
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ షాపింగ్ మాల్స్, ఖరీదైన వీధుల్లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ గతేడాది 47 లక్షల చదరపు అడుగులు నమోదైంది. దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో 2021తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ తన నివేదికలో వెల్లడించింది. ‘భారత రిటైల్ రంగం రికవరీ బాటలో ఉంది. ఈ ఏడాదీ ఊపు కొనసాగుతుంది.
అంతర్జాతీయంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ విదేశీ బ్రాండ్లు ప్రథమ శ్రేణి నగరాలేగాక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించడమే ఇందుకు కారణం. 2022లో రిటైల్ రియల్ ఎస్టేట్ లీజింగ్ బెంగళూరులో 16.8 లక్షల నుంచి 19.2 లక్షల చదరపు అడుగులకు, ఢిల్లీ ఎన్‌సీఆర్ 3.6 లక్షల నుంచి 9.6 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో 6.4 లక్షల నుంచి 3.1 లక్షల చదరపు అడుగులకు, ముంబైలో 6.6 లక్షల నుంచి 3.9 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. 2023లో భారత్‌లో కొత్తగా 16 మాల్స్ రాబోతున్నాయి. వచ్చే ఏడాదీ ఇదే స్థాయిలో మాల్స్ ఏర్పాటు కానున్నాయి’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment