
2024–25లో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ఆటుపోట్ల మధ్య మార్కెట్లు 5%అప్
3,764 పాయింట్లు బలపడిన సెన్సెక్స్
సెప్టెంబర్‌లో 85,978 వద్ద కొత్త రికార్డ్
ముంబై: దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల సంపద మార్చి 28తో ముగిసిన తాజా ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ.25.9 లక్షల కోట్లమేర ఎగసింది. దీంతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 4,12,87,647 కోట్ల(4.82 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సెన్సెక్స్ సెపె్టంబర్ చివర్లో సరికొత్త రికార్డు 85,978 పాయింట్లకు చేరినప్పటికీ తదుపరి అక్టోబర్ నుంచీ డీలా పడింది. చివరికి 77,415 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం తాజా ఆర్థిక సంవత్సరంలో నికరంగా 1,192 పాయింట్లు(5.3 శాతం) జమ చేసుకుంది. 23,519 వద్ద నిలిచింది. అయితే సెపె్టంబర్‌లో 26,277 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిన తదుపరి దిద్దుబాటుకు లోనైన సంగతి తెలిసిందే.
దిద్దుబాటు బాటలో..
గతేడాది(2023–24)లో భారీ ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు 2024-25లో పలు కారణాలతో ఆటుపోట్లను చవిచూశాయి. ఒక్క అక్టోబర్‌లోనే సెన్సెక్స్ 4,911 పాయింట్లు(5.8 శాతం) పతనమైంది. ప్రధానంగా అంతర్జాతీయ అనిశ్చితులు, యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలపై ఆందోళనలు మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు దారి తీశాయి. నిర్మాణాత్మక బుల్ ట్రెండ్ నేపథ్యంలో లాభాల స్వీకరణ సైతం ఇందుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
మరోవైపు దేశీ కార్పొరేట్ ఫలితాలు నిరాశపరచడం, భవిష్యత్ అంచనాలు తగ్గడం వంటి అంశాలు వీటికి జత కలిసినట్లు వివరించారు. అయితే దేశీయంగా పలువురు కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వచి్చనట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌కు సైతం భారీగా పెట్టుబడులు సమకూరినట్లు ప్రస్తావించారు. దీంతో ఐపీవో మార్కెట్లు కళకళలాడటంతోపాటు.. సెకండరీ మార్కెట్లు భారీ పతనాల నుంచి రికవరీ అయినట్లు వెల్లడించారు.
2024-25కు నష్టాలతో వీడ్కోలు
ఆర్థిక సంవత్సరం 2024-25కు దలాల్ స్ట్రీట్ నష్టాలతో వీడ్కొలు పలికింది. ట్రంప్ సుంకాల మోతతో ఈక్విటీ మార్కెట్లు డీలాపడ్డాయి. ఐటీ, ఆటో షేర్ల పతనంతో శుక్రవారం సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోయి 77,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించి 23,519 వద్ద నిలిచింది. ఉదయమే బలహీనంగా మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి.
ఒక దశలో సెన్సెక్స్ 421 పాయింట్లు క్షీణించి 77,186 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు పతనమై 23,450 వద్ద కనిష్టాన్ని తాకాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ సూచీ 0.68%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35% పెరిగాయి. రంగాల వారీగా ఐటీ ఇండెక్స్ 2%, రియల్టీ 1.50%, యుటిలిటీ, ఆటో సూచీలు 1 శాతం నష్టపోయాయి. మార్కెట్లో మరిన్ని విశేషాలు..
● బీఎస్‌ఈ షేరు 16% పెరగ్గా, ఎంఅండ్‌ఎం 3 3%, మారుతీ సుజుకీ, అశోక్‌లేలాండ్ 2% నష్టపోయాయి.
● హ్యుందాయ్ మోటార్స్‌కు కీలక సూచీల్లో చోటు లభించింది.