న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ)తో రుణ వ్యవస్థలో పెను సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం తీసుకువచ్చిన ఈ చట్టంతో రుణ దాతలు, రుణ గ్రహీతల వైఖరిలో కూడా మార్పు చోటుచేసుకుందని అన్నారు. ఇచ్చిన రుణం తిరిగి వస్తుందన్న భరోసా రుణదాతకు, తీసుకున్న రుణం తప్పనిసరిగా తీర్చాలన్న అభిప్రాయం రుణ గ్రహీతకు కలిగినట్లు పేర్కొన్నారు.
ఆయా అంశాలు దేశంలో సరళతర వ్యాపార వృద్ధికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దోహదపడుతున్నట్లు వివరించారు. రుణ వ్యవస్థకు సంబంధించి ఐబీసీ ఒక పెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. రుణ పరిష్కారానికి గతంలో దశాబ్దాలు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రతి దశ దివాలా వ్యవహారం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తయ్యే వ్యవస్థ ప్రస్తుతం నెలకొందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఐసీఏఐ (ఐఐఐపీఐ) ఐదవ వ్యవస్థాపక దినోత్సవంలో గోయెల్ ఈ కీలక ప్రసంగం చేశారు. రానున్న కాలంలో భారత్ విశ్వసనీయత, దేశ ఫైనాన్షియల్ నిర్మాణం మరింత బలపడతాయని గోయెల్ అన్నారు.
ఐఐఐపీఐకు ఐదు మార్గదర్శకాలు...
పనిలో సమగ్రత, నిష్పాక్షికత, వృత్తిపరమైన సామర్థ్యం, గోప్యత, పారదర్శకత అనే ఐదు మార్గదర్శక సూత్రాలను అనుసరించాలని మంత్రి ఐఐఐపీఐ సభ్యులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ఐదు సూత్రాలను అనుసరిస్తే, నిపుణులు ఆశించే వృత్తిపరమైన ప్రవర్తన మరింత ఇనుమడిస్తుందని అన్నారు. వీటితోపాటు మరే ఇతర తరహా విధినిర్వహణ తమ సామర్థ్యాన్ని, పనితీరును పెంచుతుందన్న విషయాన్ని సభ్యులు గుర్తించాలన్నారు.
మొండి బకాయిల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమని అన్నారు. వ్యాపార సంస్థల ఏర్పాటు, నిర్వహణలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఐఐఐపీఐ తనవంతు కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కోవిడ్–19 కాలంలో వ్యాపారాలను కష్టాల నుండి రక్షించడానికి, 2020 మార్చి నుండి 2021 మార్చి వరకు డిఫాల్ట్‌ల నుండి ఉత్పన్నమయ్యే దివాలా చర్యలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment