
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్) వచ్చే నెల 21న జరగనున్నది. ఈ ఈజీఎమ్‌లో రుణాలను ఈక్విటీగా మార్చడం, అధీకృత మూలధనం పెంపు, తదితర ప్రతిపాదనలకు జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వాటాదారుల ఆమోదం కోరనున్నది. నిధుల సమస్య తీవ్రంగా ఉండటంతో రుణదాతలు ఇచ్చిన రుణాలను మొత్తంగా గానీ, పాక్షికంగా గానీ, ఈక్విటీగా గానీ, కన్వర్టబుల్ డిబెంచర్లుగా గానీ లేదా ఇతర సెక్యూరిటీలుగా మార్చాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీకి, రుణ దాతల మధ్య కుదిరిన ఒప్పందం బట్టి ఈ మార్పిడి ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పరిస్థితులను బట్టి సమయానుకూలంగా మరిన్ని రుణ సమీకరణలకు కూడా ఈ కంపెనీ వాటాదారుల ఆమోదం కోరుతోంది. ఈ రుణాలు రూ.25,000 కోట్లు మించకుండా ఉండాలనేది కంపెనీ ఆలోచన. మరోవైపు ప్రస్తుతం రూ.200 కోట్లుగా ఉన్న అధీకృత వాటా మూలధనాన్ని రూ.2,200 కోట్లకు పెంచాలని కూడా కంపెనీ నిర్ణయించింది. అంతేకాకుండా రుణాలు ఇచ్చిన సంస్థలు, నామినీ డైరెక్టర్లను, లేదా డైరెక్టర్ల బోర్డ్‌లో పరిశీలకులను నియమించడానికి గాను కంపెనీ నిబంధనావళిలో కూడా మార్పులు చేయాలని కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనలన్నిం టికీ వాటాదారుల ఆమోదం కోసం జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ వచ్చే నెల 21న ఈజీఎమ్‌ను నిర్వహిస్తోంది.
ఎస్‌బీఐకు 15 శాతం వాటా !
రుణాలను వాటాగా మార్చిన పక్షంలో జెట్ ఎయిర్‌వేస్‌లో ఎస్‌బీఐ వాటా 15 శాతంగా ఉండే అవకాశాలున్నాయి. ఎస్‌బీఐతో సహా ఇతర రుణదాతల వాటా 30 శాతంగా ఉండొచ్చని మంగళవారం టీవీ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ఇతిహాద్ ఎయిర్‌వేస్ తన వాటాను ప్రస్తుతమున్న 24 శాతం నుంచి 40 శాతానికి పెంచుకునే అవకాశాలున్నాయని కూడా ఈ వార్తలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ షేర్ 2.3% క్షీణించి రూ.240 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment