జెట్ ఎయిర్‌వేస్‌కు ఎనిమిదేళ్లలో తొలి వార్షిక లాభం
► వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ లాభాల బాట...
► రూ.5,245 కోట్లకు నికర అమ్మకాలు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ వరుసగా నాలుగవ క్వార్టర్‌లోనూ లాభాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ కంపెనీ రూ.397 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే క్వార్టర్‌లో రూ.1,729 కోట్ల నికర నష్టాలు వచ్చాయని జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది. నికర అమ్మకాలు రూ.5,065 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.5,245 కోట్లకు ఎగిశాయని జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేశ్ గోయల్ చెప్పారు. ఇంధన ధరలు తక్కువ స్థాయిలో ఉం డడం, ట్రాఫిక్ అధికంగా ఉండడం, వడ్డీ వ్యయాలు కూడా తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని పేర్కొంది.
మొత్తం వ్యయాలు రూ.5,596 కోట్ల నుంచి 13 శాతం క్షీణించి రూ.4,848 కోట్లకు తగ్గాయని తెలిపారు. మొత్తం నిర్వహణ వ్యయాల్లో ప్రధాన భాగమైన ఇంధన వ్యయాలు రూ.1,334 కోట్ల నుంచి 25 శాతం క్షీణించి రూ.999 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు.
ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,814 కోట్ల నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,174 కోట్ల నికర లాభం వచ్చిందని నరేశ్ గోయల్ పేర్కొన్నారు. కాగా కంపెనీకి ఎనిమిదేళ్లలో తొలి వార్షిక లాభం ఇదే. ఇక మొత్తం ఆదాయం రూ.19,573 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.21,167 కోట్లకు ఎగసిందని గోయల్ పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.6,686కోట్ల నుంచి 25 శాతం తగ్గి రూ.5,016 కోట్లకు తగ్గాయని వివరించారు.
పటిష్టమైన ఆర్థిక పనితీరు కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,680 కోట్లు తగ్గిందని తెలిపారు. జెట్ ఎయిర్‌వేస్, ఇతిహాద్ ఎయిర్‌వేస్ భాగస్వామ్యం కారణంగా లాభాల బాట పట్టామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ షేర్ బీఎస్‌ఈలో 1.2 శాతం వృద్ధితో రూ.607 వద్ద ముగిసింది.