మహారాష్ట్ర నుంచి తాడేపల్లిగూడేనికి తగ్గిన దిగుమతులు
రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.40 నుంచి రూ.45కు అమ్మకం
కూరగాయలదీ అదే దారి
సాక్షి, భీమవరం: ఉల్లి ధర ఘాటెక్కింది. రిటైల్ మార్కెట్‌లో కేజీ ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే పేరొందిన తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌కు షోలాపూర్, నాసిక్, పూణే, అహ్మద్‌నగర్ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతులు జరుగుతుంటాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని మార్కెట్లకు సైతం ఇక్కడి నుంచే ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. వారం క్రితం రిటైల్ మార్కెట్‌లో కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు పలికిన ధరలు అమాంతం పెరిగాయి. ఆటోలపై ఇళ్లకు వచ్చి నాసిరకం ఉల్లిని మూడు కిలోలు రూ.100కు విక్రయిస్తుండగా.. దుకాణాల వద్ద నాణ్యతను బట్టి కిలో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్మకాలు చేస్తున్నారు.
రెట్టింపైన కూరగాయల ధరలు
కూరగాయల ధరలు సైతం రెట్టింపయ్యాయి. వేసవి ఎండలు గోదావరి లంకలు, మెట్ట ప్రాంతాల్లో సాగుచేసే కూరగాయ పంటలకు తీవ్ర నష్టం కలగజేశాయి. అధిక ఉష్ణోగ్రతలకు పూత మాడిపోయి దిగుబడులు పడిపోయాయి. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.20 ఉండే వంకాయలు రూ.40కి చేరగా, బెండకాయలు రూ.24 నుంచి రూ.40కి, బీరకాయలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే క్యారెట్, బీట్‌రూట్, బంగాళా దుంప ధరలు నిలకడగా ఉండగా.. టమాటా రూ.20 నుంచి రూ.50కి పెరిగింది.
పాత నిల్వలు వస్తేనే..
ప్రస్తుతం ఉల్లి ధర పెరుగుదల తాత్కాలికమేనని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు దిగుమతులు తగ్గాయని హోల్‌సేల్ వ్యాపారి సర్వేశ్వరరావు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర మార్కెట్‌లోకి పాత నిల్వలు రానున్నట్టు అక్కడి వ్యాపారులు చెబుతున్నారన్నారు. అవి ఇక్కడి మార్కెట్‌కు చేరితే శుక్రవారం నాటికి ధరలు దిగివచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment