Jet Airways Company
-
పడకేసిన ‘జెట్’
నాలుగైదు నెలలుగా ఆకాశయానంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎలాగోలా నెట్టుకొస్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ చివరకు తన ప్రయాణాన్ని ముగించింది. అమృత్సర్–న్యూఢిల్లీ మధ్య బుధవారం రాత్రి నడిపిన విమానంతో ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిధుల కొరతతో నీరసపడిన సంస్థను ఆదుకునేందుకు రూ. 400 కోట్ల మేర అత్యవవసర నిధుల్ని అందించాలన్న బోర్డు ప్రతిపాదనకు బ్యాంకులు ససేమిరా అనడంతో అది పడకేసింది. సంస్థను విక్రయించే ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, దానికి మున్ముందు ఎదురయ్యే అడ్డంకులేమిటో ఇప్పుడే ఎవరూ చెప్పే స్థితి లేదు. విమానయాన రంగంలో ఇంతవరకూ మూతబడిన సంస్థల్లో ఏ ఒక్కటీ తెరుచుకున్న దాఖలా లేదు గనుక జెట్ ఎయిర్వేస్ కూడా ఆ దోవనే చరిత్రలో కలిసిపోతుందా అని కొందరు ఆందోళనపడుతున్నారు. (చదవండి : ‘జెట్ రూట్లలో ఎయిర్ఇండియా సర్వీసులు’) దేశంలో ఆర్థిక సంస్కరణలు మొగ్గతొడిగి, ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేస్తున్న తొలిరోజుల్లో అవకాశాలను ఒడిసిపట్టుకుని జెట్ ఎయిర్వేస్ పేర సొంత విమానయాన సంస్థతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన నరేష్ గోయల్ 2012 నాటికి దాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ప్రయాణీకుల వాటాలో అగ్ర తాంబూలం అందుకున్నారు. ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నకొద్దీ అవి పెరుగుతూపోయాయి. వరస సంక్షోభాలు వెంటతరుముతుంటే చివరకు రూ. 8,500 కోట్ల అప్పుల్ని ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితికి ఆ సంస్థ చేరుకుంది. ఒకప్పుడు 124 విమానాలతో రోజుకు 600 సర్వీసులు నడిపిన ఆ సంస్థ గత కొన్ని వారాలుగా అయిదారు విమానాలతో, దాదాపు 40 సర్వీసులతో నెట్టుకొస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా అవి కూడా నిలిచిపోవడంతో ప్రయాణీకులకు వేలాదికోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రపంచ దేశాల్లోని విమానయాన సంస్థలు అనేకం లాభాల దారిలో దూసుకుపోతుంటే మన సంస్థలే ఇలా కళ్లు తేలేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత అయిదేళ్లలో దేశంలోని పెద్దా చిన్నా ప్రైవేటు విమానయాన సంస్థలు ఆరు మూతబడగా, ఇది ఏడోది. 2012లో మూతబడిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ తర్వాత జెట్ ఎయిర్వేస్ సంస్థే పెద్దది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను కేంద్రం ఎప్పటికప్పుడు ఆదుకుంటూ దాన్ని నిలబెడుతోంది. ఒకపక్క దేశంలో 2016–18 మధ్య ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు 50 లక్షలమంది ఉద్యోగాలు గల్లంతయ్యాయని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నివేదిక వెలువరించినరోజే 23,000మందికి ప్రత్యక్షంగా, మరిన్ని వేలమందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఒక పెద్ద విమానయాన సంస్థ మూతబడటం ఆందోళన కలిగించే అంశం. ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక మన దేశంలో విమానయాన రంగానికి ప్రాముఖ్యత పెరిగింది. అది దేశాభివృద్ధికి దోహదపడే మౌలిక సదుపాయ రంగంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కనుకనే ఈ రంగం వెలుగులీనుతుందని అందరూ జోస్యం చెప్పారు. ఇప్పటికీ అందరూ ఆ మాటే అంటున్నారు. ఆర్నెల్లక్రితం అంతర్జాతీయ విమానయాన సంఘం(ఐఏటీఏ) ఏకరువుపెట్టిన గణాంకాలు కూడా ఆశావహంగా ఉన్నాయి. దాని ప్రకారం రాగల ఇరవైయ్యేళ్లలో ప్రపంచ విమానయానంలో చైనా, అమెరికాల తర్వాత భారత్‌ది మూడో స్థానం. 2037నాటికల్లా భారత విమానయాన ప్రయాణికుల సంఖ్య 57.2 కోట్లకు చేరుకుంటుందని దాని అంచనా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లమంది ప్రయాణికులుండగా అది 2037నాటికి రెట్టింపవుతుందని తెలిపింది. నెలవారీ గణాంకాలు చూసినా పరిస్థితి బాగానే ఉంది. మొన్న జనవరిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య కోటీ 25 లక్షల పైమాటేనని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ప్రకటించింది. వీటిని గమనిస్తే విమానయానం నానాటికీ వృద్ధి చెందుతుందన్న భావం కలుగుతుంది. ప్రయాణికుల సంఖ్య మాత్రమే కాదు...సరుకు రవాణాలోనూ వృద్ధి రేటు బాగానే ఉంది. ఇన్ని అనుకూలతలనూ మూలకు నెట్టి విమానయాన సంస్థలను కుంగదీస్తున్న సమస్యలెన్నో ఉన్నాయి. దేశీయ విమానయాన సర్వీసులకు వినియోగిస్తున్న ఇంధనంపై పన్నుల బాదుడు, వేరే సంస్థలతో పోటీపడి చార్జీలు తగ్గించాల్సి రావడం, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల లేమితో డిమాండ్‌కు తగినట్టుగా అదనపు విమానాలను ప్రవేశపెట్టలేకపోవడం వగైరా కారణాలు ప్రస్తుత స్థితికి దోహదపడ్డాయని చెబుతున్నారు. దానికితోడు 2007లో రూ. 1,450 కోట్లు వెచ్చించి కొన్న ఎయిర్ సహారాతో అదనపు భారం పడిందంటున్నారు. విమాన ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని విమానయాన సంస్థల డిమాండ్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం కూడా ప్రస్తుత స్థితికి కారణం. ఒక విమానయాన సంస్థ మూతబడిందంటే దాని ప్రకంపనలు సాధారణంగా ఉండవు. సంస్థ సిబ్బంది రోడ్డునపడటంతోపాటు విమానాశ్రయాల నిర్వాహకులకూ, ఇంధన సరఫరాదారులకూ ఒక పెద్ద ఖాతాదారు నుంచి వచ్చే నికరాదాయం ఆగిపోతుంది. రంగం నుంచి ఒక విమానయాన సంస్థ తప్పుకున్నప్పుడు తగినంతగా సర్వీసుల లభ్యత లేక ప్రయాణికులకు ఇబ్బందు లెదురవుతాయి. సహజంగానే ఇతర సంస్థలు టికెట్ చార్జీలు పెంచుతాయి. ఇదంతా మన విమాన యాన రంగం ప్రతిష్టను మసకబారుస్తాయి. విషాదమేమంటే ఈ ఏడాది మొదట్లో నరేష్ గోయ ల్ను పక్కనబెట్టి యాజమాన్య బాధ్యతలు స్వీకరించిన బ్యాంకులు, ఇతర మదుపుదార్లు కనీసం వాటాల విక్రయ ప్రక్రియ పూర్తయ్యేవరకైనా దాన్ని ఏదోవిధంగా నడపాలనుకోలేదు. అప్పులు మినహా విమానాలుగానీ... పైలట్లుగానీ... నిపుణులైన ఇంజనీర్లుగానీ...సిబ్బందిగానీ లేని సంస్థను కొనుగోలుదార్లు ఏం చూసి సొంతం చేసుకుంటారని బ్యాంకులు అనుకున్నాయో అనూహ్యం. ఈ రంగంలోని సంస్థల నిర్వహణపై ఒక కన్నేసి ఉంచి సకాలంలో హెచ్చరించడం, అధిక పన్నుల భారాన్ని తగ్గించడంతోసహా అవసరమైన చర్యలు తీసుకోవడంపై పాలకులు దృష్టి పెట్టాలి. -
‘జెట్’లో బ్యాంకులకు వాటా..!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్) వచ్చే నెల 21న జరగనున్నది. ఈ ఈజీఎమ్‌లో రుణాలను ఈక్విటీగా మార్చడం, అధీకృత మూలధనం పెంపు, తదితర ప్రతిపాదనలకు జెట్ ఎయిర్వేస్ సంస్థ వాటాదారుల ఆమోదం కోరనున్నది. నిధుల సమస్య తీవ్రంగా ఉండటంతో రుణదాతలు ఇచ్చిన రుణాలను మొత్తంగా గానీ, పాక్షికంగా గానీ, ఈక్విటీగా గానీ, కన్వర్టబుల్ డిబెంచర్లుగా గానీ లేదా ఇతర సెక్యూరిటీలుగా మార్చాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీకి, రుణ దాతల మధ్య కుదిరిన ఒప్పందం బట్టి ఈ మార్పిడి ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పరిస్థితులను బట్టి సమయానుకూలంగా మరిన్ని రుణ సమీకరణలకు కూడా ఈ కంపెనీ వాటాదారుల ఆమోదం కోరుతోంది. ఈ రుణాలు రూ.25,000 కోట్లు మించకుండా ఉండాలనేది కంపెనీ ఆలోచన. మరోవైపు ప్రస్తుతం రూ.200 కోట్లుగా ఉన్న అధీకృత వాటా మూలధనాన్ని రూ.2,200 కోట్లకు పెంచాలని కూడా కంపెనీ నిర్ణయించింది. అంతేకాకుండా రుణాలు ఇచ్చిన సంస్థలు, నామినీ డైరెక్టర్లను, లేదా డైరెక్టర్ల బోర్డ్‌లో పరిశీలకులను నియమించడానికి గాను కంపెనీ నిబంధనావళిలో కూడా మార్పులు చేయాలని కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనలన్నిం టికీ వాటాదారుల ఆమోదం కోసం జెట్ ఎయిర్వేస్ కంపెనీ వచ్చే నెల 21న ఈజీఎమ్‌ను నిర్వహిస్తోంది. ఎస్బీఐకు 15 శాతం వాటా ! రుణాలను వాటాగా మార్చిన పక్షంలో జెట్ ఎయిర్వేస్లో ఎస్బీఐ వాటా 15 శాతంగా ఉండే అవకాశాలున్నాయి. ఎస్బీఐతో సహా ఇతర రుణదాతల వాటా 30 శాతంగా ఉండొచ్చని మంగళవారం టీవీ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ఇతిహాద్ ఎయిర్వేస్ తన వాటాను ప్రస్తుతమున్న 24 శాతం నుంచి 40 శాతానికి పెంచుకునే అవకాశాలున్నాయని కూడా ఈ వార్తలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేర్ 2.3% క్షీణించి రూ.240 వద్ద ముగిసింది. -
జెట్ ఎయిర్వేస్కు ఎనిమిదేళ్లలో తొలి వార్షిక లాభం
► వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాల బాట... ► రూ.5,245 కోట్లకు నికర అమ్మకాలు న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కంపెనీ వరుసగా నాలుగవ క్వార్టర్లోనూ లాభాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ కంపెనీ రూ.397 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే క్వార్టర్లో రూ.1,729 కోట్ల నికర నష్టాలు వచ్చాయని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. నికర అమ్మకాలు రూ.5,065 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.5,245 కోట్లకు ఎగిశాయని జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేశ్ గోయల్ చెప్పారు. ఇంధన ధరలు తక్కువ స్థాయిలో ఉం డడం, ట్రాఫిక్ అధికంగా ఉండడం, వడ్డీ వ్యయాలు కూడా తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.5,596 కోట్ల నుంచి 13 శాతం క్షీణించి రూ.4,848 కోట్లకు తగ్గాయని తెలిపారు. మొత్తం నిర్వహణ వ్యయాల్లో ప్రధాన భాగమైన ఇంధన వ్యయాలు రూ.1,334 కోట్ల నుంచి 25 శాతం క్షీణించి రూ.999 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,814 కోట్ల నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,174 కోట్ల నికర లాభం వచ్చిందని నరేశ్ గోయల్ పేర్కొన్నారు. కాగా కంపెనీకి ఎనిమిదేళ్లలో తొలి వార్షిక లాభం ఇదే. ఇక మొత్తం ఆదాయం రూ.19,573 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.21,167 కోట్లకు ఎగసిందని గోయల్ పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.6,686కోట్ల నుంచి 25 శాతం తగ్గి రూ.5,016 కోట్లకు తగ్గాయని వివరించారు. పటిష్టమైన ఆర్థిక పనితీరు కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,680 కోట్లు తగ్గిందని తెలిపారు. జెట్ ఎయిర్వేస్, ఇతిహాద్ ఎయిర్వేస్ భాగస్వామ్యం కారణంగా లాభాల బాట పట్టామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేర్ బీఎస్ఈలో 1.2 శాతం వృద్ధితో రూ.607 వద్ద ముగిసింది. -
జెట్ ఎయిర్వేస్ స్పెషల్ చార్జీల ఆఫర్
దేశీయ రూట్లలో.. అక్టోబర్ 15 వరకూ ముంబై: జెట్ ఎయిర్వేస్ సంస్థ దేశీయ రూట్లలో స్పెషల్ చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 15 వరకూ ఈ స్పెషల్ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాజ్ శివ్‌కుమార్ చెప్పారు. 750 కిమీ, లోపు దూరమున్న రూట్లలో ఈ స్పెషల్ చార్జీలు రూ.6,999 నుంచి, 750 నుంచి 1,000 కిమీ. దూరమున్న రూట్లలో చార్జీలు రూ.8,999 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దేశీ నెట్‌వర్క్‌లోని తమ అన్ని విమాన సర్వీసులకు ఈ స్పెషల్ చార్జీలు వర్తిస్తాయని వివరించారు. డెరైక్ట్, వయా ఫ్లైట్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. వ్యక్తిగత సర్వీసులతో పాటు మల్టీ-కోర్స్ మీల్ ఆప్షన్లను కూడా అందిస్తున్నామన్నారు. ఇక 1,000 కిమీ. పైబడి దూరమున్న విమాన రూట్లకు సంబంధించిన చార్జీలపై 20% డిస్కౌంట్నిస్తున్నట్లు శివ్‌కుమార్ పేర్కొన్నారు.