‘మిత్రమా.. మనకు అన్యాయం జరిగింది!’ | Netizens Troll Vijay Mallya Dearest Friend Lalit Modi Tweet Exchange | Sakshi
Sakshi News home page

‘మిత్రమా.. దేశంలో మనకు అన్యాయం జరిగింది!’.. మాల్యా-లలిత్‌ మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ

Published Thu, Dec 19 2024 2:00 PM | Last Updated on Thu, Dec 19 2024 2:00 PM

Netizens Troll Vijay Mallya Dearest Friend Lalit Modi Tweet Exchange

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యా..  లలిత్‌ మోదీ మధ్య ఎక్స్‌ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయ్‌ మాల్యాకు ఇవాళ లలిత్‌ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు విజయ్‌ మాల్యా తనదైన శైలిలో స్పందించారు.  ఈ క్రమంలో చర్చ తాజా పరిణామాలపైకి దారి మళ్లింది.

‘‘నా ప్రియమైన మిత్రుడు విజయ్‌మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనిద్దరమూ అది చూశాం. అయ్యిందేదో అయ్యింది.. రాబోయే సంవత్సరం నీదే మిత్రమా. ప్రేమ.. చిరునవ్వులతో సంతోషంగా ఉండూ.. అంటూ పోస్ట్‌ చేశారు. దానికి విజయ్‌ మాల్యాస్పందిస్తూ.. థ్యాంక్యూ మై డియరెస్ట్‌ ఫ్రెండ్‌. దేశానికి మనం ఎంతో చేశాం.. అయినా మనకు అన్యాయమే జరిగింది అనే అర్థం వచ్చేలా బదులిచ్చారు.

ఇదిలా ఉంటే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ఎగవేతదారుల నుంచి ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేస్తున్నామని.. ఈ ఏడాది రూ.22,280 కోట్లు రాబట్టామని.. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రకటనపైనా విజయ్‌ మాల్యా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారాయన. అలాగే సీబీఐ తన మీద పెట్టిన కేసు గురించి.. జప్తు గురించి మరో ట్వీట్‌ చేశారు. 

ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే..  ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్‌ చేశారాయన. అయితే దానికి కూడా లలిత్‌ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్‌డే శుభాకాంక్షలు’’ అంటూ మరో పోస్ట్‌ చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య సంభాషణపై నెటిజన్లు జోకులేస్తూ.. ట్రోల్‌ చేస్తున్నారు. మరికొందరేమో విజయ్‌ మాల్యా తీరుపై మండిపడుతున్నారు.

 

 ఐపీఎల్‌ వ్యవస్థాపకుడైన లలిత్‌ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ కేసులో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్‌ మోదీ వెల్లడించారు. 

ఇక.. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఈడీ, బ్యాంకులు సంయుక్తంగా ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.  వివిధ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకోవడంతో నష్టపోయిన బ్యాంకులు కొంత ఉపశమనం పొందాయన్నారామె. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను విక్రయించి వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆస్తుల నుంచి మరో రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసి వేలం వేయబోతున్నట్లు ప్రకటించారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement