ఆయన ఎందుకు వచ్చారో? | Suspicions on maharashtra chief engineer of the project gaikwad | Sakshi
Sakshi News home page

ఆయన ఎందుకు వచ్చారో?

Published Sun, Feb 9 2014 4:16 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Suspicions on maharashtra chief engineer of the project gaikwad

బాల్కొండ, న్యూస్‌లైన్:  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ జోగ్‌దండ్ శుక్రవారం ఎస్‌ఆర్‌ఎస్‌పీని సందర్శించడం ప్రాజెక్టు అధికారులు, రైతులను కలవరపరుస్తోంది. ప్రాజెక్టు నిర్మించిన 50 ఏళ్లలో గైక్వాడ్ ప్రాజెక్టు సీఈ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సమాచారం ఉన్నప్పటికీ ఎస్‌ఆర్‌ఎస్‌పీ ముఖ్య అధికారులు హాజరుకాకపోవడం వెనక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు.

 బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత గైక్వాడ్ సీఈ ఎస్‌ఆర్‌ఎస్‌పీ వద్దకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబ్లీ నిర్మాణంపై సుప్రీం కోర్టు గతేడాది ఫిబ్రవరి 28న మహారాష్ట్ర సర్కారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం మహా సర్కారు అక్టోబర్‌లో బాబ్లీ గేట్లను దించింది. జూన్‌లో గేట్లను ఎత్తివేయాలి. ఏపీ, మహారాష్ట్ర మధ్య జలవివాదం తలెత్తకుండా త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుందని సుప్రీం తీర్పులో పేర్కొంది.

ఈ కమిటీలో గైక్వాడ్ సీఈ సభ్యుడు కానున్నారా, అందుకోసమే ఎస్ ఆర్‌ఎస్‌పీని సందర్శించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలే ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆయకట్టుకు బాబ్లీ ప్రాజెక్టు ముప్పుగా పరిణమించింది. దీనికితోడు మహారాష్ట్ర ప్రాజెక్టుల సీఈలు ఈ ప్రాజెక్టు నీటి నిల్వ, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను తెలుసుకునిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.

 గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి ఇన్‌ఫ్లో నిల్
 శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న  గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి గడిచిన పదేళ్లలో ఎలాంటి ఇన్‌ప్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రాలేదని  రికార్డులు తెలుపుతున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టు కింద ఉన్న సిద్ధేశ్వర, ఎల్దరి, మజ్‌గావ్ ప్రాజెక్టు నుంచి ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. గైక్వాడ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 102 టీఎంసీలు. ఇప్పటికి ప్రాజెక్టు ఖాళీగానే ఉందని సమాచారం. అలాంటప్పుడు గైక్వాడ్ సీఈ ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఇన్‌ఫ్లో వివరాలను అడగడం వెనుక మతలబు ఏమిటో తెలియడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement