Retail market
-
ఘాటెక్కిన ఉల్లి
సాక్షి, భీమవరం: ఉల్లి ధర ఘాటెక్కింది. రిటైల్ మార్కెట్లో కేజీ ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే పేరొందిన తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌కు షోలాపూర్, నాసిక్, పూణే, అహ్మద్‌నగర్ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతులు జరుగుతుంటాయి.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని మార్కెట్లకు సైతం ఇక్కడి నుంచే ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. వారం క్రితం రిటైల్ మార్కెట్లో కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు పలికిన ధరలు అమాంతం పెరిగాయి. ఆటోలపై ఇళ్లకు వచ్చి నాసిరకం ఉల్లిని మూడు కిలోలు రూ.100కు విక్రయిస్తుండగా.. దుకాణాల వద్ద నాణ్యతను బట్టి కిలో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్మకాలు చేస్తున్నారు.రెట్టింపైన కూరగాయల ధరలు కూరగాయల ధరలు సైతం రెట్టింపయ్యాయి. వేసవి ఎండలు గోదావరి లంకలు, మెట్ట ప్రాంతాల్లో సాగుచేసే కూరగాయ పంటలకు తీవ్ర నష్టం కలగజేశాయి. అధిక ఉష్ణోగ్రతలకు పూత మాడిపోయి దిగుబడులు పడిపోయాయి. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.20 ఉండే వంకాయలు రూ.40కి చేరగా, బెండకాయలు రూ.24 నుంచి రూ.40కి, బీరకాయలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే క్యారెట్, బీట్రూట్, బంగాళా దుంప ధరలు నిలకడగా ఉండగా.. టమాటా రూ.20 నుంచి రూ.50కి పెరిగింది.పాత నిల్వలు వస్తేనే..ప్రస్తుతం ఉల్లి ధర పెరుగుదల తాత్కాలికమేనని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు దిగుమతులు తగ్గాయని హోల్‌సేల్ వ్యాపారి సర్వేశ్వరరావు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర మార్కెట్లోకి పాత నిల్వలు రానున్నట్టు అక్కడి వ్యాపారులు చెబుతున్నారన్నారు. అవి ఇక్కడి మార్కెట్‌కు చేరితే శుక్రవారం నాటికి ధరలు దిగివచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. -
తగ్గిన పరిశ్రమల జోరు.. ఆహార ధరల తగ్గుముఖం
న్యూఢిల్లీ: భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 25 శాతంపైగా వెయిటేజ్ ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 2023 డిసెంబర్లో మందగించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెలలో ఈ రంగం వృద్ధి స్పీడ్ 5.1 శాతం. సమీక్షా కాలంలో మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి విభాగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. అయితే 2023 నవంబర్‌తో (2.4 శాతం) డిసెంబర్లో సూచీ పెరగడం (3.8 శాతానికి) కొంత ఊరటనిచ్చే అంశం. ఇక జనవరి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.1%గా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. కీలక రంగాలు ఇలా... జాతీయ గణాంకాల కార్యాలయం గణాంకాల ప్రకారం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు 3.6 శాతం (2022 డిసెంబర్) నుంచి 3.9 శాతానికి (2023 డిసెంబర్) పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి వృద్ధి 10.4 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. మైనింగ్ క్షీణతలోనే ఉంది. అయితే క్షీణ రేటు 10.1 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. తొమ్మిది నెలల కాలంలో అప్ ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల (ఏప్రిల్–డిసెంబర్) కాలాన్ని చూస్తే.. మాత్రం ఐఐపీ వృద్ధి రేటు 5.5% నుంచి 6.1%కి పెరిగింది. ఆహార ధరల తగ్గుముఖం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.1 శాతానికి తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ను చూస్తే, డిసెంబర్లో ధరల భారం 9.53 శాతం పెరగ్గా, ఈ భారం జనవరిలో 8.3 శాతానికి తగ్గింది. ఆహారం, పానీయాల విభాగంలో 7.58%, హౌసింగ్ రంగంలో 3.20% ద్రవ్యోల్బణం నమోదైంది. -
సన్నాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: సన్న బియ్యం సామాన్యులు కొనలేని పరిస్థితి దాపురించింది. దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి పాత సన్న బియ్యం ధర క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి 8వేల వరకు ఉండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన వానాకాలం బియ్యాన్ని కూడా రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. జై శ్రీరామ్ క్వింటాల్‌కు రూ.7,800 వరకు సన్నబియ్యంలో అగ్రగామిగా చెప్పుకునే జైశ్రీరాం రకం పాత బియ్యం ధర నాలుగు రోజుల క్రితం క్వింటాల్‌కు రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో పలికింది. తర్వాత రూ. 200 వరకు తగ్గినా, మళ్లీ ధర పెరిగింది. మంగళవారం రూ. 7,500 నుంచి రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో అమ్మినట్టు సమాచారం. హెచ్ఎంటీ రకం బియ్యం(పాతవి) రూ.7,200 వరకు, కొత్తవి రూ.6,500 నుంచి 7,000 వరకు రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాలను రూ. 5,500 నుంచి 6,500 వరకు అమ్ముతున్నారు. దొడ్డు బియ్యం అంతంతే దొడ్డు బియ్యం ధర క్వింటాల్ రూ.4,500 నుంచి ఉన్నా, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరగని సన్నాల దిగుబడి రాష్ట్రంలో యాసంగి సీజన్లో 80 శాతానికి పైగా దొడ్డు రకాలైన 1010, 1001, 1061, ఐఆర్ 64, తెల్లహంస వంటి వరి రకాలనే ఎక్కువగా పండిస్తారు. ఉత్తర తెలంగాణలో యాసంగిలో సన్న రకాలు పండే పరిస్థితి ఏమాత్రం లేదు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మంలలో అదే పరిస్థితి. మిర్యాలగూడ, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కొన్నిచోట్ల సన్నాలు పండించినా, సొంత అవసరాలకే వినియోగిస్తారు. ఇక వానాకాలం సీజన్లో నిజామాబాద్ మినహా ఉత్తర తెలంగాణలో రైతులు తమ పొలాల్లో సంవత్సరకాలం తిండి అవసరాలు, స్థానిక అవసరాలకు మాత్రమే సన్న రకాలను పండించి, దొడ్డు వరి వైపే మొగ్గు చూపుతారు. నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే ఖరీఫ్ సీజన్లో సన్నాలు ఎక్కువగా పండిస్తారు. సన్నాలను బియ్యంగా మార్చి విక్రయించే రైతులు కొందరైతే , సన్న ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించే వారు ఎక్కువ మంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో నాగార్జునసాగర్ కింద పంట తక్కువగా రావడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కూడా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో సన్న ధాన్యాన్ని తెగులు సోకినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా కొంత పంట దెబ్బతింది. కేవలం బోర్లు, కరెంటు మోటార్ల కింద పండిన పంట మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 99 మెట్రక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినా, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే మరో 2 ఎల్ఎంటీ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. గత యాసంగిలో 67 ఎల్ఎంటీ మేర దొడ్డు ధాన్యం వచ్చినా, అదంతా మిల్లుల్లోనే నిల్వ ఉంది. -
పైసలు... తీసుకెళ్లాలంటే పరేషాన్!
వీరేందర్ హయత్‌నగర్‌లో కిరాణా స్టోర్ నిర్వహిస్తున్నాడు. దసరా సీజన్ కావడంతో దుకాణంలోకి సరుకులు తెచ్చేందుకు రెండ్రోజుల క్రితం మార్కెట్‌కు బయలుదేరాడు. చింతలకుంట సమీపంలో రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. అతని వెంట ఉన్న రూ.2.30 లక్షల నగదును సీజ్ చేశారు. కిరాణా దుకాణం నిర్వాహకుడినని, సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు చెప్పినా ఫలితం లేక పోయింది. దుకాణంలో రోజువారీ సేల్స్ తాలూకు డబ్బులు కావడంతో సంబంధిత పత్రాలు లేవు.దీంతో నగదును వెనక్కు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. దీనిపై క్షేత్రస్థాయి లో అవగాహన లేకపోవడంతో చాలామంది నగదును తీసుకెళ్తూ పట్టుబడుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కోట్లాది రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల సంఘం విధించిన రూ.50 వేల గరిష్ట పరిమితి నిబంధన వల్ల సామాన్యులు పలు సందర్భాల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ చిల్లర వర్తకంలో నగదు లావాదేవీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. హోల్‌సేల్‌తోపాటు రిటైల్ మార్కెట్లోనూ నగదు లావాదేవీలు పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయి. అలా నగదు లావాదేవీలు జరిగినప్పుడు దుకాణా దారులు చాలాచోట్ల రసీదులు ఇవ్వడం లేదు. హోల్‌సేల్ దుకాణాల్లో వస్తువుల కొనుగోలుకు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. డిజిటల్ లావాదేవీలు మేలు: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది. చిల్లర వ్యాపారులు పలు అవసరాలకు నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. అంతేగాకుండా సరుకుల కొనుగోలుకు జనాలు సైతం నగదు తీసుకెళ్తుంటారు. ఇవేగాకుండా వైద్య, వ్యాపార అవసరాల నిమిత్తం అప్పులు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటారు. వీటికి లిఖిత పూర్వక ఆధారాలేమీ ఉండవు. చేబదులు రూపంలో తీసుకునే మొత్తానికి ఎలాంటి రసీదు ఉండదు. మరోవైపు వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు, కాలేజీ ఫీజులు చెల్లించే వాళ్లు తమ వెంట రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఎక్కువగా ఇలాంటివే ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. అందువల్ల ఈ పరిస్థితుల్లో నగదును తీసుకెళాల్సి ఉంటే సరైన ఆధారాలను వెంట ఉంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే సమీప బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం మంచిదని అంటున్నారు. -
టమాటా రూ.100 పచ్చిమిర్చి రూ.160
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వరకు రూ.వందకు నాలుగు కిలోల చొప్పున అమ్మిన టమాటాల ధర ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ రిటైల్ మార్కెట్లో టమాటా కిలో రూ.100కు చేరింది. పావుకిలో కొనాలంటే రూ.30 ఇస్తే తప్ప దొరకని పరిస్థితి. అలాగే, పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడుతోపాటు అన్ని కూరల్లో వాడే అల్లం, వెల్లుల్లి ధరలు కూడా సామాన్యుడికి ఏమాత్రం అందనంతగా పెరిగిపోయాయి. పచ్చిమిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు తప్ప బెండకాయలు, బీరకాయలు, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కిలో రూ.60–80కి మధ్య ఉండటం గమనార్హం. రైతుబజార్లు, మార్కెటింగ్ శాఖ మొబైల్ వ్యాన్లలో విక్రయించే చోట ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రిటైల్ దుకాణాల్లో కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్మార్కెట్లలో రిటైల్ మార్కెట్ల కన్నా కిలోకు రూ.10–15 వరకు అధికంగా ఉంది. అల్లం కిలో రూ.300 కూరల్లో రుచికి తప్పనిసరైన అల్లం ధర ఊహించని విధంగా కిలో రూ.300కి చేరింది. మంగళవారం హైదరాబాద్ చింతలబస్తీలో బండ్లపైన అల్లం పావుకిలో రూ.80 ఉండగా, కిలోకు రూ.300 చెప్పడం గమనార్హం. వెల్లుల్లి కిలో రూ.200 ఉండగా, మేలురకం ధర రూ.240 ఉంది. మూడు నెలల క్రితం వరకు కిలో రూ.100కి లభించిన అల్లం, వెల్లుల్లి ధరలు ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయి సామాన్యుడు కొనలేనంత పైకి చేరుకున్నాయి. బీన్స్ నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి రూ.160 వరకు ఉండగా, చిక్కుడుకాయలు కిలో రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. వేసవిలో కూరగాయలు పండించకనే.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మూడునెలలుగా రాష్ట్రంలో కూరగాయల పంటలు ఆశించిన స్థాయిలో లేవు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షాలు, మే, జూన్లలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపీ నుంచి కూడా ఆశించినస్థాయిలో తెలంగాణకు దిగుమతులు లేవు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, క్యారెట్ వంటివి తప్ప నిత్యం వండుకునే కూరగాయల దిగుమతులు తక్కువగానే ఉన్నట్లు హైదరాబాద్ రైతుబజార్ ప్రతినిధి ఒకరు చెప్పారు. -
పప్పు.. నిప్పు!
సాక్షి, హైదరాబాద్: వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. ఎర్రపప్పు (మసూర్ దాల్) కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. వేరుశనగ (పల్లీలు) ధర కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. కేవలం పెసరపప్పు ధరలో మాత్రమే పెద్దగా తేడా కనిపించట్లేదు. ఇక సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది. అలాగే ఆర్గానిక్ పేరుతో ప్యాక్ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. ఈ కేటగిరీలో మినపపప్పు ధర కిలో రూ. 150పైగా ఉండగా ఎర్రపప్పు రూ. 120గా ఉంది. వేరుశనగ నూనెను కిలోకు రూ. 180పైగా విక్రయిస్తున్నారు. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాల, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే.. దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గతేడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంది. కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతా వరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాలకుతోడు పప్పుధాన్యాలు, వేరుశనగతో పోలిస్తే తక్కువ శ్రమతో చేతికందే ఇతర పంటల సాగు వైపు రైతు లు మొగ్గుచూపడం వల్లే దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోనితాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ గతేడాది పప్పుధాన్యాల దిగుబడి తగ్గినట్లు చెబుతున్నాయి. స్టాక్.. బ్లాక్ మార్కెట్‌కు? పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్ వంటి ప్రధాన మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే ‘నో స్టాక్’బోర్డులు దర్శనస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్ మార్కెట్‌కు తరలే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల త్వరలోనే కందిపప్పు ధర రిటైల్ మార్కెట్లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా యూపీఐదే
న్యూఢిల్లీ: దేశీయంగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)లో లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి 2026–27 నాటికి రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా ఆక్రమించనున్నాయి. రోజుకు 100 కోట్ల స్థాయికి చేరనున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం 2022–23లో రిటైల్ సెగ్మెంట్లో మొత్తం లావాదేవీల పరిమాణంలో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతంగా ఉంది. దేశీయంగా మొత్తం డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఏటా 50 శాతం (పరిమాణం పరంగా) పెరుగుతూ వస్తోంది. ఇది 2022–23లో 103 బిలియన్ లావాదేవీల స్థాయిలో ఉండగా 2026–27 నాటికి 411 బిలియన్ లావాదేవీలకు చేరనుంది. ఇందులో ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు 83.71 బిలియన్లుగా ఉండగా అప్పటికి 379 బిలియన్లకు (రోజుకు దాదాపు 1 బిలియన్) చేరతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ మెరుగ్గా వృద్ధి చెందుతోంది. 2024–25 నాటికి డెబిట్ కార్డు లావాదేవీలను మించనుంది. ► క్రెడిట్ కార్డుల జారీ వచ్చే అయిదేళ్లలో 21 శాతం మేర వృద్ధి చెందనుండగా.. డెబిట్ కార్డుల జారీ మాత్రం స్థిరంగా 3 శాతం స్థాయిలోనే కొనసాగనుంది. డెబిట్ కార్డును ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్‌కే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు యూపీఐతో కూడా విత్‌డ్రా చేసుకునే వీలుండటంతో డెబిట్ కార్డుల వినియోగం తగ్గనుంది. ► 2022–23లో బ్యాంకులు, ఫిన్‌టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కార్డుల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో క్రెడిట్ కార్డుల వ్యాపారం వాటా 76 శాతంగా ఉంది. దీంతో ఆయా సంస్థలకు ఇది ఆకర్షణీయమైన వ్యాపారంగానే కొనసాగనుంది. 2021–22తో పోలిస్తే 2022–23లో క్రెడిట్ కార్డుల జారీ ద్వారా ఆదాయం 42 శాతం పెరిగింది. వచ్చే అయిదేళ్లలో ఇది వార్షికంగా 33 శాతం వృద్ధి చెందనుంది. -
దేశీ రిటైల్ రంగం @ 2 లక్షల కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో ఒకటైన భారత్ 2032 నాటికల్లా 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఇది 844 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అసంఘటిత రిటైల్ మార్కెట్ వాటా 87%గా ఉంది. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ సుబ్రమణియం వి. ఈ విషయాలు తెలిపారు. ‘రిటైల్ రంగం ఏటా 10 శాతం వృద్ధితో 2032 నాటికి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలవనుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వ హించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయిలో ఉండటం, ఆర్థిక వనరుల కొరత వంటి సమస్యల కారణంగా అసంఘటిత రిటైల్ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ వినియోగం ఉండటం లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమ్మిళిత, సుస్థిర వృద్ధికి తోడ్పడేలా వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సుబ్రమణియం చెప్పారు. అసంఘటిత రంగంలోని చిన్న వ్యాపారా ల సమ్మిళిత వృద్ధికి సహకరించేలా ప్రభుత్వ పాలసీ లు, బడా కంపెనీల వ్యాపార విధానాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న స్థాయి తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆధునీకరించుకుని, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహదపడే విధమైన కొనుగోళ్ల వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లైసెన్సింగ్ విధానం మెరుగుపడాలి .. రిటైల్ రంగానికి లైసెన్సింగ్ వంటి అంశాలపరంగా సమస్యలు ఉంటున్నాయని సుబ్రమణియన్ చెప్పారు. ప్రస్తుతం ఒక రిటైల్ స్టోర్ ప్రారంభించాలంటే 10 నుంచి 70 వరకు లైసెన్సులు తీసుకోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ఇలా వివిధ లైసెన్సుల అవసరం లేకుండా వ్యాపార సంస్థకు ఒకే లైసెన్సు సరిపోయేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. మరోవైపు దేశీయంగా సరఫరా వ్యవస్థపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరమని సుబ్రమణియన్ తెలిపారు. ప్రధానమైన సోర్సింగ్ ప్రాంతాలను అవసరానికి తగినట్లు విస్తరించుకోగలిగేలా గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానించాలని ఆయన చెప్పారు. తద్వారా సోర్సింగ్‌కు పట్టే సమయం తగ్గుతుందని, ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతం కాగలదని పేర్కొన్నారు. ఇటు స్టోర్స్‌లోనూ, అటు ఈ–కామర్స్లోను కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం రిటైల్ రంగంలో క్రమంగా పెరుగుతోందని సుబ్రమణియన్ వివరించారు. 5జీ రాకతో ఇది మరింతగా పుంజుకోగలదని పేర్కొన్నారు. రిటైల్, ఈ–కామర్స్ పాలసీలపై కేంద్రం కసరత్తు డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ దేశీయంగా రిటైల్ రంగం వృద్ధికి ఊతమిచ్చే దిశగా జాతీయ స్థాయిలో రిటైల్ వాణిజ్యం, ఈ–కామర్స్ విధానాలను రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రుణ లభ్యత మొదలైన వాటి రూపంలో భౌతిక స్టోర్స్‌ను నిర్వహించే వ్యాపార వర్గాలకు ఇది తోడ్పాటునిచ్చే విధంగా ఉంటుందని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు. అటు ఆన్లైన్ రిటైలర్ల కోసం కూడా ఈ–కామర్స్ పాలసీని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. రిటైల్ ట్రేడర్ల కోసం ప్రమాద బీమా పథకంపైనా కసరత్తు జరుగుతోందని, ప్రధానంగా చిన్న ట్రేడర్లకు ఇది సహాయకరంగా ఉండగలదని ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్‌పై సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ చెప్పారు. భౌతిక, ఆన్లైన్ రిటైల్ వాణిజ్యం రెండింటి మధ్య వైరుధ్యమేమీ లేదని, ఒకటి లేకుండా రెండోది మనలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో ఈ–కామర్స్ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, కొన్ని ఈ–కామర్స్ దిగ్గజాల గుత్తాధిపత్యానికి బ్రేక్ పడుతుందని సంజీవ్ వివరించారు. నాణ్యతలేని ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే లక్ష్యంతో వివిధ ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడంపై కేంద్రం దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు. -
రూ.164 లక్షల కోట్లకు రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ 2032 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు (రూ.164 లక్షల కోట్లు) చేరుకుంటుందని రిటైల్ వర్తకుల అసోసియేషన్ (రాయ్), ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సంయుక్తంగా విడుదల చేసిన ఓ నివేదిలో పేర్కొన్నాయి. 2021 నాటికి రిటైల్ మార్కెట్ పరిమాణం 690 బిలియన్ డాలర్లు (56.5 లక్షల కోట్లు)గా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. సంఘటిత రిటైల్ రంగం విక్రయాలు 2021–22 నాటికి 52 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2028 నాటికి 136 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని పేర్కొంది. వచ్చే 4–5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 25 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో కొత్త మాల్ వసతులను అభివృద్ధి చేయనున్నట్టు అంచనా వేసింది. 2022లో ఈ ఏడు పట్టణాల్లో 2.6 మిలియన్ చదరపు అడుగుల కొత్త మాల్ విస్తీర్ణం తోడైనట్టు తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువని పేర్కొంది. 2022 చివర్లో పండుగల సమయంలో విక్రయాల విలువ రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని, గతేడాదితో పోలిస్తే ఇది 2.5 రెట్లు అధికమని అనరాక్ రిటైల్ సీఈవో, ఎండీ అనుజ్ కేజ్రీవాల్ తెలిపారు. సంఘటిత రిటైల్ మార్కెట్ ఏటా 25 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చూస్తుందని చెప్పారు. మూడు పట్టణాల్లో ఎక్కువ వసతులు భారత రిటైల్ రంగం 2019 నుంచి 2022 మధ్య 1,473 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 51 మిలియ్ చదరపు అడుగులకు పైన మాల్ వసతులు ఉంటే, అందులో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు 62 శాతం వాటా ఆక్రమిస్తున్నట్టు చెప్పారు. 2022లో సగటున మాల్ అద్దె 15 శాతం పెరిగిందని, బెంగళూరులో అత్యధికంగా అద్దెలు 27 శాతం పెరిగితే, ఆ తర్వాత కోల్‌కతాలో 20 శాతం అధికమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ–రిటైల్ మార్కెట్ పరిమాణం 2025–26 నాటికి 120–140 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. -
ఊపు మీదున్న రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ షాపింగ్ మాల్స్, ఖరీదైన వీధుల్లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ గతేడాది 47 లక్షల చదరపు అడుగులు నమోదైంది. దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో 2021తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తన నివేదికలో వెల్లడించింది. ‘భారత రిటైల్ రంగం రికవరీ బాటలో ఉంది. ఈ ఏడాదీ ఊపు కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ విదేశీ బ్రాండ్లు ప్రథమ శ్రేణి నగరాలేగాక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించడమే ఇందుకు కారణం. 2022లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ బెంగళూరులో 16.8 లక్షల నుంచి 19.2 లక్షల చదరపు అడుగులకు, ఢిల్లీ ఎన్సీఆర్ 3.6 లక్షల నుంచి 9.6 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో 6.4 లక్షల నుంచి 3.1 లక్షల చదరపు అడుగులకు, ముంబైలో 6.6 లక్షల నుంచి 3.9 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. 2023లో భారత్‌లో కొత్తగా 16 మాల్స్ రాబోతున్నాయి. వచ్చే ఏడాదీ ఇదే స్థాయిలో మాల్స్ ఏర్పాటు కానున్నాయి’ అని వివరించింది. -
కోడిగుడ్డు.. కొత్త రికార్డు
మండపేట: గుడ్డు ధర అంతకంతకూ పెరుగుతోంది. పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గుడ్డు రైతు దగ్గర ధర రూ.5.54కు చేరింది. నాలుగేళ్లలో ఇదే అత్యధిక ధర. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ. 7కు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తక్కువగా ఉండటంతో గుడ్ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఎగుమతులు పుంజుకొని రైతులకు అత్యధిక ధర లభిస్తుంది. 2017వ సంవత్సరం సీజన్లో రైతు దగ్గర ధర అత్యధికంగా రూ.5.45 లభించింది. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో నాలుగేళ్లుగా పౌల్ట్రీ రంగం గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సీజన్లో రైతు ధర రూ.5 దాటడం గగనమైంది. ఈ సీజన్లో శీతలం ఎక్కువగా ఉండటంతో జిల్లాలోని గుడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగి, ధర పెరిగింది. ఈ ధర అశాజనకమే అయినప్పటికీ, మేత ధర ఇబ్బడిముబ్బడిగా పెరడంతో ప్రయోజనం అంతంత మాత్రమేనని కోళ్ల రైతులు అంటున్నారు. కోళ్లకు వేసే వ్యాక్సిన్లు, మందుల ధరలు, కార్మికుల జీతాలు పెరిగిపోవడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని పెంచేసిందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది సగటు ధర రైతు దగ్గర రూ.5 ఉంటేనే కానీ గిట్టుబాటు కాదని, గత ఏడాది సగటు ధర రూ. 4.39 మాత్రమే ఉండటంతో నష్టాలు వచ్చాయని చెబుతున్నారు. కోడి మేతకు వినియోగించే మొక్కజొన్న, సోయా, నూకలు తదితర వాటిని పౌల్ట్రీలకు రాయితీపై సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధరలు తగ్గితేనే ఊరట గతంతో పోలిస్తే ఈ సీజన్లో గుడ్డు అత్యధిక రైతు ధరను నమోదు చేసుకుంది. ప్రస్తుత ధర ఆశాజనకంగా ఉన్నా కోడి మేత ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మేత రేట్లు అందుబాటులోకి వస్తేనే పరిశ్రమకు ఊరట. కోడి మేతను సబ్సిడీపై పౌల్ట్రీలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ -
Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు
సాక్షి, తూర్పుగోదావరి(మండపేట): కోడి గుడ్డు ధర కొండెక్కింది. రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.ఏడుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకున్నాయి. మరోపక్క కార్తిక మాసం ముగియడంతో స్థానిక వినియోగం పెరగడంతో గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. కాగా సీజన్లో రైతు ధర నిలకడగా ఉంటేనే నష్టాలు కొంత భర్తీ అవుతాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలో చేపల లభ్యత తక్కువగా ఉండటం వల్ల గుడ్ల వినియోగం పెరిగి ఎగుమతులకు డిమాండ్ ఉంటుంది. శీతల ప్రభావం అధికంగా ఉండే అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి సీజన్‌గా భావిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైతు ధర పౌల్ట్రీకి ఆశాజనకంగా ఉంటుంది. పౌల్ట్రీ వర్గాల ఆందోళన మంగళవారం నాటికి రైతు ధర రూ. 5.44కు చేరింది. కాగా రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 పలుకుతుండటంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అమ్మకాలు చేయడం పరిపాటి. అందుకు భిన్నంగా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న మండపేట, అనపర్తి, పెద్దాపురం, రాజానగరం పరిసర ప్రాంతాల్లో రూ 6.50కు అమ్మకాలు చేస్తుండగా రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర చోట్ల ఏడు రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.7.50కు అమ్మకాలు జరుగుతున్నట్టు వ్యాపారులు అంటున్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) రెండు వారాల క్రితం రూ.5 ఉన్న గుడ్డు ధరను ఏడు రూపాయలు వరకు పెంచేశారని వినియోగదారులు అంటున్నారు. డ్యామేజీ అయిన గుడ్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ధర పెంచకతప్పడం లేదని వ్యాపారులు అంటున్నారు. కాగా రిటైల్ మార్కెట్లో ధర బాగా పెరిగిపోవడం పౌల్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక ధరతో వినియోగం తగ్గితే ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుందంటున్నారు. పెరిగిన మేతలు, మందుల ధరలు, నిర్వహణ భారంతో గుడ్డు ఏడాది సగటు రైతు ధర ఐదు రూపాయలు ఉంటేనే గిట్టుబాటు కాదని కోళ్ల రైతులు అంటున్నారు. ఈ ఏడాది సగటు ధర నాలుగు రూపాయలు మాత్రమే ఉండటంతో ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. సీజన్లో రైతు ధర రూ. 5.50 దాటి నిలకడగా ఉంటేనే పాత నష్టాలను భర్తీ చేసుకునేందుకు వీలుంటుందన్నారు. రైతు ధర నిలకడగా ఉండాలి మేత ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. ఏడాది సగటు రైతు ధర రూ. ఐదు ఉంటేనే కాని గిట్టుబాటు కాదు. ప్రస్తుత రైతు ధర సీజన్లో నిలకడగా ఉంటే పాత నష్టాలు కొంతమేర భర్తీ అవుతాయి. ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వపరంగా సాయం కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి
Vegetable Prices List In Hyderabad: వంటగదిలోకి వెళ్లకమునుపే కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు బయట మార్కెట్లోనే అనుకుంటే...ఇప్పుడు రైతుబజార్లో సైతం కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క టమాటా ధర నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.100కు చేరింది. అదే బాటలో బెండకాయ, వంకాయ, దొండ, చిక్కుడు, గోకరకాయ, క్యారెట్, బీన్స్...ఇలా దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో కిలో కొనేచోట అర, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. రైతుబజార్ ధరలే బెంబేలెత్తిస్తుంటే ఇక బయట ధరలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితులే ఉన్నాయి. (చదవండి: గిన్నిస్ బుక్‌లో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ వాస్తవ.. ఇంతకీ ఏం చేస్తోంది) వర్షాలు బాగా కురిసినప్పటికీ.. నిన్న మొన్నటివరకు వర్షాలు బాగానే కురిసినప్పటికీ కూరగాయల ధరల దిగుబడి మాత్రం పెరగకపోవడంతో ధరలకు రెక్కాలొచ్చాయి. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో నిన్నటి వరకు కురిసిన భారీ వరదలకు రోడ్లు దెబ్బతినటంతో కూరగాయల దిగుమతి తగ్గిపోయింది. వాహనాల రాకపోకలు లేకపోవటంతో ధరలు పెరిగాయి. మండు వేసవిలో ఉన్న ధరల కంటే అధికంగా ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య ఎనలేని వ్యత్యాసం ఉంటుండడంతో వ్యాపార వర్గాలు ధరలు పెంచేసి విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భరత్‌నగర్ కాలనీ కూరగాయల మార్కెట్లో కూడా ధరలు అధికంగా ఉన్నాయి. కర్రీ పాయింట్లలో సైతం.. పెరిగిన కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరల కారణంగా కర్రీ పాయింట్ల నిర్వాహకులు సైతం ధరలు పెంచేశారు. నిన్నటివరకు రూ.10– 12లుగా ఉన్న కనీస ధర (ఒక కర్రీ)ను రూ.20లకు పెంచేశారు. అయితే ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా ఉంది. మరోవైపు పెరిగిన కూరగాయల ధరలతో కొనడమే మానేసిన చాలా మంది కర్రీ పాయింట్లను ఆశ్రయించడంతో ఆయా సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఆదే అదునుగా నిర్వాహకులు కర్రీ పాయింట్లపై ఆధారపడ్డ యువత, బ్యాచ్లర్స్, కుటుంబాలపై సైతం అదనపు భారం వేస్తున్నారు. (చదవండి: ముక్కలేనిదే ముద్ద దిగదు.. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచి ఆస్వాదించాల్సిందే) ఎన్నడూ లేనంత ధరలు పలుకుతున్నాయి.. గతంలో ఎప్పుడూ లేనంతగా కూరగాయల ధరలు మండుతున్నాయి. అదీ, ఇదీ అని కాకుండా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి. నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం తప్పడం లేదు. టమాట గతంలో 10 నుంచి 20 దాకా ఉండేది. ఒకేసారి 100కు చేరటం, మిగతా కూరగాయలు కూడా 60 రూపాయలు దాటి ఉండటం వినియోగదారుల నడ్డి విరుగుతోంది. – అనిత, మూసాపేట గడిచిన నెలలో పెరిగిన కూరగాయల ధరలు, రైతుబజార్ ధరల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి -
రిటైల్ మార్కెట్లో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్
ముంబై: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ప్రపంచ రిటైల్ పవర్ హౌస్‌ల 2021 ర్యాంకింగ్‌లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ రిటైలర్‌గా నిలిచింది. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ జాబితాలో గత ఏడాది 56వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 53వ స్థానంలో ఉంది. డెలాయిట్ నివేదిక ప్రకారం, ఈ జాబితాలో యుఎస్ దిగ్గజం వాల్ మార్ట్ ఇంక్ అగ్రస్థానంలో ఉంది. మరోసారి ప్రపంచంలోని అగ్రశ్రేణి రిటైలర్ గా తన స్థానాన్ని నిలుపుకుంది. అమెజాన్.కామ్ రెండవ స్థానంలో నిలిచింది. కాస్ట్కో హోల్‌సేల్ కార్పొరేషన్ ఆఫ్ యుఎస్ మూడో స్థానంలో నిలిచింది, స్క్వార్జ్ గ్రూప్ ఆఫ్ జర్మనీ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏడుగురు యుఎస్ రిటైలర్లు, ఒకరు యుకె(టెస్కో పిఎల్సి 10వ స్థానంలో) ఉన్నారు. టాప్ 10లో ఉన్న ఇతర యుఎస్ రిటైలర్లలో ది క్రోగర్ కో(5 వ ర్యాంక్), వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ ఇంక్ (6వ), సీవీఎస్ హెల్త్ కార్పొరేషన్ (9వ ర్యాంక్) ఉన్నాయి. జర్మనీకి చెందిన ఆల్డి ఐంకాఫ్ జిఎమ్‌బిహెచ్ & కో.ఓహెచ్జి మరియు ఆల్డి ఇంటర్నేషనల్ సర్వీసెస్ జిఎమ్‌బిహెచ్ & కో.ఓహెచ్జీ 8వ స్థానంలో ఉన్నాయి. 250 మంది రిటైలర్ల ప్రపంచ జాబితాలో రిలయన్స్ రిటైల్ మాత్రమే భారతీయ సంస్థగా గుర్తింపు పొందడం విశేషం. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్, ప్రపంచంలోని వేగవంతమైన రిటైలర్ల జాబితాలో ఇది వరుసగా 4వ సారి ప్రవేశం పొందింది. "రిలయన్స్ రిటైల్ కంపెనీ 41.8 శాతం వృద్ధిని నమోదు చేసింది, ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జీవనశైలి, కిరాణా రిటైల్ గొలుసులలోని దుకాణాల సంఖ్య 13.1 శాతం పెరిగింది. ఆర్థిక సంవత్సరాంతంలో(ఎఫ్వై 20) భారతదేశంలోని 7,000 పట్టణాలు, నగరాల్లో 11,784 దుకాణాలకు చేరుకుంది" అని డెలాయిట్ ప్రతినిధులు తెలిపారు. "వాట్సాప్ ఉపయోగించి జియోమార్ట్ ప్లాట్ఫామ్లో రిలయన్స్ రిటైల్ డిజిటల్ కామర్స్ వ్యాపారాన్ని మరింత వేగవంతం చేయడానికి మరియు వాట్సాప్‌లో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి కంపెనీ వాట్సాప్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది" అని తెలిపింది. చదవండి: ప్రమాదంలో లక్షల క్వాల్కామ్ స్మార్ట్ఫోన్లు -
దిగొస్తున్న ఉల్లి ధర
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరలు క్రమంగా దిగొ స్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న, మొన్నటివరకు కిలో రూ.130 వరకు ఉన్న ఉల్లి ధర రూ.20 వరకు తగ్గింది. గత కొద్ది రోజులుగా కర్ణాటక నుంచి ఉల్లి సరఫరా పూర్తిగా నిలిచిపోగా, మహారాష్ట్ర నుంచి 6 వేల నుంచి 7 వేల బస్తాల మేర మాత్రమే ఉల్లి సరఫరా జరిగింది. దీంతో హోల్‌సేల్ ధర రూ.110 నుంచి రూ.120 వరకు పలికింది. ఇది రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.130–140 మధ్య పలికింది. అయితే సోమవారం మలక్‌పేట మార్కెట్‌కు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఏకంగా 16,650 బస్తాల ఉల్లి వచ్చింది. దీంతో కిలో ఉల్లి ధర రూ.80–90 మధ్య పలికింది. ఇది రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.100–110 మధ్య పలికింది. ఉల్లి సరఫరా పెరిగితే జనవరి మొదటి వారానికి రిటైల్ మార్కెట్లో ధర రూ.70–80 వరకు తగ్గుతాయని అంటున్నాయి. రాష్ట్రానికి ఈజిప్టు నుంచి రావాల్సిన ఉల్లి ఇంకా రాలేదు. అయితే మలక్‌పేట మార్కెట్లో మాత్రం ప్రతిరోజూ మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈజిప్టు నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన ఉల్లిని విక్రయిస్తున్నారు. సోమవారం సైతం మార్కెట్లో లారీ ఈజిప్టు ఉల్లిని మహారాష్ట్ర వ్యాపారి ఒకరు కిలో రూ.70కి విక్రయించడం గమనార్హం. -
రిటైల్ మార్కెట్లోకి కేపీఆర్ గ్రూప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న తమిళనాడుకు చెందిన కేపీఆర్ గ్రూప్ కంపెనీ కేపీఆర్ మిల్.. ఫాసో పేరుతో సొంత బ్రాండ్‌లో లోదుస్తుల విభాగంలోకి ప్రవేశించింది. భారత్‌లో తొలిసారిగా నూరు శాతం ఆర్గానిక్ కాటన్‌తో వీటిని తయారు చేశారు. ఇటీవలే తమిళనాడు, కేరళలో ఫాసో ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా ఫాసో అడుగు పెడుతుందని కేపీఆర్ మిల్ ఈడీ ఇ.కె.శక్తివేల్ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. 2021లో మహిళలు, పిల్లల లోదుస్తుల తయారీలోకి వస్తామన్నారు. ఆ తర్వాతి ఏడాది నుంచి సొంత స్టోర్లను ప్రారంభిస్తామన్నారు. ఫాసో ధరల శ్రేణి రూ.139–1,199 మధ్య ఉంది. విస్తరణకు రూ.400 కోట్లు.. కేపీఆర్ మిల్కు భారత్‌తోపాటు ఇథియోపియాలో అంతర్జాతీయ స్థాయిలో 12 ప్లాంట్లున్నాయి. 60 దేశాల్లోని 40 ప్రముఖ కంపెనీలకు వివిధ బ్రాండ్లలో లోదుస్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ ఎండీ పి.నటరాజ్ తెలిపారు. ‘రోజుకు 2,75,000 కిలోల యార్న్, 50,000 కిలోల ఫ్యాబ్రిక్, 60,000 కిలోల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉంది. రూ.400 కోట్లతో విస్తరణ చేపట్టాం. విస్తరణ పూర్తి అయితే విభాగాన్నిబట్టి తయారీ సామర్థ్యం 50 శాతం వరకు పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ టర్నోవర్ రూ.4,000 కోట్లు. ఇందులో టెక్స్టైల్ విభాగం వాటా రూ.3,016 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం టర్నోవరులో 15 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని కంపెనీ ఎండీ పి.నటరాజ్ వివరించారు. పరిశ్రమ రూ.30,000 కోట్లు.. ‘ఇన్నర్ వేర్ మార్కెట్ భారత్‌లో రూ.30,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 40%. ఆసియాలో హొజైరీ తయారీలో అతి పెద్ద కేంద్రంగా తమిళనాడులోని తిరుపూర్ నిలిచింది. ఇక్కడ 3,000లకుపైగా ప్లాంట్లు కొలువుదీరాయి. రూ.50,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ ఏటా తయారవుతున్నాయి. 8 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు’ అని నటరాజ్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాంటు? ప్లాంటు ఏర్పాటు చేయాల్సిందిగా పలు రాష్ట్రాలు కేపీఆర్ గ్రూప్‌ను ఆహ్వానించాయి. ఇందులో తెలుగురాష్ట్రాలూ ఉన్నాయి. 13వ ప్లాంటును తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పుతారా అని సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎండీ స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కొత్త యూనిట్ విషయమై బోర్డు అనుమతి పొందాలి. ఎంత కాదన్నా ఫ్యాక్టరీకి రూ.500 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది.’ అని పేర్కొన్నారు. రెండేళ్లలో కొత్త ప్లాంటు సాకా రం అయ్యే అవకాశం ఉందని కంపెనీ డైరెక్టర్ టి.ఎన్.అరుణ్ వెల్లడించారు. కేపీఆర్ మిల్ షేరు శుక్రవారం 19 శాతం వృద్ధి చెంది రూ.554.60 వద్ద స్థిరపడింది. -
రిలయన్స్ ‘రికార్డ్’ లాభం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రికార్డ్ స్థాయిలో రూ.10,362 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్)ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలు మంచి పనితీరు సాధించడంతో రిలయన్స్ నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. కంపెనీకి కీలకమైన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ విభాగాలు బలహీనంగా ఉన్నప్పటికీ, రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డ్ స్థాయి లాభం వచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. భారత్‌లోనే ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇప్పటివరకూ ఈ స్థాయి లాభాలను ప్రకటించలేదు. రిటైల్ వ్యాపారం 52 శాతం, డిజిటల్ సర్వీసుల వ్యాపారం 62 శాతం చొప్పున వృద్ధి చెందాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. పెట్రో కెమికల్ విభాగం అమ్మకాలు అధికంగా ఉండటం కూడా కలసివచ్చిందని పేర్కొంది. ఆదాయం జోరుగా పెరగడానికి ఇవే ముఖ్య కారణాలని వివరించింది. 10 శాతం పెరిగిన లాభం.... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) నాలుగో త్రైమాసిక కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరలాభం రూ.9,438 కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే తాజా నాలుగో క్వార్టర్లో (2018–19) నికర లాభం 10 శాతం పెరిగి రూ.10,362 కోట్లు చేరింది. షేర్ పరంగా చూస్తే, ఒక్కో షేరు వారీ నికర లాభం రూ.15.9 నుంచి రూ.17.5కు ఎగసింది. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం తగ్గింది. స్థూల రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ మార్జిన్ తగ్గడంతో నికర లాభం 2 శాతం తగ్గి రూ.8,556 కోట్లకు పరిమితమైంది. ఇక ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,54,110 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. క్యూ4 మొత్తం ఆదాయం సీక్వెన్షియల్‌గా చూస్తే, 10 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం రూ.1,70,709 కోట్లుగా ఉంది. వడ్డీ వ్యయాలు రూ.2,566 కోట్ల నుంచి రూ.4,894 కోట్లకు పెరిగాయి. రిటైల్ వ్యాపారం ఎబిటా 77 శాతం ఎగసి రూ.1,923 కోట్లకు చేరగా, టెలికం విభాగం లాభం 65 శాతం పెరిగింది. క్వార్టర్లీ ఎబిటా 13 శాతం వృద్ధితో రూ.20,832 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 15 శాతం సాధించామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, కంపెనీ ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.6.22 లక్షల కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.39,588 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.87 లక్షల కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,33,027 కోట్లకు పెరిగాయి. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.50 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. పెట్రో కెమికల్స్ విభాగం.. తగ్గిన జీఆర్ఎమ్! గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో పెట్రో కెమికల్స్ విభాగం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.42,414 కోట్లకు పెరిగింది. రియలైజేషన్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఇక ఎబిట్ 24 శాతం వృద్ధితో రూ.7,975 కోట్లుగా నమోదైంది. ఎబిట్ మార్జిన్ 19 శాతంగా నమోదైంది. అయితే స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎమ్) తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 11 డాలర్లుగా ఉన్న జీఆర్ఎమ్(ఒక్కో బ్యారెల్‌కు) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 8.2 డాలర్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీఆర్ఎమ్ 8.8 డాలర్లుగా ఉంది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మెంట్ ఆదాయం 6 శాతం తగ్గి రూ.87,844 కోట్లకు చేరింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్ వ్యాపారంలో సౌదీ ఆరామ్కో కంపెనీ 25 శాతం వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తలు, ఫలితాలు సానుకూలంగా ఉండగలవన్న అంచనాల కారణంగా ఈ షేర్ పెరిగింది. బీఎస్ఈలో 2.7 శాతం లాభంతో రూ.1,383 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసినప్పటికీ, సెన్సెక్స్‌లో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ఈ ఏడాదిలో ఈ షేర్ ఇప్పటివరకూ 20 శాతం లాభపడింది. రిలయన్స్ జియో...జిగేల్! టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 65 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.510 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.840 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,128 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.11,106 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.723 కోట్లుగా ఉన్న నికర లాభం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 309 శాతం వృద్ధితో రూ.2,964 కోట్లకు పెరిగింది. దాదాపు నాలుగు రెట్లు వృద్ధి నమోదైంది. ఆదాయం 93 శాతం వృద్ధితో రూ.38,838 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్లను దాటింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయి వినియోగదారులను సాధించిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇదే. కంపెనీ ఏఆర్పీయూ (ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి) రూ.126.2గా ఉంది. ఏఆర్పీయూ గత క్యూ3లో రూ.130గా ఉంది. రిటైల్ వ్యాపారం... లక్ష కోట్ల మైలురాయి ! గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రిటైల్ వ్యాపారం ఆదాయం 52% పెరిగి రూ.36,663 కోట్లకు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ.24,183 కోట్లుగా ఉంది. ఎబిటా 77 శాతం వృద్ధితో రూ.1,923 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం ఆదాయం 89 శాతం వృద్ధితో రూ.1,30,566 కోట్లకు పెరిగింది. ఎబిటా 145 శాతం వృద్ధితో రూ.6,201 కోట్లకు పెరిగింది. ఆదాయం, లాభాల వృద్ధి పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రికార్డ్‌లు సృష్టించింది. అంతర్జాతీయ టాప్ 100 కంపెనీల జాబితాలో చోటు సాధించిన ఏకైక భారత కంపెనీ ఇదే. ‘గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. రిలయన్స్ భవిష్యత్తు కోసం చెప్పుకోదగిన ప్రయత్నాలు చేశాం. రిలయన్స్ రిటైల్ ఆదాయం రూ. లక్ష కోట్లను దాటేసింది. రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లకు పెరిగింది. పెట్రో కెమికల్స్ విభాగం ఎన్నడూ లేనంత లాభాన్ని సాధించింది’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
టమాటా ధర పైపైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధర సామాన్యుడికి అందనంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ టమాటా రూ.35 పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు కిలో రూ.8కే లభించిన టమాటా ఇప్పుడు రైతుబజార్లోనే రూ.30కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.20 పలికిన టమాటా శుక్రవారం బహిరంగ మార్కెట్లో రూ.32–35ల చొప్పున అమ్మారు. స్థానికంగా ఈ పంట సాగు చివరి దశకు చేరడం, ఏపీలోని మదనపల్లి ద్వారా దిగుమతులు తగ్గడం, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అరకొర సరఫరా అవుతుండటంతో ఆ ప్రభావం ధరలపై పడుతోంది. తగ్గిన సరఫరా.. రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలోని వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో లక్ష ఎకరాల్లో టమాటా సాగు జరుగుతున్నా 15 శాతం అవసరాలనే తీరుస్తున్నాయి. దీంతో దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్ర మార్కెట్‌కు రోజూ 400 టన్నుల మేర దిగుమతి అవుతోంది. స్థానికంగా 50 టన్నులు వస్తుండగా, మిగతా 350 టన్నుల మేర పొరుగు రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతోంది. ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే సరఫరా అవుతోంది. అయితే ప్రస్తుత సీజన్లో అక్కడ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఏపీ అధికారుల లెక్కల ప్రకారం ఒక్క మదనపల్లి మండల పరిధిలోనే గతేడాది 1,970 హెక్టార్లలో ఉన్న సాగు ఈ ఏడాది 502 హెక్టార్లకు పడిపోయింది. నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల పరిధిలోనూ సగానికి విస్తీర్ణం తగ్గింది. దీనికి తోడు చలి తీవ్రత కారణంగా మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో బూడిద తెగులు సోకడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో మదనపల్లిలోనే టమాటాకు మంచి రేటు లభిస్తోంది. అక్కడే కిలో రూ.30 పలుకుతోంది. దీంతో రాష్ట్రానికి దిగుమతి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని కోలార్, చింతమణి ప్రాంతాల నుంచి టమాటా రాష్ట్రానికి వస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడం, భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గింది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగు మతి చేసుకుంటుండటంతో.. డిమాండ్ పెరిగి, తెలంగాణకు టమాటా సరఫరా తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకు బోయిన్పల్లి మార్కెట్‌కే 2,500 క్విం టాళ్ల మేర టమాటా సరఫరా కాగా, శుక్రవారం 1,380 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గత వారం హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.5 నుంచి రూ.6 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.30 వరకు పలుకుతోంది. దీన్ని మార్కెట్లో వ్యాపారులు రూ.2 నుంచి రూ.5 వరకు కలిపి రూ.35 వరకు అమ్ముతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మున్ముందు ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గతేడాది ఇదే రోజున టమాటా కిలో ధర 6 రూపాయలు పలికింది. మిగతా కూరగాయల్లోనూ అంతే చీక్యాప్సికం, వంకాయ, కాకర, బెండ, దొండ ధరల్లోనూ పెరుగుదల ఉంది. వీటి ధర రెండింతల మేర పెరిగింది. క్యాప్సికం ధర ప్రస్తుతం కిలో రూ.35 నుంచి రూ.40 మధ్య పలుకుతోంది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ నుంచి దిగుమతులు తగ్గాయి. అనంతపురం నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే వంకాయకు డిమాండ్ పెరగడంతో దీని ధర కిలో రూ.40కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్ర నుంచి రావాల్సిన కాకర దిగుమతులు తగ్గడంతో దీని ధర కిలో రూ.30 నుంచి రూ.45కి చేరింది. బెండ రూ.40, దొండ రూ.35కి చేరింది. -
ఒప్పందంపై బహుపరాక్!
ఆన్లైన్ వ్యాపారంలో వరస విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనమైంది. చాన్నాళ్లుగా ఇరు సంస్థల వ్యవస్థాపకుల మధ్యా సాగుతున్న చర్చల పర్యవసానంగా ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను రూ. 1,05,000 కోట్లతో వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాల్‌మార్ట్ చేపట్టిన కంపెనీ కొనుగోళ్లలో మాత్రమే కాదు... మొత్తం ఈ–కామర్స్ రంగంలోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారంటేనే ఫ్లిప్‌కార్ట్ ఏ స్థాయికి ఎదిగిందో అర్ధమవుతుంది. ఆన్లైన్ వ్యాపారానికి అంతగా ఆదరణలేని తరుణంలో ఆ రంగంలో అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను అటువైపు ఆకర్షించడానికి చాలానే కృషి చేసింది. 2000 సంవత్సరంలో డాట్కామ్లు తామరతంపరగా పుట్టుకొచ్చినప్పుడు ఇక భవిష్యత్తంతా ఆన్లైన్ వ్యాపారానిదేనన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. కానీ చాలా తక్కువకాలంలోనే అదంతా నీటిబుడగ చందంగా మాయమైంది. ఆన్లైన్లో ఆర్డరిచ్చి తెప్పిం చుకునే వస్తువులు నాసిరకంగా ఉంటాయన్న అనుమానాలు, ఫిర్యాదు చేస్తే పట్టించుకోరన్న భయాలు ఆ వ్యాపారానికి అవరోధంగా మారాయి. ఇలా అంతంతమాత్రం ఆదరణ ఉన్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు అలాంటి భయాలను, అనుమానాలను పోగొట్టడానికి కృషి చేశాయి. దీనికితోడు టెక్నాలజీ రంగంలో వచ్చిన పెను మార్పులు, ఈ–కామర్స్ సంస్థ లిచ్చే భారీ డిస్కౌంట్లు కూడా ఆన్లైన్ వ్యాపార విస్తరణకు దోహదపడ్డాయి. వినియోగదారులు ముందుగా చెల్లించడం కాక, కోరుకున్నది తమకు చేరాకే డబ్బు చెల్లించే ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ–కామర్స్ తీరునే ఫ్లిప్‌కార్ట్ మార్చేసింది. పుస్తకా లతో మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, టీవీలు, దుస్తులు... ఇలా ఆన్లైన్లో ఇప్పుడు దొరకనిదేదీ లేదు. వచ్చే అయిదేళ్లలో ఈ–కామర్స్ మార్కెట్ నాలుగు రెట్లు పెరుగు తుందంటున్నారు. అయితే ఇప్పటికీ మన దేశంలో సంప్రదాయ రిటైల్ వ్యాపారం వాటాయే అధికం. ఆన్లైన్ వ్యాపారం ఎంతగా విస్తరిస్తున్నా సంప్రదాయ వ్యాపారం దరిదాపులకు అదింకా చేరలేదు. ఒక సంస్థ అధ్యయనం ప్రకారం మన దేశంలో మొత్తం రిటైల్ రంగం విలువ 65000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 43,62,800కోట్లు)కాగా, అందులో ఇప్పటికీ 90 శాతం వాటా సంప్రదాయ రిటైల్ వ్యాపారానిదే. కానీ మున్ముందు ఇది ఇలాగే కొనసాగుతుందనుకోవడానికి లేదు. ఈ– కామర్స్ సంస్థలు ఎడాపెడా ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు క్రమేపీ వినియోగదారులను అటు మళ్లిస్తాయి. సాధారణ రిటైల్ వ్యాపారులకు వినియోగదారుల్లో వారిపై ఉండే విశ్వాసమే ప్రధాన పెట్టుబడి. ఒక దుకాణంతో ఏళ్లు గడిచేకొద్దీ ఏర్పడే అనుబంధం వినియోగ దారుల్ని ఎటూ పోకుండా నిలబెడుతుంది. ఆ వ్యాపారులు దుకాణానికి అద్దె చెల్లించాలి. సరుకు నిర్వ హణ చూసుకోవాలి. తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలి. వారి జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకోవాలి. కనుక వారు వినియోగదారులకిచ్చే డిస్కౌంట్లకు పరిమితి ఉంటుంది. కానీ ఆన్లైన్ వ్యాపార సంస్థలకు ఇలాంటి బాదరబందీ లేదు. ఆన్లైన్లో వారు అమ్మే సరుకేదీ వారి దగ్గర ఉండదు. గిడ్డంగులున్నవారితో, సరుకులు సరఫరా చేసేవారితో, కొరియర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారందరినీ సమన్వ యపరుచుకుంటూ విని యోగదారులు కోరుకున్నవి అందేలా చూస్తారు. అహేతుకమైన డిస్కౌంట్లు, ఆఫర్లవల్ల వీరికి నిజానికి నష్టాలే వస్తాయి. వీటిని కొన్నేళ్లు భరిస్తే క్రమేణా సంప్రదాయ రిటైల్ వ్యాపారం దెబ్బతిని కనుమరుగవుతుందని, అప్పుడు మార్కెట్‌ను శాసించి లాభాల బాట పట్టొచ్చునన్నది వీరి వ్యాపార సూత్రం. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిందదే. మన దేశంలో సంప్రదాయ రిటైల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 కోట్ల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆ వ్యాపారం దెబ్బతింటే వీరందరూ వీధిన పడతారు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకున్న వాల్‌మార్ట్‌తో మరో ప్రమాదం ఉంది. ఇది చవగ్గా దొరికే చైనా సరుకుతో మార్కెట్లను ముంచెత్తుతోంది. అది అమ్మే సరుకులో దాదాపు 80 శాతం చైనా మార్కెట్‌కు సంబంధించినవే. ఇందువల్ల రిటైల్ దుకాణదారులకు, వినియో గదారులకొచ్చే కష్టనష్టాల సంగతలా ఉంచి మన తయారీ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. రిటైల్ రంగంలోని కోట్లాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. చైనా తయారీరంగం మాత్రం పుంజుకుంటుంది. ఆ దేశంతో ఇప్పటికే మనకున్న వాణిజ్య లోటు మరింత పెరుగుతుంది. చైనా కార్మికులకు ఉపాధి, అక్కడి పరిశ్రమలకు, అమెరికా ఈ–కామర్స్ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టే ఈ పరిణామం మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్డీఐపై ఉన్న పరిమితులను ఈ–కామర్స్ దారిలో ఉల్లంఘిస్తోంది. వీటన్నిటిపైనా ఇప్పటికే అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్వంటివి నిరసన వ్యక్తం చేశాయి. తాజా ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి మన ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. చట్టాల్లోని లొసుగులను తొలగించాలి. -
సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న ఉల్లి
సాక్షి,న్యూఢిల్లీ : ఉల్లి రిటైల్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు గృహిణులకు భారమవుతుంటే తాజాగా దేశ రాజధానిలో కిల్లో ఉల్లి రూ 80కి ఎగబాకింది. ఇతర మెట్రో నగరాల్లో కిలో ఉల్లి రూ 50 నుంచి రూ 70 పలుకుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఆజాద్‌పూర్ మండీలో మంగళవారం కిలో ఉల్లి రూ 80కి చేరిందని వ్యాపారులు చెప్పారు. ఉల్లి సాగు అధికంగా ఉండే మహారాష్ర్ట, కర్ణాటక,మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి సరఫరాలు తగ్గడంతో ఉల్లి ధరలు కొండెక్కాయి. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరొందిన మహారాష్ర్టలోని లాసాల్గావ్ మండీకి ఉల్లి సరఫరాలు 12,000 క్వింటాళ్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే రోజు మార్కెట్‌కు ఏకంగా 22,933 క్వింటాళ్ల సరుకు వచ్చింది. ఇదే మార్కెట్లో గత సంవత్సరం కేవలం రూ 7.50గా ఉన్న కిలో ఉల్లి ప్రస్తుతం రూ 33కు ఎగబాకింది. -
పెద్ద నోట్లు చెల్లవు... చిన్న నోట్లు మాయం...
-
పెద్ద నోట్లు చెల్లవు... చిన్న నోట్లు మాయం...
హైదరాబాద్ : రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తొలిరోజు బుధవారం ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా సామాన్యులు, పేద వర్గాలు ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. మరోవైపు మార్కెట్ లో చిల్లర కొరత తీవ్రమైంది. 50 రూపాయల వస్తువేదైనా కొనుగోలు చేసి షాపు యజమానికి వంద రూపాయలు ఇస్తే తిరిగి చెల్లించడానికి చిల్లర లేదని చెబుతున్నారు. మార్కెట్ లో ప్రతినిత్యం జరిగే లావాదేవీలన్నీ గందరగోళంగా మారాయి. ఎక్కడ చూసినా... ఏ చేయాలన్నా వంద రూపాయలు అంతకన్నా తక్కువ డినామినేషన్ చెల్లించాల్సి రావడం, చాలా మంది వద్ద ఆ డినామినేషన్ లేకపోవడంతో క్రయవిక్రయ మార్కెట్ అంతా అతలాకుతలమైంది. అవసరాలు తీరక సామాన్యులు, వ్యాపారం జరక్క వ్యాపారస్తులు బోరుమన్నారు. వివిధ పనుల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వారి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రధానమంత్రి మంగళవారం రాత్రి చేసిన ప్రకటన ఈరోజు ఉదయం వరకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కూరగాయల మార్కెట్ లో ప్రతి ఒక్కరూ 500 నోటును ఇస్తుండటంతో కొందరు వ్యాపారస్తులు వాటిని అంగీకరించినప్పటికీ మిగిలిన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యారు. మరికొందరు ఆ నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. తద్వారా వారి వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. సిటీ బస్సెక్కినా, ఊర్లకు వెళ్లడానికి బస్సెక్కినా, రైలెక్కినా, క్యాబ్ లో ప్రయాణం చేయాలన్నా, ఆటోలో వెళ్లాలన్నా... చిల్లర లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. చిల్లర లేని కారణంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు సైతం ప్రయాణికులను ఎక్కించుకోలేక గిరాకీ వదులుకొనే పరిస్థితులు తలెత్తాయి. ఉబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసుల వారైతే 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కానందున క్యాబ్ ల్లో ప్రయాణించాలనుకునే వారు సరిపడా చిల్లర ఉంచుకోవాలని కస్టమర్లకు మెసేజ్ లు సైతం పంపించింది. ఒక మధ్యతరగతి వ్యక్తి ఇంట్లో పెళ్లి ఖర్చుల కోసం రెండు రోజుల కిందట బ్యాంకు నుంచి లక్ష రూపాయలు తీసుకురాగా, అందులో అన్నీ వెయ్యి, 500 రూపాయల నోట్లే ఉన్నాయి. తక్షణం ఉపయోగించాలంటే ఇప్పుడా డబ్బు ఏమాత్రం పనికి రావడం లేదు. పోనీ రెండు రోజుల తర్వాత తిరిగి ఆ డబ్బును బ్యాంకులో జమ చేసి మళ్లీ విత్ డ్రా చేద్దామంటే... పది వేలకు మించి తీసుకోవడానికి లేదని తెలిసి ఆ మధ్య తరగతి కుటుంబం ఇప్పుడేం చేయాలో తెలియక సతమతమవుతోంది. ఒక వ్యక్తి తన ఇంటిని అమ్ముకోగా తొలివిడత చెల్లింపుగా రెండు రోజుల ముందే 20 లక్షల డబ్బు ఇచ్చారు. ఇప్పుడున్న నిబంధనల మేరకు రెండో విడత చెల్లింపు ఎప్పటివరకు చేస్తారో తెలియని పరిస్థితిని పక్కన పెడితే... అంత మొత్తం సొమ్మును బ్యాంకులో ఎలా జమ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఇతరత్రా పెద్దగా ఆదాయం లేకపోగా ఉన్న ఒక్క ఇంటిని విక్రయిస్తే వచ్చిన సొమ్ముకు ఎలా లెక్క చూపించాలో (మార్కెట్ ధరకు వాస్తవ విక్రయ ధరకు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి) తెలియక తలపట్టుకున్నారు. ఒక వ్యక్తి అత్యవసర మందులు కొనుగోలుకు మెడికల్ షాపులో వెయ్యి రూపాయల నోటు ఇవ్వగా రెండు వందల బిల్లు పోగా మిగిలిన చిల్లర లేదని, కావాలంటే చిట్టీ రాసిస్తాం... రెండు రోజుల తర్వాత తీసుకోవాలని చెప్పడంతో మందులు అత్యవసరం కాబట్టి చేసేదేమీ చిట్టీతో వెనుదిరిగాడు. ఆస్పత్రిలో ఉన్న పేషంట్ కోసం బయటకెళ్లి బ్రెడ్ కొనుగోలు చేయాలన్నా చిల్లర లేక అనేక బాధలు పడుతున్నారు. సాధారణంగా ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చేరుతున్న వారు మందులు వైద్యులకు చెల్లించడానికి ఈరోజుల్లో ఎవరైనా వేలల్లో డబ్బు తెచ్చుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల్లో వైద్యం కోసం వచ్చే వాళ్లు చిల్లర కొరత కారణంగా బ్రెడ్ లాంటి చిన్న చిన్న వాటిని కూడా కొనుగోలు చేయలేక అనేక అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ బంకుల్లోనూ ఇదే పరిస్థితి. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లాంటి చిన్న వాహన దారులకు చిల్లర లేదన్న కారణంగా ఎక్కడ కూడా 500, 1000 నోట్లను అంగీకరించకపోవడం లేదు. కొన్ని చోట్ల బంకులను మూసివేశారు. నేషనల్ హైవేస్ పైన టోల్ గేట్ల వద్ద 500, 1000 నోట్లను తీసుకోకపోవడంతో దాదాపు అన్ని హైవేస్ ల్లోనూ ట్రాఫిక్ స్థంభించిపోయింది. టోల్ గేట్ వారితో అనేక చోట్ల వాహనదారులు గొడవకు దిగారు. ముందు ఏం జరుగుతుందో తెలియక బారులు తీరిన వాహన శ్రేణుల్లో వెనకాల నిలిచిపోవిన వారు, ట్రాఫిక్ లో ఇరుక్కుని సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మార్కెట్ లో లీటరు పాలు కొందామన్నా... కూరగాయలు కొనాలన్నా... ఒక పేస్ట్, పెన్ను, నోట్ బుక్... ఒకటేమిటి. ఏవీ కొనుగోలు చేయాలన్నా చేయలేకపోయారు. ఎక్కడైనా కొందరు వంద లేదా 50 రూపాయల నోట్లను చెల్లిస్తుంటే... వ్యాపారస్తులు చెల్లించాల్సిన చోట చెల్లించడం లేదు. మరో రెండు రోజులు ఎలా వెళ్లదీయడం అన్న కోణంలో చాలా మంది తమ వద్ద ఉన్న ముఖ్యంగా 50, 100 రూపాయల నోట్లను వినియోగంలో పెట్టకపోవడం, కొందరు వ్యాపారస్తులు వంద రూపాయల నోట్లను బ్లాక్ చేయడం కూడా చిల్లర కొరతకు కారణమవుతుందని తెలుస్తోంది. -
గుడ్డు.. రికార్డు!
అమాంతం పెరిగిన ధర కార్తీకం ముగియడంతోనే ధరకు రెక్కలు కార్తీకం పుణ్యాన నెల్నాళ్లు ఒదిగి ఉన్న గుడ్డు పుణ్యకాలం పూర్తి కాగానే విశ్వరూపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో గుడ్డు చిల్లర ధర రూ.5కు పెరిగింది. గత 15 రోజుల్లోనే 49 పైసల పెరుగుదల నమోదు కావడం గతంలో ఎన్నడూ లేదని వ్యాపారులే అంటున్నారు. విశాఖపట్నం : కార్తీకమాసం ముగిసీ ముగియగానే కోడి గుడ్డు ధర కొండెక్కేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధర పెరిగింది. కూరగాయల ధరలు ఆకాశంలో విహరిస్తున్న సమయంలో కోడిగుడ్డే సామాన్యులను ఆదుకుంది. దాదాపు మూడు నెలల పాటు అందుబాటులో ఉన్న గుడ్డు ఇప్పుడు భారమవుతోంది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో వంద గుడ్ల ధర రూ. 405లకు చేరింది. రిటైల్ మార్కెట్లో విడిగా రూ.5లకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి హోల్‌సేల్ కంటే రిటైల్ ధర గుడ్డుకు గరిష్టంగా 50 పైసలు అధికంగా ఉంటుంది. కానీ అర్థ రూపాయికి కాలం చెల్లడంతో మధ్యలో బ్రేక్ లేకుండా వినియోగదారుడిపై ఏకంగా రూపాయి భారం పడుతోంది. పెరిగిన వాడకం నిజానికి కార్తీకమాసంలో పూజల సెంటిమెంట్‌తో మాంసాహారం వినియోగం బాగా తగ్గుతుంది. అందువల్ల వీటి అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతాయి. దీంతో ధరలు తగ్గించి విక్రయాలు జరపడంతో గుడ్డు అందరికీ అందుబాటులో ఉంటుంది. శనివారంతో కార్తీకమాసం పూర్తయింది. మరోవైపు చలికాలమూ మొదలైంది. మళ్లీ గుడ్ల వాడకం పెరుగుతుంది. అదే సమయంలో కోడిగుడ్లను ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చలి సీజనులో మామూలు రోజులకంటే అధికంగా తింటారు. ప్రస్తుతం ఒడిశా, బిహార్, పశ్చిమ బంగ, త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి గుడ్ల ఎగుమతులు ఊపందుకుంటాయి. వీట న్నింటినీ ఆసరాగా చేసుకుని గుడ్ల ధరలు పెంచుతున్నారు. 15 రోజుల్లో 49 పైసలు పెరుగుదల గత నెల 14న వంద గుడ్ల ధర (హోల్‌సేల్) రూ.355, ఈనెల ఒకటిన రూ.356 ఉంది. అంటే ఆ పదిహేను రోజుల్లో కేవలం గుడ్డుపై ఒక్క పైసా మాత్రమే పెరిగింది. అప్పట్నుంచి రోజుకు మూడు నాలుగు పైసలు చొప్పున పెరుగుతూ ఆదివారం నాటికి రూ.400కు (గుడ్డు రూ.4.05లకు) చేరుకుంది. అంటే గుడ్డుపై 15 రోజుల వ్యవధిలో 49 పైసలు పెరిగిందన్న మాట! ఇప్పటిదాకా కోడిగుడ్డు ధర 2013 డిసెంబర్ 21న రూ.4.02 పైసలకు పెరగడమే రికార్డు. తాజా ధరతో అది చెరిగిపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. ఉత్తరాంధ్రలో 20 లక్షల గుడ్ల ఉత్పత్తి ఉత్తరాంధ్రలో రోజుకు వివిధ పౌల్ట్రీల నుంచి సుమారు 20 లక్షల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో స్థానికంగా 60 శాతం గుడ్లు వినియోగమవుతాయి. మిగిలినవి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. వినియోగం పెరగడంతో పాటు కోళ్ల దాణా ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయం కూడా బాగా పెరిగినందున గుడ్ల ధరలు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. -
కందిపప్పు డబుల్ సెంచరీ
ఆల్‌టైమ్ రికార్డు ధర.. కిలో రూ.200 సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో కందిపప్పు ధర మండిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుధవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. కేజీ ధర హోల్‌సేల్‌లోనే రూ.200కి ఎగబాకింది. రిటైల్ మార్కెట్లో మరో రూ.5 నుంచి రూ.6 అదనంగా గుంజుతున్నారు. కందిపప్పు ధర రూ.200 దాటడం ఎన్నడూ చూడలేదని వ్యాపారులే ఆశ్చర్యపోతున్నారు. కొందరు హోల్‌సేల్ వ్యాపారులు పెద్దమొత్తంలో కందిపప్పును నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించటంతో రేట్లు పెరిగిపోతున్నాయి. మినపపప్పు కూడా చుక్కలనంటుతోంది. హోల్‌సేల్‌లో కిలో రూ.185, రిటైల్‌లో రూ.190 పలుకుతోంది. -
రూ. 44కే ఎల్ఈడీ బల్బు!
న్యూఢిల్లీ: ఎల్ఈడీ బల్బును రూ. 44కే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో సుమారు రూ. 300 గా ఉన్న ఎల్ఈడీ బల్బును డొమెస్టిక్ ఎఫిషియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(డెల్ప్) పథకం కింద రూ. 44కే విక్రయించి.. ప్రజలు సామర్థ్యం లేని నాసిరకం బల్బులను వినియోగించకుండా చేయాలన్నది యోచన. ఈ బల్బులను వేలంలో భారీగా కొనడం ఒక్కో బల్బును రూ. 44 కే విక్రయించాలని యోచిస్తున్నట్లు విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బల్పుల ధర ఒక్కోటి రూ. 275-300గా ఉందన్నారు. వేలంలో దీని ధర రూ. 74 వరకు వచ్చిందని తెలిపారు. దీన్ని మరింత తగ్గించాలని యోచిస్తున్నామన్నారు. డెల్ప్ కింద ఎల్ఈడీ బల్బులను తీసుకొన్న వినియోగదారులు నెలవారీగానూ సొమ్ము చెల్లించవచ్చన్నారు. ఎల్ఈడీ బల్బుల వాడకం పెరిగితే విద్యుత్ వినియోగంలో 50 నుంచి 90 శాతం ఆదా అవుతుందన్నారు.