Indian manufacturing sector
-
లాభాలతో కొత్త ఏడాదిలోకి!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, వినిమయ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందడుగేసింది. భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 59,131 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 412 పాయింట్ల పరిధిలో 58,793 వద్ద కనిష్టాన్ని, 59,205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 115 పాయింట్ల లాభంతో 59,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 17,428 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 17,313–17,428 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌పీఐలు రూ.322 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 82.30 స్థాయి వద్ద స్థిరపడింది. మహవీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం ప్రారంభమవుతాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ఈ వారంలో ట్రేడింగ్ మూడురోజులకే పరిమితం కావడంతో పాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చిలో ఆటో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు భారత తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్లో ఒత్తిళ్లను తగ్గించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► హీరో మోటోకార్ప్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.2,434 వద్ద ముగిసింది. వార్షిక ప్రాతిపదికన మార్చి విక్రయాలు 15% వృద్ధిని సాధించడంతో ఈ కంపెనీ షేరుకు డిమాండ్ నెలకొంది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ రేటింగ్ తగ్గించడంతో కేపీఐటీ టెక్నాలజీ షేరు 12 శాతం క్షీణించి రూ.810 వద్ద నిలిచింది. ► పలు ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ షేరు 10% ఎగసి రూ.75 వద్ద నిలిచింది. -
ట్రైన్ 18 ఇక ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’
న్యూఢిల్లీ: దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలుకు కేంద్రం కొత్త పేరు పెట్టింది. ఇప్పటివరకూ ‘ట్రైన్ 18’గా వ్యవహరిస్తున్న ఈ రైలుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ అని నామకరణం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వారణాసి–ఢిల్లీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుందని వెల్లడించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూ.97 కోట్ల వ్యయంతో 16 బోగీలున్న ఈ రైలును నిర్మించిందని పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత ఇంజనీర్లు 18 నెలల్లోనే పూర్తి ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైలును అభివృద్ధి చేశారన్నారు. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉంటాయన్నారు. లోకోమోటివ్ల అవసరం లేకుండా నడిచే తొలి రైలుగా ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ చరిత్ర సృష్టించిందని గోయల్ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద ప్రపంచస్థాయి ప్రమాణాలతో రైళ్లను నిర్మించగలమని ఈ ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’తో తేటతెల్లమయిందన్నారు. వారణాసి–ఢిల్లీ మధ్య పరుగులు పెట్టే ఈ రైలు కాన్పూర్, అలహాబాద్‌లో ఆగుతుందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనల ఆధారంగానే ఈ పేరును ఖరారు చేసినట్లు గోయల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ త్వరలోనే ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభిస్తారని ప్రకటించారు. ఈ తరహా రైళ్ల తయారీని వేగవంతం చేయాలని తాను రైల్వే బోర్డును కోరారనీ, దీనివల్ల రైళ్ల సగటు ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. -
ఒప్పందంపై బహుపరాక్!
ఆన్లైన్ వ్యాపారంలో వరస విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనమైంది. చాన్నాళ్లుగా ఇరు సంస్థల వ్యవస్థాపకుల మధ్యా సాగుతున్న చర్చల పర్యవసానంగా ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను రూ. 1,05,000 కోట్లతో వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాల్‌మార్ట్ చేపట్టిన కంపెనీ కొనుగోళ్లలో మాత్రమే కాదు... మొత్తం ఈ–కామర్స్ రంగంలోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారంటేనే ఫ్లిప్‌కార్ట్ ఏ స్థాయికి ఎదిగిందో అర్ధమవుతుంది. ఆన్లైన్ వ్యాపారానికి అంతగా ఆదరణలేని తరుణంలో ఆ రంగంలో అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను అటువైపు ఆకర్షించడానికి చాలానే కృషి చేసింది. 2000 సంవత్సరంలో డాట్కామ్లు తామరతంపరగా పుట్టుకొచ్చినప్పుడు ఇక భవిష్యత్తంతా ఆన్లైన్ వ్యాపారానిదేనన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. కానీ చాలా తక్కువకాలంలోనే అదంతా నీటిబుడగ చందంగా మాయమైంది. ఆన్లైన్లో ఆర్డరిచ్చి తెప్పిం చుకునే వస్తువులు నాసిరకంగా ఉంటాయన్న అనుమానాలు, ఫిర్యాదు చేస్తే పట్టించుకోరన్న భయాలు ఆ వ్యాపారానికి అవరోధంగా మారాయి. ఇలా అంతంతమాత్రం ఆదరణ ఉన్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు అలాంటి భయాలను, అనుమానాలను పోగొట్టడానికి కృషి చేశాయి. దీనికితోడు టెక్నాలజీ రంగంలో వచ్చిన పెను మార్పులు, ఈ–కామర్స్ సంస్థ లిచ్చే భారీ డిస్కౌంట్లు కూడా ఆన్లైన్ వ్యాపార విస్తరణకు దోహదపడ్డాయి. వినియోగదారులు ముందుగా చెల్లించడం కాక, కోరుకున్నది తమకు చేరాకే డబ్బు చెల్లించే ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ–కామర్స్ తీరునే ఫ్లిప్‌కార్ట్ మార్చేసింది. పుస్తకా లతో మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, టీవీలు, దుస్తులు... ఇలా ఆన్లైన్లో ఇప్పుడు దొరకనిదేదీ లేదు. వచ్చే అయిదేళ్లలో ఈ–కామర్స్ మార్కెట్ నాలుగు రెట్లు పెరుగు తుందంటున్నారు. అయితే ఇప్పటికీ మన దేశంలో సంప్రదాయ రిటైల్ వ్యాపారం వాటాయే అధికం. ఆన్లైన్ వ్యాపారం ఎంతగా విస్తరిస్తున్నా సంప్రదాయ వ్యాపారం దరిదాపులకు అదింకా చేరలేదు. ఒక సంస్థ అధ్యయనం ప్రకారం మన దేశంలో మొత్తం రిటైల్ రంగం విలువ 65000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 43,62,800కోట్లు)కాగా, అందులో ఇప్పటికీ 90 శాతం వాటా సంప్రదాయ రిటైల్ వ్యాపారానిదే. కానీ మున్ముందు ఇది ఇలాగే కొనసాగుతుందనుకోవడానికి లేదు. ఈ– కామర్స్ సంస్థలు ఎడాపెడా ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు క్రమేపీ వినియోగదారులను అటు మళ్లిస్తాయి. సాధారణ రిటైల్ వ్యాపారులకు వినియోగదారుల్లో వారిపై ఉండే విశ్వాసమే ప్రధాన పెట్టుబడి. ఒక దుకాణంతో ఏళ్లు గడిచేకొద్దీ ఏర్పడే అనుబంధం వినియోగ దారుల్ని ఎటూ పోకుండా నిలబెడుతుంది. ఆ వ్యాపారులు దుకాణానికి అద్దె చెల్లించాలి. సరుకు నిర్వ హణ చూసుకోవాలి. తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలి. వారి జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకోవాలి. కనుక వారు వినియోగదారులకిచ్చే డిస్కౌంట్లకు పరిమితి ఉంటుంది. కానీ ఆన్లైన్ వ్యాపార సంస్థలకు ఇలాంటి బాదరబందీ లేదు. ఆన్లైన్లో వారు అమ్మే సరుకేదీ వారి దగ్గర ఉండదు. గిడ్డంగులున్నవారితో, సరుకులు సరఫరా చేసేవారితో, కొరియర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారందరినీ సమన్వ యపరుచుకుంటూ విని యోగదారులు కోరుకున్నవి అందేలా చూస్తారు. అహేతుకమైన డిస్కౌంట్లు, ఆఫర్లవల్ల వీరికి నిజానికి నష్టాలే వస్తాయి. వీటిని కొన్నేళ్లు భరిస్తే క్రమేణా సంప్రదాయ రిటైల్ వ్యాపారం దెబ్బతిని కనుమరుగవుతుందని, అప్పుడు మార్కెట్‌ను శాసించి లాభాల బాట పట్టొచ్చునన్నది వీరి వ్యాపార సూత్రం. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిందదే. మన దేశంలో సంప్రదాయ రిటైల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 కోట్ల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆ వ్యాపారం దెబ్బతింటే వీరందరూ వీధిన పడతారు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకున్న వాల్‌మార్ట్‌తో మరో ప్రమాదం ఉంది. ఇది చవగ్గా దొరికే చైనా సరుకుతో మార్కెట్లను ముంచెత్తుతోంది. అది అమ్మే సరుకులో దాదాపు 80 శాతం చైనా మార్కెట్‌కు సంబంధించినవే. ఇందువల్ల రిటైల్ దుకాణదారులకు, వినియో గదారులకొచ్చే కష్టనష్టాల సంగతలా ఉంచి మన తయారీ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. రిటైల్ రంగంలోని కోట్లాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. చైనా తయారీరంగం మాత్రం పుంజుకుంటుంది. ఆ దేశంతో ఇప్పటికే మనకున్న వాణిజ్య లోటు మరింత పెరుగుతుంది. చైనా కార్మికులకు ఉపాధి, అక్కడి పరిశ్రమలకు, అమెరికా ఈ–కామర్స్ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టే ఈ పరిణామం మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్డీఐపై ఉన్న పరిమితులను ఈ–కామర్స్ దారిలో ఉల్లంఘిస్తోంది. వీటన్నిటిపైనా ఇప్పటికే అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్వంటివి నిరసన వ్యక్తం చేశాయి. తాజా ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి మన ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. చట్టాల్లోని లొసుగులను తొలగించాలి. -
రికవరీ ఆశల పై నీళ్లు...!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఆర్థిక రికవరీ ఆశలపై నీళ్లు చల్లాయి. 2013 డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు చూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా, క్షీణ దశ కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి 2012 డిసెంబర్లో -0.6 శాతం క్షీణత నమోదుకాగా, 2013 డిసెంబర్లో కూడా ఇదే ఫలితం వెలువడింది. క్షీణత యథాపూర్వం -0.6 శాతంగా నమోదయింది. అయితే కొంతలో కొంత ఊరట అనుకుంటే క్షీణత రేటు తగ్గడం. అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత -1.6 శాతం. నవంబర్‌లో -1.3 శాతం. తాజాగా ఇది మరింత తగ్గి - 0.6 శాతానికి చేరింది. ఐదు ప్రధాన రంగాల తీరు... మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్షీణత మరింత పెరిగింది. 2012 డిసెంబర్లో క్షీణత -0.8 శాతం. అదిప్పుడు ఏకంగా -1.6 శాతానికి చేరింది. మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో 14 శాతం వాటా ఉండే మైనింగ్ రంగం క్షీణత నుంచి బయటపడింది. ఈ రంగం -3.1 శాతం క్షీణత నుంచి 0.4 శాతం వృద్ధికి మళ్లింది. విద్యుత్ రంగం వృద్ధి రేటు కొంత సానుకూల రీతిలో 5.2 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. మొత్తం వినియోగ వస్తువుల విభాగం క్షీణత మరింత పెరిగి -3.6 శాతం నుంచి -5.3 శాతానికి చేరింది. ఇందులో మన్నికైన వస్తువుల (డ్యూరబుల్) విభాగంలో సైతం క్షీణత మరింత పెరిగింది. -8.1 శాతం నుంచి -16.2 శాతానికి చేరింది. కన్సూమర్ నాన్-డ్యూరబుల్కు వస్తే ఈ విభాగం వృద్ధిబాటకు మళ్లింది. -0.5 శాతం క్షీణత నుంచి 1.6 శాతం వృద్ధిబాటకు మళ్లింది. ఇక డిమాండ్‌కు సూచిక అయిన భారీ వస్తువుల ఉత్పత్తి రంగం క్యాపిటల్ గూడ్స్ విభాగంలో క్షీణత మరింత పెరిగింది. -1.1 శాతం నుంచి -3 శాతానికి పడింది. 9 నెలల్లోనూ క్షీణతే... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనూ (2013-14 మార్చి-డిసెంబర్) పారిశ్రామిక రంగం రివర్స్‌గేర్‌లోనే పయనించింది. ఉత్పాదకత క్షీణతలోనే నమోదైంది. 2012 ఏడాది ఇదే కాలంలో 0.7 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, ప్రస్తుతం అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతానికి ఉత్పత్తి కుంగింది. వడ్డీ రేట్ల కోత తప్పనిసరి: పరిశ్రమలు తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పారిశ్రామిక రంగంలో వృద్ధికి ఆర్బీఐ రెపో రేటు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే తయారీ రంగం పునరుత్తేజానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాయి. ముఖ్యంగా తాము తయారీ రంగం తీరు పట్ల ఆందోళన చెందుతున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. పెట్టుబడులు, డిమాండ్ పెరగడానికి తగిన పరపతి విధానం అవసరమన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణి నేపథ్యంలో వడ్డీరేటు తగ్గించడానికి వెసులుబాటు ఉంటుందని విశ్లేషించారు. అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ కూడా దాదాపు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగం వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, దీనిపై వ్యయాలు తీవ్రంగా ఉండడం, రుణ సమీకరణ వ్యయాల భారం వంటి అంశాలను ప్రస్తావించారు. కాగా ద్రవ్యోల్బణం-వృద్ధి మధ్య సమతౌల్యతను సాధించడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ... వృద్ధికి ఊతం ఇవ్వడానికి ఆర్బీఐ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిబార్ సింగ్ కోరారు.