
ఆన్‌లైన్ వ్యాపారంలో వరస విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనమైంది. చాన్నాళ్లుగా ఇరు సంస్థల వ్యవస్థాపకుల మధ్యా సాగుతున్న చర్చల పర్యవసానంగా ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను రూ. 1,05,000 కోట్లతో వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాల్‌మార్ట్ చేపట్టిన కంపెనీ కొనుగోళ్లలో మాత్రమే కాదు... మొత్తం ఈ–కామర్స్ రంగంలోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారంటేనే ఫ్లిప్‌కార్ట్ ఏ స్థాయికి ఎదిగిందో అర్ధమవుతుంది.
ఆన్‌లైన్ వ్యాపారానికి అంతగా ఆదరణలేని తరుణంలో ఆ రంగంలో అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను అటువైపు ఆకర్షించడానికి చాలానే కృషి చేసింది. 2000 సంవత్సరంలో డాట్‌కామ్‌లు తామరతంపరగా పుట్టుకొచ్చినప్పుడు ఇక భవిష్యత్తంతా ఆన్‌లైన్ వ్యాపారానిదేనన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. కానీ చాలా తక్కువకాలంలోనే అదంతా నీటిబుడగ చందంగా మాయమైంది. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి తెప్పిం చుకునే వస్తువులు నాసిరకంగా ఉంటాయన్న అనుమానాలు, ఫిర్యాదు చేస్తే పట్టించుకోరన్న భయాలు ఆ వ్యాపారానికి అవరోధంగా మారాయి. ఇలా అంతంతమాత్రం ఆదరణ ఉన్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు అలాంటి భయాలను, అనుమానాలను పోగొట్టడానికి కృషి చేశాయి.
దీనికితోడు టెక్నాలజీ రంగంలో వచ్చిన పెను మార్పులు, ఈ–కామర్స్ సంస్థ లిచ్చే భారీ డిస్కౌంట్లు కూడా ఆన్‌లైన్ వ్యాపార విస్తరణకు దోహదపడ్డాయి. వినియోగదారులు ముందుగా చెల్లించడం కాక, కోరుకున్నది తమకు చేరాకే డబ్బు చెల్లించే ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ–కామర్స్ తీరునే ఫ్లిప్‌కార్ట్ మార్చేసింది. పుస్తకా లతో మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు, టీవీలు, దుస్తులు... ఇలా ఆన్‌లైన్‌లో ఇప్పుడు దొరకనిదేదీ లేదు. వచ్చే అయిదేళ్లలో ఈ–కామర్స్ మార్కెట్ నాలుగు రెట్లు పెరుగు తుందంటున్నారు.
అయితే ఇప్పటికీ మన దేశంలో సంప్రదాయ రిటైల్ వ్యాపారం వాటాయే అధికం. ఆన్‌లైన్ వ్యాపారం ఎంతగా విస్తరిస్తున్నా సంప్రదాయ వ్యాపారం దరిదాపులకు అదింకా చేరలేదు. ఒక సంస్థ అధ్యయనం ప్రకారం మన దేశంలో మొత్తం రిటైల్ రంగం విలువ 65000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 43,62,800కోట్లు)కాగా, అందులో ఇప్పటికీ 90 శాతం వాటా సంప్రదాయ రిటైల్ వ్యాపారానిదే. కానీ మున్ముందు ఇది ఇలాగే కొనసాగుతుందనుకోవడానికి లేదు. ఈ– కామర్స్ సంస్థలు ఎడాపెడా ఇస్తున్న ఆఫర్‌లు, డిస్కౌంట్లు క్రమేపీ వినియోగదారులను అటు మళ్లిస్తాయి.
సాధారణ రిటైల్ వ్యాపారులకు వినియోగదారుల్లో వారిపై ఉండే విశ్వాసమే ప్రధాన పెట్టుబడి. ఒక దుకాణంతో ఏళ్లు గడిచేకొద్దీ ఏర్పడే అనుబంధం వినియోగ దారుల్ని ఎటూ పోకుండా నిలబెడుతుంది. ఆ వ్యాపారులు దుకాణానికి అద్దె చెల్లించాలి. సరుకు నిర్వ హణ చూసుకోవాలి. తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలి. వారి జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకోవాలి. కనుక వారు వినియోగదారులకిచ్చే డిస్కౌంట్లకు పరిమితి ఉంటుంది. కానీ ఆన్‌లైన్ వ్యాపార సంస్థలకు ఇలాంటి బాదరబందీ లేదు. ఆన్‌లైన్‌లో వారు అమ్మే సరుకేదీ వారి దగ్గర ఉండదు. గిడ్డంగులున్నవారితో, సరుకులు సరఫరా చేసేవారితో, కొరియర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారందరినీ సమన్వ యపరుచుకుంటూ విని యోగదారులు కోరుకున్నవి అందేలా చూస్తారు.
అహేతుకమైన డిస్కౌంట్లు, ఆఫర్లవల్ల వీరికి నిజానికి నష్టాలే వస్తాయి. వీటిని కొన్నేళ్లు భరిస్తే క్రమేణా సంప్రదాయ రిటైల్ వ్యాపారం దెబ్బతిని కనుమరుగవుతుందని, అప్పుడు మార్కెట్‌ను శాసించి లాభాల బాట పట్టొచ్చునన్నది వీరి వ్యాపార సూత్రం. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిందదే. మన దేశంలో సంప్రదాయ రిటైల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 కోట్ల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆ వ్యాపారం దెబ్బతింటే వీరందరూ వీధిన పడతారు.
అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకున్న వాల్‌మార్ట్‌తో మరో ప్రమాదం ఉంది. ఇది చవగ్గా దొరికే చైనా సరుకుతో మార్కెట్లను ముంచెత్తుతోంది. అది అమ్మే సరుకులో దాదాపు 80 శాతం చైనా మార్కెట్‌కు సంబంధించినవే. ఇందువల్ల రిటైల్ దుకాణదారులకు, వినియో గదారులకొచ్చే కష్టనష్టాల సంగతలా ఉంచి మన తయారీ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. రిటైల్ రంగంలోని కోట్లాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. చైనా తయారీరంగం మాత్రం పుంజుకుంటుంది. ఆ దేశంతో ఇప్పటికే మనకున్న వాణిజ్య లోటు మరింత పెరుగుతుంది.
చైనా కార్మికులకు ఉపాధి, అక్కడి పరిశ్రమలకు, అమెరికా ఈ–కామర్స్ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టే ఈ పరిణామం మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్‌డీఐపై ఉన్న పరిమితులను ఈ–కామర్స్ దారిలో ఉల్లంఘిస్తోంది. వీటన్నిటిపైనా ఇప్పటికే అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్‌వంటివి నిరసన వ్యక్తం చేశాయి. తాజా ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి మన ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. చట్టాల్లోని లొసుగులను తొలగించాలి.
Comments
Please login to add a commentAdd a comment