balkonda
-
ఒక్కసారిగా చెలరేగిన కత్తిపోట్ల కలకలం!
నిజామాబాద్: బాల్కొండ మండల కేంద్రంలోని ఓ హోటల్లో టీ తాగుతున్న వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కత్తితో శనివారం దాడి చేయడంతో కలకలం రేగింది. ఎస్సై గోపి తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన రఫీక్ వన్నెల్(బి) చౌరస్తాలోని ఓ హోటల్ వద్ద టీ తాగుతుండగా, అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు సయ్యద్ సోఫియాన్, సయ్యద్ రియాన్లు పాత కక్షలను మనుసులో అతడిపై కత్తితో దాడి చేశారు. రఫీక్ తప్పించుకోవడానికి యత్నించగా చేతులకు, ఇతర చోట్ల గాయాలయ్యాయి. వీరిని అడ్డుకోవడానికి వెళ్లిన అతారొద్దీన్ సైతం గాయపడ్డాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఇవి చదవండి: పెళ్లి రోజే.. తీవ్ర విషాదం! -
బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇవ్వబోతున్నాం: సీఎం కేసీఆర్
-
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో నాలుగు రోజులు గట్టి వానలే.. -
బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసినా కృతజ్ఞత చూపించడంలేదని బాధను వెల్లబోసుకున్నారు. తనకు బాధగా అనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మెండోరా ప్రాంత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం నీళ్లు తెచ్చినా కనికరం చూపించరా? అని ప్రశ్నించారు. గతంలో కాకతీయ లీకేజీ నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళనలు చేశారు. రైతులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. నాపై చెప్పులు వేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే రైతులది బతుకుపోరాటం. శ్రీరామ్‌సాగర్ నీళ్లు మొట్టమొదటగా అందేది మెండోరాకే. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చినా కెనాల్ కమిటీ వారు కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకు మెండోరాకు రాలేదు. నాకు బాధగా ఉంది. మెండోరాకు ఎంత మంచి చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు.. -
ఆర్మూర్ బరిలో రేవంత్!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ఇచ్చినప్పటికీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకుని వ్యూహాత్మకంగా ఎత్తులు వేసేందుకు పావులు కదుపుతోంది. జిల్లాల వారీగా పార్టీ బలం, బలహీనతల లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలంగా ఉండడంతో పాటు ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, అదేవిధంగా మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు తదితరులు చేరనుండడంతో పార్టీ శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహం పెల్లుబికుతోంది. దక్షిణ తెలంగాణ విషయమై పార్టీ అధినాయకత్వం పూర్తి భరోసాతో ఉంది. ఖమ్మం సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పార్టీ పూరించింది. తదుపరి టాస్‌్కలో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బలహీనంగా ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్.. రేవంత్ ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారనే విషయమై జిల్లాలోని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో పసుపు రైతులు, ఇతర రైతుల గ్రూపుల్లో ఈ అంశం తిరుగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ నేపథ్యంలో రైతుల్లో పారీ్టపై అనుకూలత పెరిగింది. ధరణి రద్దు చేస్తామని ప్రకటనతో కాంగ్రెస్‌కు మరింత మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో రైతుల్లోకి మరింతగా చొచ్చుకెళ్లేందుకు వ్యవసాయపరంగా ముందంజలో ఉన్న ఆర్మూర్ నుంచి రేవంత్‌ను పోటీ చేయించనున్నట్లు పార్టీ వర్గాలు వెళ్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం కోసమే..! కర్ణాటక విజయం తరువాత తెలంగాణను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇక్కడి వ్యవహారాలను నేరుగా పర్యవేక్షిస్తోంది. దక్షిణ తెలంగాణలో అత్యంత ప్రభావం చూపించే నాయకులు ఉండడంతో ఉత్తర తెలంగాణలో సైతం ఆ స్థాయిలో ప్రభావం చూపించే విధంగా పావులు కదుపుతోంది. పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని ప్రజాదరణ ఉన్న రేవంత్‌రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు సూచించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సునీల్ కనుగోలు సర్వే బృందం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రేవంత్ ఆర్మూర్ నుంచి బరిలో ఉంటే ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంగనర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ని 25 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఆదరణ వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నిజామాబాద్ డీసీసీ నాయకత్వం రేవంత్‌ను బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా వ్యవహారం ముందుకు పడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టిన ఏఐసీసీ నేతలు ఆర్మూర్ నుంచి రేవంత్‌ను బరిలో దించేందుకు ఆలోచిస్తుండడం విశేషం. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇక్కడ రేవంత్ విజయం నల్లేరు మీద నడకేనని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
దారికొచ్చిన ‘ధరణి’..! వెబ్సైట్లో కొత్త ఆప్షన్లు
మోర్తాడ్ బాల్కొండ/నిజామాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్లను ఇచ్చారు. ఫలితంగా కొంత కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు దారి చూపడానికి అవకాశం ఏర్పడిందని అధికార యంత్రాంగం చెబుతుంది. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది. కొన్ని ఆప్షన్లను ఇవ్వడంతో కేవలం డిజిటల్ పట్టా పాసు పుస్తకం ఉండి ఎలాంటి తప్పు లు లేని భూమి పట్టా మార్పిడి మాత్రమే జరిగింది. చదవండి👉 Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్ పార్ట్–బీలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలను జారీ చేయడం, పట్టా మార్పిడి చేయడం వీలు పడలేదు. కొన్ని ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ధరణిలో తాజాగా పాస్ బుక్కులలో పేర్ల మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం లెక్కలను సరి చేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లను గుర్తించి వాటిని ఎక్కించడం, సబ్ డివిజన్ల చేర్పు, నేషనల్ ఖాతా నుంచి పట్టా భూమి మార్పు, భూమి అనుభవంలో మార్పులకు అవకాశం ఏర్పడింది. ఇలా పలురకాల ఆప్షన్లను ఇవ్వడంతో అనేక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మా ర్గం సుగమమైందని తహసీల్దార్లు చెబుతున్నారు. చదవండి👉🏻 దయాకర్‌కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం ధరణిలో ఇచ్చిన కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎంత మేరకు పరిష్కరించవచ్చో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త ఆప్షన్లతో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. – శ్రీధర్, తహసీల్దార్, మోర్తాడ్ -
కలకలం: రోడ్డుపై కరెన్సీ నోట్ల ముక్కల సంచులు..
సాక్షి, బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై కత్తిరిచ్చిన కరెన్సీ నోట్ల ముక్కల సంచులు పడి ఉండటం కలకలం రేపింది. ఇందులో కొత్త 500, 2000 నోట్లను ముక్కలుగా చేసి సంచుల్లో నింపారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే దారిలో వీటిని పడేశారు. నోట్ల ముక్కల సంచులపై నుంచి వాహనాలు వెళ్లడంతో చెల్లా చెదురుగా రోడ్డుపై ఎగిరి పడ్డాయి. రవాణా చేస్తుండగా వాహనంలో నుంచి పడి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: HYD: ఇక్కడ అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు? సమాచారం అందడంతో ఏఎస్సై మురళీధర్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. శాంపిళ్లను సేకరించి, ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారి పక్కన ఆరేళ్ల కిందట కూడా ఇలాంటి నోట్ల ముక్కలే పడేశారు. ఒకే గ్రామంలో రెండు సార్లు కరెన్సీ నోట్ల ముక్కలు పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కరెన్సీ ముక్కలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: న్యూ ఇయర్ వేడుకలకు గ్రీన్ సిగ్నల్.. అరకొరే...అయినా హుషారే... -
పలకా బలపం పట్టాల్సిన వయసు.. చిట్టి తల్లికి ఎంత కష్టం!
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): పలక బలపం పట్టి బడిలో ఉండాల్సిన చిట్టి తల్లికి ఎంత కష్టం వచ్చింది. హాయిగా ఆడుకోవాల్సిన వయసులో తోపుడు బండిలో చెల్లిని, నీళ్ల బిందెలను పెట్టుకుని తాము ఉంటున్న గూడెం వద్దకు తోసుకుంటూ వెళ్తుంది. బాల్కొండ మండలం బస్సాపూర్ శివారులో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఏర్పడ్డ ఇటుక బట్టీల వద్ద చిన్నారుల దుస్థితి ఇది. తాగు నీటి కోసం చిట్టి తల్లి తోపుడు బండిలో గ్రామానికి వెళ్లి నీళ్లను తీసుకు వస్తోంది. చదవండి: మరియమ్మ లాక్ అప్ డెత్‌పై హైకోర్టు తీర్పు -
కొత్త వీసాల జారీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
మోర్తాడ్ (బాల్కొండ): కొత్తగా వచ్చే వలస కార్మి కులకు వీసాలు జారీ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి. కొత్త వీసాల జారీకి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మరో సౌదీ విషాద ఘటన: చివరి చూపూ దక్కలేదు..
మోర్తాడ్ (బాల్కొండ): కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి సౌదీ అరేబియాకు వెళ్లిన మోర్తాడ్ మండలం పాలెం వాసి షేక్ మదర్(50) అనారోగ్యంతో అక్కడే కన్నుమూశాడు. కరోనా వైరస్ ఉధృతితోనే విదేశాల్లో మరణించినవారి మృతదేహాలను తెప్పించడం కష్టంతోపాటు ఖర్చుతో కూడుకున్నది కావడంతో కుటుంబసభ్యుల అంగీకారంతో సౌదీలోనే మదర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ కుటుంబ పెద్ద కడసారి చూపునకు కూడా తాము నోచుకోలేకపోయామని మదర్ కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు) ఎన్నో ఏళ్ల నుంచి మదర్ గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల కింద ఆజాద్ వీసాపై సౌదీకి వెళ్లి అక్కడ సైకిల్ రిపేరింగ్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. నెల రోజుల కిందట మదర్ అనారోగ్యానికి గురవడంతో ఈనెల 6వ తేదీన మరణించాడు. మదర్ మృతదేహాన్ని ఇంటికి పంపించాలంటే ఎంతో ఖర్చు అవుతుందని అతడికి ఆజాద్ వీసా స్పాన్సర్ చేసిన సౌదీవాసి తెలిపాడు. మక్కా ఉన్న సౌదీలోనే మదర్ మృతదేహానికి ఖననం చేస్తే అతని ఆత్మకు శాంతి చేకూరుతుందని పలువురు సూచించడంతో కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈనెల 25 ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. రావడానికి ఒక్కరోజు ముందుగానే మృతి సౌదీలో మరణించిన మదర్ ఈ నెల 7వ తేదీన స్వదేశం రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మధుమేహం, బీపీ ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడు ఇంటికి రావడానికి విమాన టికెట్‌ను తీసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. ఒకరోజు ముందుగానే తీవ్ర అనారోగ్యానికి గురై సౌదీలోనే మరణించడం, అక్కడే అంత్యక్రియలు ముగిసిపోవడంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మదర్‌కు భార్య, నలుగురు కొడుకులు ఉన్నారు. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
గర్భిణులకు వాన కష్టాలు
అశ్వాపురం/నేరడిగొండ(బోథ్)/మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణులకు ఇది ప్రాణసంకటంగా మారింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ గ్రామానికి చెందిన గర్భిణి కుర్సం లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం నుంచి వచ్చిన అంబు లెన్స్ వాగు అవతలే నిలిచిపోవడంతో సర్పంచ్ పాయం భద్రమ్మ దంపతులు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు వారికి అండగా నిలిచారు. వాగులోంచి వెళ్లడానికి వీలుపడక సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి నడిపిస్తూ లక్ష్మిని వాగు దాటించి అంబులెన్స్‌లోకి చేర్చారు. అనంతరం ఆమెను అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించారు. మంచంపై అంబులెన్స్ వరకు.. మరో ఘటనలో గురువారం కొందరు యువకులు ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ వరకు తరలించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెరువు నిండి రోడ్లన్నీ మునిగిపోగా స్థానిక కోళ్లఫారంలో పనిచేయడానికి వచ్చిన వలస కుటుంబానికి చెందిన గర్భిణిని సర్పంచ్ నవీన్ కొందరు యువకుల సాయంతో మంచంపై మోసుకుంటూ అరకిలోమీటర్ దూరం లో ఉన్న అంబులెన్స్ వరకు తరలించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో గర్భిణిని మంచంపై అంబులెన్స్ వద్దకు తరలిస్తున్న తొర్తి యువకులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో మరో గర్భిణి ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న రాజులతండా గ్రామానికి చెందిన రబ్డే అనితను ఆస్పత్రికి తరలించే దారిలో బుద్దికొండ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆమెను తీసుకెళ్తున్న ఆటో వాగు మధ్యలోనే ఆగింది. దాంతో కుటుంబసభ్యులు ఎడ్లబండి తెప్పించి వర్షంలోనే 5 కి.మీ. దూరంలోని బోథ్ మండలం పొచ్చర గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ రెండు వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం ప్రజలు యాతన పడుతున్నారు. గొందిగూడెంలో వాగు ఇవతల గర్భిణితో కుటుంబసభ్యులు, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు -
ఈ ప్రాంతంలో వింత లాక్డౌన్
మోర్తాడ్(బాల్కొండ): కరోనా వైరస్ ఉధృతిని అరికట్టడానికి గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీలు సెల్ఫ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే సెల్ఫ్ లాక్డౌన్ నిబంధనలు మద్యం అమ్మకాలకు వర్తించకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాలు, హోటళ్లు ఉదయం కొంత సమయం, సాయంత్రం కొంత సమయంలో తెరిచి ఉంచాలని ఆయా గ్రామాల పంచాయతీలు, వీడీసీలు తీర్మానించాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రెండు, మూడు రోజుల నుంచి సెల్ఫ్ లాక్డౌన్ అమలవుతోంది. లాక్డౌన్ నిబంధనలు కిరాణ దుకాణాలు, హోటళ్లు, కూరగాయల వ్యాపారం, ఇతరత్రా చిన్న వ్యాపారులకే వర్తింప చేశారు. లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలు కాని, బెల్టు షాపులకు ఈ లాక్డౌన్ నిబంధనలు వర్తింప చేయడం లేదు. దీంతో సాదారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటిని బంద్ చేయాల్సి ఉండగా ఇదేమి వింత అని గ్రామస్తులు విస్తుపోతున్నారు. ( చదవండి: నిజామాబాద్‌లో దారుణం.. మున్సిపల్ సిబ్బందిపై దాడి! ) -
నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య
సాక్షి, నిజామాబాద్: బాల్కొండ శివారులో జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికుడు నిద్రిస్తుండగా ఇనుప రాడ్లతో కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంకులో బాల్కొండకు చెందిన కోటగిరి రాంకిషన్(49) కార్మికుడిగా పని చేస్తాడు. ఆదివారం విధులు నిర్వహించిన రాంకిషన్, తోటి కార్మికులు విధులకు రాక పోవడంతో సోమవారం కూడా డ్యూటీ చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఒక్కడే విధుల్లో ఉన్నాడు. అక్కడే ఉన్న కేబిన్‌లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చి తలపై ఇనుప రాడ్లతో కొట్టారు. దీంతో తలకు తీవ్ర గాయాలై పడి ఉన్నాడు. మంగళవారం ఉదయం బంకుకు వచ్చిన మేనేజర్ రాజారెడ్డి గాయాలతో పడి ఉన్న రాంకిషన్‌ను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కొనఊపిరితో ఉన్న ఆయనను ముందుగా అంబులెన్స్‌లో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్మూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతు డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పో లీసులు పేర్కొన్నారు. రాంకిషన్‌కు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో రాంకిషన్ హత్యకు గురైన ప్రదేశంలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ వైపు వెళ్లి ఆగిపోయింది. క్లూస్ టీంతో తనిఖీలు చేశారు. బాల్కొండ, ముప్కాల్ ఎస్సైలు శ్రీహరి, రాజ్‌భరత్‌రెడ్డి ఉన్నారు. -
భీమ్‌గల్‌గా మారిన వేముగల్లు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఎక్కువగా వేప చెట్లు ఉండడంతో వేముగల్లుగా పిలువబడిన ఆ నాటి సంస్థానమే నేటి భీమ్‌గల్‌గా గుర్తించబడింది. సరైన వైద్యం అభివృద్ధి చెందని సమయంలో తమకు అందుబాటులో ఉన్న వేప చెట్ల ఆకులు, గింజలతో మందులను తయారు చేసి రోగులను బతికించుకున్న సంస్థానంగా చరిత్రలో చోటు సంపాదించుకున్న వేముగల్లు సంస్థానం కాలక్రమంలో భీమ్‌గల్‌గా ప్రసిద్ధిగాంచింది. 15వ శతాబ్దంలో వేముగల్లు సంస్థానాధీశుడైన రాణామల్ల నరేంద్రుడు పల్లికొండను రాజధానిగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్రకారులు వివరించారు. వేముగల్లు సంస్థాన ఆస్థాన కవి కొరవి గోపరాజు ఈ సంస్థానం పాలన గురించి చాలా గొప్పగా వివరించారు. వేముగల్లు సంస్థానంపై తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా పని చేసిన హన్మాండ్ల భూమేశ్వర్ పరిశోధన చేశారు. అలాగే సిరికొండ మండలం కొండూర్‌కు చెందిన సల్లావచ్చల మహేశ్‌బాబు కూడా కొరవి గోపరాజు రచించిన సింహాసన ధ్వాతృంశిఖపై పరిశోధనలను కొనసాగించారు. ఇలా వేముగల్లు సంస్థానానికి చరిత్రలో ఎన్నో విధాలుగా ప్రాధాన్యత లభించింది. కస్బా నుంచి కస్పా.. వేముగల్లు పేరు భీమ్‌గల్‌గా మారక ముందు కస్బా అని పిలిచేవారు. ఉర్దూలో కస్బా అంటే పెద్ద నగరం, పట్టణం అని అర్థం. అలా భీమ్‌గల్‌ను మొదట కస్బా అని ఆ తరువాత వాడుకలో కస్పాగా మారింది. తరువాత భీమ్‌గల్ అని పలికేవారు. ప్రస్తుతం భీమ్‌గల్ అని పలుకుతూ రాస్తున్నారు. భీమ్‌గల్ 1975లో గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. పంచాయతీ సమితిగా, తాలుకా కేంద్రంగా కూడా భీమ్‌గల్ ప్రసిద్ధికెక్కింది. ‘గాడి’ కుటుంబానికి ఎక్కువ మార్లు అవకాశం భీమ్‌గల్ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీగా కొనసాగింది. ఈ పంచాయతీకి ఎక్కువ మార్లు ‘గాడి’ కుటుంబీకులే సర్పంచ్‌లుగా ఎంపికయ్యారు. 1975లో మొదటి సర్పంచ్‌గా ఇమాంభ„Š ఎంపికయ్యారు. ఆ తరువాత 1980 నుంచి గాడి సుదర్శన్‌రావు నాలుగుమార్లు సర్పంచ్‌గా ఎంపికయ్యారు. ఆయన 1998 వరకు 18 ఏళ్ల పాటు సర్పంచ్‌గా బాధ్యతలను నిర్వహించారు. ఆయన మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో గాడి సుదర్శన్‌రావు సోదరుడు రాజేశ్వర్‌రావు సర్పంచ్‌గా ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో మరోసారి రాజేశ్వర్‌రావు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2005లో గాడి భూపతిరావు, 2010లో గాడి భూపతిరావు సతీమణి శోభ సర్పంచ్‌గా ఎంపికై భీమ్‌గల్‌పై తమ పట్టును నిరూపించుకున్నారు. 2014లో సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వు చేయబడడంతో రవినాయక్ ఎన్నికయ్యారు. 2019లో మున్సిపాలిటీగా భీమ్‌గల్ అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని బీసీ మహిళలకు రిజర్వు చేశారు. భీమ్‌గల్ తొలి మున్సిపల్ చైర్మన్‌గా ఎవరు ఎంపికైతారో వేచి చూడాలి. -
చేపలు పోతున్నాయి!
సాక్షి. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టిన, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీరు వచ్చిన ప్రాజెక్ట్ నుంచి చేపలు వెళ్లిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్‌కు జాలి గేట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ హైలెవల్లో ఉండటంతో నీటి విడుదల సమయంలో చేపలు, చేప పిల్లలు కాలువలో వెళ్లిపోతున్నాయి. దీంతో జలాశయంలో చేపలు, చేపపిల్లలు ఖాళీ అవుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద జాలి గేట్లు కావాలని ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని మత్స్య కారులు అంటున్నారు. జాలి గేట్లు ఏర్పాటు చేస్తే 90 శాతం చేపలు, చేపపిల్లలు బయటకు వెళ్లిపోయే పరిస్థితి ఉండదంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువకు జాలి గేట్లు అమర్చుతామని పాలకులు వచ్చి సందర్శించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మోక్షం లభించలేదు. దీంతో వరద కాలువ ప్రవహించిన ప్రతిసారి మీనాలు కాలువలో పోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై చేపలు వేటాడుతు ఐదు వేల కుటుంబాలు బతుకుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చేపల వేటకు వస్తుంటారు. కాకతీయ కాలువ, ఇతర కాలువల ద్వారా నీటి విడుదల చేసినప్పు డు చేపలు, చేపపిల్లలు చాలా తక్కువగా కాలు వల్లో కొట్టుకుపోతాయంటున్నారు. వీటికి జాలి గేట్లు ఉన్నాయని మత్స్యకారులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వరద కాలువ హెడ్ రెగ్యులేటర్‌కు జాలి గేట్లను అమర్చాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కాలువలో చేపల వేట ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల జరిగినప్పుడు అధికంగా చేపలు బయటకు వెళ్తాయి. దీంతో కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద కొందరు చేపలు పడుతున్నారు. మత్స్యకారులే కాకుండా ఇతరులు కూడా చేపలను పట్టుకుంటారు. దీంతో మత్స్య సంపద తరలి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాలి గేట్లు నిర్మించాలి వరద కాలువకు జాలీ గేట్లను నిర్మించాలి. లేదంటే నీటి విడుదల చేపట్టినా రోజులు వరద కాలువలో చేపలు అధికంగా బయటకు పోతాయి. దీంతో తీవ్రంగా నష్టపోతాం. – కిషన్, మత్స్యకారుడు లాభం ఉండటం లేదు ప్రభుత్వం ప్రతి ఏటా ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను వదులుతుంది. కానీ వరద కాలువ ప్రవహిస్తే కాలువలోనే అనేక చేప పిల్లలు కొట్టుకు పోతున్నాయి. దీంతో లాభం ఉండటం లేదు. జాలి గేట్లు ఉంటే ఇంత నష్టం జరగదు. – గణేశ్, మత్స్యకారుడు మంత్రికి విన్నవించాం వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద జాలి గేట్ల కోసం మంత్రి ప్రశాంత్‌రెడ్డికి విన్నవించాం. ఆయన సానూకూలంగా స్పందించారు. జాలీ గేట్లు పెడితే మత్స్యసంపద తరలిపోదు. – గంగాధర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, బాల్కొండ -
నవంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు
సాక్షి, బాల్కొండ: మద్యం సిండికేట్ ఇష్ట్యారాజ్యానికి కొందరు ఎక్సైజ్ అధికారులు మద్దతునిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మద్యం పాలసీ అమలు కావడానికి మరో నెల రోజుల సమయం ఉండటంతో పాత వైన్సులకే లైసెన్స్‌ను ఒక నెల రెన్యూవల్ చేసిన విషయం విదితమే. అక్టోబర్ మాసానికి లైసెన్స్ ఫీజు చెల్లించిన మద్యం వ్యాపారులు ప్రతి సీసాపై రూ.10 ధర పెంచి వినియోగదారుల జేబులు గుళ్ల చేస్తున్నారు. అక్టోబర్ నెలకు మద్యం సిండికేట్ చెప్పిన ధరకే వినియోగదారులు మద్యంను కొనుగోలు చేయాల్సి వస్తుంది. మద్యం సిండికేట్‌పై పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న సందర్భాలు కనిపించడం లేదు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొనుగోలు చేసే ఒక్కో మద్యం సీసాపై ప్రత్యేక ధరను వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఎంఆర్పీ ధరల ప్రకారమే మద్యంను విక్రయించాల్సి ఉంది. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సదరు వైన్స్‌లను సీజ్ చేసే అధికారం ఎక్సైజ్ అధికారులకు ఉంది. కానీ అక్టోబర్ నెల అంతా ప్రత్యేక ధరకే మద్యం విక్రయిస్తామని మద్యం వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. నవంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. ఒక నెల లైసెన్స్ ఫీజు చెల్లించి మద్యం విక్రయిస్తే తమకు గిట్టుబాటు కాదని మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా మద్యం దుకాణాల లైసెన్స్‌లను ఖచ్చితంగా రెన్యూవల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకవచ్చారు. అయితే ఈ నెల కోసం అదనంగా లైసెన్స్ ఫీజును చెల్లించే సమయంలో మద్యం వ్యాపారులు కొందరు మొండికేయడంతో వారిని బుజ్జగించడంలో భాగంగా ధర పెంచుకోవడానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కో సీసాపై రూ.10 పెంచి విక్రయించుకోవడానికి ఎక్సైజ్ అధికారులు అనధికార అనుమతులు ఇవ్వడంతో మద్యం వ్యాపారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మద్యం సీసాల పరిమితితో తేడా లేకుండా ప్రతి సీసాపై రూ.10 ధర హెచ్చింపు చేయడం ద్వారా రూ.లక్షల్లో అదనపు ఆదాయం మద్యం సిండికేట్‌కు సమకూరనుంది. ఎక్సైజ్ అధికారులు నోరు మెదపకుండా ఉండటానికి మద్యం సిండికేట్ నుంచి ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రూ.10 ధర పెంపు ఈ నెలకోసమే అని వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. రెండు దుకాణాలకు జరిమానా విధించినా.. ఎంఆర్పీ ధరలకు కాకుండా మద్యం ధరలను పెంచి విక్రయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానా కూడా విధించారు. అయినా మద్యం వ్యాపారులు తమ తీరును మార్చుకోలేదు. రూ.10 ధర పెంచి మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఎంఆర్పీకే విక్రయించాలి మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు నిబంధనల ప్రకారం మద్యం విక్రయించాలి. – డేవిడ్ రవికాంత్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
కిసాన్‌నగర్ వరకే ‘కాళేశ్వరం’ నీరు
సాక్షి, బాల్కొండ: ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా శనివారం ప్రారంభించిన వెట్‌రన్ నిలిచిపోయింది. దీంతో వరద కాలువలో నీరు బాల్కొండ మండలం కిసాన్‌నగర్ వరకు మాత్రమే వచ్చి నిలిచి పోయింది. వరద కాలువపై రాజేశ్వర్‌రావుపేట్ వద్ద నిర్మించిన రెండో పంపుహౌస్ నుంచి రెండు మోటార్ల ద్వారా వెట్‌రన్ నిర్వహించారు. శనివారం కిసాన్‌నగర్ వరకు చేరుకోగానే మోటార్లు నిలిపి వేయడంతో నీరు అక్కడికే నిలిచి పోయింది. ఎస్సారెస్పీకి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం నీళ్లు ఆగాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే, మంత్రివర్గ విస్తరణ ఉండటంతో పర్యటన వాయిదా పడటంతో మోటార్ల ద్వారా వెట్‌రన్ నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో కిసాన్‌నగర్ వరకు మాత్రమే కాళేశ్వరం నీళ్లు వచ్చి చేరాయి. త్వరలోనే ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు చేర వేసే కార్యక్రమం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. -
వలలో చిక్కిన కొండ చిలువ
సాక్షి, బాల్కొండ: బాల్కొండ అలీం చెరువులోని చేపలు బయటకు వెళ్లకుండా అలుగుకు కట్టిన వలలో పెద్ద కొండ చిలువ చిక్కింది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల దగ్గరికి వెళితే బుసలు కొట్టడంతో వలలోనే బంధించారు. ఈ చెరువులో ఇప్పటి వరకు 8 కొండ చిలువలను చంపినట్లు మత్స్యకారులు తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పూడికతీత పనులు సక్రమంగా చేపట్టలేదన్నారు. పిచ్చి మొక్కలు అధికంగా ఉండడంతో చెరువు కొండ చిలువలకు ఆవాసంగా మారిందని చెబుతున్నారు. -
రైతుల గుండెల్లో ‘గ్రీన్ హైవే’ గుబులు
సాక్షి, బాల్కొండ: గ్రీన్ హైవే నిర్మాణ ప్రతిపాదన రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పచ్చని పొలాల్లోంచి జాతీయ రహదారి వెళ్తుందన్న వార్త అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో గల 44వ జాతీయ రహదారి నుంచి మంచిర్యాల జిల్లా మీదుగా జగదల్పూర్ వరకు గ్రీన్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి గత నెలలో సర్వే కూడా చేపట్టారు. పక్కన గల జగిత్యాల జిల్లాలో సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులకు గ్రీన్ హైవే గుబులు పట్టుకుంది. జిల్లాలోని ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల పరిధిలోని విలువైన భూముల్లోంచి ఈ గ్రీన్ హైవే వెళ్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 63వ జాతీయ రహదారిని విస్తరించాలని కేంద్రం భావించింది. అయితే, ఈ రోడ్డు విస్తరణలో భాగంగా భారీగా భవన నిర్మాణాలను పడగొట్టాల్సి వస్తుండడం, ఇందుకు భారీగా నష్ట పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉండడంతో కేంద్రం ప్రత్యామ్నయంగా గ్రీన్ హైవేకు రూపకల్పన చేసింది. ఇళ్లను తొలగించకుండా పంట భూముల మీదుగానే రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదన సిద్ధం చేసింది. నాలుగు లేన్ల రోడ్డు నిర్మించనుండడంతో ఎకరం, రెండేకరాల భూమి ఉన్న రైతులు పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాము ఉపాధిని కోల్పోతామని చిన్న, సన్నకారు రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ముప్కాల్ మండల పరిధిలోని రైతులు గత వారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో పాటు కలెక్టర్ రామ్మోహన్‌రావును కలిసి గ్రీన్ హైవే నిర్మాణం నిలిపి వేయాలని విన్నవించారు. విలువైన భూములు.. ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల పరిధిలో భూముల విలువ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎకరానికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పలుకుతోంది. 44వ జాతీయ రహదారి పక్కన భూములైతే రూ.అర కోటికి పైగానే ధరలున్నాయి. గ్రీన్ హైవే నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే తమకు ప్రభుత్వం అంత ధర చెల్లించే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసుకునే భూములు కోల్పోవడంతో ఉపాధి కోల్పోతామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పునారాలోచన చేసి గ్రీన్ హైవే నిర్మాణం విరమించు కోవాలని కోరుతున్నారు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటమంటూ రైతులు హెచ్చరిస్తున్నారు. వేంపల్లి రైతులకు తీవ్ర నష్టం.. గ్రీన్ హైవే నిర్మాణం జరిగితే వేంపల్లి రైతులకు మరోమారు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే వేంపల్లి రైతులు తమ విలువైన భూములను వరద కాలువతో పాటు 44వ జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు గ్రీన్ హైవే నిర్మాణం కోసం భూమి కోల్పోతే అసలు సాగు చేసుకోవడానికే భూమి లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేసే లక్ష్మి కాలువ డీ–3పై నిర్మించిన వేంపల్లి ఎత్తిపోతల పథకానికి సైతం ఇక్కడి రైతులు భూమిని కోల్పోయారు. గతంలో నిర్మించిన నవాబు కాలువ, నిజాంసాగర్ కాలువలు కూడా వీరి భూముల నుంచే పోయాయి. -
ప్రమాదపుటంచున పర్యాటకులు
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే సమయంలో ప్రాజెక్ట్‌కు జలకళతో పాటు, జనకళ వస్తుంది. ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. కాని ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల భద్రతను పట్టించుకునే నాథుడే కరువవడంతో పర్యాటకులు ప్రమాదపు అంచుకు వెళ్తున్నారు. అయిన ప్రాజెక్ట్ ఆనకట్టపై ఉన్న సబ్ కంట్రోల్ బూత్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నీటి అంచున సెల్ఫీలు పర్యాటకులు నీటి అంచు వరకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ప్రాజెక్ట్ లోపలి వైపు నీటి అంచు వరకు రివీట్మెంట్ మీద వెళ్లడం ప్రమాదకరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులకు తెలియక నేరుగా ప్రాజెక్ట్ నీటి అంచుకు వెళ్తున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి సందర్శనకు వచ్చిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మత్యువాత పడ్డారు. అయిన ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల కోసం ఎలాంటి భద్రత చర్యలు చేపట్టడం లేదు. ప్రాజెక్ట్ వద్ద ప్రమాదాలు జరగక ముంద చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. డ్యాం మీదకి అనుమతి లేదు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డ్యాంపైకి పర్యాటకులకు అనుమతివ్వడం లేదు. ఆనకట్టపై నుంచే ప్రాజెక్ట్‌ను సందర్శించి వెళ్లాలి. దీంతో ప్రాజెక్ట్ లోపకి వైపుకు దిగుతు గేట్లను చూస్తున్నారు. ప్రాజెక్ట్ వద్ద డ్యాంపైకి వెళ్లకుండ గేట్లను మూసి వేస్తున్నారు. కేవలం ఆదివారం మాత్రమే డ్యాంపైకి అనుమతిస్తున్నారు. డ్యాంపైకి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గేట్లు మూసి ఉంచుతున్నారు. -
ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు
ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు వెతలు తీరే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 15వ తేదీలోగా కాళేశ్వరం నీరు ఎస్సారెస్పీకి చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించడంతో.. పునరుజ్జీవన పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఆదేశాలతో ఈ సీజన్లోనే తమ పంటలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం తీసుకువచ్చింది. రూ. 1,067 కోట్లతో పనులు చేపట్టారు. వరద కాలువ గుండా నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేయడానికి వరద కాలువపై మూడు పంపు హౌజ్‌లు నిర్మిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ జీరో పాయింట్ వద్ద గల మూడో పంపు హౌజ్ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా మొదటి రెండు పంపు హౌజులతో రోజుకు 0.5 టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో 60 రోజుల పాటు 0.5 టీఎంసీల నీటిని తరలిస్తే 30 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 టీఎంసీల నీరు వచ్చి చేరితే ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఢోకా ఉండదు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పూర్తయితే రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజులు 60 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు లేకపోవడంతో 0.5 టీఎంసీల చొప్పున నీటిని ముందుగా తరలించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి తరలించే పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఈ నెల 15 లోపు ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలున్నాయి. వరద కాలువలో ఏడాదంతా నీరు.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా వరద కాలువలో నీరు రివర్స్ పంపింగ్ చేయడంతో వరద కాలువలో ఏడాదంతా నీరు నిల్వ ఉంటుంది. దీంతో వరద కాలువకు ఇరువైపులా భూగర్భజలాలు పెరగే అవకాశాలున్నాయి. రైతులకు ఈ నీటితో కొంత ఉప శమనం కలుగనుంది. ఆయకట్టు రైతుల్లో ఆనందం.. సీఎం ఆదేశాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సంవత్సరం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాక పోవడంతో ప్రాజెక్ట్‌లో నీరు లేదు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది రైతులు ఖరీఫ్ పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. కానీ సీఎం ఆదేశాలతో ఈనెల 15వ తేదీలోపు కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలు ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీని చేరితే తమ పంటలకు ఢోకా ఉండదని రైతులు అంటున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు -
నాడు గల్ఫ్ కార్మికుడు.. నేడు జెడ్పీటీసీ సభ్యుడు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): నిన్నటి వరకు గల్ఫ్ కార్మికుడిగా కొనసాగిన గుల్లె రాజేశ్వర్ నేటి నుంచి ఏర్గట్ల మండల తొలి జెడ్పీటీసీ సభ్యుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. జీవనోపాధి కోసం ఎన్నో ఏళ్ల పాటు గల్ఫ్‌లో పని చేసిన గుల్లె రాజేశ్వర్ తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. అంతేకాక జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలను నిర్వహించడానికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఏర్గట్లకు చెందిన రాజేశ్వర్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. వ్యవసాయం ఉన్నా ఉపాధి కోసం 2002లో గల్ఫ్ పయనం అయ్యాడు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా చేరిన రాజేశ్వర్ తన వృత్తి నైపుణ్యంతో సూపర్వైజర్ స్థాయికి ఎదిగాడు. తాను ఆర్థికంగా స్థిరపడడంతో పాటు పది మందికి పని కల్పిం చాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి 2010లో స్నేహితులు, బంధువుల సహకారంతో సప్లయింగ్ కంపెనీని కువైట్‌లో ప్రారంభించాడు. మరామిష్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీని స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. కువైట్‌లో తన కంపెనీ సక్సెస్ కావడంతో ఇటీవల దుబాయ్ లో కూడా మరో కంపెనీని స్నేహితుల భాగస్వామ్యంతో ప్రారంభించాడు. అయితే కువైట్‌లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం బాధ్యతలను స్వీకరించి సేవా కార్యక్రమాలను కొనసాగించాడు. కువైట్‌లో క్షమాభిక్ష అమలు జరిగిన సమయంలో ఎంతో మంది ఖల్లివెల్లి కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి విమాన టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో అందించి పార్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో అతని సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఏర్గట్ల జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం కల్పించగా ఆయనను జెడ్పీటీసీ పదవి వరిం చింది. జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రాజేశ్వర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు జిల్లా పరిషత్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్‌గాను వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. -
డెడ్ స్టోరేజ్‌కి చేరువలో..
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పడిపోతోంది. ప్రాజెక్ట్ నుంచి తాగు నీటి అవసరాల కోసమే నీటి విడుదల చేపడుతున్నారు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం రోజుకు 0.10 అడుగులు తగ్గుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు రికార్డుల్లో పేర్కొంటున్నారు. ఈ లెక్కన పది రోజులకు ఒక అడుగు నీటి మట్టం తగ్గుతుంది. మరో రెండు నెలల్లో 6 అడుగుల నీటి మట్టం తగ్గుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం డెడ్ స్టోరేజీ దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. గత నాలుగు రోజుల క్రితం వరకు 130 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. నాలుగు రోజుల నుంచి పెరిగిన ఎండ తీవ్రత వలన 229 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున నీరు కూడ ఎక్కువగా ఆవిరవుతుంది. నీటి వినియోగం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం అతి తక్కువ నీటి వినియోగం జరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 142 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మిగత ఏ కాలువల ద్వారా కూడ నీరు వినియోగించడం లేదు. అయినా ప్రాజెక్ట్ నీటి మట్టం శర వేగంగా తగ్గుతోంది. డెడ్ స్టోరేజీకి చేరువలో.. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 7.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు. డెడ్ స్టోరేజీకి 2.3 టీఎంసీల దూరంలో ప్రాజెక్ట్ నీటి మట్టం ఉంది. ప్రాజెక్ట్‌లో 2015 సంవత్సరంలో ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రాక పోవడంతో డెడ్‌స్టోరేజీ దిగువకు ప్రాజెక్ట్ నీటి మట్టం పడిపోయింది. ప్రస్తుత సంవత్సరం కూడ డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్ట్ 55 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు రెండు మార్లు మాత్రమే డెడ్ స్టోరేజీకి దిగువకు నీటి మట్టం పడిపోయినట్లు ప్రాజెక్ట్ రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1052.40 (7.3 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
ప్రతి ఇంటా.. గ్రామ దేవత పేరే
బాల్కొండ: ఆ గ్రామ ఆరాధ్య దైవం దేవమ్మ.. ఆ దైవం పేరు లేకుండా గ్రామంలోని ఏ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు ఉండవు.. అదే బాల్కొండ మండలం వన్నెల్(బి) గ్రామం. ఆ గ్రామ జనాభా సుమారు 5,172 మంది ఉంటారు. 600పై చిలుకు కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వన్నెల్(బి) ఎంతో అభివృద్ధి బాటలో ఉంది. రాజకీయంగా కూడా ఎంతో చైతన్యం గల గ్రామం. ఆ గ్రామం దేవెంద్రుల పల్లెగా చెప్పుకోవచ్చు. ఆ గ్రామ ఆరాధ్య దైవం దేవమ్మ పేరుతో ప్రతి కుటుంబంలో ఒకరి పేరు కచ్చితంగా ఉంటుంది. మగవారికి దేవేందర్, దేవన్న, ఆడవారికి దేవమ్మ, దేవాయి పేర్లు ఉంటాయి. ఈ తరం పిల్లలకు కూడా ముందుగా ఆ పేరుతో నామకరణం చేసిన తరువాతనే ఇతర పేర్లు పెట్టుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ గ్రామంలో అందరూ దేవేందర్‌లు ఉండడం వలన ఇంటి పేరు తప్పని సరిగా వాడాల్సి వస్తుంది. దీంతో అధికంగా పూర్తి పేరుకు బదులు ఇంటి పేర్లతో ఎక్కువ మందిని పిలుచుకుంటారు. లేదంటే అందరు దేవేందర్‌లు ఉండడంతో ఏ దేవేందర్ ఏంటో తెలియదంటారు. దేవమ్మ ఆ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం కావడంతో గ్రామ శివారులో ఆలయం నిర్మించారు. రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమిలో చెట్లను పెంచారు. ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం జూన్ మాసంలో పెద్ద ఎత్తుగా దేవమ్మ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతి శుక్రవారం దేవమ్మకు పూజలు నిర్వహిస్తారు. దేవమ్మ కరుణతో అందరం చల్లగా ఉన్నామని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో పేరు ఉంటుంది వన్నెల్(బి) గ్రామంలో ప్రతి ఇంట్లో దేవమ్మ పేరుతో గల దేవేందర్, దేవన్న, లాంటి పేర్లు తప్పకుండా ఉంటాయి. ఇప్పటి పిల్లలకు కూడా మొదట ఆ పేరుతో పేరు పెట్టాకే వేరే పేర్లతో పిలుచుకుంటాం. దేవమ్మ కరుణతో గ్రామస్తులందరం చల్లగా ఉంటున్నాం. – ఏనుగు దేవేందర్, గ్రామస్తుడు మా ఆరాధ్య దైవం.. దేవమ్మ మా గ్రామస్తుల ఆరాధ్య దైవం కావడంతో అందరి ఇళ్లలో అమ్మ వారి పేరుతో పేర్లు పెంటుకుంటాం. ప్రతి సంవత్సరం ఘనంగా దేవమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటాం. అందరివి ఒకే పేర్లు కావడంతో ఇంటి పేర్లు తప్ప కుండా వాడుతాం. – రెంజర్ల దేవేందర్, గ్రామస్తుడు