
ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ .2, ఆర్థికేతర లావాదేవీలకు రూ .1 ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్‌వర్క్ ఉన్న చిన్న బ్యాంకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
పెంచిన ఇంటర్‌ఛేంజ్ ఫీజులను కస్టమర్లకు బదిలీ చేయాలా వద్దా అనే దానిపై బ్యాంకులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ చివరికి భారాన్ని వినియోగదారులపైనే వేస్తారన్న చర్చ సాగుతోంది. గత పదేళ్లలో ఇంటర్ చేంజ్ ఫీజులను సవరించినప్పుడల్లా బ్యాంకులు ఆ భారాన్ని కస్టమర్లపైనే వేశాయి. ఈసారి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదని, బ్యాంకులు కస్టమర్లకు ఫీజులు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే..
ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజు అనేది ఏటీఎం సేవలను ఉపయోగించడానికి ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. ఆర్బీఐ గతంలో 2021 జూన్‌లో ఇంటర్‌ఛేంజ్ ఫీజును సవరించింది. నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు ఇంటర్ఛేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కి, బ్యాలెన్స్ ఎంక్వైరీలు వంటి ఆర్థికేతర లావాదేవీలకు ఇంటర్ఛేంజ్ ఫీజును రూ.6 నుంచి రూ.7కు పెంచారు.
ఇంటర్ఛేంజ్ ఫీజుల పెంపునకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మార్చి 13న బ్యాంకులు, ఇతర వాటాదారులకు తెలియజేసింది. ఇంటర్ చేంజ్ ఫీజుల పెంపును అమలు చేసేందుకు ఎన్‌పీసీఐ ఆర్బీఐ అనుమతి కోరింది.
ప్రస్తుత ఫీజు విధానంలో కార్యకలాపాలు నడపడం ఆర్థికంగా కష్టంగా ఉన్న వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల విజ్ఞప్తుల మేరకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లో ఒక బ్యాంకు ఖాతాదారు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో మూడు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment