రాష్ట్రంలో గత పదేళ్లలో గణనీయంగా పడిపోయిన కూరగాయల సాగు
ఉల్లిగడ్డ నుంచి ఆకుకూరల దాకా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే..
ఇందులోనూ అవసరానికి మించి టమాటా, వంకాయల ఉత్పత్తి
రవాణా ఖర్చు, మధ్య దళారులతో పెరుగుతున్న ధరలు..
ధరల్లో హెచ్చుతగ్గులు, ప్రభుత్వ ప్రోత్సాహలేమి, మార్కెటింగ్ సమస్యలే కారణం
పెరిగిపోతున్న పట్టణీకరణ, రియల్ వెంచర్లతో పట్టణాల శివారు గ్రామాల్లో సాగుపై ప్రభావం
సాగునీటి వసతితో వరి సాగుకు మొగ్గుతున్న రైతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. డిమాండ్, సరఫరాలో అంతరం ఏటికేడు పెరుగుతోంది. అవసరమైన కూరగాయల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు, మధ్య దళారుల కారణంగా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజావి కాకుండా నిల్వ కూరగాయలే జనానికి అందుతున్నాయి.
కూరగాయల సాగులో సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పట్టణ ప్రాంతాలు విస్తరించడం, శివారు భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండటంతోపాటు సాగునీటి వసతి పెరిగి రైతులు వరి సాగువైపు దృష్టిపెట్టడం వంటివి కూరగాయల సాగు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. రిజర్వుబ్యాంక్ ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
పదేళ్లలో 80శాతం తగ్గిపోయి..
రాష్ట్రంలో ఏటా 2 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో ఈసారి ఖరీఫ్‌లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.96 లక్షల ఎకరాలే. మిగతా అంతా వరి, పత్తి వంటి పంటలే. ఉద్యాన పంటల్లోనూ పండ్ల తోటలు 4 లక్షల ఎకరాల్లో, సుగంధ ద్రవ్యాల సాగు 3 లక్షల ఎకరాల్లో, ఆయిల్ పామ్ 2 లక్షల ఎకరాల్లో, ఆగ్రో ఫారెస్ట్రీ లక్ష ఎకరాల్లో, పూలు, ఇతర వాణిజ్యపర ఉద్యాన పంటలు కలిపి లక్షన్నర ఎకరాల్లో సాగయ్యాయి.
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల జనాభాకు అవసరమైన కూరగాయల సాగు జరుగుతున్నది కేవలం 1.13 లక్షల ఎకరాల్లో మాత్రమే. నిజానికి 2013–14లో తెలంగాణలో 5.46 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుకాగా.. తర్వాతి నుంచి ఏటా తగ్గిపోతూ వచ్చింది. ఈసారి 1.13 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే పదేళ్లలో 4.33 లక్షల ఎకరాల మేర (80శాతం) కూరగాయల సాగు తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న నిల్వ కూరగాయలనే జనం వాడాల్సి వస్తోంది. కూరగాయల సాగులో రాష్ట్రం దేశంలో 15 స్థానానికి, ఉత్పత్తిలో 14వ స్థానానికి పడిపోవడం గమనార్హం.
ఏటా 40 లక్షల టన్నులు అవసరం
రాష్ట్ర జనాభా వినియోగం కోసం ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. హార్టికల్చర్ విభాగం లెక్కల ప్రకారం 1.13 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అవుతున్న కూరగాయలు 21 లక్షల టన్నులు మాత్రమే. ఇందులోనూ వంకాయ, టమాటాలను అవసరానికి మించి పండిస్తున్నారు.
పచ్చి మిర్చితో పాటు బెండ, దొండ, ఉల్లి, బంగాళాదుంప, చిక్కుడు, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్‌తోపాటు పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటివి కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చు కారణంగా రాష్ట్రంలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.
ప్రోత్సాహకాలు, నిల్వ సదుపాయాలు లేక..
కూరగాయల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ సదుపాయాల కొరత, పండించిన కూరగాయలకు సరైన మార్కెట్ కల్పించకపోవడం వంటి సమస్యలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. కూరగాయల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలతోపాటు కూలీల ఖర్చులు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం కూడా కూరగాయల సాగు పట్ల రైతులకు ఆసక్తి తగ్గడానికి కారణమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన వరి, పత్తి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం
తెలంగాణలో కూరగాయల సాగు తగ్గిపోగా వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. భూగర్భ జలాలు, సాగునీటి సదుపాయాలు పెరగడం దీనికి కారణం. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో వరి 66 లక్షల ఎకరాల్లో, పత్తి 44 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. యాసంగిలోనూ 60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీనితోపాటు మొక్కజొన్న, మిర్చి వంటి పంటల సాగు కూడా గణనీయంగా పెరుగుతోంది. కూరగాయల సాగు మరింతగా క్షీణిస్తోంది.
నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఖమ్మం పరిధిలో సీతారామ ప్రాజెక్టు వంటివి అందుబాటులోకి వచ్చాక... రాష్ట్రంలో వరితో పాటు కూరగాయల సాగు కూడా పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు భావించారు. కానీ దీనికి భిన్నంగా జరుగుతోంది. కూరగాయలు ఎక్కువగా పండించే.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా సాగు తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరంగా మారింది.
హైదరాబాద్‌లో తగ్గిన కూరగాయల వినియోగం
హైదరాబాద్‌లో కూరగాయల వినియోగంపై జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటున నెలకు ఒక్కొక్కరు 8.08 కిలోల కూరగాయలు(ఉల్లిపాయలతో కలిపి) వినియోగిస్తున్నట్లు తేలింది. అంటే రోజుకు 269 గ్రాములు అన్నమాట. దేశ సగటు కంటే ఇది 56 గ్రాములు తక్కువ.
మన దేశ పరిస్థితుల మేరకు.. ప్రతి ఒక్కరూ రోజుకు 325 గ్రాముల కూరగాయలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 2,006 టన్నులు అంటే నెలకు 60,182 టన్నులు, ఏడాదికి 7,22,186 టన్నుల కూరగాయలు అవసరమని అంచనా.
కానీ ఏటా హైదరాబాద్‌కు 6 లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే వస్తున్నట్టు అంచనా. ఇందులోనూ 80శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. సరిపడా కూరగాయలు రాకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగం తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పెట్టుబడులు, కూలీల సమస్యతో..
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కూరగాయలు, ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుతోంది. పెట్టుబడుల ఖర్చు, ఎక్కువ శ్రమ, పురుగు మందులు, ఎరువుల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి చూపడం లేదు. కూలీల కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు నీటి లభ్యత పెరగడం, ప్రభుత్వం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తుండటంతో వరి పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.
– ప్రభాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్‌కర్నూల్ జిల్లా
కొత్తగా సాగు చేసేవారే లేరు
పట్టణీకరణతో కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ కొత్తగా కూరగాయల సాగుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నీటి లభ్యత, మద్దతు ధరతో కొనుగోళ్లతో రైతులంతా వరివైపు చూస్తున్నారు.
– కె.వేణుగోపాల్, జిల్లా హార్టికల్చర్ అధికారి, మహబూబ్‌నగర్
కూరగాయల సాగు ఖర్చులు బాగా పెరిగాయి
కూరగాయలకు చీడపీడల సమస్య ఎక్కువ. పురుగు మందులు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో క్రమంగా కూరగాయల సాగు తగ్గించుకుంటూ వస్తున్నాం. సూపర్ మార్కెట్లు పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి టోకుగా తెప్పించుకుంటుండటంతో.. స్థానికంగా మార్కెటింగ్ సమస్య వస్తోంది.
– ముత్యంరెడ్డి, రైతు, బుస్సపూర్, బాల్కొండ నియోజకవర్గం
దళారీలే బాగుపడుతున్నారు..
మా గ్రామంలో ఇప్పుడు టమాటా పండిస్తున్నారు. నెల కింద టమాటా ఒక్క బాక్స్ (సుమారు 25 కిలోలు) 500 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.200 కూడా రావడం లేదు. టమాటాలను నిల్వ చేసుకునే సదుపాయం లేదు. దళారీలు ఎంతకు అడిగితే అంతకు అమ్మడం తప్ప ఏం చేయలేం. రైతులు, వినియోగదారులు ఇద్దరికీ నష్టమే. దళారీలు బాగుపడుతున్నారు. విత్తనాల నుంచి మార్కెట్‌లో అమ్ముకునేదాకా నష్టం కలుగుతున్నప్పుడు కూరగాయల సాగు నుంచి వేరే పంటల వైపు వెళ్లక ఏం చేస్తాం?
– మొగుళ్లపల్లి వెంకటరెడ్డి, ముట్పూర్, కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా
లాభాలపై గ్యారంటీ లేదు
కూరగాయలు పండిస్తే పెట్టిన పెట్టుబడికి అదనంగా వచ్చే లాభాలపై ఎలాంటి గ్యారంటీ లేదు. ఒకవైపు వాతావరణ పరిస్థితులు. మరోవైపు చీడపీడల బెడద. అన్నీ తట్టుకొని సాగుచేసినా.. మహారాష్ట్ర నుంచి దిగుబడి అవుతున్న కూరగాయలతో పోటీపడలేకపోతున్నాం. మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా, కొత్తిమీర ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. దిగుబడి వస్తున్న సమయంలో ధర తగ్గిపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది.
– సాతాళే విజయ్‌కుమార్, కూరగాయల రైతు, గుడిహత్నూర్
నిలకడైన ధర లేక ఇబ్బంది అవుతోంది
కూరగాయలకు మార్కెట్లో నిలకడైన ధర లేకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. దగ్గరలో మార్కెట్ అందుబాటు లేక రవాణా, ఇతర ఖర్చులు పెరుగుతున్నాయి. హార్టికల్చర్ శాఖ నుంచి ఎలాంటి సబ్సిడీలు కూడా అందడం లేదు. అందుకే ప్రస్తుతం కూరగాయలు సాగు చేయడం లేదు.
– లింగారెడ్డి. రైతు, రెంజర్ల
Comments
Please login to add a commentAdd a comment