పంజాబ్‌లోని శంభు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుమన్నారు. తమకు నష్టదాయకమైన ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలు శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా రైతులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని నినదించారు. రైతుల నిరసనలతో పంజాబ్, హరియాణాలో జనం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.
గురువారం ప్రారంభమైన రైలు రోకో రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. వ్యవసాయ బిల్లులపై రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బంద్‌కు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల దిగ్బంధం చేపట్టింది. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారుస్తారా? అని నిలదీసింది. కనీస మద్దతు ధరను రైతుల నుంచి దూరం చేయడం ఏమిటని ప్రశ్నించింది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment