక్‌సభలో స్పీకర్‌ను తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1954 డిసెంబర్ 18న అప్పటి స్పీకర్ జి.వి.మౌలాంకర్, 1966 నవంబర్ 24న హుకం సింగ్, 1987 ఏప్రిల్ 15న బలరాం జక్కడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. మౌలాంకర్, బలరాం జక్కడ్‌పై తీర్మానాలు వీగిపోయాయి. హుకుం సింగ్‌పై ఇచ్చిన నోటీసు తిరస్కరణకు గురైంది. ఓటింగ్‌లో పాల్గొనడానికి 50 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు సముఖత వ్యక్తం చేయకపోవడమే ఇందుకు కారణం. ఓటింగ్ జరగాలంటే కనీసం 50 మంది సభ్యులు అంగీకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment