
మళ్లీ విద్యుత్ కోతలు షురూ ఉదయం తీసివేయడంతో
గృహిణుల ఇబ్బందులు రైతుల ఇక్కట్లు
రానున్న రోజులపై ఆందోళన
బాల్కొండ,న్యూస్‌లైన్ :అకాల వర్షాలతో విద్యుత్ కోతలకు ఊరట లభించిందని సంతోషపడ్డ రైతులకు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలువ లేదు. గృహ అవసరాలకు విద్యుత్ కోతలను ట్రాన్స్‌కో అధికారులు అధికారికంగా మళ్లీ రెండు రోజుల నుంచి విధిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు అధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు సబ్‌స్టేషన్ ఉన్న గ్రామంలో 8 గంటలు, పల్లెల్లో 12 గంటలు విద్యుత్ కోతలు విధించారు.
వారం పది రోజుల పాటు అకాల వర్షాలు కురవడంతో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ లేకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు గృహ అవసరాలకు విద్యుత్ కోతలను ఎత్తివేశా రు. రెండు రోజులుగా భానుడు ప్రతాపం చూపాడోలేదో సాగు విద్యుత్ డిమాండ్ పెరగడంతో మళ్లీ విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే వేసవికాలంలో విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ల్లో నీరు సమృద్ధిగా ఉంది. అకాల వర్షాలతో ప్రాజెక్ట్‌లకు అనుకొని జలకళ వచ్చి పడింది. విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతోంది. అయినా విద్యుత్ కోతలు విధించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కోతలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గృహిణుల అవస్థలు..
ఉదయం ఆరు గంటల నుంచే విద్యుత్ కోతలు విధించడంతో ఇళ్లలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీళ్లు లభించక కోతల అనంతరం విద్యుత్ సరఫరా వరకు వేచి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యుత్ కోతలు ఎత్తి వేయాలి. లేదా విద్యుత్ కోతల వేళాల్లో మార్పు చేయాలని వారు కోరుతున్నారు.
నాలుగో ఫీడర్ రైతులు తీవ్ర ఇబ్బందులు..
సాగుకు విద్యుత్ లోడ్‌ను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాన్స్‌కో అధికారులు నాలుగు ఫీడర్లలో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కాని నాలుగో ఫీడర్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి ఫీడర్‌లో ఉదయం 4.15 నిమిషాల నుంచి 9.15 నిమిషాల వరకు , రెండో ఫీడర్‌లో ఉదయం 9.15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2.15 నిమిషాల వరకు, మూడో ఫీడర్ 2.15 నిమిషాల నుంచి 7.15 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
నాలుగో ఫీడర్‌లో రాత్రి 7.15 నుంచి అర్ధరాత్ర 12.15 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా చేయడంతో పంటలకు రైతులు నీరు అందించ లేక పోతున్నారు. రాత్రి కరెంట్ వ ల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నాలుగో ఫీడర్‌పై పరిశీలన చేయాలని రైతులు కోరుతున్నారు.