
ప్రతిపాదిత అమెరికా సుంకాల నుంచి భారత్‌కు కొంతమేర ఉపశమనం లభించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై యూఎస్ విధిస్తున్న సుంకాల మాదిరిగా కాకుండా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికా-ఇండియా మధ్య వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని, ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు కనిపించడం లేదన్నారు.
కొత్త వాణిజ్య చర్యలను దశలవారీగా అమలు చేయడానికి వీలుగా అనువైన విధానాన్ని అధికారులు అన్వేషిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా గణనీయమైన వాణిజ్య పరిమాణాలు కలిగిన అధిక డిమాండ్ ఉన్న వస్తువులపై ఒక మోస్తరు సుంకం పెరుగుదలనే చూడవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికాకు భారత ఎగుమతులపై సుంకాల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు.
మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడి
అమెరికాకు అధిక పరిమాణంలో ఎగుమతి చేసే కొన్ని కీలక రంగాలపై సుంకాలను తగ్గించాలని భారత వాణిజ్య అధికారులు యూఎస్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూఎస్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ అమెరికా భారత్ నుంచి మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.616 కోట్లు ఎగనామం
ఇతర దేశాల మాదిరి కాదు..
ప్రపంచ వాణిజ్య పునర్వ్యవస్థీకరణల మధ్య అమెరికా తన టారిఫ్ వ్యూహాన్ని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. చైనా, మెక్సికో, కెనడాల మాదిరిగా కాకుండా భారత్‌ను ప్రత్యేకంగా చూస్తూ కొంతమేర సుంకాల్లో వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక వాణిజ్య సంబంధాలను హైలైట్ చేస్తుంది. దీంతో భారీగా టారిఫ్ పెంపుపై ఆందోళన చెందుతున్న భారత ఎగుమతిదారులకు ఉపశమనం లభించనుందనే వాదనలున్నాయి.