రాజ్యసభలో జగదీప్ ధన్‌ఖడ్, ఖర్గే మధ్య మాటల యుద్ధం
అవిశ్వాస తీర్మానంపై చర్చకు 14 రోజులు ఆగలేకపోతున్నారు
నిత్యం నాపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు
విపక్షాలపై మండిపడ్డ ధన్‌ఖడ్
బీజేపీ ఎంపీలను ధన్‌ఖడ్ మాపైకి ఉసిగొల్పుతున్నారు: ఖర్గే ఆగ్రహం
సభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై శుక్రవారం ఎగువ సభలో తీవ్రస్థాయిలో రగడ జరిగింది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దూషించుకున్నారు. చైర్మన్ ధన్‌ఖడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభ మొదటి గంటలోనే సోమవారానికి వాయిదా పడింది.
శుక్రవారం సభ ప్రారంభం కాగానే తొలుత బీజేపీ సభ్యుడు రాధామోహన్ దాస్ మాట్లాడారు. ధన్‌ఖడ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసు అంశాన్ని లేవనెత్తారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజులకు సభలో చర్చ జరగాల్సి ఉండగా, ప్రతిపక్షాలు నిత్యం ధన్‌ఖడ్‌పై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయని తప్పుపట్టారు. దేశాన్ని, ఉపరాష్ట్రపతి పదవిని, రైతులను కించపరుస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రపతులను, ఉప రాష్ట్రపతులను అగౌరవపర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను పదేపదే కించపర్చేవారని చెప్పారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ మృతిచెందితే అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వలేదని, మృతదేహాన్ని పటా్నకు తరలించారని గుర్తుచేశారు. అంత్యక్రియలకు హాజరు కాకూడదని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను నెహ్రూ కోరారని తెలిపారు. అయినప్పటికీ నెహ్రూ మాట లెక్కచేయకుండా పటా్నలో బాబూ రాజేంద్ర ప్రసాద్ అంత్యక్రియలకు రాధాకృష్ణన్ హాజరయ్యారని వెల్లడించారు.
కాంగ్రెస్ పారీ్టకి రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కేవలం ఒక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆరాటపడుతోందని బీజేపీ ఎంపీ కిరణ్ చౌదరి విమర్శించారు. రైతు బిడ్డ అయిన ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఈ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీకి ధన్‌ఖడ్ అవకాశం ఇచ్చారు. ధన్‌ఖడ్ రైతు బిడ్డ అయితే, ఖర్గే కార్మికుడి బిడ్డ అని చెప్పారు. దళితుడైన ఖర్గేకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు.
‘‘నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను. దేశం కోసం ప్రాణత్యాగమైనా చేస్తా. మీకు(విపక్షాలు) నిత్యం ఒక్కటే పని. నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నాపై దు్రష్పచారం చేస్తుండడం వ్యక్తిగతంగ బాధ కలిగిస్తోంది. ఇప్పటికే చాలా సహించా. నాపై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కుమీకు ఉండొచ్చు. నోటీసు ఇచ్చాక చర్చ జరగడానికి 14 రోజులు వేచి చూడాలి. కానీ, వేచి చూసే ఓపిక మీకు లేదు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు’’ అని ధన్‌ఖఢ్ మండిపడ్డారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
మీ గొప్పలు వినడానికి రాలేదు: ఖర్గే
ఆ తర్వాత ఖర్గే మాట్లాడారు. ‘‘మీరు(ధన్‌ఖడ్) బీజేపీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు. మాపై ఉసిగొల్పుతున్నారు. నేను కార్మికుడి బిడ్డను. జీవితంలో మీకంటే ఎక్కువ సవాళ్లు ఎదుర్కొన్నా. మీరు మా పార్టీని, మా పార్టీ నాయకులను కించపరుస్తున్నారు. మీరు చెప్పుకొనే గొప్పులు వినడానికి మేము ఇక్కడికి రాలేదు. చర్చ కోసం వచ్చాం. మీరు పక్షపాతం చూపుతున్నారు. విపక్షాల గొంతును నొక్కేస్తున్నారు. రాజ్యసభ కార్యకలాపాలకు మీరే పెద్ద అడ్డంకి.
మరో పదోన్నతి సాధించుకోవడానికి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. సభ సజావుగా సాగాలన్నదే తన ఉద్దేశమని, సభలో గొడవలకు తావులేకుండా సభ్యులంతా సహకరించాలని కోరారు. దీనిపై చర్చించడానికి తన చాంబర్‌కు రావాలని ఖర్గేతోపాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ధన్‌ఖడ్ ఆహ్వానించారు. దీనిపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఎలా గౌరవించాలి? మీరు నన్ను దారుణంగా కించపర్చారు అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment