లోన్ కోసం బ్యాంకుల వద్ద ఉంచిన రుణ గ్రహీతల ఒరిజినల్ ఆస్తి పత్రాలను పోగొడితే బ్యాంకులు రుణగ్రహీతలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలలో కస్టమర్ సేవా ప్రమాణాలను సమీక్షించడానికి గత ఏడాది మేలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అంగీకరిస్తే ఇది త్వరలో అమల్లోకి రానుంది.
ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో నేతృత్వంలోని ప్యానెల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యాంక్‌కు తన నివేదికను సమర్పించింది. ప్యానెల సిఫార్సులలో ఈ సూచన కూడా ఉంది. కమిటీ సిఫార్సులపై వాటాదారుల అభిప్రాయాలను ఆర్‌బీఐ కోరింది. జూలై 7లోగా తమ అభిప్రాయాలను వాటాదారులు తెలియజేయాల్సి ఉంటుంది.
లోన్ అకౌంట్‌ను మూసివేసిన అనంతరం రుణగ్రహీతకు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడానికి బ్యాంకులకు కాల పరిమితిని నిర్దేశించడాన్ని ఆర్‌బీఐ పరిగణించవచ్చని ప్యానెల్ సూచించింది. లేని పక్షంలో ఆలస్యమైన మేరకు జరిమానా లేదా పరిహారం చెల్లించేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించింది.
పరిహారం చెల్లించాల్సిందే!
ఆస్తి పత్రాలు బ్యాంకులు పోగొట్టిన సందర్భంలో పత్రాల సర్టిఫైడ్ రిజిస్టర్డ్ కాపీలను తమ ఖర్చుతో అందించడమే కాకుండా, ఈ క్రమంలో కస్టమర్లు కోల్పోయిన విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా పరిహారం చెల్లించడానికి బ్యాంక్ బాధ్యత వహించాలని ప్యానెల్ సూచించింది.
సాధారణంగా లోన్లు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఒరిజినల్ ఆస్తి పత్రాలను తమ వద్ద ఉంచుకుంటాయి. రుణాలు పూర్తిగా తిరిగి చెల్లించాక వాటని కస్టమర్లకు ఇస్తాయి. అయితే, రుణాన్ని సకాలంలో చెల్లించినప్పటికీ ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు చాలా సమయం తీసుకుంటున్నాయని ఆర్‌బీఐకి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సిఫార్సులు వచ్చాయి.
ఇదీ చదవండి: Aadhaar-based UPI: ఆధార్‌తో యూపీఐ పేమెంట్: గూగుల్‌పేలో కొత్త ఫీచర్
Comments
Please login to add a commentAdd a comment