
నాలుగో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 115 పరుగుల తేడాతో ఘనవిజయం
మెరిసిన అలెన్, సీఫెర్ట్, డఫీ
బుధవారం చివరి టి20
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): బ్యాటర్ల దూకుడుకు... బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో... పాకిస్తాన్‌తో నాలుగో టి20లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన పోరులో ఆతిథ్య న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3–1తో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (22 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. బ్రేస్‌వెల్ (26 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... మార్క్ చాప్‌మన్ (24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (29; 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నంతసేపు దూకుడు కనబర్చారు.
పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ పూర్తిగా తడబడింది. 16.2 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. మొత్తం జట్టులో అబ్దుల్ సమద్ (30 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇర్ఫాన్ ఖాన్ (24; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
గత మ్యాచ్ సెంచరీ హీరో హసన్ నవాజ్ (1), కెప్టెన్ ఆఘా సల్మాన్ (1), మొహమ్మద్ హరీస్ (2), షాదాబ్ ఖాన్ (1), ఖుష్‌దిల్ షా (6) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4, ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టారు. కివీస్ ఓపెనర్ అలెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి టి20 బుధవారం వెల్లింగ్టన్‌లో జరుగుతుంది.
బాదుడే బాదుడు...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సీఫెర్ట్, అలెన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ ఎడాపెడా బౌండరీలతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్‌లో 2 సిక్స్‌లు బాదిన సీఫెర్ట్... అబ్రార్ వేసిన నాలుగో ఓవర్‌లో 6, 4, 6 కొట్టాడు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 54 పరుగులు చేసింది.
మరో భారీ షాట్‌కు యత్నించి సీఫెర్ట్ అవుట్ కాగా... ఆ తర్వాత బాదే బాధ్యత అలెన్ తీసుకున్నాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన అలెన్... అబ్రార్ వేసిన ఏడో ఓవర్‌లో 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఫలితంగా 8 ఓవర్లలోనే కివీస్ వంద పరుగుల మార్క్ దాటింది. షాదాబ్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 6 కొట్టిన అలెన్ 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 134/2తో నిలిచింది.
ఈ దూకుడు చూస్తుంటే కివీస్ మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా... ఆ తర్వాత తేరుకున్న పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచి కివీస్‌ను కాస్త కట్టడి చేశారు. చివర్లో బ్రాస్‌వెల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టుకు మంచి స్కోరు అందించాడు.
పెవిలియన్‌కు ‘క్యూ’
భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే హరీస్ క్లీన్»ౌల్డ్ కాగా... గత మ్యాచ్‌లో సెంచరీతో జట్టుకు చక్కటి విజయాన్ని అందించిన హసన్ నవాజ్ రెండో ఓవర్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ సల్మాన్ కూడా కీపర్ క్యాచ్‌గా వెనుదిరగగా... ఇర్ఫాన్ ఖాన్ కాసేపు పోరాడాడు.
షాదాబ్, ఖుష్‌దిల్ షా, అబ్బాస్ అఫ్రిది (1), షాహీన్ షా అఫ్రిది (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా ఒక దశలో పాకిస్తాన్ 56 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి మరింత ఘోరం పరాజయం మూటగట్టుకునేలా కనిపించినా... ఆఖర్లో సమద్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును వంద పరుగుల మైలురాయి దాటించాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ (4/20), ఫోల్‌్క్స (3/25) కలిసి 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment