Lenders
-
అల్లుడితో షూట్ చేయించుకున్న మామ..ఎందుకంటే..?
న్యూఢిల్లీ : అప్పులోళ్లను ఇరికించేదుకు ఓ వ్యక్తి తన అల్లుడితో కలిసి పెద్ద కుట్రే పన్నాడు. కానీ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కించే పరిస్థితి తెచ్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన అల్లుడికి తుపాకీ ఇచ్చి చేతిపై ఘూట్ చేయించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అప్పు కోసంవేధిస్తూ అప్పులోళ్లే తనను కాల్చారని చెప్పాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంద్ నగ్రీ తాహీర్‌పూర్‌లో జరిగింది. కాల్పులు జరిగాయని ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి చూశారు. చేతికి గాయంతో ఉన్నసుందర్ కనిపించాడు. 315 బోర్ తుపాకీకి చెందిన ఖాళీ షెల్ అక్కడే పడి ఉంది. గాయపడిన సుందర్‌తో పాటు అతడి అల్లుడు హిమాన్షు కూడా అక్కడే ఉన్నాడు. ఏం జరిగందని అడగ్గా మేమిక్కడ చేపలకు ఆహారం వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి తనను తిడుతూ తుపాకీతో కాల్చాడని చెప్పాడని డీసీపీ తెలిపారు. సుందర్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిచినట్లు చెప్పారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. గాయపడ్డ సుందర్‌కు కొన్ని అప్పులున్నాయని, అప్పులు ఇచ్చిన వారిని కేసులో ఇరికించేందుకే అల్లుడితో కాల్పులు జరిపించుకుని డ్రామా ఆడాడని తేలింది. సుందర్ అల్లుడు హిమాన్షు ఇంటరాగేషన్‌లో పోలీసులకు అన్ని విషయాలు చెప్పాడు. కాల్చిన తర్వాత తుపాకీని అక్కడే ఉన్న చెరువులో పడేసినట్లు వెల్లడించాడు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకు తుపాకీ దొరికింది. దీంతో పోలీసులు సుందర్‌తో పాటు హిమాన్షుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు -
రక్షించండి ప్రభో! పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. పాక్ ప్రధాని ఆవేదన
పాకిస్థాన్‌లో నగదు నిల్వలు అడుగంటిపోయాయి. ఐఎమ్ఎఫ్ నుంచి రావాల్సిన నగదు అందకపోవడంతో ఆ దేశం పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్యారిస్ వేదికగా స్పందించారు. 'యుద్దాలకు ఇవ్వడానికి ప్రపంచ రుణదాతల దగ్గర డబ్బులు ఉంటాయి.. కానీ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు ఇవ్వడానికి మాత్రం ఉండవు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారిస్‌లో రెండు రోజులపాటు జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. 'యుద్ధం జరుగుతున్న దేశానికి ఏమైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు కూడా కావాల్సినవన్నీ సమకూర్చుతారు. వేల మంది ప్రాణాలను రక్షించడానికి మాత్రం నిధులను ఇవ్వడానికి వెనకంజ వేస్తారు. పాకిస్థాన్ విషయానికి వచ్చే సరిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి సంపన్న దేశాలు. మా దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది' అని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది వరదలతో నష్టపోయిన పాక్‌ను రక్షించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి వేల కోట్లు సొంత జేబు నుంచి ఖర్చు చేశామని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ చర్చలు జరుపుతుంది. ప్రధానంగా వాతావరణ విపత్తుల కారణంగా చితికిపోయిన దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటుంది. జూన్ చివరి నాటికి ఐఎమ్ఎఫ్ నుంచి పాక్‌కు రావాల్సిన 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం గడువు ముగుస్తుంది. గత సంవత్సరం నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న 1.1 బిలియన్ డాలర్ల రుణాన్నైనా విడుదల చేయాలని ఐఎమ్ఎఫ్కు షరీఫ్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి నిలిచిపోయిన నిధులపై ప్రశ్నించగా తనను పాక్ ఆర్థిక మంత్రి చెంపపై కొట్టాడని ఓ విలేఖరి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: State Dinner Menu: వైట్ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే.. -
రుణ పరిష్కార బాటలో విదర్భ
న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికలో ఉన్న విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్(వీఐపీఎల్) సలహాదారుగా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేసుకుంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన వీఐపీఎల్ రుణ పరిష్కారానికి వీలుగా ఎస్బీఐ క్యాప్స్ బిడ్స్‌ను ఆహా్వనించనుంది. తద్వారా కంపెనీకిగల రూ. 2,000 కోట్ల రుణాల విక్రయం లేదా వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను చేపట్టనుంది. స్విస్ చాలెంజ్ విధానంలో రుణదాతలకు రుణాల గరిష్ట రికవరీకి ఎస్బీఐ క్యాప్స్ కృషి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెపె్టంబర్ 30లోగా రుణ పరిష్కార ప్రణాళికలను ముగించవలసి ఉంది. కాగా.. ఈ ప్రాసెస్(వీఐపీఎల్ రుణాలు, ఓటీఎస్) నిర్వహణను 2023 జూన్ 8న ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి పూర్తిచేయవలసి ఉంటుంది. అయితే రుణాలు, ఓటీఎస్‌కు సంబంధించి వీఐపీఎల్ రుణదాతలకు ఇప్పటికే మూడు సువో మోటో బిడ్స్ దాఖలుకాగా.. కంపెనీ తాజాగా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంచుకోవడం గమనార్హం! -
రిలయన్స్ క్యాపిటల్ ప్రణాళికకు డెడ్‌లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్‌ను (ఆర్సీఎల్) కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల సంస్థలు తగు పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు గడువును రుణదాతలు ఆగస్టు 28 వరకూ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ మదింపు కోసం మరింత సమయం కావాలంటూ బిడ్డర్లు కోరడంతో డెడ్‌లైన్‌ను పొడిగించడం ఇది అయిదోసారని పేర్కొన్నాయి. గడువు ఆగస్టు 10తో ముగియాల్సి ఉంది. బరిలో ఉన్న పిరమల్, టోరెంట్ సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇవ్వాలని కోరగా రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆగస్టు 30 వరకూ గడువు కోరింది. వాస్తవానికి పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు మే 26 అసలు డెడ్‌లైన్. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు గవర్నెన్స్‌పరంగా లోపాలు ఉండటంతో గతేడాది నవంబర్ 29న ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసి అడ్మినిస్ట్రేటరును నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విక్రయానికి అడ్మినిస్ట్రేటర్ బిడ్లను ఆహ్వానించారు. -
దివాలా చట్టంతో రుణ వ్యవస్థలో మార్పు
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ)తో రుణ వ్యవస్థలో పెను సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం తీసుకువచ్చిన ఈ చట్టంతో రుణ దాతలు, రుణ గ్రహీతల వైఖరిలో కూడా మార్పు చోటుచేసుకుందని అన్నారు. ఇచ్చిన రుణం తిరిగి వస్తుందన్న భరోసా రుణదాతకు, తీసుకున్న రుణం తప్పనిసరిగా తీర్చాలన్న అభిప్రాయం రుణ గ్రహీతకు కలిగినట్లు పేర్కొన్నారు. ఆయా అంశాలు దేశంలో సరళతర వ్యాపార వృద్ధికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దోహదపడుతున్నట్లు వివరించారు. రుణ వ్యవస్థకు సంబంధించి ఐబీసీ ఒక పెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. రుణ పరిష్కారానికి గతంలో దశాబ్దాలు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రతి దశ దివాలా వ్యవహారం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తయ్యే వ్యవస్థ ప్రస్తుతం నెలకొందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఐసీఏఐ (ఐఐఐపీఐ) ఐదవ వ్యవస్థాపక దినోత్సవంలో గోయెల్ ఈ కీలక ప్రసంగం చేశారు. రానున్న కాలంలో భారత్ విశ్వసనీయత, దేశ ఫైనాన్షియల్ నిర్మాణం మరింత బలపడతాయని గోయెల్ అన్నారు. ఐఐఐపీఐకు ఐదు మార్గదర్శకాలు... పనిలో సమగ్రత, నిష్పాక్షికత, వృత్తిపరమైన సామర్థ్యం, గోప్యత, పారదర్శకత అనే ఐదు మార్గదర్శక సూత్రాలను అనుసరించాలని మంత్రి ఐఐఐపీఐ సభ్యులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ఐదు సూత్రాలను అనుసరిస్తే, నిపుణులు ఆశించే వృత్తిపరమైన ప్రవర్తన మరింత ఇనుమడిస్తుందని అన్నారు. వీటితోపాటు మరే ఇతర తరహా విధినిర్వహణ తమ సామర్థ్యాన్ని, పనితీరును పెంచుతుందన్న విషయాన్ని సభ్యులు గుర్తించాలన్నారు. మొండి బకాయిల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమని అన్నారు. వ్యాపార సంస్థల ఏర్పాటు, నిర్వహణలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఐఐఐపీఐ తనవంతు కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కోవిడ్–19 కాలంలో వ్యాపారాలను కష్టాల నుండి రక్షించడానికి, 2020 మార్చి నుండి 2021 మార్చి వరకు డిఫాల్ట్‌ల నుండి ఉత్పన్నమయ్యే దివాలా చర్యలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. -
లోన్ యాప్ వేధింపులు: మరో వ్యక్తి బలి
సాక్షి, మేడ్చల్: ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. రుణాల పేరుతో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక తెలంగాణలో మరో వ్యక్తి బలైయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని తన నివాసంలో చంద్రమోహన్ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. (చదవండి: సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య) లోన్ కట్టాలంటూ యాప్ నిర్వాహకులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో.. తన ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న నంబర్లకూ మెసేజ్‌లు పంపడంతో మనస్థాపం చెందిన చంద్రమోహన్.. తన నివాసంలోనే ఉరేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సాక్షి స్టింగ్ ఆపరేషన్: కరోనా టెస్టులే లేకుండా సర్టిఫికేట్లు) -
నవంబర్ 5 కల్లా ఖాతాల్లో డబ్బులు
ముంబై/న్యూఢిల్లీ: మారటోరియంలో రుణాలపై చక్రవడ్డీ మాఫీ పథకాన్ని నవంబర్ 5లోగా అమలు చేయాలని బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. స్కీమ్‌కి అనుగుణంగా సాధారణ వడ్డీ, చక్రవడ్డీ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తాన్ని నిర్దిష్ట రుణగ్రహీతల ఖాతాల్లో గడువులోగా జమ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ‘రుణాలిచ్చే అన్ని ఆర్థిక సంస్థలు నిర్దిష్ట స్కీమ్ నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా తగు చర్యలు తీసుకోవాలి‘ అని ఆదేశిస్తూ ఆర్బీఐ మంగళవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విషయాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘6 నెలల వ్యవధికి సంబంధించి చక్రవడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే స్కీము నిబంధనలను అమలు చేయాలంటూ ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది‘ అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ఇదే వివరాలను సుప్రీం కోర్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. రుణగ్రహీతలు మారటోరియం ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా లేదా పాక్షికంగా ఎంచుకున్నా .. అర్హులైన వారందరికీ ఈ స్కీమును వర్తింపజేస్తున్నట్లు వివరించింది. నిర్దిష్ట నిధులను రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌కు బ్యాంకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ‘ఆర్థిక పరిస్థితులు, రుణగ్రహీతల తీరుతెన్నులు, ఎకానమీపై ప్రభావం తదితర అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని వివరించింది. నేపథ్యం ఇదీ.. కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో కుదేలైన రుణగ్రహీతలకు కాస్త వెసులుబాటునిచ్చే విధంగా రుణ బాకీల చెల్లింపును కొంతకాలం వాయిదా వేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం మార్చి 1 నుంచి ఆగస్టు 31 దాకా ఆరు నెలల పాటు రెండు విడతలుగా మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ వ్యవధిలో అసలుపై వడ్డీ మీద వడ్డీ కూడా వడ్డించే విధంగా బ్యాంకుల నిబంధనలు ఉన్నాయి. ఈ చక్రవడ్డీ భారాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. సామాన్యుడి దీపావళి పండగ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా స్కీమ్ రూపొందించింది. స్కీమ్ ఇలా... రూ. 2 కోట్ల దాకా రుణాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, వాహన రుణాలు, చిన్న..మధ్య తరహా సంస్థల లోన్స్, కన్జూమర్ డ్యూరబుల్ లోన్స్ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. పథకం ప్రకారం .. మారటోరియం ప్రకటించిన ఆరు నెలల కాలానికి గాను సాధారణ వడ్డీ, చక్ర వడ్డీకి మధ్య గల వ్యత్యాసాన్ని బ్యాంకులు ఆయా రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేస్తాయి. ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటాయి. మారటోరియంను ఎంచుకోకుండా యథాప్రకారం రుణాల నెలవారీ వాయిదాలను చెల్లించడం కొనసాగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. -
భారీ తప్పిదం : వేల కోట్లు మళ్లిపోయాయి
న్యూయార్క్ : అతిపెద్ద బ్యాంకు సిటీబ్యాంక్ ఒక చిన్న తప్పు కారణంగా భారీ వివాదంలో చిక్కుకుంది. న్యూయార్క్ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న క్లరికల్ తప్పిదం కారణంగా ఏకంగా 900 మిలియన్ డాలర్లు (సుమారు 6700 కోట్ల రూపాయలు) ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇపుడు ఈ సొమ్మును రాబట్టుకునేందుకు సిటీ గ్రూపు నానా కష్టాలు పడుతోంది.తాజా నివేదిక ప్రకారం కొంత డబ్బును బ్యాంక్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ ప్రముఖ కాస్మొటిక్ కంపెనీ రెవ్లాన్ వివాదానికి దారి తీసింది. ఈ ఊహించని పరిణామంతో ఇప్పటికే అప్పుల ఊబిలో ఇరుక్కున్న రెవ్లాన్ మరింత సంక్షోభంలో పడిపోయింది. అంతేకాదు కంపెనీ మొత్తం బకాయిలకు ఈమొత్తానికి సమానం కావడం మరింత ప్రకంపనలు పుట్టించింది. ఈ పొరపాటు సిటిగ్రూప్ను చాలా కాలం పాటు వెంటాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్, సుమారు బిలియన్ డాలర్ల మేరకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై దావా వేసింది. ఈ కేసులో సిటీ బ్యాంకును కూడా ప్రతివాదిగా చేర్చాయి. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల మొత్తాన్ని పొరపాటున రెవ్లాన్ ఖాతా నుంచి రుణదాతల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు బ్రిగేడ్, హెచ్‌పీఎస్, సింఫనీతో సహా రుణాలిచ్చిన సంస్థలు తిరస్కరించాయి. తమకు అందిన సొమ్ము రుణానికి, వడ్డీకి సమానమని వాదిస్తున్నాయి. దీంతో వ్యవహరం మరింత ముదిరింది. ఇది ఈ శతాబ్దానికే అతి పెద్ద తప్పిదమంటూ దివాలా సలహాదారు మైఖేల్ స్టాంటన్ విమర్శించారు. అయితే ఈ పరిణామంపై సిటీ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. అటు అసలు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రెవ్లాన్ తెగేసి చెప్పింది. -
రాజమండ్రి ప్లాంటు రుణాలు తీరుతాయా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంతో కుంగిపోతున్న జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్ (జీఆర్‌ఈఎల్), అప్పుల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. ఈ ప్రణాళికకు కంపెనీ రుణదాతలు ఆమోదం తెలిపారని పేర్కొంది. జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీకి రూ.2,353 కోట్ల రుణ భారం ఉంది. తొలుత దీన్లో రూ.1,412 కోట్లను చెల్లించేందుకు ఒక విధానాన్ని రూపొందించారు. రూ. 1,412కోట్లలో 20% చెల్లించేందుకు, ఇంకా తొలి ఏడాది వడ్డీల కోసం జీఎంఆర్ గ్రూప్ రూ.395 కోట్లు కేటాయిస్తుంది. మిగిలిన రూ. 1,130 కోట్ల రుణాన్ని 9% ఫ్లోటింగ్ వడ్డీతో వచ్చే 20 ఏళ్లలో చెల్లించనుంది. మొత్తం రూ. 2353 కోట్లలో రూ. 1,412 కోట్లు పోగా మిగిలిన రూ. 941 కోట్ల రుణాన్ని భవిష్యత్‌లో చెల్లుబడయ్యే సీఆర్‌పీఎస్‌గా (క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు) మార్చింది. ఈ షేర్లకు ఇప్పటినుంచి 17–20 ఏళ్ల మధ్య 0.1% వడ్డీతో చెల్లింపులు చేస్తారు. ఈ ప్రణాళిక కంపెనీకి, రుణదాతలకు మేలు చేస్తుందని జీఎంఆర్ ఇన్ఫ్రా ఎండీ గ్రంధి కిరణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తమ గ్రూప్ మొత్తం రుణాలు తగ్గేందుకు ఈ ప్రణాళిక ఉపకరిస్తుందన్నారు. రాజమండ్రి ప్లాంట్ పనిచేసేందుకు తగిన గ్యాస్ లభిస్తుందనే నమ్మకాన్ని జీఎంఆర్ వ్యక్తంచేస్తోంది. తద్వారా జీఆర్‌ఈఎల్ నిర్వహణ కొనసాగి సీఆర్‌పీఎస్‌లు డిఫాల్ట్ కాకుండా ఉంటాయని భావిస్తోంది. 2016లో జీఆర్‌ఈఎల్ వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణకు(ఎస్డీఆర్) వెళ్లింది. 2012లో ఈ ప్లాంట్ పూర్తయింది. కానీ గ్యాస్ సరఫరాలో కొరత కారణంగా కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి. దీంతో వ్యయాలు పెరిగి రుణభారం ఎక్కువైంది. 2015లో సంస్థ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. -
జెట్‌పై బ్యాంకుల కసరత్తు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్ ఎయిర్వేస్పై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘జెట్‌ను పునరుద్ధరించేందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఇంకా ఏ ప్రణాళికా ఖరారు కాలేదు‘ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మరోవైపు, జెట్‌కు రుణాలిచ్చిన సంస్థల ప్రతినిధులు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్‌తో కూడా భేటీ అయ్యారు. రూ.8,000 కోట్ల పైగా రుణభారం ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కంపెనీ 123 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 5కు పడిపోయింది. సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్.. డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. రుణాలిచ్చిన బ్యాంకులు.. కంపెనీ యాజమాన్య అధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థకు అత్యవసరంగా రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూర్చేలా ప్రతిపాదనలు చేశాయి. 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్ కూడా ఆహ్వానించాయి. దీంతో కంపెనీలో వాటాలు దక్కించుకునేందుకు నరేష్ గోయల్ కూడా బిడ్ వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బిడ్డింగ్‌లో పాల్గొనరాదని ఆయన నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. సంక్షోభంపై కేంద్రం సమీక్ష... జెట్ ఎయిర్వేస్ సంక్షోభం, పెరుగుతున్న విమాన చార్జీలు, ఫ్లయిట్స్ రద్దు తదితర అంశాలపై సమీక్ష జరపాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల భద్రత, హక్కులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాకు సూచించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు. జెట్ వివాదంపై సమీక్షకు ఆదేశించినట్లు ప్రభు ప్రకటించడం వారం రోజుల్లో ఇది రెండోసారి. తక్షణ సాయం కోసం నిధులు అందించాలంటూ బ్యాంకులను జెట్ ఎయిర్వేస్ కోరినట్లు ఖరోలా తెలిపారు. సంస్థ ప్రస్తుతం అయిదు విమానాలు మాత్రమే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 10 రూట్లలో చార్జీల తగ్గింపుపై డీజీసీఏ దృష్టి జెట్ ఎయిర్వేస్ ఫ్లయిట్స్ రద్దు నేపథ్యంలో చార్జీలను రోజువారీ సమీక్షించడం కొనసాగుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి తెలిపారు. అలాగే, సత్వరం తగు చర్యలు తీసుకునేందుకు ఎయిర్‌లైన్స్‌తో సంప్రతింపులు జరుగుతున్నాయని వివరించారు. ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో .. రద్దీ ఎక్కువగా ఉండే 40 రూట్లలో చార్జీలు సమీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. పది రూట్లలో చార్జీలు 10–30 శాతం దాకా పెరిగాయని గుర్తించినట్లు .. వాటిని సముచిత స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఎయిర్‌లైన్స్‌కు సూచించినట్లు ఖరోలా చెప్పారు. ఏప్రిల్ 18న విమానయాన సంస్థలు, విమానాశ్రయాల ప్రతినిధులతో పౌర విమానయాన శాఖ సమావేశం కానున్నట్లు మరో అధికారి పేర్కొన్నారు. మంగళవారం జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో సుమారు 8 శాతం మేర క్షీణించి రూ. 241.85 వద్ద క్లోజయ్యింది. -
ఆ నిధులపై హక్కులు మాకే...
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్) ఐటీ రిఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్ల నిధులపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని బ్యాంకులు స్పష్టంచేశాయి. ఇదే విషయాన్ని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్ఏటీ) చెప్పాయి. తమకు చెందాల్సిన నిధులతో ఎరిక్సన్కి ఇవ్వాల్సిన బాకీలను ఆర్‌కామ్ తీరుస్తానంటే కుదరదని తెగేసి చెప్పాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్కు చెల్లించడం కోసం రిటెన్షన్, ట్రస్ట్ ఖాతాలో ఉన్న ఐటీ రిఫండ్ నిధులను ఉపయోగించుకునేలా అనుమతించాలంటూ ఆర్‌కామ్ వేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా బ్యాంకుల తరఫున సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందే రిటెన్షన్, ట్రస్ట్ ఖాతా ఏర్పాటైందని, దానికి, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఎరిక్సన్ బాకీల భారాన్ని ఆర్‌కామ్ బ్యాంకులపై రుద్దడం కుదరదని తెలిపారు. ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదాపడింది. -
అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి, ముంబై : చుట్టూ సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపునకు భారీ ఊరట లభించింది. తనఖా పెట్టిన షేర్లను విక్రయించకుండా రుణదాతలతో అనిల్ అంబానీ గ్రూప్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అడాగ్ గ్రూపు షేర్లు లాభాల పరుగందుకున్నాయి.. సెప్టెంబర్‌వరకూ తనఖా షేర్లను విక్రయించకుండా 90 శాతం రుణదాతలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అడాగ్ తాజాగా వెల్లడించింది. ఇందుకువీలుగా రుణాలకు సంబంధించిన వాయిదా చెల్లింపులను సమయానుగుణంగా చెల్లించే విధంగా అడాగ్ రుణదాతలకు హామీ ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్న అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు నష్టాల మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏకంగా 12 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 12 శాతం, రిలయన్స్ కేపిటల్ దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ సైతం లాభాల బాటపట్టడం విశేషం. కాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. -
‘జెట్’లో బ్యాంకులకు వాటా..!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్) వచ్చే నెల 21న జరగనున్నది. ఈ ఈజీఎమ్‌లో రుణాలను ఈక్విటీగా మార్చడం, అధీకృత మూలధనం పెంపు, తదితర ప్రతిపాదనలకు జెట్ ఎయిర్వేస్ సంస్థ వాటాదారుల ఆమోదం కోరనున్నది. నిధుల సమస్య తీవ్రంగా ఉండటంతో రుణదాతలు ఇచ్చిన రుణాలను మొత్తంగా గానీ, పాక్షికంగా గానీ, ఈక్విటీగా గానీ, కన్వర్టబుల్ డిబెంచర్లుగా గానీ లేదా ఇతర సెక్యూరిటీలుగా మార్చాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీకి, రుణ దాతల మధ్య కుదిరిన ఒప్పందం బట్టి ఈ మార్పిడి ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పరిస్థితులను బట్టి సమయానుకూలంగా మరిన్ని రుణ సమీకరణలకు కూడా ఈ కంపెనీ వాటాదారుల ఆమోదం కోరుతోంది. ఈ రుణాలు రూ.25,000 కోట్లు మించకుండా ఉండాలనేది కంపెనీ ఆలోచన. మరోవైపు ప్రస్తుతం రూ.200 కోట్లుగా ఉన్న అధీకృత వాటా మూలధనాన్ని రూ.2,200 కోట్లకు పెంచాలని కూడా కంపెనీ నిర్ణయించింది. అంతేకాకుండా రుణాలు ఇచ్చిన సంస్థలు, నామినీ డైరెక్టర్లను, లేదా డైరెక్టర్ల బోర్డ్‌లో పరిశీలకులను నియమించడానికి గాను కంపెనీ నిబంధనావళిలో కూడా మార్పులు చేయాలని కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనలన్నిం టికీ వాటాదారుల ఆమోదం కోసం జెట్ ఎయిర్వేస్ కంపెనీ వచ్చే నెల 21న ఈజీఎమ్‌ను నిర్వహిస్తోంది. ఎస్బీఐకు 15 శాతం వాటా ! రుణాలను వాటాగా మార్చిన పక్షంలో జెట్ ఎయిర్వేస్లో ఎస్బీఐ వాటా 15 శాతంగా ఉండే అవకాశాలున్నాయి. ఎస్బీఐతో సహా ఇతర రుణదాతల వాటా 30 శాతంగా ఉండొచ్చని మంగళవారం టీవీ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ఇతిహాద్ ఎయిర్వేస్ తన వాటాను ప్రస్తుతమున్న 24 శాతం నుంచి 40 శాతానికి పెంచుకునే అవకాశాలున్నాయని కూడా ఈ వార్తలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేర్ 2.3% క్షీణించి రూ.240 వద్ద ముగిసింది. -
గ్రీస్‌లో పన్నుల మోత
- మళ్లీ తెరుచుకున్న బ్యాంకులు... - ఏటీఎం పరిమితుల సడలింపు... ఏథెన్స్: తాజాగా తీసుకుంటున్న బెయిలవుట్ ప్యాకేజీకి ప్రతిగా రుణదాతల షరతుల ప్రకారం గ్రీస్ కఠిన సంస్కరణల అమలు, పన్నుల మోత మోగింపు మొదలుపెట్టింది. చక్కెర మొదలుకుని కండోమ్స్, ట్యాక్సీలు, దహన సంస్కారాల దాకా అన్ని రకాల వస్తువులు, సేవలపైనా పన్నులను 13% నుంచి ఏకంగా 23%కి పెంచేసింది. అయితే, ఔషధాలు, పుస్తకాలు, పత్రికలు వంటి కొన్నింటిపై మాత్రం 6.5% నుంచి 6%కి తగ్గించింది. మరోవైపు, 3 వారాలుగా మూతబడిఉన్న గ్రీస్ బ్యాంకులు మళ్లీ తెరుచుకున్నాయి. 60 యూరోల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని కాస్త సడలించి శుక్రవారం దాకా రోజుకు గరిష్టంగా 300 యూరోల దాకా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు గ్రీస్ బ్యాంకుల అసోసియేషన్ హెడ్ లూకా కట్సెలీ తెలిపారు. ఆ తర్వాత నుంచి దీన్ని 420 యూరోలకు పెంచనున్నట్లు వివరించారు. విదేశీ బ్యాంకులకు నగదు బదలాయింపు, కొత్త అకౌంట్లను తెరవడంపై నిషేధం మొదలైనవి కొనసాగనున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున విత్‌డ్రాయల్స్ చేయకుండా జూన్ 29 నుంచి బ్యాంకులను మూసివేసిన సంగతి తెలిసిందే. మూసివేత కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న గ్రీస్ ఆర్థిక వ్యవస్థకి సుమారు 3 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అటు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లకు రుణాల చెల్లింపును గ్రీస్ ప్రారంభించింది. తమకు రావాల్సిన 2 బిలియన్ యూరోలను గ్రీస్ చెల్లించినట్లు ఐఎంఎఫ్ తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి 7.16 బిలియన్ డాలర్ల తాత్కాలిక రుణం లభించడంతో పాత బకాయిల చెల్లింపులకు గ్రీస్‌కు వెసులుబాటు లభిస్తోంది. -
గ్రీస్ దారెటు?
రుణదాతల షరతులపై రిఫరెండం నేడే ఏథెన్స్: అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయిన గ్రీస్ భవితను తేల్చే రిఫరెండం నేడు(ఆదివారం) జరగనుంది. మరో బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి రుణదాతలు విధిస్తున్న షరతులకు ఓకే చెప్పాలా లేదా అన్నదానిపై జరుగుతున్న రిఫరెండంలో ప్రజలు దేనికి ఓటేస్తారోనని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. యూరోజోన్‌లో గ్రీస్ కొనసాగాలా లేదా అనేది రిఫరెండంపై ఆధారపడి ఉంది. షరతులకు తలొగ్గద్దని, షరతులకు ఒప్పుకోబోమని రిఫరెండంలో తేల్చి చెప్పాలని నిర్వహించిన ర్యాలీలో గ్రీస్ ప్రధాని సిప్రాస్ పాల్గొన్నారు. అయితే, గ్రీస్ ఆర్థిక పరిస్థితులతో విసిగిపోయిన సగం మంది ప్రజలు ఎలాగోలా బెయిలవుట్ ప్యాకేజీ వస్తే కష్టాలు తీరతాయనే ఉద్దేశంతో.. షరతులకు ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రెఫరెండంకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో 44.8% మంది అనుకూలంగా, 43.4 % మంది వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. షరతులేంటి.. గ్రీస్ ఇప్పటికే రెండు బెయిలవుట్ ప్యాకేజీలు దక్కించుకుంది. అయినా కష్టాలు పోలేదు. ఈ నేపథ్యంలో మరో ప్యాకేజీ ఇవ్వాలంటే గ్రీస్ ప్రభుత్వం బడ్జెట్లో కోతలు, పన్నుల పెంపు, కఠిన సంస్కరణలు అమలు చేయాలని రుణదాతలు షరతులు పెట్టారు. వీరికి నో చెప్పడం ద్వారా రుణదాతలతో బేరసారాలకు వీలు దొరుకుతుందన్నది గ్రీస్ ప్రభుత్వం వాదన. యూరోపియన్ యూనియన్, ఐఎంఎఫ్‌లు కలిసి 2010 నుంచి గ్రీస్‌కు సుమారు 240 బిలియన్ యూరోల రుణాలిచ్చాయి. నో చెబితే.. రిఫరెండంలో షరతులకు ప్రజలు నో చెబితే నిధుల కొరతతో బ్యాంకులు మూతబడి గ్రీస్ మరింత సంక్షోభంలోకి వెళ్తుంది. ఇంధనం నుంచి ఔషధాల దాకా ప్రతీ దానికీ కొరత ఏర్పడవచ్చు. యూరోజోన్‌లో భాగంగా యూరో కరెన్సీలో ఉన్న గ్రీస్ ఇకమీదట కొత్తగా సొంత కరెన్సీని ముద్రించుకోవాలి. గ్రీస్ బ్యాంకుల దగ్గర ప్రస్తుతం సుమారు బిలియన్ యూరోల నిధులు ఉన్నాయి. ఇవి సోమవారం దాకా సరిపోతాయి. రిఫరెండంలో నో చెబితే బ్యాంకులకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి నిధులు రావు. కొత్త డీల్ కుదుర్చుకోవడంలో ప్రధాని విఫలమైతే ఆయన గద్దె దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే చెబితే.. ప్రజలు రిఫరెండంలో యస్ అని చెబితే, ప్రధాని వైదొలగాల్సి రావొచ్చు. ఎన్నికలు నిర్వహించాలి. అయితే, దేశ ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడమన్నది కష్టసాధ్యం కావొచ్చు. దీంతో అధికారిక సిరిజా పార్టీలోనే మితవాదిగా కాస్త పేరున్న ఉప ప్రధాని యానిస్ డ్రాగాసాకిస్ లాంటి వారికి పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.