ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, వినిమయ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందడుగేసింది. భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.
ఉదయం సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 59,131 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 412 పాయింట్ల పరిధిలో 58,793 వద్ద కనిష్టాన్ని, 59,205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 115 పాయింట్ల లాభంతో 59,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 17,428 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 17,313–17,428 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఎఫ్‌పీఐలు రూ.322 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 82.30 స్థాయి వద్ద స్థిరపడింది. మహవీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం ప్రారంభమవుతాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
‘‘ఈ వారంలో ట్రేడింగ్ మూడురోజులకే పరిమితం కావడంతో పాటు ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చిలో ఆటో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు భారత తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్లో ఒత్తిళ్లను తగ్గించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► హీరో మోటోకార్ప్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.2,434 వద్ద ముగిసింది. వార్షిక ప్రాతిపదికన మార్చి విక్రయాలు 15% వృద్ధిని సాధించడంతో ఈ కంపెనీ షేరుకు డిమాండ్ నెలకొంది.
► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ రేటింగ్ తగ్గించడంతో కేపీఐటీ టెక్నాలజీ షేరు 12 శాతం క్షీణించి రూ.810 వద్ద నిలిచింది.
► పలు ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ షేరు 10% ఎగసి రూ.75 వద్ద నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment