న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ | PAK VS NZ 3rd T20: Pakistan Records Quickest 200 Plus Run Chase In T20Is | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌

Published Fri, Mar 21 2025 4:00 PM | Last Updated on Fri, Mar 21 2025 4:18 PM

PAK VS NZ 3rd T20: Pakistan Records Quickest 200 Plus Run Chase In T20Is

పాక్‌ క్రికెట్‌ జట్టు టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో  జరిగిన మ్యాచ్‌లో 205 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం​ 16 ఓవర్లలోనే ఊదేసి.. పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్‌ టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 200 పైబడిన లక్ష్యాలను ఇంత తొందరగా ఏ జట్టూ ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. 

సౌతాఫ్రికా 2007లో వెస్టిండీస్‌ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఛేదించింది. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 200 ప్లస్‌ లక్ష్యాలను ఛేదించిన జట్ల జాబితాలో మూడో స్థానంలో కూడా పాకిస్తానే ఉంది. 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 205 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఛేదించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. మార్క్‌ చాప్‌మన్‌ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడ్డారు. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో బ్రేస్‌వెల్‌ (18 బంతుల్లో 31), టిమ్‌ సీఫర్ట్‌ (19), డారిల్‌ మిచెల్‌ (17), ఐష్‌ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఫిన్‌ అలెన్‌ 0, నీషమ్‌ 3, మిచెల్‌ హే 9, జేమీసన్‌ 0, డఫీ 2 పరుగులకు  ఔటయ్యారు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్‌ అఫ్రిది, అబ్రార్‌ అహ్మద్‌, అబ్బాస్‌ అఫ్రిది తలో 2, షాదాబ్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌ ఓపెనర్‌ హసన్‌ నవాజ్‌ (45 బంతుల్లో 105 నాటౌట్‌; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్‌కు మరో ఓపెనర్‌ మహ్మద్‌ హరీస్‌ (20 బంతుల్లో 41), కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్‌) సహకరించడంతో పాక్‌ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

పాక్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ డఫీకి దక్కింది. ఈ గెలుపుతో పాక్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్‌ ఘన విజయం​ సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా జరుగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement