కష్టాల కధనం | kashtala kadhanam | Sakshi
Sakshi News home page

కష్టాల కధనం

Published Mon, Dec 5 2016 1:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కష్టాల కధనం - Sakshi

కష్టాల కధనం

పెద్దనోట్ల రద్దు అన్నదాతను కుంగదీసింది. ఆరుగాలం  శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో ఊహిం చని పరిణామంతో రైతులు హతాశులయ్యారు. ప్రతిఏటా ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న వారు ఈ సారి కేంద్రం నిర్ణయంతో చిత్తయ్యారు. మాసూళ్ల పనులు సరిగా సాగక, ఇళ్లకు చేర్చిన పంటను అమ్ముకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. రబీ పెట్టుబడుల కోసం ఏం చేయాలో పాలుపోక దీనంగా రోదిస్తున్నారు. 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘పెద్ద నోట్ల రద్దు వల్ల రైతాంగం ఇబ్బంది పడటం లేదు. వారి వద్ద అసలు 
నల్లధనం ఉంటే కదా’ అంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గత వారం తాడేపల్లిగూడెం రైతు సభలో వ్యాఖ్యానించారు. అయితే ఈయన వ్యాఖ్యలకు వాస్తవానికి పొంతన లేదు. పెద్దనోట్ల రద్దుతో రైతులు తీవ్రంగా కుంగిపోయారు. చేతికంది వచ్చిన పంటను ఇళ్లకు చేర్చుకోవడానికి, అమ్ముకోవడానికి అగచాట్లు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక కూలీలకు చెల్లింపులు, పంట రవాణాకు  సతమతమవుతున్నారు. తమ 
ఇబ్బందులపై దృష్టిపెట్టని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సార్వా పంట ఆశాజనకంగా వచ్చింది. ప్రకృతి కూడా కరుణించింది. దీంతో ధాన్యాన్ని అమ్మి అప్పులు తీర్చి రబీ సాగుకు సన్నద్ధమవుదామని అనుకున్న తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు శరాఘాతంలా తగిలింది. మాసూళ్లకు ఆటంకం కలిగింది. కూలీల చెల్లింపులకూ చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు అష్టకష్టాలు పడ్డారు. కొందరు కూలీలు, రైతుల పరస్పర సహకారంతో ఎలాగోలా ధాన్యాన్ని ఇళ్లకు చేర్చినా.. అమ్ముకునేందుకు  కష్టపడుతున్నారు. ధాన్యం సొమ్మును వ్యాపారులు పాత నోట్లను ఇస్తామని, లేదా బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పడంతో చాలామంది రైతులు అమ్మకానికి ఇష్టపడడం లేదు. దీంతో ఎక్కడిబడితే అక్కడ ధాన్యపు రాశులు దర్శనమిస్తున్నాయి. కొందరు  పంటను చేలల్లో కుప్పలుగా వేశారు.  మరికొందరు రైతులు అరువుకు అమ్మకాలు సాగిస్తున్నారు. అరువుకు అమ్మలేక, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిబంధనల కారణంగా వెళ్లలేక చాలామంది బ్యాంకు ఖాతాల్లో  నగదు జమకు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం రబీకి సిద్ధమైన కొందరు రైతులు దమ్ములు చేస్తున్నారు. నారుమళ్లు పోసుకుంటున్నారు. ఈ దశలో డబ్బుల కోసం నరకయాతన అనుభవిస్తున్నారు.  పాతనోట్లు చెలామణి కాక, బ్యాంకుల్లో ఇచ్చిన రూ. 2వేలు నోట్లకు చిల్లర దొరకక కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల్లో కొత్త రుణాలు ఇవ్వకపోవడం, కమీష¯ŒSదారుల నుంచి అప్పు పుట్టకపోవడంతో చాలా మంది రైతులు రబీ సాగు చేయాలా వద్దా అన్న అయోమయంలో పడ్డారు. 
 
రాని కూలీలు   
కొన్నిచోట్ల చెల్లింపులు లేకపోతే కూలీలు పనికి రావడం లేదు.  కూలీలు రాక, వచ్చిన వారికి చెల్లించేందుకు డబ్బులు లేక మొగల్తూరుకు చెందిన కోయ సత్యనారాయణ అనే రైతు ఒక్కడే తన పొలంలో ధాన్యం                     ఆరబోసుకునే పనులు చేసుకుంటున్నాడు. రెండు రోజులు కూలికి మనుషులు వచ్చినా బ్యాంకులో ఇచ్చిన రెండువేలను ఎవరికివ్వాలో అర్థం కాక అతను సతమతమయ్యాడు. దీంతో డబ్బులు లేవని తెలుసుకున్న కూలీలు  రావడం మానుకున్నారు. ఫలితంగా ఆ రైతు తానే సొంతంగా పనులు చేసుకుంటున్నాడు. 
ఈ ఉదంతం జిల్లాలోని రైతులు పడుతున్న ఇబ్బందులకు సజీవ తార్కాణంగా  కనపడుతోంది. వ్యవసాయపనులకు వెళ్లిన కూలీలకు మనిషికి రూ.400 చొప్పున రోజుకు చెల్లిస్తున్నారు. ఐదుగురికి కలిపి రూ.రెండువేల నోటు ఇచ్చినా వారు ఆ డబ్బులు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చిల్లర ఇస్తేనే పనులకు వస్తామని కొందరు కూలీలు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన డబ్బులు బ్యాంకు నుంచి ఇప్పించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement