
కొత్త ఆర్థిక సంవత్సరం(2025-26) ఏప్రిల్ 1, 2025 నుంచి ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాదికి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ షెడ్యూల్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటారు. దేశ ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ద్రవ్య విధానాన్ని రూపొందించేందుకు ఇందులో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎంపీసీ సమావేశం జరిగే తేదీలు కింది విధంగా ఉన్నాయి.
ఆర్‌బీఐ వచ్చే ఏడాదిలో ఆరుసార్లు ఎంపీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి సమావేశం 2025 ఏప్రిల్ 7-9 తేదీల్లో జరగనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి ఎంపీసీ సమావేశం 2025 ఫిబ్రవరిలో కొత్త ఆర్‌బీఐ బాస్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగింది. ఇందులో చాలాకాలం తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చారు.
2025-26లో ఎంపీసీ సమావేశాల తేదీలు
2025 ఏప్రిల్ 7, 8, 9
2025 జూన్ 4, 5, 6
2025 ఆగస్టు 5, 6, 7
2025 సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1
2025 డిసెంబర్ 3, 4, 5
2026 ఫిబ్రవరి 4, 5, 6
ఆర్థిక వ్యవస్థ అంతటా రుణాలు, డిపాజిట్ రేట్లను ప్రభావితం చేసే రెపో రేటును నిర్ణయించడానికి ఎంపీసీ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, కరెన్సీని స్థిరీకరించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి దాని నిర్ణయాలు కీలకంగా మారుతాయి.
ఇదీ చదవండి: ప్రభుత్వ ట్యాక్సీలు వస్తున్నాయ్..
ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యులు వీరే..
ఎంపీసీ సమావేశాల్లో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. అందులో ముగ్గురు సభ్యులు సెంట్రల్ బ్యాంక్‌కు చెందినవారు ఉంటారు. అందులో గవర్నర్ మానిటరీ పాలసీ సమావేశానికి ఇన్‌ఛార్జీగా, డిప్యూటీ గవర్నర్, ఆర్‌బీఐ బోర్డు ఎంపిక చేసిన మరొక అధికారి ఉంటారు. మరో ముగ్గురిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కమిటీకి ఆర్బీఐ గవర్నర్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం ఉన్న సభ్యులు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ రంజన్, డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర్ రావు, నగేష్ కుమార్, సౌగతా భట్టాచార్య, ప్రొఫెసర్ రామ్ సింగ్ ఉన్నారు.