సాధారణంగా వరిలో కాలిబాట తీసే రైతులు తూర్పు, పడమర దిశల్లో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్ల ఖాళీ స్థలాన్ని వదులుతారు.
బాల్కొండ : సాధారణంగా వరిలో కాలిబాట తీసే రైతులు తూర్పు, పడమర దిశల్లో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్ల ఖాళీ స్థలాన్ని వదులుతారు. మోహన్‌రెడ్డి మాత్రం సాలుసాలుకో కాలిబాట తీస్తున్నారు. ఆయనకు రెండెకరాల భూమి ఉంది. ఇందులో మూడేళ్లుగా ఈ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు.
ఈ విధానం గురించి ఆయన మాటల్లోనే..
‘‘సూర్యుడు ఉదయించే దిశ నుంచి అస్తమించే దిశకు మడిలో దారం కడతాను. ఆ దారంపైనుంచి వరి నాట్లు వేస్తాను. సాలు సాలుకు ఇలాగే నాట్లు వేస్తాను. సాళ్లకు మధ్యలో ఖాళీ స్థలాన్ని వదులుతాను. ఇలా ఖాళీ స్థలాన్ని వదలడం వల్ల పంటపై సూర్యరశ్మి బాగా పడుతుంది. గాలి ఎక్కువగా సాలు దిశలోనే వీచడం వల్ల వరికర్రలకు బాగా గాలి తగులుతుంది. దీంతో పంటకు చీడపీడల బాధ తగ్గుతుంది. చీడపీడలు ఆశించినా.. సూర్యరశ్మి ప్రభావంతో తగ్గిపోతాయి. కాలి బాటల వల్ల చీడపీడల వ్యాప్తి ఉండదు.
గాలి బాగా తగలడం వల్ల పిలకలు బాగా వస్తున్నాయి. కంకులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతోంది. కాలి బాటలు లేకుండా సాగు చేసిన పొలంలో కంటే గతేడాది ఎకరానికి నాలుగు బస్తాల దిగుబడి ఎక్కువగా వచ్చింది’’ అని మోహన్‌రెడ్డి వివరించారు. ఈ పద్ధతిలో మూడేళ్లుగా వరి సాగు చేస్తున్నానని తెలిపారు.
ఇతర ప్రయోజనాలు
వరి పంటలో కాలి బాటలు వేయడం వల్ల ఎరువులు పొలం అంతా సమానంగా పడతాయి.
కలుపును సునాయాసంగా తీయవచ్చు.
నీరు పెట్టినప్పుడు అంతటికీ నీరందుతుందో లేదో పరిశీలించవచ్చు.
{పధానంగా దోమపోటుకు టాటా చెప్పవచ్చు. వరి పంట ఈనిక దశ తర్వాత దోమపోటు వచ్చే అవకాశాలుంటాయి. దీనివల్ల పంటలో తెల్ల కంకులు ఏర్పడతాయి. కాలి బాటల వల్ల దోమపోటు వేగంగా వ్యాపించదు.