ప్రకాశమంతా పండుగ | YSR Jayanthi Under The Auspices Of Minister Balineni Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

ప్రకాశమంతా పండుగ

Published Tue, Jul 9 2019 8:05 AM | Last Updated on Tue, Jul 9 2019 8:06 AM

YSR Jayanthi Under The Auspices Of Minister Balineni Srinivasa Reddy - Sakshi

వైఎస్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బాలినేని, కలెక్టర్‌ పోలా భాస్కర్‌ 

సాక్షి, ఒంగోలు: జిల్లా కేంద్రం ఒంగోలులో రాష్ట్ర విద్యుత్, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యవసాయం పండుగ అని నిరూపించిన మహానేత రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రారంభమైన పార్టీలో నేతలుగా, కార్యకర్తలుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు. వైయస్సార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఉచిత విద్యుత్‌పై సంతకం చేసి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా పేరుతో అక్టోబరు 15వ తేదీన రు12500లు రైతులకు అందిస్తున్నారని, అంతే కాకుండా రైతులకు నాణ్యమైన 9గంటల పగటిపూట విద్యుత్, రైతులకు వడ్డీలేని పంట రుణాలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 

యర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మార్కాపురం రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన కేక్‌ను కట్‌ చేశారు. బస్టాండ్‌ ఆవరణలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి మంత్రి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌తో కలిసి రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌పై తన తొలి సంతకాన్ని పెట్టి ఆ సంతకానికి ఉన్న విలువేంటే రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా చేశారని కొనియాడారు. రైతులకు రుణాల పంపిణీ, వైఎస్సార్‌ పింఛన్‌ పథకం అమలు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  వైఎస్సార్‌కు నిజమైన నివాళులు అర్పించే విధంగా చేశారని అన్నారు.
గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. రాచర్ల గేట్‌ సెంటర్లో వైయస్సార్‌ విగ్రహం వద్ద నివాళులర్పించడంతోపాటు నగర పంచాయతీ కార్యాలయంలో సామాజిక పెన్షన్లు పంపిణీతోపాటు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది 
దర్శి నియోజకవర్గ ప్రజలు మహానేతను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించారు. దర్శిలో శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్‌ పాల్గొని పలుచోట్ల వైయస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  
సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైయస్సార్‌ జయంతి వేడుకకు సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు హాజరై ఘనంగా జననేతకు నివాళి అర్పించారు. సంతనూతలపాడు, మద్దిపాడులలో జరిగిన కార్యక్రమాలకు హాజరై సామాజిక పెన్షన్లు, బాలికలకు సైకిళ్లు తదితరాలను పంపిణీ చేశారు. 
నిగిరిలో జననేత జయంతిని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ప్రారంభించారు. ఎద్దుల బండిపై ఊరేగింపుగా రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరై ఉత్తమ రైతులకు ప్రశంసాపత్రాలు, పంట రుణాల చెక్కులు, నాగలి, పొట్టేళ్లను పంపిణీచేశారు. 
మార్కాపురం శాసనసభ్యులు కుందుర్రు నాగార్జునరెడ్డి రైతు దినోత్సవంలో పాల్గొని వైయస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. ఉత్తమరైతులను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు. పలువురు కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీచేయడంతోపాటు పలువురు రైతులకు ట్రాక్టర్లను పంపిణీచేశారు.  . 
కందుకూరు పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు, మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి వైయస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు వ్యవసాయ పరికరాలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీ చేశారు. జననేత జయంతి కార్యక్రమంలో భాగంగా పేదలకు పట్టాలు పంపిణీతోపాటు పొజిషన్‌ చూపించారు. 
అద్దంకి మార్కెట్‌యార్డులో జరిగిన రైతు దినోత్సవానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాచిన చెంచు గరటయ్య హాజరై వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బల్లికురవ, జె.పంగులూరు, కోరిశపాడు మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు యువ నాయకుడు బాచిన కృష్ణచైతన్య పాల్గొన్నారు.
కొండపిలో వైఎస్సార్‌ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయినాథ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ మాదాసి వెంకయ్య పాల్గొని సామాజిక పెన్షన్లు 
పంపిణీచేశారు.  
• చీరాల గడియార స్తంభం సెంటర్లోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తోటవారిపాలెంలో పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఆమంచి కట్‌ చేశారు. అనంతరం రైతుదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
• పర్చూరు నియోజకవర్గం కారంచేడులోని దగ్గుబాటి క్యాంప్‌ కార్యాలయంలో దగ్గుబాటి హితేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు జరిగాయి. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పర్చూరు మార్కెట్‌ యార్డులో జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొని ఆయన సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు.

వైఎస్‌ ఆశయాల కొనసాగింపే ఘన నివాళి
ఒంగోలు సిటీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను, ఆదర్శాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్ధానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో దివంగత నేత 70వ జయంతి కార్యక్రమాలను కేకు కోసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు అధ్యక్షత వహించారు. పార్టీ కార్యాలయంలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రైతు బాంధవుని జయంతి నాడే రైతు దినోత్సవాన్ని ప్రారంభించామన్నారు. వైఎస్‌ బాటలోనే జగన్‌ పయనిస్తారని అన్నారు.

రైతులను వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే వ్యవసాయాన్ని పండుగ చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. నెల రోజుల్లోనే రైతులను నిలబెట్టే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు పగటి పూటే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్తు, విత్తనాల సబ్సిడీ, కరెంటు బకాయిల రద్దు, పావలా వడ్డీ, ప్రాజెక్టుల నిర్మాణం , మద్దతు ధరతో వ్యవసాయ ఉత్పత్తులు వంటివి గుర్తు చేసుకున్నప్పుడు వైఎస్సారే గుర్తుకు వస్తారని అన్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోపే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనే ఎన్నో నిర్ణయాలను అమలు చేశారని వివరించారు.

పండించిన ప్రతి ధాన్యం గింజ మీద అది ఎవరు తినాలో దేవుడు రాసి మెడతాడన్నది సామెతగా ప్రస్తావిస్తూ ప్రతి ధాన్యపు గింజను ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని పండించే కష్టజీవులైన రైతుల కళ్లల్లో ఆనందం, వారి కుటుంబాల్లో సంతోషాలను నింపేలా జగన్‌ ప్రభుత్వం ధీమా కల్పిస్తుందని వివరించారు. గ్రామ స్ధాయి నుంచి గ్రామ సచివాలయాల వ్యవస్ధ ద్వారా పేరుకుపోయిన అవినీతిని తొలగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికి దేవుడి దీవెనలు వైఎస్సార్‌ ఆశీస్సులు ఉంటాయని అన్నారు. జిల్లాలో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్తు అందించడం వల్ల ఈ ఏడాది గ్యాప్‌ ఆయకట్టు లక్షలకు పైగా ఎకరాలు సాగులోకి రానుందని అన్నారు. జగన్‌ ప్రభుత్వం రైతు బాంధవుని ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని, రానున్న రోజుల్లో రైతు కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

వ్యవసాయానికి కావాల్సిన అన్ని అంశాల్లోనూ ప్రభుత్వమే అన్నదాతకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఆక్వా ఉత్పత్తులు ఏటా రూ.1400 కోట్లకుపైగా ఉన్నాయని వివరించారు. ఆక్వా రైతుకు సబ్సిడీపై కరెంటు ఇవ్వడం వల్ల ఈ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. రైతు భరోసా కింద అందిస్తున్న కార్యక్రమాలను వివరించారు. వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement