Rice cultivation
-
వెజి‘ట్రబుల్’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. డిమాండ్, సరఫరాలో అంతరం ఏటికేడు పెరుగుతోంది. అవసరమైన కూరగాయల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు, మధ్య దళారుల కారణంగా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజావి కాకుండా నిల్వ కూరగాయలే జనానికి అందుతున్నాయి. కూరగాయల సాగులో సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పట్టణ ప్రాంతాలు విస్తరించడం, శివారు భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండటంతోపాటు సాగునీటి వసతి పెరిగి రైతులు వరి సాగువైపు దృష్టిపెట్టడం వంటివి కూరగాయల సాగు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. రిజర్వుబ్యాంక్ ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పదేళ్లలో 80శాతం తగ్గిపోయి.. రాష్ట్రంలో ఏటా 2 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో ఈసారి ఖరీఫ్‌లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.96 లక్షల ఎకరాలే. మిగతా అంతా వరి, పత్తి వంటి పంటలే. ఉద్యాన పంటల్లోనూ పండ్ల తోటలు 4 లక్షల ఎకరాల్లో, సుగంధ ద్రవ్యాల సాగు 3 లక్షల ఎకరాల్లో, ఆయిల్ పామ్ 2 లక్షల ఎకరాల్లో, ఆగ్రో ఫారెస్ట్రీ లక్ష ఎకరాల్లో, పూలు, ఇతర వాణిజ్యపర ఉద్యాన పంటలు కలిపి లక్షన్నర ఎకరాల్లో సాగయ్యాయి. రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల జనాభాకు అవసరమైన కూరగాయల సాగు జరుగుతున్నది కేవలం 1.13 లక్షల ఎకరాల్లో మాత్రమే. నిజానికి 2013–14లో తెలంగాణలో 5.46 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుకాగా.. తర్వాతి నుంచి ఏటా తగ్గిపోతూ వచ్చింది. ఈసారి 1.13 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే పదేళ్లలో 4.33 లక్షల ఎకరాల మేర (80శాతం) కూరగాయల సాగు తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న నిల్వ కూరగాయలనే జనం వాడాల్సి వస్తోంది. కూరగాయల సాగులో రాష్ట్రం దేశంలో 15 స్థానానికి, ఉత్పత్తిలో 14వ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఏటా 40 లక్షల టన్నులు అవసరం రాష్ట్ర జనాభా వినియోగం కోసం ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. హార్టికల్చర్ విభాగం లెక్కల ప్రకారం 1.13 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అవుతున్న కూరగాయలు 21 లక్షల టన్నులు మాత్రమే. ఇందులోనూ వంకాయ, టమాటాలను అవసరానికి మించి పండిస్తున్నారు. పచ్చి మిర్చితో పాటు బెండ, దొండ, ఉల్లి, బంగాళాదుంప, చిక్కుడు, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్‌తోపాటు పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటివి కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చు కారణంగా రాష్ట్రంలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రోత్సాహకాలు, నిల్వ సదుపాయాలు లేక.. కూరగాయల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ సదుపాయాల కొరత, పండించిన కూరగాయలకు సరైన మార్కెట్ కల్పించకపోవడం వంటి సమస్యలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. కూరగాయల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలతోపాటు కూలీల ఖర్చులు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం కూడా కూరగాయల సాగు పట్ల రైతులకు ఆసక్తి తగ్గడానికి కారణమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన వరి, పత్తి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం తెలంగాణలో కూరగాయల సాగు తగ్గిపోగా వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. భూగర్భ జలాలు, సాగునీటి సదుపాయాలు పెరగడం దీనికి కారణం. ఈ ఏడాది వానకాలం సీజన్లో వరి 66 లక్షల ఎకరాల్లో, పత్తి 44 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. యాసంగిలోనూ 60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీనితోపాటు మొక్కజొన్న, మిర్చి వంటి పంటల సాగు కూడా గణనీయంగా పెరుగుతోంది. కూరగాయల సాగు మరింతగా క్షీణిస్తోంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఖమ్మం పరిధిలో సీతారామ ప్రాజెక్టు వంటివి అందుబాటులోకి వచ్చాక... రాష్ట్రంలో వరితో పాటు కూరగాయల సాగు కూడా పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు భావించారు. కానీ దీనికి భిన్నంగా జరుగుతోంది. కూరగాయలు ఎక్కువగా పండించే.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా సాగు తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌లో తగ్గిన కూరగాయల వినియోగం హైదరాబాద్‌లో కూరగాయల వినియోగంపై జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటున నెలకు ఒక్కొక్కరు 8.08 కిలోల కూరగాయలు(ఉల్లిపాయలతో కలిపి) వినియోగిస్తున్నట్లు తేలింది. అంటే రోజుకు 269 గ్రాములు అన్నమాట. దేశ సగటు కంటే ఇది 56 గ్రాములు తక్కువ. మన దేశ పరిస్థితుల మేరకు.. ప్రతి ఒక్కరూ రోజుకు 325 గ్రాముల కూరగాయలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 2,006 టన్నులు అంటే నెలకు 60,182 టన్నులు, ఏడాదికి 7,22,186 టన్నుల కూరగాయలు అవసరమని అంచనా. కానీ ఏటా హైదరాబాద్‌కు 6 లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే వస్తున్నట్టు అంచనా. ఇందులోనూ 80శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. సరిపడా కూరగాయలు రాకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగం తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులు, కూలీల సమస్యతో.. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కూరగాయలు, ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుతోంది. పెట్టుబడుల ఖర్చు, ఎక్కువ శ్రమ, పురుగు మందులు, ఎరువుల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి చూపడం లేదు. కూలీల కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు నీటి లభ్యత పెరగడం, ప్రభుత్వం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తుండటంతో వరి పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. – ప్రభాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్‌కర్నూల్ జిల్లా కొత్తగా సాగు చేసేవారే లేరు పట్టణీకరణతో కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ కొత్తగా కూరగాయల సాగుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నీటి లభ్యత, మద్దతు ధరతో కొనుగోళ్లతో రైతులంతా వరివైపు చూస్తున్నారు. – కె.వేణుగోపాల్, జిల్లా హార్టికల్చర్ అధికారి, మహబూబ్‌నగర్ కూరగాయల సాగు ఖర్చులు బాగా పెరిగాయి కూరగాయలకు చీడపీడల సమస్య ఎక్కువ. పురుగు మందులు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో క్రమంగా కూరగాయల సాగు తగ్గించుకుంటూ వస్తున్నాం. సూపర్ మార్కెట్లు పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి టోకుగా తెప్పించుకుంటుండటంతో.. స్థానికంగా మార్కెటింగ్ సమస్య వస్తోంది. – ముత్యంరెడ్డి, రైతు, బుస్సపూర్, బాల్కొండ నియోజకవర్గం దళారీలే బాగుపడుతున్నారు.. మా గ్రామంలో ఇప్పుడు టమాటా పండిస్తున్నారు. నెల కింద టమాటా ఒక్క బాక్స్ (సుమారు 25 కిలోలు) 500 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.200 కూడా రావడం లేదు. టమాటాలను నిల్వ చేసుకునే సదుపాయం లేదు. దళారీలు ఎంతకు అడిగితే అంతకు అమ్మడం తప్ప ఏం చేయలేం. రైతులు, వినియోగదారులు ఇద్దరికీ నష్టమే. దళారీలు బాగుపడుతున్నారు. విత్తనాల నుంచి మార్కెట్లో అమ్ముకునేదాకా నష్టం కలుగుతున్నప్పుడు కూరగాయల సాగు నుంచి వేరే పంటల వైపు వెళ్లక ఏం చేస్తాం? – మొగుళ్లపల్లి వెంకటరెడ్డి, ముట్పూర్, కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా లాభాలపై గ్యారంటీ లేదు కూరగాయలు పండిస్తే పెట్టిన పెట్టుబడికి అదనంగా వచ్చే లాభాలపై ఎలాంటి గ్యారంటీ లేదు. ఒకవైపు వాతావరణ పరిస్థితులు. మరోవైపు చీడపీడల బెడద. అన్నీ తట్టుకొని సాగుచేసినా.. మహారాష్ట్ర నుంచి దిగుబడి అవుతున్న కూరగాయలతో పోటీపడలేకపోతున్నాం. మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా, కొత్తిమీర ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. దిగుబడి వస్తున్న సమయంలో ధర తగ్గిపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. – సాతాళే విజయ్‌కుమార్, కూరగాయల రైతు, గుడిహత్నూర్నిలకడైన ధర లేక ఇబ్బంది అవుతోందికూరగాయలకు మార్కెట్లో నిలకడైన ధర లేకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. దగ్గరలో మార్కెట్ అందుబాటు లేక రవాణా, ఇతర ఖర్చులు పెరుగుతున్నాయి. హార్టికల్చర్ శాఖ నుంచి ఎలాంటి సబ్సిడీలు కూడా అందడం లేదు. అందుకే ప్రస్తుతం కూరగాయలు సాగు చేయడం లేదు. – లింగారెడ్డి. రైతు, రెంజర్ల -
కొత్త విత్తనాలు వేద్దాం
వరి సాగులో విత్తన మార్పిడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దశాబ్దాలుగా అన్నదాతలు సాగు చేస్తున్న పాత రకాల వరి వంగడాలకు బదులుగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నవీకరించిన రకాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. దశలవారీగా వీటి సాగును విస్తరించేలా చర్యలు చేపట్టింది. ఆ దిశగా రైతులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. సాక్షి, అమరావతి: వరి సాగులో విత్తన మారి్పడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నూతన విత్తనాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వరి ఖరీఫ్ సీజన్లో 37 లక్షల ఎకరాల్లో, రబీలో 20 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఖరీఫ్‌లో 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మూడు దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన వంగడాలనే నేటికీ సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా బీపీటీ 5204తో పాటు ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు ఎక్కువగా పండిస్తున్నారు. దశాబ్దాలుగా సాగవుతుండడంతో చీడపీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుఫాన్లతోపాటు కొద్దిపాటి వర్షాలను సైతం తట్టుకోలేక పంటచేలు నేలచూపులు చూస్తున్నాయి.భారీ వర్షాలొస్తే ముంపు బారిన పడుతున్నాయి. వీటికి సరైన ప్రత్యామ్నాయం లేక, కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలపై అవగాహన లేక రైతన్నలు వీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుబాటులో ప్రత్యామ్నాయ రకాలు శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1318 రకం వరి విత్తనాన్ని అందుబాటులోకి తెచ్చారు. గింజ రాలకపోవడంతోపాటు తెగుళ్లను సమర్థంగా తట్టుకుని మిల్లర్లకు నూక శాతం లేని రకంగా ఈ కొత్త వరి వంగడం ప్రాచుర్యం పొందింది. ఇక బీపీటీ 5204 రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1271, ఎన్‌డీఎల్‌ఆర్ 7 రకాలు అందుబాటులోకి వచ్చాయి. తెగుళ్లు, పురుగులను తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి చేసిన ఈ వంగడాలు గింజ రాలకుండా అధిక దిగుబడులు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఆర్జీఎల్ 2537 రకం వరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1232 రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది సన్న గింజ రకం కావడంతోపాటు అధిక దిగుబడినిస్తుంది. వేరుశనగలో కే–6కు ప్రత్యామ్నాయం ఖరీఫ్‌లో సాగు చేసే నూనె గింజల్లో అత్యధిక విస్తీర్ణం (15 లక్షల ఎకరాలు)లో సాగయ్యే వేరుశనగలో కే–6 రకాన్నే దాదాపు మూడు దశాబ్దాలుగా పండిస్తున్నారు. తెగుళ్లు, చీడపీడలతో పాటు బెట్ట పరిస్థితులను తట్టుకోలేక, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. కే–6కు ప్రత్యామ్నాయంగా టీసీజీఎస్ 1694, కదిరి లేపాక్షి రకాలను అందుబాటులోకి తెచ్చారు. బెట్టనే కాకుండా తెగుళ్లను కూడాసమర్థంగా తట్టుకునే ఈ రకాలు అధిక దిగుబడినిస్తున్నాయని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దశలవారీగా విస్తరణ.. వ్యవసాయ శాఖాధికారులు, డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ పక్కాగా కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మార్పిడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసింది. ప్రభుత్వ క్షేత్రాలు/ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో మూల విత్తనాన్ని నాటి సర్టిఫైడ్ సీడ్‌ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా వీటి సాగుకు ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచి్చన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేసి దశల వారీగా సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రోత్సహిస్తారు. ఆర్బీకేల ద్వారా అవగాహన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల వారీగా సమావేశాలు నిర్వహించి తొలుత అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్థమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా విç్తత ప్రచారం కల్పిస్తారు. ఆర్బీకే ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోల ద్వారా వీటి సాగును ప్రోత్సహిస్తారు.చిన్న చిన్న వీడియో, ఆడియో సందేశాలను రూపొందించి పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసి వాటిపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యామ్నాయ రకాల విస్తరణే లక్ష్యంరాష్ట్రంలో కొన్ని రకాల వంగడాలు దాదాపు 20–30 ఏళ్లకుపైగా సాగులో ఉన్నాయి. కనీసం 10–15 ఏళ్ల పాటు సాగు చేసిన వంగడాలను క్రమేపీ తగ్గించాలి. వాటి స్థానంలో ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. వచ్చే మూడేళ్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం విస్తీర్ణంలో పాత వంగడాల స్థానంలో శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన కొత్త రకాల సాగును ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేశాం. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
వరి సాగుపై రోత రాతలు! అడ్డంగా దొరికిన రాజగురువు
-
ఒరిగిపోలేదు.. పెరిగిపోయింది
సాక్షి, అమరావతి: సర్వ సాధారణంగా ఎవరైనా సరే మన పరిస్థితిని సమీక్షించుకోవాలంటే గతంతో బేరీజు వేసుకుంటారు. ఇప్పుడు అంతకంటే మెరుగ్గా ఉన్నామో లేదో పరిశీలించుకుంటారు. ఈనాడు రామోజీ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం! పొరపాటున కూడా అలా పోల్చే సాహసం చేయరు! ఎందుకంటే చంద్రబాబు వైఫల్యాలు, రైతులకు చేసిన మోసాలు బహిర్గతమవుతాయి కాబట్టే!! టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో వరి సాగు సగటున మరో నాలుగున్నర లక్షల ఎకరాలకుపైగా అదనంగా పెరిగింది. అందుకు తగ్గట్లే అన్నదాతలకు ఆదాయమూ పెరిగింది. నీళ్లపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ కొందరు రైతులు ప్రభుత్వ తోడ్పాటుతో ఉద్యాన పంటల వైపు మళ్లి పండ్ల తోటల సాగుతో మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వరి రైతులకు బోనస్ చెల్లిస్తున్నారంటూ రామోజీ మన రాష్ట్రం గురించి మొసలి కన్నీళ్లు కార్చారు. గ్రామస్థాయిలోనే రైతన్నలకు ఆర్బీకేల ద్వారా పంట ఉత్పాదకాలన్నీ సమకూరుస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం నుంచి పంట నష్ట పరిహారం దాకా ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తోంది. సీజన్ ముగియకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందుతోంది. పంటలను నేరుగా కల్లాల నుంచే కొనుగోలు చేస్తూ రైతన్నలకు గన్నీ బ్యాగులు, లేబర్ చార్జీలు, రవాణా చార్జీలను సైతం చెల్లించి వారిపై భారం పడకుండా ఆదుకుంటోంది. జీఎల్టీ పేరుతో టన్నుకు రూ.2,523 చొప్పున ధాన్యం కొనుగోలు డబ్బులతోపాటే రైతుల ఖాతాల్లో జమ చేస్తోందన్న విషయం రామోజీకి తెలుసా? తెలిసీ నటిస్తున్నారా? ఈనాడు ఆరోపణ: ఏపీలో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది... వాస్తవం: రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 38.8 లక్షల ఎకరాలు కాగా రబీలో 19.92 లక్షల ఎకరాలు. టీడీపీ హయాంలో ఏటా సగటున 55.43 లక్షల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు గత నాలుగేళ్లుగా సగటున 60 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది. చంద్రబాబు పాలనలో 2014–15లో గరిష్టంగా 59.85 లక్షల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు 2020 – 21లో గరిష్టంగా 63.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. రాష్ట్రంలో వరి మొత్తం సాగు విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు కాగా 2022–23లో 55.52 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే వ్యత్యాసం 3.20 లక్షల ఎకరాలు మాత్రమే. రబీలో బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో 1.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో 35 వేల ఎకరాల్లో మత్స్యసాగు విస్తరించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 6.34 లక్షల ఎకరాలు తగ్గిపోయిందంటూ పొంతన లేని లెక్కలతో ఈనాడు కథలు అల్లింది. ఆరోపణ: పంట విరామం ప్రకటించినా మొద్దు నిద్రే వాస్తవం: చంద్రబాబు అధికారంలో ఉండగా కరువు మండలాలను ప్రకటించని ఏడాదంటూ లేదు.గత నాలుగేళ్లుగా అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాలేదు. పుష్కలంగా వర్షాలు, సమృద్ధిగా సాగునీరు, ముందస్తుగానే కాలువలకు నీటి విడుదలతో సిరులు పండుతున్నాయి. గోదావరి, కృష్ణాకే కాకుండా తొలిసారిగా పెన్నాకు కూడా వరదలు వచ్చాయంటే వరుణుడు ఏ స్థాయిలో కరుణ కురిపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటప్పుడు పనిగట్టుకుని పంట విరామం ప్రకటించాలి్సన అవసరం ఏముంటుందో రామోజీకే తెలియాలి. 2022–23లో వరి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తే పంట విరామం ప్రకటించినట్లుగా నోటికొచి్చన అంకెలతో రామోజీ అబద్ధాలను అచ్చేశారు. ఆరోపణ: మద్దతు ధర మాయే.. వాస్తవం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 17,94,279 మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. టీడీపీ హయాంలో దళారులదే రాజ్యం. తక్కువ మంది రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం ధాన్యం సేకరించడమే ఇందుకు నిదర్శనం. 2014–15లో 1.18 లక్షల మంది రైతుల నుంచి రూ.5,583 కోట్ల విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఒక్కో రైతు నుంచి సగటున 33.89 టన్నుల ధాన్యం సేకరించారు. నూటికి 90 శాతం సన్న, చిన్నకారురైతులున్న ఈ రాష్ట్రంలో ఈస్థాయిలో ధాన్యంఅమ్మారంటే వార్ని ఏమంటారో అర్ధం చేసుకోవచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఏకంగా 32,78,354 మంది రైతుల నుంచి రూ.58,766 కోట్ల విలువైన 3,10,69,117 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంతో పోలిస్తే ధాన్యం అమ్ముకున్న రైతుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. గరిష్టంగా కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేశారు. ఆరోపణ: తడిసిన ధాన్యాన్ని కొనలేదు.. వాస్తవం: గతంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఒక్కో బస్తాకి (75 కేజీలు) మద్దతు ధర కంటే రూ.200 – రూ.500 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరాకు తక్కువలో తక్కువ 30–33 బస్తాల దిగుబడి వేసుకున్నా రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. తేమ శాతం పేరిట ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. ఇప్పుడు జిల్లాకో మొబైల్ మిల్లును పంపి రైతుల ఎదుటే శాంపిల్స్ పరీక్షిస్తున్నారు. తడిసిన ధాన్యాన్నే కాకుండా ముక్క విరిగిన ధాన్యాన్ని సైతం బాయిల్డ్ రకంగా పరిగణించి మరీ కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన మొత్తం ధాన్యంలో సుమారు 30 శాతం తడిసిన ధాన్యమే ఉంది. కేంద్ర నిబంధనలు అడ్డంకిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని మిల్లర్లను ఒప్పించి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా సేకరించింది. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడమే కాకుండా పొలం నుంచే నేరుగా కొనుగోలు చేస్తూ జీఎల్టీ(గన్నీ బ్యాగ్‌లు, లేబర్, ట్రాన్స్‌పోర్టు) ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది. టన్నుకు రూ.2,523 చొప్పున (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలుగా రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85) చెల్లిస్తుండగా ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాల్‌కు రూ.418 చొప్పున భరిస్తోంది. ఈ అదనపు మొత్తాన్ని ధాన్యం సొమ్ముతో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఆరోపణ: వరిసాగు లేక కూలీలు వలసపోతున్నారు వాస్తవం: వరి సాగు లేక వ్యవసాయ పనిదినాలు తగ్గిపోయాయని, కూలీలు వలస వెళుతున్నారంటూ రామోజీ కంటతడి పెట్టారు. వాస్తవానికి ఉపాధి హామీ పనులతో పాటు ఇతర పనుల కారణంగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. సాగులో కూలీల కొరత తీర్చేందుకు యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా చిన్న, సన్న కారు రైతులకు లబ్ధి చేకూర్చి పెట్టుబడి ఖర్చులను తగ్గించేలా యంత్రపరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఆరోపణ: వరి రైతును ఆదుకునే చర్యలేవి? వాస్తవం: 2020 నుంచి ఇప్పటివరకు వైపరీత్యాల వల్ల 15.31 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తినగా 12.79 లక్షల మంది వరి రైతులకు రూ.930.56 కోట్ల పెట్టుబడి రాయితీని సీజన్ ముగియకుండానే అందజేశారు. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు 2.21 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఈనాడుకు మాత్రం 3.51 లక్షల ఎకరాలుగా తోచింది. 2014 నుంచి నేటి వరకు ఎకరాకు పెట్టుబడి రాయితీ రూ.6 వేల చొప్పునే ఇస్తున్నారు. 2018లో తితిలీ, పెతాయి తుపాన్ వల్ల నష్టపోయిన పంటలకు కేవలం రెండు జిల్లాల పరిధిలో మాత్రమే ఎకరాకు రూ.8వేల చొప్పున ఇచ్చారు. 2014–19 మధ్య 359 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. 42.26 లక్షల ఎకరాలు కరువు బారిన పడినట్లు గుర్తించారు. నాడు పరిస్థితి అంత దారుణంగా ఉంటే 20.09 లక్షల మంది రైతులకు రూ.2,188.74 కోట్ల పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుది కాదా? ఈ లెక్కలు రామోజీ ఎక్కడ దాచినట్లు? ఆరోపణ: ఏటా ఉత్పాతమే... వాస్తవం: ఆహార ధాన్యాల దిగుబడి 2014–19 మధ్య ఐదేళ్లలో సగటు 153.94 లక్షల టన్నులు కాగా గత నాలుగేళ్లలో 170.96 లక్షల టన్నులు ఉంది. ఒక్క వరినే పరిశీలిస్తే చంద్రబాబు అధికారంలో ఉండగా ఏటా సగటున 1.22 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 2019–22 మధ్య 1.29 కోట్ల టన్నుల చొప్పున ఉత్పత్తి జరిగింది. 2021–22 ఖరీఫ్‌లో హెక్టార్‌కు 4,351, రబీలో 6,950 కేజీల చొప్పున దిగుబడి నమోదైంది. 2022–23 ఖరీఫ్‌లో 5,195 కేజీలు, రబీలో 6,944 కేజీల చొప్పున దిగుబడి వచ్చింది. 2021–22లో 1.25 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 2022–23లో 1.29 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే దిగుబడి పెరిగినట్లా? తగ్గినట్లా? రామోజీకి మాత్రం ఇవన్నీ కనపడవు. ఎందుకంటే ఆయన కళ్లున్నా కబోదిలానే వ్యవహరిస్తున్నారు కాబట్టి!! ఇతర రాష్ట్రాల్లో ఇలా.. ఏపీలో 24 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంటే కేరళలో 1.98 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 13.57 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 19 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు అవుతోంది. ఇక దిగుబడిని పరిశీలిస్తే ఏపీలో ఎకరాకు 23.24 క్వింటాళ్ల్లను (2022–23)మన రైతన్నలు సాధిస్తుండగా తమిళనాడులో 17, జార్ఖండ్‌లో 9, కేరళలో 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఎంత ప్రోత్సహిస్తున్నా ఫలితం లేకపోవడంతో కేరళ ఏటా మన గోదావరి జిల్లాల్లో సాగయ్యే బొండాల కోసం క్యూ కడుతుండగా తమిళనాడు మన రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే ఫైన్ వెరైటీల వైపు చూస్తోంది. ఉత్తరాంధ్రలో సాగయ్యే ఫైన్ వెరైటీ ధాన్యాన్ని జార్ఖండ్ కొనుగోలు చేస్తోంది. -
ధాన్యం సొమ్ము చెల్లింపుల్లో ముందంజ
సాక్షి, భీమవరం: రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు సొమ్ములు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించిన వారంలోగా సొమ్ములను వారి బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. పండించిన పంటను నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం ద్వారా దళారుల కమీషన్ల బెడద లేకుండా రైతులకు మద్దతు ధర అందుతోంది. అంతేగాకుండా ధాన్యం సొమ్ములతోపాటు గోనె సంచులు, హమాలీలు, రవాణా చార్జీలను సైతం ప్రభుత్వమే చెల్లించడం రైతులకు వరంగా మారింది. 296 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జిల్లాలోని 20 మండలాల పరిధిలో గడిచిన దాళ్వా సీజన్లో సుమారు 2.19 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించగా, పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని దళారులు, రైస్ మిల్లర్లకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ధాన్యం అమ్మకం చేసిన 21 రోజుల్లోగానే పంట సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తుందని వ్యవసాయ, రెవెన్యు శాఖాధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనితో దాళ్వా సీజన్లో జిల్లాలోని 74,083 మంది రైతుల నుంచి 6,43,128 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీరికి మొత్తం రూ.1,312.21 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.1,310.82 కోట్లు చెల్లించారు. అలాగే గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీలకు రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.41.55 కోట్లు దాదాపు జమ చేయగా కొద్దిమొత్తంలో ధాన్యం రవాణ చేసిన ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు లింకేజీ సక్రమంగా లేకే జాప్యం జిల్లాలోని ధాన్యం విక్రయాలు చేసిన రైతుల్లో కేవలం 117 మందికి రూ.1.39 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆయా రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజీ చేయకపోవడం, జన్‌ధన్ బ్యాంకు ఖాతాకు కేవలం రూ.50 వేలు మాత్రమే జమచేసే అవకాశం ఉండడం వంటి అవరోధాలు కారణంగా సొమ్ములు జమ కాలేదు. అలాగే గోనె సంచులు, రవాణా, హమాలీ చార్జీలకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయగా ఏజెన్సీల ద్వారా ధాన్యం రవాణా చేసిన సుమారు రూ.1.58 కోట్ల సొమ్మును ఏజెన్సీలు క్లయిమ్స్ అందజేయకపోవడంతో చెల్లించలేదు. ధాన్యం సొమ్ములతోపాటు రైతులకు రవాణా, హమాలీ, గోనె సంచులకు సంబంధించిన సొమ్ములను త్వరితగతిన ప్రభుత్వం చెల్లిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సిద్దిపేట జిల్లాలో ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు...
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఒడిదుడుకుల మధ్య ముగిసింది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో జిల్లా యంత్రాంగం 416 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. బుధవారంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిశాయి. సీజన్ ప్రారంభంలో 5లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని జిల్లా యంత్రాంగం అంచనా వేశారు. ఈ సారి యాసంగిలో కోతల సమయంలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. కొందరు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసువచ్చిన తర్వాత సైతం వర్షాలు కురవడంతో రైతులు యాసంగి ధాన్యాన్ని అమ్మడం కోసం అష్టకష్టాలు పడ్డారు. తడిసిన వడ్లకు కాంట పెట్టకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తీసుకున్నారు. తగ్గిన ధాన్యం జిల్లాలో యాసంగిలో 3.31లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోత దశలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 416 కొనుగోలు కేంద్రాల ద్వారా 85,411 మంది రైతుల దగ్గరి నుంచి రూ.732.15కోట్ల విలువ చేసే 3,55,413 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ● గతేడాది కంటే యాసంగి సీజన్లో సాగు పెరిగినప్పటికీ దిగుబడి తగ్గింది. గతేడాది 2.62లక్షల ఎకరాలు సాగయితే 3.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సారి 37,055 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. రూ.111 కోట్లు పెండింగ్ ధాన్యం కొనుగోలు చేసిన పది నుంచి 15రోజులకు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డబ్బులు చేతిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ● రూ.732.15 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా రూ.720.66కోట్ల విలువ చేసే ధాన్యం ట్యాబ్ ఎంట్రీ అయ్యాయి. ట్రక్ షీట్లు రూ.678.92కోట్ల విలువ చేసే ధాన్యంకు జనరేట్ అయ్యాయి. రూ.678.92 కోట్ల విలువ చేసే ధాన్యంకు మిల్లర్లు ఒకె చెప్పారు. ఇప్పటి వరకూ రైతులకు రూ.620.85కోట్లను చెల్లించారు. ఇంకా రూ.111.30కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. విజయవంతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. మంత్రి హరీశ్ రావు, కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశాం. పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బుల చెల్లింపులు రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి అవుతుంది. – హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
ధాన్యం రైతు ‘ధర’హాసం
ఎమ్మిగనూరు(కర్నూలు జిల్లా): వరి సాగు ఈ ఏడాది రైతుకు కలిసొచ్చింది. దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. వేరుశనగ, మిరప పంటలకు దీటుగా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 31,402 హెక్టార్లు. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించటం, ప్రాజెక్టుల్లో విస్తారంగా సాగునీరు లభ్యంకావటంతో కేవలం ఖరీఫ్‌లోనే 28,651 హెక్టార్లలో వరి సాగైంది. రబీలో కూడా కాలువల కింద రైతులు ఈ పంటను సాగు చేసుకొన్నారు. ఒక్కో ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టగా.. 35 నుంచి 45 బస్తాల వరకు దిగుబడులొచ్చాయి. గతేడాది క్వింటా ధర రూ.1,700 పలికింది. ఈ ఏడాది ఆరంభం(జనవరి)లో కర్నూలు సోనా క్వింటా రూ.2,000, ఆరున్నర రకం(చిన్నసోనా), ఎన్డీఎల్(నంద్యాలసోనా) రకాలు క్వింటాల్ రూ.2,300 వరకు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ.2,900 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు రూ. 3,000 మార్కును అందుకోనుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు ఖరీఫ్ పంట దిగుబడులను రైతులు వెంటనే అమ్ముకోకుండా అధిక ధరలు వచ్చే వరకూ వేర్‌హౌజ్‌ల్లో నిల్వచేస్తున్నారు .రైతుల అవసరాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 95 గోడౌన్ల నిర్మాణం చేపట్టింది. అంతేకాకుండా రైతులు నిల్వచేసుకొన్న పంటకు బ్యాంకులతో రుణాలు మంజూరు చేయిస్తోంది. కొంతమంది వేర్‌హౌజ్ యజమానులు కూడా వరి బస్తాకు రూ.1,000 చొప్పున రైతులకు రుణాలు ఇస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తీరుతున్నాయి. క్వింటా బియ్యం రూ.4500 మార్కెట్లో క్వింటా బియ్యం రూ.4500 పలుకుతోంది. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న శిక్షణలతో రైతుల్లో చైతన్యం మొదలైంది. పంట అమ్మకాల్లో గత కొంతకాలంగా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తాము పండించించిన పంట ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చుతున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు ప్రాంతాల్లోని రైసు మిల్లులకు రైతులు వరిధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలుసోనా బియ్యం క్వింటా రూ.4300, నంద్యాల సోనా, సన్నబియ్యం రూ.4500 వరకు విక్రయిస్తున్నారు. రైతుకు మంచికాలం రైతులకు మంచి కాలం నడుస్తోంది. పంటలకు రేట్లు బాగున్నాయి. ఎప్పుడూ రూ1,800 దాటని వడ్లు ఈఏడు రూ.2,900 అమ్ముతున్నాయి. నేను పది ఎకరాల్లో నంద్యాల సోనా రకం సాగు చేశా. 400 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.2900 చొప్పున విక్రయించా. –ఎన్ పరమేష్, గురుజాల గ్రామం గతంలో ఇంత రేటు లేదు తుంగభద్ర నది పంపుసెట్ల కింద 2.5 ఎకరాల్లో కర్నూలు సోనా పండించా. 100 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.2800 చొప్పున అమ్ముకొన్నా. గతంలో ఎప్పుడూ ఇంత రేటు లేదు. మంచి ధర వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. – కురువ కిష్టప్ప,వరి రైతు -
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సృష్టి ‘ఆర్ఎన్ఆర్ 29235’.. సరికొత్త వరి వంగడం
వ్యవసాయ వర్సిటీ విడుదల చేసిన వరి వంగడాల్లో అత్యంత కీలకమైనది ‘ఆర్ఎన్ఆర్ 29235’ రకమే. ఇప్పటివరకు యాసంగిలో వేస్తున్న వివిధ రకాల వరి రకాల్లో నూక శాతం అధికంగా ఉంటోంది. ఇది ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కూడా కారణమైంది. ప్రస్తుతం యాసంగిలో వేస్తున్న వరి రకాలను మిల్లింగ్ చేసినప్పుడు 40% బియ్యం, 60% నూకలు వస్తున్నాయి. అదే తాజాగా విడుదల చేసిన ‘ఆర్ఎన్ఆర్ 29235’ రకం వరి అయితే బియ్యం దాదాపు 62%, నూకలు 38% వస్తాయని.. దీనివల్ల కొనుగోళ్ల వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందని వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కొత్తగా విడుదల చేసిన అన్ని రకాల వరి వంగడాల ద్వారా అదనంగా 10% దిగుబడి వస్తుందని వివరించారు. ఇక వరి పంటకాలం ఇప్పటివరకు 135 రోజులుగా ఉండగా.. కొత్త రకాలు 125 రోజులకే కోతకు వస్తాయని వెల్లడించారు. సాక్షి, హైదరాబాద్: తక్కువ సమయంలో దిగుబడి రావడంతోపాటు మిల్లింగ్ చేసినప్పుడు నూకలు తక్కువగా వచ్చే సరికొత్త వరి రకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ‘ఆర్ఎన్ఆర్ 29235’ పేరిట ఈ సరికొత్త వరి వంగడాన్ని తాజాగా విడుదల చేసింది. ఇతర రకాల వరితో పోలిస్తే దీనిద్వారా దిగుబడి కూడా పది శాతం ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటు మరో 9 రకాల వరి వంగడాలు, ఇంకో ఐదు ఇతర పంటల రకాలను వ్యవసాయ వర్సిటీ విడుదల చేసింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలను తట్టుకునేలా, తక్కువ కాలంలోనే దిగుబడి వచ్చేలా ఈ వంగడాలను అభివృద్ధి చేసినట్టు తెలిపింది. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. వచ్చే ఏడాది వానాకాలం సీజన్ నాటికి కొత్త రకాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. వీటితో రైతులకు లాభసాటిగా ఉండటంతోపాటు వినియోగదారులకూ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో..: ప్రస్తుతం అభివృద్ధి చేసిన కొత్త వంగడాల్లో ఎనిమిదింటిని జాతీయ స్థాయిలో, ఏడింటిని రాష్ట్రస్థాయిలో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలో జరిగిన జాతీయ వంగడాల విడుదల, నోటిఫికేషన్ కమిటీ సమావేశంలో.. వరిలో ఐదు, పశుగ్రాస సజ్జలో రెండు, నువ్వుల్లో ఒక రకానికి ఆమోదం లభించింది. ఇక సెప్టెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయిలో కొత్త వంగడాల విడుదల ఉప కమిటీ సమావేశంలో ఐదు వరి రకాలు, మినుము, నువ్వు పంటల్లో ఒక్కో రకం చొప్పున ఏడు నూతన రకాలను ఆమోదించారు. మొత్తంగా ఈ 15 వంగడాలను వ్యవసాయ వర్సిటీ తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ మొత్తంగా 61 కొత్త వంగడాలను అభివృద్ధి చేసింది. ఇందులో 26 వరి రకాలు, 8 కంది రకాలు ఉన్నాయి. రైతుల ప్రయోజనమే లక్ష్యంగా: ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు రైతులకు మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం వ్యవసాయ శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు, రిజి్రస్టార్ ఎస్.సుధీర్ కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. పత్తిలో నూతన రకాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అధిక సాంద్రత పత్తిపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. దానిని 8,500 ఎకరాల్లో సాగు చేస్తున్నామని వివరించారు. కొత్త వంగడాల అభివృద్ధికి గతంలో 8–10 ఏళ్ల సమయం పట్టేదని, స్పీడ్ బ్రీడింగ్ బయో టెక్నాలజీ వినియోగంతో ఐదేళ్లలో ప్రయోగం పూర్తవుతోందని తెలిపారు. ఇక జన్యుమారి్పడి వంగడాలపైనా వర్సిటీ దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే మొక్కజొన్న, వరిలో ఈ తరహా పరిశోధనలు చేపట్టామని.. పత్తికి సంబంధించి కేంద్రం అనుమతి కోరామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో విడుదలైన రకాలివీ.. 1) వరి–1 (ఆర్ఎన్ఆర్ 11718): కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండించేందుకు సిఫార్సు చేశారు. ఖరీఫ్‌కు అనుకూలం. పంట కాలం 135 నుంచి 140 రోజులు. హెక్టారుకు 7 వేల నుంచి 8 వేల కిలోలు దిగుబడి వస్తుంది. చవుడు నేలల్లోనూ వేసుకోవచ్చు. 2) తెలంగాణ రైస్ 5 (ఆర్ఎన్ఆర్ 28362): ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7,000–7,500 కిలోలు 3) తెలంగాణ రైస్ 6 (కేఎన్ఎం 7048): ఒడిశా, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల కోసం సిఫార్సు చేశారు. వానాకాలం అనుకూలం. పంట కాలం 115–120 రోజులే. దిగుబడి హెక్టారుకు 8000–8500 కిలోలు. ఇది దొడ్డురకం. 4) తెలంగాణ రైస్ 7 (కేఎన్ఎం 6965): ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. వానాకాలం పంట. 115–120 రోజుల్లో చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7500–8500 కిలోలు. ఇది పొడవు సన్నగింజ రకం. 5) తెలంగాణ రైస్ 8 (డబ్లు్యజీఎల్ 1487): వానాకాలం పంట. 125–130 రోజుల్లో.. హెక్టారుకు 5,600–6,000 కిలోల దిగుబడి వస్తుంది. మధ్యస్థ, సన్నరకం ఇది. ఫాస్పరాస్ తక్కువగా ఉన్న నేలలకు అనుకూలం. 6) నువ్వులు– తెలంగాణ తిల్–1 (జేసీఎస్ 3202): తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. పంటకాలం 91–95 రోజులే. హెక్టారుకు 820–980 కిలోలు దిగుబడి వస్తుంది. 7) తెలంగాణ పశుగ్రాసపు సజ్జ–1 (టీఎస్ఎఫ్బీ 17–7): తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వానాకాలం సీజన్‌కు సిఫార్సు చేశారు. పంటకాలం (5౦శాతం పూతదశ) 56–68 రోజులు. 8) తెలంగాణ పలుకోతల సజ్జ–1 (టీఎస్ఎఫ్బీ 18–1): పంటకాలం (5౦శాతం పూత దశ ) 56–68 రోజులు. రాష్ట్రస్థాయిలో విడుదలైన రకాలివీ.. 1) రాజేంద్రనగర్ వరి–3 (ఆర్ఎన్ఆర్ 15459): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135– 140 రోజుల పంట. దిగుబడి హెక్టారుకు 4,000– 4,500 కిలోలు వస్తుంది. సువాసన గల అతి చిన్న గింజ రకం ఇది. సాంప్రదాయ చిట్టిముత్యాల రకం వరితో పోలి్చతే చేనుపై పంట పడిపోయే అవకాశం తక్కువ. 2) రాజేంద్రనగర్ వరి–4 (ఆర్ఎన్ఆర్ 21278): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలం, యాసంగి సీజన్లలో వేయవచ్చు. వానాకాలంలో 115–120 రోజుల స్వల్పకాలిక రకం. దిగుబడి హెక్టారుకు 6,500 కిలోలు వస్తుంది. అగ్గితెగులును మధ్యస్థంగా తట్టుకుంటుంది. పొట్టి గింజ రకం, చేనుపై పంట పడిపోదు. 3) రాజేంద్రనగర్ వరి–5 (ఆర్ఎన్ఆర్ 29235): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాల్లో రెండు సీజన్లలో పండించొచ్చు. వానాకాలంలో 120–125 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7,500 కిలోలు. పొడవు, సన్నగింజ రకం. పొడవు గింజ రకాల్లో అధిక దిగుబడి ఇచ్చే రకం ఇదే. చేను పొట్టిగా ఉండి పడిపోదు. యాసంగిలో ఈ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే నూకలు తక్కువగా వస్తాయి. 4) జగిత్యాల వరి–2 (జేజీఎల్ 28545): రాష్ట్రంలోని నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టారుకు 7,500 కిలోలు దిగుబడి ఇస్తుంది. 5) జగిత్యాల వరి–3 (జేజీఎల్ 27356): రాష్ట్రంలోని నీటి వసతిగల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7000 కిలోలు వస్తుంది. ఇది అతి సన్నగింజ రకం ఇది. 6) మధిర మినుము–1 (ఎంబీజీ 1070): తెలంగాణ రాష్ట్రం అంతటా పండించడానికి అనుకూలం. వానాకాలం, యాసంగి, ఎండాకాలంలలోనూ పండించవచ్చు. పంటకాలం 75–80 రోజులు. హెక్టారుకు దిగుబడి 1,400–1,500 కిలోలు వస్తుంది. మధ్యస్థ దొడ్డు నలుపు గింజ రకం ఇది. 7) జగిత్యాల తిల్ –1 నువ్వులు (జేసీఎస్ 1020): పంటకాలం 85–95 రోజులు. దిగుబడి హెక్టారుకు 1,050–1,100 కిలోలు వస్తుంది. -
ఎన్జీ రంగా వర్సిటీ సేవలు దేశానికి అవసరం
తిరుపతి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో సాగయ్యే వివిధ పంటలకు నూతన వంగడాలు రూపొందించడం, కొత్త సాంకేతికతను అందించడం, దేశ ఆహార భద్రతను సాధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సేవలు దేశానికి ఎంతో అవసరమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. తిరుపతిలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో బుధవారం వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన అధ్యాపకులు, విద్యార్థులతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ 11వ స్థానంలో నిలవడంలో అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకుల పాత్ర కీలకమని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమేగాక ఆహారధాన్యాలు, వివిధ పంట ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతోందన్నారు. వరిసాగు విస్తీర్ణంలో సగం సాగు ఈ వర్సిటీ రూపొందించిన విత్తనాలే.. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వరి విత్తనాలు బి.పి.టి–5204 (సాంబమసూరి), స్వర్ణ, విజేత, వేరుసెనగ విత్తనాలు కె–6, ధరణి వంటి రకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. దేశంలో వరిసాగులో దాదాపు సగం విస్తీర్ణంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలే సాగవుతున్నట్లు తెలిపారు. దేశంలో మొదటిసారిగా వ్యవసాయ విద్యలో గ్రామీణ అనుభవ పథకాన్ని ప్రవేశపెట్టడం, వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం వంటి ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో 14.5 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇటీవల కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, వర్సిటీ వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు పి.వి.మిథున్‌రెడ్డి, డాక్టర్ ఎం.గురుమూర్తి, ఎన్.రెడ్డప్ప, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరువు నేలలో కృష్ణమ్మ పరుగులు
వర్షం పడితేనే పంటలు పండే నేలలో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. కృష్ణమ్మ జల స్పర్శతో చెరువులు సైతం పులకించనున్నాయి. ఇందుకోసం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో త్వరలోనే రైతుల కల సాకారం కానుంది. కృష్ణగిరి(కర్నూలు): జిల్లాలోని çపత్తికొండ, డోన్, ఆలూరు, కర్నూలు నియోజకవర్గాలకు గతంలో సాగునీటి వనరులు తక్కువగా ఉండేవి. వరుణుడి కరుణతోనే పంటలు పండేవి. ఇక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుని కృష్ణా జలాలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా తరలించేందుకు 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా కృష్ణాజలాలను చిత్తూరు జిల్లా వరకు తీసుకెళ్లేలా నిధులు మంజూరు చేసి పనులు సైతం పూర్తి చేయించారు. 2014 ఎన్నికల కంటే ముందుగానే కాలువకు నీరు విడుదల చేసి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్‌కు అప్పటి మంత్రులు పాదయాత్ర చేపట్టారు. జిల్లాలో ఏడు ఎత్తిపోతల పథకాలు, రెండు రిజర్వాయర్లతోపాటు రెండు చానల్ కాల్వల ద్వారా 80వేల ఎకరాలకు అధికారికంగా సాగునీరు ఇస్తున్నారు. ఇదంతా దివంగత నేత వైఎస్సార్ పుణ్యమే అని ఇక్కడి ప్రజలు నిత్యం స్మరించుకుంటున్నారు. 68 చెరువులకు హంద్రీ–నీవా నీరు హంద్రీ–నీవా ప్రాజెక్టుతో బీడు భూములను వైఎస్సార్ సస్యశ్యామలం చేయిస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి హంద్రీ–నీవా ప్రధాన కాల్వ నుంచి 68 చెరువులకు నీరు మళ్లించే పనులను పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ సమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ 90 కి.మీ దగ్గర పంప్‌హౌస్ నిర్మించారు. ఇందులో 3,800 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్ల నుంచి కటారుకొండ పంచాయతీ పరిధిలోని పులిచెర్ల సమీపంలో డెలివరీ చాంబర్‌కు నీరు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి మూడు ౖపైపుల ద్వారా నీరు చెరువులకు మళ్లించనున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలతోపాటు డోన్, ప్యాపిలి, కల్లూరు, దేవనకొండ మండలాల్లోని 68 చెరువులకు పైపుల ద్వారా నీరు వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 186 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 160 కోట్లు ఖర్చు చేసింది. పంటలు పూర్తయిన వెంటనే డిస్ట్రిబ్యూటరీ పనులు కృష్ణగిరి మండల పరిధిలోని పులిచెర్ల కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్ నుంచి మూడు గ్రావిటీల ద్వారా చెరువులకు నీరు మళ్లించే మెయిన్ పైప్‌లైన్ పనులు 80 శాతానికిపైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ పంటలు ఉండటంతో డిస్ట్రిబ్యూటరీ పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. పంట కాలం పూర్తయిన వెంటనే పనులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని అనుమతులు వచ్చాయి 68 చెరువులకు నీరు మళ్లించే పథకానికి సంబంధించి అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా ఉండేవి. అయితే ఇప్పుడు అన్ని అనుమతులు వచ్చాయి. మెయిన్ పైప్‌లైన్ దాదాపుగా 80 శాతానికిపైగా పూర్తి చేశాం. డిస్ట్రిబ్యూటరీలు కొన్ని చేపట్టాల్సి ఉంది. పొలాల్లో రైతులు పంటలు తీస్తే ఆ పనులు కూడా త్వరగా పూర్తి చేస్తాం. డిసెంబర్ నాటికి 30 చెరువులకు పైగా నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణరెడ్డి, ఇరిగేషన్ ఈఈ మూడు గ్రావిటీలు ఇవే.. గ్రావిటీ–1: పులిచెర్ల సమీపంలోని కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్ నుంచి 41.52 కిలోమీటర్ల దూరం ప్రయాణించి డోన్, వెల్దుర్తి, కల్లూరు, కృష్ణగిరి మండలాల్లోని 22 చెరువులకు నీరు చేరుకుంటుంది. 4,217ఎకరాలకు నీరు అందనుంది. గ్రావిటీ–2: డెలివరీ చాంబర్ నుంచి నీరు 21.20 కిలోమీటర్లు ప్రయాణించి పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల్లోని 16 చెరువులకు చేరుతుంది. మొత్తం 3,018 ఎకరాలకు నీరు పారనుంది. గ్రావిటీ–3: డెలివరీ చాంబర్ నుంచి నీరు 38 కిలోమీటర్లు దూరం ప్రయాణించి డోన్, ప్యాపిలి, తుగ్గలి మండలాల్లోని 30 చెరువులకు చేరుతుంది. ఆయా మండలాల్లో 2,898 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ట్రయల్ రన్ విజయవంతం హంద్రీ– నీవా కాలువ నుంచి చెరువులకు నీటిని మళ్లించేందుకు సెప్టెంబర్ నెలలో డీఈలు రవీంద్రనాథ్‌రెడ్డి, రామకృష్ణ ట్రయల్ రన్ నిర్వహించారు. రెండు మోటార్ల ద్వారా నీటిని పులిచర్ల సమీపంలోని డెలివరీ చాంబర్లోకి వదిలారు. అక్కడి గ్రావిటీ–1 పైపులైన్ ద్వారా కృష్ణగిరి మండలంలోని కటారుకొండ తుమ్మల చెరువు, కర్లకుంట, డోన్ మండలంలోని మల్లెపల్లె, వెంకటాపురం, జగదుర్తి చెరువులకు నీటిని పంపించారు. అలాగే గ్రావిటీ–2 పైప్‌లైన్ ద్వారా ఆలంకొండ గ్రామంలోని బోయినాల, కూర్మగిరి, తుగ్గలి మండలంలోని బొందిమడుగుల, చందోళి, చక్రాళ్ల, ముకెళ్ల చెరువుల్లోకి నీటి విడుదల విజయవంతమైంది. దీంతో ఈ గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాం వైఎస్సార్ చలువతో మా గ్రామానికి సమీపంలోనే హంద్రీ–నీవా కాలువ ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడంతో హంద్రీ–నీవా కాలువ నుంచి చెరువులకు నీరు వదిలే పనులు చురుగ్గా సాగుతున్నాయి. బోయినాల, కూర్మగిరి చెరువులకు త్వరలోనే నీరు వదులుతామంటున్నారు. మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాం. – ఆర్బీ వెంకటరాముడు, ఆలంకొండ ప్రతి ఏడాది వరి సాగు చేస్తాం హంద్రీ–నీవా కాలువకు మా గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు. మా చెరువులకు నీరు వస్తుందనే ఆశ కూడా మాకు లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకుని పనులు చేయిస్తున్నారు. చెరువులకు హంద్రీ–నీవా నీరొస్తే ప్రతి ఏడాది వరిసాగు చేస్తాం. – ఆదినారాయణ, వెంకటాపురం భూగర్భ జలాలు పెరుగుతాయి మా గ్రామ చెరువు ఎప్పుడూ నిండింది లేదు. రెండేళ్ల కిందట ఒకసారి భారీ వర్షానికి నిండింది కానీ పంట సాగుచేస్తే చివరివరకు నీరు చాలలేదు. సెస్టెంబర్లో నిర్వహించిన ట్రయల్ రన్లో మా చెరువులోకి హంద్రీ–నీవా నీరు వచ్చింది. చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే ప్రతి ఏటా వరి పండిస్తాం. బోరుబావుల్లో కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. – జల్ల సుంకన్న, బొందిమడుగుల -
సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో నాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరిసాగు గత ఏడాది రికార్డును బద్దలు కొట్టింది. కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు సాగవడమే కాకుండా ఇంకా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 62.12 లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ నెలాఖరు వరకు సీజన్ కొనసాగనున్నందున ఇంకా నాట్లు పడతాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది (2021) కూడా రికార్డు స్థాయిలో ఏకంగా 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇతర పంటలు ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ చెబుతున్నా..సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, నీటి వనరులు పుష్కలంగా ఉండటం, పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో పాటు ఉచిత విద్యుత్‌తో రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈసారి ధాన్యపు సిరులు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. ఏటా పెరుగుతున్న సాగు రాష్ట్రంలో వరి సాగు ఏడాదికేడాదికీ పెరిగిపోతోంది. తెలంగాణ రాకముందు 2013లో 29.16 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఇప్పుడు అంతకు రెట్టింపు పైగానే సాగు కావడం విశేషం. ఈ ఏడాది మొత్తం 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 45 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. అదే సమయంలో పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలుగా పేర్కొంది. బుధవారం నాటికి 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అయితే పత్తి 49.58 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కీలకమైన సమయంలో వర్షాలు కురవడం వల్ల వేసిన పత్తి కూడా లక్షలాది ఎకరాల్లో దెబ్బతింది. రెండోసారి వేసే వీలు కూడా లేకుండాపోయింది. మొత్తం మీద వర్షాలు పత్తి సాగు పెరగకుండా అడ్డుకున్నాయి. దీంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 5.57 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, 4.29 లక్షల ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 8.18 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 6.14 లక్షల ఎకరాల్లో సాగైంది. పంటల సాగులో నల్లగొండ టాప్.. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో వంద శాతానికి పైగా వానాకాలం సీజన్ పంటలు సాగయ్యాయి. 11.14 లక్షల ఎకరాల సాగుతో నల్లగొండ టాప్‌లో నిలిచింది. 7.75 లక్షల ఎకరాలతో సంగారెడ్డి, 6 లక్షల ఎకరాలతో వికారాబాద్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సూర్యాపేట (5.91 లక్షలు), ఆదిలాబాద్ (5.61 లక్షలు), ఖమ్మం (5.56 లక్షలు), కామారెడ్డి (5.12 లక్షలు), నిజామాబాద్ (5.10 లక్షలు), నాగర్‌కర్నూల్ (5.10 లక్షలు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత తక్కువగా మేడ్చల్ (20 వేలు), ములుగు (1.27 లక్షలు), వనపర్తి (2.21 లక్షలు) ఎకరాల్లో సాగయ్యాయి. నీటి వనరులు పెరగడం,ఉచిత విద్యుత్ వల్లే.. వరి రికార్డు స్థాయిలో సాగైంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాంతంలో వరి అంతంతే. కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరంతో రిజర్వాయర్లు నిండిపోవడం, పుష్కలంగా నీటి వనరులు అందుబాటులోకి రావడం, ఉచితంగా 24 గంటలూ కరెంటు ఇస్తుండటంతో రైతులు వరి సాగువైపు మళ్లుతున్నారు. కేంద్రం కొనకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్న ధీమాతో వరి వేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి -
Konaseema: కోనసీమలో సాగుకు శ్రీకారం
సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాల పలకరింపు పెద్దగా లేకున్నా గోదారి నీటి లభ్యతతో ఆయకట్టు రైతులు సాగుకు ఉరకలేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లలో జోరుగా ఆకుమడులు పడగా, ఇప్పుడు అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం సబ్ డివిజన్ల పరిధిలో నారుమళ్లు వేస్తూ ముందస్తు సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో 1.79 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని అంచనా కాగా.. ఇప్పటివరకు పది వేల ఎకరాలకు సరిపడా నారుమళ్లు పడ్డాయి. వర్షాలు పడితే నెలాఖరు నాటికి ఇంకా ఎక్కువగా పడే అవకాశముందని జిల్లా వ్యవసాయ అధికారి వై. ఆనందకుమారి ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: కాలం దాచుకున్న కథ ఇది! వర్షాలు పడి భూమి చల్లబడితే రైతులు సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వేస్తే మొలక దెబ్బతింటుందని రైతులు ఆలోచిస్తున్నారు. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ మద్దతున్న కోనసీమ రైతు పరిరక్షణ సమితి నాయకులు చేస్తున్న సాగుసమ్మె ప్రకటనల నేపథ్యంలో సైతం అంబాజీపేట, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో అన్నదాతలు నారుమళ్లు పోస్తుండడం విశేషం. ముంపు కారణంగా ఈ ప్రాంతంలోనే రైతులు సాగుకు దూరమని టీడీపీ అనుకూల రైతు నాయకులు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అటువంటి చోట రైతులు నారుమళ్లకు సిద్ధంకావడం విశేషం. అంబాజీపేట మండలం గంగలకుర్రు, పుల్లేటికుర్రులలో గడిచిన రెండ్రోజుల్లో రైతులు పెద్దఎత్తున నారుమళ్లు పోశారు. అలాగే, అల్లవరం మండలం కోడూరుపాడు, బోడసకుర్రు, అల్లవరం, ఎంట్రికోన, మొగళ్లమూరు, తుమ్మలపల్లి గ్రామాల్లో రైతులు దమ్ము చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం మునిపల్లిలో నారుమడిలో విత్తనాలు చల్లుతున్న రైతు కోనసీమలో పంట విరామంలేదు: కలెక్టర్ ఖరీఫ్ రైతులకు సాగునీటి సరఫరా, ఎరువులు, విత్తనాలు అందించడంలో అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదని, రైతుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. వ్యవసాయ, సాగునీటిపారుదల శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముందస్తు సాగుకు దన్నుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధంచేశామన్నారు. ఈ ఏడాది డ్రైనేజీ, హెడ్‌వర్క్స్ పరిధిలో 82 పనులకు రూ.8.82 కోట్ల నిధులు వచ్చాయని, గుర్రపుడెక్క, కాలువల్లో పూడికతీత పనులకు ఈ నిధులు వినియోగిస్తామన్నారు. అల్లవరం మండలం బోడసకుర్రులో దమ్ము చేస్తున్న రైతులు ఈ పనులను తక్షణం పూర్తిచేయాలని, పనుల ప్రగతిని ప్రతీరోజూ తనకు నివేదించాలని ఆదేశించారు. ఇక కోనసీమలో పంట విరామం అనేదిలేదని, సాగు పూర్తయ్యే వరకూ అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ.. ఇళ్ల నుంచి, పంచాయతీల్లో డ్రెయిన్ల నుంచి వచ్చిన మురుగునీరు కాలువల్లో కలుస్తోందని వివరించారు. పంట కాలువల్లో మురుగునీరు కలవడంవల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ ధ్యానచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి వై. ఆనందకుమారి, జిల్లా ఇరిగేషన్ అధికారి రవిబాబు, మధ్య డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు గుబ్బల రమేష్ పాల్గొన్నారు. -
నిరంతరం.. కొత్త రకం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, ప్రకృతిపై దాడి చేస్తున్న చీడ పీడలను ఎదుర్కొనే విధంగా తక్కువ పెట్టుబడులతో అత్యధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలు సృష్టించడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు సఫలీకృతం అవుతున్నారు. తరతరాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ సేద్యం నుంచి సాంకేతిక సేద్యం వైపు రైతులను చైతన్య వంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): వరి సాగుకు ప్రసిద్ధిగాంచిన సింహపురి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం సహకారంతో సరికొత్త సీడ్స్‌తో హైస్పీడ్ దిగుబడులు సాధిస్తోంది. పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రదేశాలతో పాటు కార్తెలు, నక్షత్రాల పేరుతో అత్యంత జన్యుపరమైన సన్న రకాల వరి విత్తనాలు సృష్టించి రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి శాస్త్రవేత్తలు జిల్లా వాతావరణాన్నే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా మంచి దిగుబడులు సాధించే విధంగా కొత్త రకం విత్తనాలను సృష్టించం ప్రత్యేకత. 28 రకాల వంగడాలు సృష్టి జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28 రకాల కొత్త వరి వంగడాలను మార్కెట్లోకి తీసుకు వచ్చారు. ప్రధానంగా 1948 నుంచి కొత్త వంగడాల సృష్టిని శాస్త్రవేత్తలు ప్రారంభించారు. బీసీపీ 1, బీసీపీ 2 అనే రెండు రకాల కొత్త వంగడాలను 1948లో సృష్టించారు. బీసీపీ 3, బీసీపీ 4 రకాలను 1950లో, 1951లో బీసీపీ 5, 1965లో బీసీపీ 6, 1965లో బల్క్‌హెచ్ 9ను తయారు చేశారు. ఆ తర్వాత కొత్త మొలగొలకులు 72 అనే రకాన్ని 1977లో మార్కెట్లోకి తీసుకు వచ్చారు. 74 పేరుతో మరో కొత్త మొలగొలుకులు రకాన్ని 1977లో తీసుకు వచ్చారు. 1987లో పినాకిని ఎన్‌ఎల్‌ఆర్ 9672–96, 1988లో తిక్కన ఎన్‌ఎల్‌ఆర్ 27999, 1991లో సింహపురి ఎన్‌ఎల్‌ఆర్ 28600, శ్రీరంగ ఎన్‌ఎల్‌ఆర్ 28523, స్వర్ణముఖి ఎన్‌ఎల్‌ఆర్ 145 రకాలను, 1996లో భరణి ఎన్‌ఎల్‌ఆర్ 30491, శ్రావణి ఎన్‌ఎల్‌ఆర్ 33359, స్వాతి ఎన్‌ఎల్‌ఆర్ 33057, పెన్నా ఎన్‌ఎల్‌ఆర్ 33365 రకాలను, 1999లో సోమశిల ఎన్‌ఎల్‌ఆర్ 33358, వేదగిరి ఎన్‌ఎల్‌ఆర్ 33641, అపూర్వ ఎన్‌ఎల్‌ఆర్ 33654 రకాలను, 2002లో పర్తివ ఎన్‌ఎల్‌ఆర్ 33892, 2006లో నెల్లూరు మసూరి ఎన్‌ఎల్‌ఆర్ 34449 2009లో, స్వేత ఎన్‌ఎల్‌ఆర్ 40024 2012లో, నెల్లూరు ధాన్యరాశి ఎన్‌ఎల్‌ఆర్ 3354, నెల్లూరు సిరి ఎన్‌ఎల్‌ఆర్ 4001, నెల్లూరు సుగంధ ఎన్‌ఎల్‌ఆర్ 40054లను 2020లో సృష్టించారు. ఈ విధంగా 28 రకాల వరి కొత్త వంగడాలను జిల్లా శాస్త్రవేత్తలు జిల్లా వాసులకు అందించారు. రైతులను చైతన్య పరుస్తూ.. జిల్లాలోని రైతులను ఎప్పకప్పుడు శాస్త్రవేత్తలు చైతన్య పరుస్తూ కొత్త వంగడాలపై అవగాహన కల్పిస్తూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తూ వస్తున్నారు. గ్రామాల్లో పర్యటించడం కాకుండా, పరిశోధనా స్థానంలో రైతులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ఆ దిశగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొత్త వంగడాలు ఖరీఫ్‌లో, రబీలో ఏ విధంగా వేసుకుంటే పంట సాగు బాగుంటుంది, ఎంత మోతాదులో రసాయనాలు వాడాలి అనే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని విధాలుగా చేస్తున్నాం జిల్లాలోని రైతులకు అనుగుణంగా, వారికి అవసరమయ్యే విధంగా వంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నాం. ఒక వంగడం పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు అని విధాలుగా శాస్త్రవేత్తలు పరిశీలన చేసి మార్కెట్లోకి తీసుకువస్తారు. – వినీత, ప్రధాన శాస్త్రవేత్త అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పకప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు. కొత్త వంగడాలను సృష్టించినప్పుడు రైతులు వెనకడుగు వేస్తారు. కానీ వాటిపై పూర్తి అవగాహన కల్పిస్తే మాత్రం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. – జి.చంద్రశేఖర్‌రెడ్డి, చాగణం రైతు,సైదాపురం మండలం సలహాలతో ఎంతో మేలు శాస్త్రవేత్తలు, సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు ఉంటుంది. మాకు తెలిసిన పరిజ్ఞానం కన్నా, శాస్త్రవేత్తల సాంకేతి పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబటి, వారి ప్రకారం నడుచుకుంటే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. – ఎస్ సుధాకర్‌రెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట రైతు, మర్రిపాడు మండలం -
ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు
ప్రత్తిపాడు (తూర్పు గోదావరి): కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు. కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆలోచనతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా అధిగమించవచ్చని నిరూపించాడు ఓ రైతు. కోటనందూరు మండలం ఇండుగపల్లికి చెందిన కంఠంరెడ్డి సోమశేఖర్ ఎంఈడీ, ఎంఏలో తెలుగు, చరిత్ర, సైకాలజీ, ప్రభుత్వ పాలన శాస్త్రాల్లో పట్టభద్రుడు. ఈ అర్హతలతో ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కరోనా కల్లోలంలో ప్రైవేట్ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. చేసేదిలేక అత్తయ్య గ్రామమైన ధర్మవరంలో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పొలంబాట పట్టాడు. విద్యావంతుడు కావడంతో అధునిక పద్ధతుల్లో వరి పంటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ప్రస్తుతం వరి సాగులో ఆశించిన ఫలితాలు దక్కని పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎకరాకు 35 బస్తాలు దిగుబడిని సాధించాడు. సోమశేఖర్ ప్రయోగాలను గుర్తించిన స్థానిక రైతులు ఆయన మార్గంలో ప్రకృతి సాగుకు మక్కువ చూపుతున్నారు. -
కేంద్రం రైతుల వ్యతిరేకి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కొనబోమని తేల్చిచెప్పినందున రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం కొంటానంటే తానే దగ్గరుండి మరీ రైతులు వరి రైతులకు సాయం చేస్తానని చెప్పారు. కానీ, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన బాధ్యతలను కేంద్రం విస్మ రిస్తోం దని, రైతుల వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడు తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. రైతులు నష్టపోవద్దు ‘‘ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వింతగా వ్యవహరిస్తోంది. కాలికేస్తే మెడకు.. మెడకేస్తే కాలికి అన్నట్టు గందరగోళం సృష్టిస్తోంది. యాసంగిలో వచ్చే బా యిల్డ్ రైస్‌ను కొనబోమని చెప్తోంది. పంట మార్పిడి చేసుకోవాలని కేంద్రం గతంలోనే చెప్పింది. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లిఖితపూర్వకంగా చెప్తే తప్ప ధాన్యం సేకరించనంటోంది. ఈ విష యాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. మంత్రి నిరంజన్‌రెడ్డి ఇదే విషయాన్ని రైతుల దృష్టికి తెచ్చే ఉద్దేశంతో మాట్లాడారు. రైతులు దీన్ని విస్మరించి భారీగా వరి వేస్తే ఇ బ్బందే. ధాన్యాన్ని సేకరించి, నిల్వ చేసుకునే స్థాయి లో గోదాములు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండ వు. విదేశాలకు ఎగుమతి చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. దీనివల్ల ఇబ్బందులు ఎదురై రైతులు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ను వ్వులు, పెసర్లు వంటివాటితో వరి కంటే ఎక్కువ లాభం వస్తుంది. వాటిని రెండో పంటగా వేసుకోవ చ్చు. రైతులు నష్టపోవద్దనే ఈ సూచన చేస్తున్నాం. కేంద్రం తీరు దారుణం గతంలో ధాన్యం కొనుగోలుకు ఎఫ్‌సీఐ ముందుకొచ్చినా.. కేంద్రం మోకాలు అడ్డం పెట్టింది. ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరు దారుణంగా ఉంది. గతంలో నేను ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని, సంబంధిత అధికారులను కలిసి.. ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరినా స్పం దించలేదు. మూడు నెలలు గడుస్తున్నా కేంద్ర మం త్రి నుంచి సరైన వివరణ రాలేదు. 3 రోజుల క్రితం అధికారులు ఢిల్లీకి వెళ్లినా అదే తీరు. నేను ఇటీవల కేంద్రమంత్రికి ఫోన్ చేస్తే.. ఆయన విదేశాల్లో ఉన్నందున చెప్పలేకపోతున్నానని, త్వరలో స్పష్టత ఇస్తానన్నారు. కానీ, మాట నిలబెట్టుకోలేదు. భవి ష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లిఖితపూర్వ కంగా రాసిఇవ్వాలని గతంలో అడిగారు. కానీ ఈసారి ఎంత ధాన్యం కొనేది ఇప్పటికీ చెప్పకపోవటం దారుణం. ఖరీఫ్ రా రైస్ కూడా పూర్తిగా తీసుకోలేదు. కేంద్రం మనం అడిగిన దానికి స్పష్టత ఇవ్వకపోగా, రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల వరిసాగు అంశాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడుతోంది. శాటిలైట్ ఇమేజ్‌లలో అంత సాగు ఉన్నట్టు కనిపిం చటం లేదని అంటోంది. అంటే మేం అబద్ధం చెప్తున్నామా? రాష్ట్రంలో ఎంతమేర వరి సాగవుతుందో లెక్కలు ఉన్నాయి. ముందు నుంచీ కూడా కేంద్రం రైతు వ్యతిరేకిగానే వ్యవహరిస్తోంది. రైతుల సంక్షేమమే లక్ష్యం ఏడేళ్ల నుంచి నిద్రలేకుండా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. రాష్ట్రం ఏర్పాటైన సమయంలో రైతుల ఆత్మహత్యలతో కకావికలమైన పరిస్థితి ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక స్థిరమైన లక్ష్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ వచ్చింది. భూగర్భ జలాలను పెంచేందుకు చెరువులను తీర్చిదిద్దాం. 24 గం టల విద్యుత్‌ను అందిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనట్టు రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నాం. చిన్నసన్నకారు రైతులు చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమా ప్రారంభించాం. కల్తీ విత్తనాల బాధ, ఎరువుల కొరత లేకుండా చేశాం. ఫలితంగా అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. కరోనా కాలంలో మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం మనదే. ఇప్పటికైనా కేంద్రం మొత్తం ధాన్యాన్ని కొంటానంటే దగ్గరుండి వరి సాగు చేయించేందుకు సిద్ధం. కానీ, అది యాసంగి ధాన్యం కొనబోమంటోంది. రైతులు ప్రత్యా మ్నాయ పంటలు వేసుకోవాల్సిందే’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం కొనలేమంటూ కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐల నుంచి అందిన లిఖితపూర్వక వివరాలను మీడియాకు అందజేశారు. అయితే డిసెంబర్ వరకు నాట్లు వేసుకునే వెసులుబాటు ఉన్నందున.. ఆలోగా కేంద్రం ఏమైనా స్పందిస్తుందేమో చూస్తామని, రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. -
వరి సాగుపై ఆంక్షలు వద్దు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సర్కారు తీసుకునే నిర్ణయాల వల్ల రైతులు రోడ్డుపై పడే ప్రమాదముందని, వరి సాగుపై ఆంక్షలు విధించొద్దని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని 70 శాతం మంది రైతులు సాగు చేసే వరి పంట విషయంలో రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. కిసాన్‌సెల్ జాతీయ వైస్‌చైర్మన్ ఎం. కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణను రైస్‌బౌల్ చేస్తానన్న సీఎం, ఇప్పుడు వరి సాగుపై ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు. వరి రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. కిసాన్‌సెల్ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను భయపెడుతోందని విమర్శించారు. వరి పంట వేయొద్దని జిల్లా కలెక్టర్ ఆదేశించడమేంటని ఆయన ప్రశ్నించారు. -
తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ఉండనున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ఈ స్థాయిలో సేకరణకు వీలుగా 6,500కుగా పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోతలు మొదలైన దృష్ట్యా..అవసరాలు, ప్రాధాన్యాలకు తగ్గట్లుగా కేంద్రాలను తెరవనుంది. వారం, పది రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం సేకరణ మొదలుకానుంది. గణనీయంగా పెరిగిన సాగు ప్రస్తుత వానాకాలంలో వరి సాధారణ విస్తీర్ణానికి మించి సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా, నీటి లభ్యత గణనీయంగా పెరగడంతో ఈసారి ఏకంగా 24.99 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. సాగైన విస్తీర్ణానికి తగ్గట్లుగా కనీసం 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో గృహావసరాలకు 14.23 లక్షల మెట్రిక్ టన్ను లు, విత్తన అవసరాలకు 4.86 లక్షల మెట్రిక్ టన్నులు పక్కనపెట్టినా, 1.13 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుందని అంచ నా ఉంది. ఇందులో మిల్లర్లు 12.49 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేసినా, మిగ తా ధాన్యం అంటే 1.01 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ లెక్కలేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మరో 10 రోజుల తర్వాత నుంచి ఉధృతం కానున్నాయి. వాస్తవానికి గత సోమ వారం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా ఇప్పటివరకు పదుల సంఖ్యలో కూడా కేంద్రాలు తెరవలేదు. గన్నీ బ్యాగులతో పాటు టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, తేమ కొలిచే మిష న్లు మొదలైన వాటిని సమకూర్చుకునే పనిలో పడ్డాయి. కేంద్రాలు ప్రారంభమైతే ఏ ఒక్క సమస్య ఎదురైనా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఉండటంతో అన్నింటినీ ముం దే సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగాలు భావిస్తున్నాయి. అవసరమైనవెన్ని.. అందుబాటులో ఉన్నవెన్ని అనే లెక్కలను పౌరసరఫరాల శాఖకు పంపిన జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను గుర్తించే పనిలో పడ్డారు. యాసంగిలో రికార్డు స్థాయి కొనుగోళ్లు గత ఏడాది యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గత ఏడాది వానాకాలంలో కేవలం 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా, ఈ ఏడాది అంతకు రెండింతలకు పైగా ధాన్యం సేకరణ జరగనుంది. జిల్లాల వారీగా చూస్తే అధికంగా నిజామాబాద్ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని లెక్కలు వేయగా, సిద్దిపేట జిల్లాలో 6.86 లక్షలు, జగిత్యాల జిల్లాలో 6.57 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 5.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ తేల్చింది. -
యాసంగిలో వరి సాగొద్దు: మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయరాదని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్ణయించిందని ఆహార, పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. తమ వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు అధికం గా ఉండడంతో పాటు వీటి వినియోగం తక్కు వగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపిందన్నారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి శాఖాపరంగా తాము పలు ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2021–22 యాసంగిలో వరి సాగు చేపట్టవద్దని రైతులకు సలహా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ యాసంగిలో శనగలు, వేరుశనగ, నువ్వులు, పెసలు, మినుములు, ఆముద, కూరగాయలు ఇతర పంటలు పండించవచ్చని సూచించారు. -
Telangana: వరి వద్దంటే ఎలా..?
ధాన్యం కొనకుంటే ఏం పండించాలె? యాసంగి నుంచి వరి సాగు చేయొద్దనడం అన్యాయం. ప్రభుత్వం వరి కొనుగోలు చేయకుంటే రైతులు ఏం సాగు చేసి బతకాలో చెప్పాలి. ఇక్కడ వరి సాగు చేయకుంటే తినడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. వరి సాగుతోటే చాలా మంది జీవితం ముడిపడి ఉంది. – జెరిపోతుల రంగన్నగౌడ్, రైతు, చింతపల్లి, కురవి మండలం సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒక్కసారిగా వరి సాగు చేయవద్దంటే ఎలా, రైతుల పరిస్థితి ఏమవుతుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నీటి లభ్యత పెరగటంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వానాకాలంలో సుమారు కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగుచేసే స్థాయికి చేరింది. ఇదే సమయంలో వరి సాగు కూడా భారీగా పెరిగింది. ఏటా రెండు పంటలు కలిపి కోటి ఎకరాలకుపైగా సాగవుతోంది. దిగుబడులు కూడా మెరుగయ్యాయి. ఇలా ఇబ్బడిముబ్బడిగా సాగు పెరగడంతో మార్కెటింగ్ సమస్యలు ఎదురవుతున్నాయి. దొడ్డురకాలు ఎక్కువ సాగు చేయటంతో అంతర్రాష్ట్ర, విదేశీ ట్రేడర్ల నుంచి.. యాసంగిలో బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఉత్పత్తి చేయటం ద్వారా ఎఫ్‌సీఐ నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికే ఉప్పుడు బియ్యం ఉత్పత్తిని తగ్గించి, పచ్చి బియ్యం (అదికూడా సన్న బియ్యం) ఉత్పత్తిని పెంచడం, యాసంగిలో వరిసాగుకు విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడమనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. భారీగా వరిసాగు కొన్నేళ్లుగా రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా వానాకాలంలో భారీగా సాగు జరుగుతోంది. గత ఏడాది వానాకాలంలో 53.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలోనూ ఏకంగా 52.79 లక్షల ఎకరాల్లో వరి వేశారు. రెండు సీజన్లలో కలిపి కోటి ఎకరాలకుపైగా వరి సాగు చేయగా.. ఒక్క ఏడాదిలోనే రెండున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. వానాకాలం సీజన్లో ఉత్పత్తి అవుతున్న సుమారు కోటీ 25 లక్షల టన్నుల ధాన్యంతోనే.. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల అవసరాలు తీరుతాయి. యాసంగిలో ఉత్పత్తయ్యే మరో కోటీ 25 లక్షల టన్నుల ధాన్యం అదనంగా ఉంటోంది. దీంతో యాసంగిలో ఆ ధాన్యాన్ని ఎవరు కొనాలనే సమస్య ఎదురవుతోంది. రైతులు వినే పరిస్థితి ఉండదు! ప్రభుత్వం చెప్పగానే రైతులు వరి వేయడాన్ని మానుకోరని, తమకు అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటారని ఒక అధికారి పేర్కొన్నారు. గతంలో పత్తి సాగు చేయవద్దని ప్రభుత్వం పిలుపునివ్వడంతో కాస్త సాగు తగ్గిందని.. కానీ ఆ ఏడాది పత్తికి మంచి రేటు రావడంతో తర్వాతి ఏడాది మళ్లీ పత్తిసాగు భారీగా పెరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు వరి సాగు విషయంలోనూ రైతులెవరూ వినే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఇలాగైతే రైతులు అప్పుల పాలే.. నాకు మూడున్నర ఎకరాల పొలం ఉంది. గతంలో నీళ్లు లేక, కరెంట్ రాక సగం పొలమే వేసేవాళ్లం. ఇప్పుడు కరెంటు, నీళ్ల బాధలేదు. ప్రభుత్వం కొంటేనే ఖర్చులు పోగా కొద్దో గొప్పో మిగులుతున్నాయి. ప్రభుత్వం కొనకుంటే.. వ్యాపారులు తక్కువ ధర ఇచ్చి రైతులను మోసం చేస్తారు. -అలువాల నవీన్, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా -
రబీలో రికార్డు స్థాయిలో పంటల సాగు
సాక్షి, అమరావతి: రబీలో పంటలు రికార్డు స్థాయిలో సాగయ్యాయి. సాధారణంగా రబీలో అపరాల సాగు ఎక్కువగా, వరి తక్కువగా సాగవుతుంది. కానీ ఈ రబీలో అపరాలతో పోటీగా వరి కూడా సాగవ్వడం విశేషం. రబీలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 17.60 లక్షల ఎకరాలు కాగా, 2018–19లో 15.41 లక్షలు, 2019–20లో 19.38 లక్షల ఎకరాల్లో సాగవ్వగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 20.03 లక్షల ఎకరాలు దాటింది. మరో 2 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. అపరాలు సాధారణ సాగు విస్తీర్ణం 24.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 22.69 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వేసవి పంట కింద ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 1.5 లక్షల ఎకరాల్లో అపరాల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే గత ఐదు సంవత్సరాల్లో కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో రబీ సాగు 60 లక్షల ఎకరాల మార్క్‌ను అందుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో వారం పది రోజుల్లో రబీ సీజన్ ముగియనుంది. సాగు లక్ష్యం 58.92 లక్షల ఎకరాలు ► రబీ సాధారణ విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా, 2018–19లో 53.04 లక్షల ఎకరాల్లో సాగయింది. 2019–20లో 54.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అలాంటిది ఈ ఏడాది ఇప్పటికే 55.63 లక్షల ఎకరాల మార్కును అందుకుంది. ► నెల్లూరు, చిత్తూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 3.50 లక్షల ఎకరాల్లో పంటలు పడే అవకాశాలున్నాయి. దీంతో గతంలో ఎప్పుడూ అందుకోలేని లక్ష్యాన్ని ఈసారి అందుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది 58.92 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ► వరి తర్వాత అత్యధికంగా 11.03 లక్షల ఎకరాల్లో శనగ సాగవ్వగా, 8.75 లక్షల ఎకరాల్లో మినుములు, 2.23 లక్షల ఎకరాల్లో పెసలు, ఇతర అపరాలు 1.11 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ► 3.91 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.54 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.52 లక్షల ఎకరాల్లో జొన్నలు, 1.45 లక్షల ఎకరాల్లో పొగాకు, 92 వేల ఎకరాల్లో మిరప, ఇతర పంటలు 1.14 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. కాగా.. గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 50 వేల ఎకరాల చొప్పున నువ్వులు, మొక్క జొన్న, 30 వేల ఎకరాల వరకు అపరాలు సాగయ్యే అవకాశాలున్నాయి. పచ్చని తివాచీలా రాయలసీమ ► నీళ్లు లేక నెర్రలు చాచే ఆ నేలల్లో పచ్చదనం పురివిప్పుకుంటోంది. ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్టు రాయలసీమ పచ్చని సీమగా కన్పిస్తోంది. ఆక్వా ప్రభావంతో ఓ వైపు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో రబీ సాగు తగ్గుతుండగా, రాయలసీమ జిల్లాల్లో గత రెండేళ్లుగా రబీ సాగు అనూహ్యంగా పెరుగుతోంది. ► వ్యవసాయం పండుగలా మార్చేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలకు తోడు వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సమృద్ధిగా సాగు నీరివ్వడంతో ఈ ప్రాంతంలో లక్ష్యానికి మించి రబీ సాగవుతోంది. ► వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రబీ సాధారణ విస్తీర్ణం 16.99 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 17.75 లక్షల ఎకరాలు దాటింది. అత్యధికంగా అనంతపురంలో 4 లక్షల ఎకరాలు, చిత్తూరులో 2.10 లక్షలు, కర్నూలులో 7.65 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో 4 లక్షల ఎకరాలు దాటింది. ► వరి విషయానికి వస్తే ఈ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 2,42,991 ఎకరాలు కాగా, ఈ ఏడాది 2,64,531 ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా చిత్తూరులో 1,29,477 ఎకరాలు, కర్నూలులో 80,339 ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలో 35,795 ఎకరాలు, అనంతపురంలో 18,920 ఎకరాల్లో సాగైంది. ఈ జిల్లాల్లో అపరాలు సాధారణ విస్తీర్ణం 9,57,314 ఎకరాలు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 10,09,462 ఎకరాల్లో సాగయ్యాయి. చరిత్రలో ఈ స్థాయిలో రాయలసీమ జిల్లాల్లో రబీ సాగవ్వలేదని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో రబీ సాగు రబీ సాగు దాదాపు చివరి దశకు వచ్చింది. గతేడాది 54.14 లక్షల ఎకరాలు సాగవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే 55.63 లక్షల ఎకరాలు దాటింది. వేసవి పంట కింద నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాల వరకు వరి, గోదావరి జిల్లాల్లో మరో 1.50 లక్షల ఎకరాల వరకు అపరాలు సాగయ్యే అవకాశాలున్నాయి. ఇదే ఊపు కొనసాగితే 60 లక్షల ఎకరాలు దాటొచ్చు. – హెచ్ అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ రెట్టించిన ఉత్సాహం.. ఖరీఫ్ చివరిలో ‘నివార్’ దెబ్బ తీయడంతో కాస్త ఇబ్బంది పడిన రైతన్నలు రబీ సాగును కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. ఖరీఫ్‌లో మాదిరిగానే రబీ సాగు ఆరంభంలోనూ వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత సొమ్ము అందింది. దీనికి తోడు పూర్తి స్థాయిలో అక్కరకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, కావాల్సిన స్థాయిలో ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. పైగా రికార్డు స్థాయిలో రుణాలందడంతో సాగు వేళ అన్నదాతలకు ఏ దశలోనూ ఇబ్బంది లేకుండా పోయింది. వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సమృద్ధిగా సాగు నీరివ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో రైతన్నలు రికార్డు స్థాయిలో రబీ పంటలు సాగు చేస్తున్నారు. -
మన విత్తనం దేశంలోనే ఉత్తమం
సాక్షి, అమరావతి : పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార భద్రతను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ప్రధాన ఆహార పంట వరి. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో తక్కువ విస్తీర్ణం, నీరు, పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించుకోవాలి. ఇందుకు అనువైన వాతావరణంతో పాటు మేలైన విత్తనం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించినందునే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల రూపకల్పనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. మంచి విత్తనాలు అభివృద్ధి చేయాల్సిందిగా యూనివర్సిటీ పరిధిలోని శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయించారు. రెండు నెలలకొకసారి జరిగే యూనివర్సిటీ అసోసియేట్ డీన్స్ సమావేశంలో ఇటీవల ఆయన ఈ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగు ► రాష్ట్రంలో సుమారు 59 లక్షల హెక్టార్ల మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. వ్యవసాయ రంగంలో వరి రెండంకెల వృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. అధిక ఆదాయాన్నిస్తోంది. ► 2018–19లో 123.52 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే హెక్టార్‌కు సగటు ఉత్పాదకత 5,593 కిలోలుగా ఉంది. సార్వాలో హెక్టార్‌కు 5,593 కిలోల ఉత్పాదకత ఉంటే దాళ్వాలో 6,973 కిలోలుగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో విత్తనాన్ని మార్చి సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి ► రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు చేస్తున్న వరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థలు గానీ, ప్రైవేటు విత్తన సంస్థలు గానీ సరఫరా చేయడం సాధ్యం కాదు. అందువల్ల రైతులే తమ పొలంలో విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. ► గుర్తించిన ఆర్బీకేల పరిధిలో రైతులకు మూల విత్తనాన్ని ఇచ్చి సొంతంగా విత్తనం తయారు చేసుకునే అవకాశం కల్పించింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకుంటే తమ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకూ విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వైస్ చాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. లక్ష్య సాధనకు అనుగుణంగా చర్యలు ► వరి సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక నుంచి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందన్న లక్ష్య సాధనకు అనుగుణంగా పని చేస్తామని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు. ► కొత్తవి కనుగొనేలోగా ఇప్పటికే యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాలు రూపొందించిన వంగడాలకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ► రాష్ట్రంలో సుమారు 43 రకాల వంగడాలు సార్వా, దాళ్వాలో సాగవుతున్నాయి. బాపట్ల, మార్టేరులో కనిపెట్టిన వరి వంగడాలైతే జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచాయి. -
ధాన్యాగారంలో జలసిరులు
సాక్షి, అమరావతి: సమృద్ధిగా ఉన్న సాగునీటితో వరి సాగులో ఉభయ గోదావరి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచి ధాన్యాగారంగా భాసిల్లుతుండగా అనంతపురం జిల్లాలో ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగును రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో వినియోగించుకుంటూనే అలాంటి అవకాశం లేని చోట్ల ఇతర పంటలను సాగు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. పండ్ల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కోసం అనంతపురం నుంచి దేశ రాజధానికి ప్రత్యేకంగా కిసాన్ రైలు ఇప్పటికే ప్రారంభమైంది. రైతన్నకు ఆదాయంతోపాటు అందరికీ ఆరోగ్యాన్ని పంచేలా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచేలా మిల్లెట్ బోర్డును ఏర్పాటు చేసింది. భారీగా పెరగనున్న సాగు విస్తీర్ణం.. కడలి వైపు కదిలిపోతున్న కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా జలాలను ఒడిసి పట్టడం ద్వారా ఈ ఖరీఫ్‌లో 1.11 కోట్ల ఎకరాలకు సాగు నీరందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఏపీఎస్ఐడీసీ(ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) ఎత్తిపోతల పథకాల కింద ఇప్పటికే 52 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేశారు. నాగార్జునసాగర్‌కుడి, ఎడమ కాలువలు, రాయలసీమలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా, సోమశిల, కండలేరు ఆయకట్టులో పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరునాటికి సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని, నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీళ్లందిస్తామని జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి. రికార్డు స్థాయిలో సాగునీరు.. దిగుబడులు ► గతేడాది ఖరీఫ్‌లో 1,00,44,463 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్‌లో కోటి ఎకరాలకు నీళ్లందించడం అదే ప్రథమం. ప్రస్తుత ఖరీఫ్‌లో 1,11,41,471 ఎకరాలకు నీళ్లందించడం ద్వారా గత రికార్డును తిరగరాసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ► గతేడాది 171.37 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయడం సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రభుత్వం దేశానికి ధాన్యాగారంగా రాష్ట్రాన్ని మరోసారి నిలబెట్టింది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా దిగుబడులు సాధించేలా అన్నదాతలను ప్రోత్సహించడం ద్వారా ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా రాష్ట్రానికి ఉన్న పేరును ఇనుమడింపజేయాలని నిర్ణయించింది. నిండుకుండలు... ► కృష్ణమ్మ పరవళ్లతో పరీవాహక ప్రాంతం (బేసిన్)లో ప్రాజెక్టులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో 561 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్‌లో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పెన్నా బేసిన్లో గండికోట, మైలవరం, వెలిగోడు, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో 115 టీఎంసీల మేర నిల్వ ఉన్నాయి. ► వంశధారలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూన్ 9న ఎత్తిన గొట్టా బ్యారేజీ గేట్లు ఇప్పటివరకూ దించలేదు. నాగావళి బేసిన్లో తోటపల్లి బ్యారేజీ, నారాయణపురం ఆనకట్ట గేట్లను కూడా దించలేదు. ► ఏలేరు బేసిన్ ఏలేరు ప్రాజెక్టులో 22.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఉభయ గోదావరుల్లో ధాన్యసిరి.. ► పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పటిదాకా 6,86,614 ఎకరాల ఆయకట్టులో వరి సాగుతో ప్రథమ స్థానంలో ఉండగా తూర్పుగోదావరి 6,77,224 ఎకరాల్లో వరి సాగుతో రెండో స్థానంలో ఉంది. ► కృష్ణా జిల్లా 6,08,973 ఎకరాల్లో వరి సాగుతో మూడో స్థానంలో నిలిచింది. 5,73,531 ఎకరాల్లో వరి సాగుతో శ్రీకాకుళం జిల్లా నాలుగో స్థానంలో ఉంది. ► మొత్తమ్మీద ఇప్పటిదాకా సుమారు 52 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో అన్నదాతలు వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి తదితర పంటల సాగు చేపట్టారు. మా రికార్డును మేమే అధిగమిస్తాం.. “దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వర్షాలు మళ్లీ సమృద్ధిగా కురుస్తున్నాయి. నదులు ఉరకలెత్తడంతో ప్రాజెక్టులు నిండిపోయాయి. గతేడాది ఖరీఫ్‌లో కోటి ఎకరాలకు నీళ్లందించి రికార్డు నెలకొల్పాం. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించి ఆ రికార్డును తిరగరాస్తాం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’ – డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి. ఒక్క ఎకరాను ఎండనివ్వం.. “ఖరీఫ్‌లో 1.11 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాం. ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఆయకట్టు చివరి భూములకూ నీటిని సరఫరా చేస్తాం. నీటి యాజమాన్యంతో వృథాకు అడ్డుకట్ట వేసి మరింత ఆయకట్టుకు నీళ్లందేలా సహకరించాలని అన్నదాతలను కోరుతున్నాం’ – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ఇన్చీఫ్, జలవనరుల శాఖ. “అనంత’లో చిరుధాన్యాలకు ప్రోత్సాహం – అనంతపురం జిల్లాలో చిరుధాన్యాల సాగును 4 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65 వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయడంతోపాటు రుణ పరిమితి (స్కేల్ ఫైనాన్స్) పెంచుతూ చర్యలు చేపట్టింది. – జిల్లాలో 2.02 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సాగులో ఉండగా 54 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. పండ్ల ఉత్పత్తులను రైతులు ఢిల్లీకి తరలించి మంచి ధరలకు విక్రయించుకునేలా ఇప్పటికే అనంతపురం నుంచి దేశ రాజధానికి ప్రత్యేకగా కిసాన్ రైలును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 500 టన్నుల పండ్ల ఉత్పత్తులను ఈ రైలు ద్వారా తరలిస్తున్నారు. – ఎక్కువగా నీటి వనరులు, పెట్టుబడి వ్యయం అవసరమయ్యే వరి సాగుకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, కొర్రలు, అరికెలు, రాగులు, సామలు లాంటి పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. -
ఖరీఫ్ లక్ష్యం 62 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. గతేడాది ఖరీఫ్‌లో 1,706 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.55 లక్షల మంది రైతుల నుంచి రూ.8,705 కోట్ల విలువ చేసే 47.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 16.30 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుండగా.. దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున 62 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆహార శాఖ దృష్టికి రాష్ట్ర అధికారులు తీసుకెళ్లారు. 1.50 కోట్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సంబంధిత రకాల ధాన్యాన్ని విడిగా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తద్వారా బియ్యంలో కల్తీ లేకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. గన్నీ బ్యాగులతో సమస్య.. ► దాన్యం కొనుగోలు, బియ్యం సరఫరాకు గన్నీ బ్యాగ్‌ల సమస్య వెంటాడుతోంది. ► వెంటనే 4.30 కోట్ల (86 వేల బేళ్ల) గన్నీ బ్యాగ్‌ల కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ► గన్నీ బ్యాగ్‌లను పశ్చిమ బెంగాల్ నుంచి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆహార శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► ప్రస్తుతానికి ఇబ్బందులు రాకుండా పాత గన్నీ బ్యాగ్‌లను రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్ల నుంచి సేకరించాలని నిర్ణయం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలివీ.. ► ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల నివారణకు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు. ► కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి విక్రయించకుండా సరిహద్దుల వద్దే అడ్డుకుంటారు. ► ప్రతి రైతుకూ మద్దతు ధర కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు. ► ఈ–క్రాప్ డేటా ఆధారంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ధాన్యం కొనుగోళ్లు. ► కౌలు రైతులు, పట్టాదారుల పేర్లు ఈ–క్రాప్ ద్వారా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లచే నమోదు. ► మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా, తూకాల్లో మోసం చేస్తున్నట్టు అనుమానం వచ్చినా రైతులు 1902 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ► ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1,728 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి లేఖ. భారీగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశాం. గన్నీ బ్యాగ్‌ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని కోరాం. కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,728 కోట్ల పాత బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే లేఖ రాశాం. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
ఆశాజనకంగా వరి – చేపల మిశ్రమ సాగు!
వరి సాగు చేసే ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు, అభ్యుదయ రైతులతో వరి తోపాటు చేపలను కలిపి సాగు చేయిస్తే వారికి ఆదాయం పెరగడంతోపాటు భూతాపోన్నతి తగ్గి పర్యావరణానికీ మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వరి బియ్యంతోపాటు చేపలు కూడా అందుబాటులోకి రావడం వల్ల పేద రైతు కుటుంబాలకు పౌష్టికాహారం అందుతుంది. నీటిని నిల్వగట్టే వరి చేలల్లో చేపలు, పీతలు, రొయ్యలతోపాటు బాతులను సైతం పెంచుతూ సమీకృత వ్యవసాయం చేయింవచ్చు. నీటిని నిల్వ గట్టే పద్ధతిలో వరి సాగు చేయటం వల్ల భూగోళాన్ని వేడెక్కించే మిథేన్ వాయువు వెలువడుతోంది. వాతావరణంలోకి చేరుతున్న మిథేన్‌లో 10–20 శాతం వరి పొలాల వల్లనే. కార్బన్ డయాక్సయిడ్ కన్నా మిథేన్ 25 రెట్లు ఎక్కువగా భూతాపోన్నతికి కారణభూతమవుతోంది. వట్టిగా వరి సాగు చేసినప్పటి కన్నా.. వరి–చేపల సాగులో 34.6 శాతం మిథేన్ వాయువు వెలువడినట్లు ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గింది. ఆ మేరకు ఉత్పాదకాలపై ఖర్చూ తగ్గింది. భూసారం పెరుగుతుంది. వరి–చేపల మిశ్రమ సాగు వల్ల ధాన్యం దిగుబడి10–26% పెరిగింది. కూలీల అవసరం 19–22 శాతం మేరకు తగ్గింది. ఇతర ఉత్పాదకాలు 7% మేరకు తగ్గాయి. చేపల పెంపకం వల్ల ఆదాయమూ పెరిగింది. ఇండోనేషియాలో వరి–చేపల మిశ్రమ సాగు చేసిన రైతుల నికరాదాయం 27 శాతం పెరిగింది. వరి–చేపల మిశ్రమ సాగుకు వరి పొలాలన్నీ పనికిరావు. మన దేశంలో వరి సాగవుతున్న 4.35 కోట్ల హెక్టార్లలో లోతట్టు, మధ్యస్థ వర్షాధార సాగు భూములతో కూడిన 2 కోట్ల హెక్టార్లు (ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో) ఈ సాగుకు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ మిశ్రమ సాగు కొత్తదేమీ కాదు. అక్కడా ఇక్కడా పూర్వకాలం నుంచీ 2.3 లక్షల హెక్టార్లలో రైతులు అనుసరిస్తున్నదే. అధిక దిగుబడి వరి వంగడాలకు రసాయనిక పురుగుమందులు విధిగా వాడాల్సి ఉండటం వల్లనే రైతులు వరి–చేపల మిశ్రమ సాగును ఎక్కువగా చేపట్టలేకపోతున్నారు. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో దేశీ వరి రకాలను వాడే రైతులకు, కూలీలపై ఆధారపడకుండా చిన్న కమతాల్లో వ్యవసాయ పనులన్నిటినీ ఇంటిల్లపాదీ కలిసి చేసుకునే సంస్కృతి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు వరి–చేపల మిశ్రమ సాగు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, వరి–చేపల మిశ్రమ సాగు నిర్లక్ష్యానికి గురైంది. దీనిపై పరిశోధకులు దృష్టి పెట్టడం లేదు. వరి దిగుబడి కూడా పెంచుకోవడానికి వీలున్న ఈ దివ్యమైన సాగు పద్ధతిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఏయే నేలలకు ఏయే రకాల చేపలను వరితో కలిపి సాగు చేయింవచ్చో స్థానికంగా పరిశోధనలు చేయించాలి. ఈ పద్ధతిలోకి మారాలంటే రైతులు తమ పొలాలను అందుకు తగినట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇంజినీరింగ్ నిపుణుల సహాయంతోపాటు పెట్టుబడి కూడా అవసరమవుతుంది. ప్రభుత్వం ప్రత్యేక రుణ పథకాలను ప్రవేశపెట్టి వరి–చేపల సాగుకు చేదోడుగా ఉంటే చిన్న రైతులకు ఆదాయం పెరిగే వీలుందన్నది నిపుణుల మాట. -
'వరి'వడిగా..
సాక్షి, అమరావతి: ఈసారి రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో కోతలు ముమ్మరమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షలు లేకుంటే ఈపాటికే ధాన్యలక్ష్మి సిరులొలికించేది. కూలీల కొరత లేదు, యంత్రాలూ సిద్ధంగా ఉండటంతో కోతలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల రబీ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందటంతో తక్షణమే సమస్యను పరిష్కరించాలని పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఇలా... ► ఖరీఫ్‌లో 48.10 లక్షల టన్నుల ధాన్యాన్ని 4,57,823 మంది రైతుల నుంచి సేకరించారు. దీని విలువ రూ.8755 కోట్లు ఉంటుంది. 11 జిల్లాల్లో 1702 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రబీలో ఎలా జరుగుతోందంటే... ► ఇప్పటివరకు 1,295 ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, అనంతపురంలో తెరవాల్సి ఉంది. ► 1.63 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.299.28 కోట్లు ఉంటుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారమే ధాన్యం సేకరణ జరుగుతోంది. వరి సాగు ఇలా... ► ఖరీఫ్‌లో 15,18,984 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా 14,67,069 హెక్టార్లు సాగు అయింది. రబీలో సాగు విస్తీర్ణ లక్ష్యం 6,98,398 హెక్టార్లు కాగా అంతకుమించి రికార్డు స్థాయిలో 8,06,803 హెక్టార్లలో సాగయింది. రబీలో 60,14,189 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ► ఖరీఫ్‌లో హెక్టార్‌కు దిగుబడి 5,248 కిలోలు కాగా రబీలో హెక్టార్‌కు రికార్డు స్థాయిలో 7,095 కిలోలు ఉండవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో రబీలో హెక్టార్‌కు 5,928 కిలోలు దిగుబడి ఉంది. ► లాక్‌డౌన్‌తో రబీ కోతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ► అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరి కోత యంత్రాలను అవసరాలకు తగ్గట్టుగా పంపిస్తున్నారు. ► రాష్ట్రంలో 2,985 కంబైన్డ్ హార్వెస్టర్లు, 1,746 వరి రీపర్లు అందుబాటులో ఉన్నాయి. యంత్రాల అద్దె గంటకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ఉంది. ఇంతకు మించి ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే సమీపంలోని వ్యవసాయాధికారికి లేదా 1902కి రైతులు ఫిర్యాదు చేయవచ్చు. రైతులకు వ్యవసాయ కమిషనర్ సూచనలు ఇవీ... ► లాక్డౌన్ వల్ల కూలీలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం హార్వెస్టర్లను తరలిస్తున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ► ఇతర జిల్లాల నుంచి కూడా హార్వెస్టర్లను తెప్పించి పాస్‌లు ఇచ్చాం. యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ► ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ రూ.1815, ఏ గ్రేడ్ రకం రూ.1835కి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. ఈ ధర కన్నా ఎవరూ తక్కువకు అమ్ముకోవద్దు. ► వరి కోతలు, ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించండి. మాస్క్‌లు ధరించండి. 3 కిలోల అదనంపై సీఎంకు ఫిర్యాదు... ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు క్వింటాల్‌కు అదనంగా మూడు కిలోలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా తిరువూరు రైతులు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా 17 శాతం తేమను బట్టి ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉండగా 21 శాతం తేమ ఉందంటూ తరుగు తీసుకుంటున్నారని, గోనె సంచులు రైతులే తెచ్చుకోవాలంటూ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఒక్కో రైతు సుమారు రూ.55 వరకు నష్టపోతుండటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించింది ‘మా జిల్లాలో 80 శాతం వరికోతలు యంత్రాల ద్వారానే సాగుతున్నాయి. లాక్డౌన్ ప్రారంభంలో రూ.3,000 చొప్పున అద్దె వసూలుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంది’ – కె.చిరంజీవి, పెరవలి,పశ్చిమ గోదావరి జిల్లా