Bharat Bandh
-
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్
-
Rajasthan: బంద్‌తో విద్యాసంస్థల మూసివేత.. ఇంటర్నెట్ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్‌లోని విద్యాసంస్థలపై కనిపించింది.బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్‌పూర్‌లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్‌గఢ్‌లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. -
ఢిల్లీలో కనిపించని భారత్ బంద్ ప్రభావం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నేడు (బుధవారం) భారత్ బంద్‌కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పలుపునిచ్చింది. అయితే ఈ బంద్ ప్రభావం ఢిల్లీలో కనిపించలేదు.ఢిల్లీలోని వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానుల సమన్వయ సంస్థ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ మీడియాతో మాట్లాడుతూ తాము కాష్మీరే గేట్, చాందినీ చౌక్, ఖరీ బావోలి, నయా బజార్, చావ్రీ బజార్, సదర్ బజార్, కరోల్ బాగ్, కమ్లా నగర్, కన్నాట్ ప్లేస్, లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన 100కు పైగా మార్కెట్ సంఘాలతో ఈ విషయమై చర్చించామన్నారు. ఈ దరిమిలా తాము బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. ఢిల్లీలోని మొత్తం 700 మార్కెట్లు పూర్తిగా తెరిచి ఉంటాయని, 56 పారిశ్రామిక ప్రాంతాలు కూడా పని చేస్తాయని తెలిపారు.మాయావతి మద్దతుభారత్ బంద్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు పలికారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక బీజేపీ కుట్ర దాగున్నదని ఆమె ఆరోపించారు. అందుకే తాము భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 1. बीएसपी का भारत बंद को समर्थन, क्योंकि भाजपा व कांग्रेस आदि पार्टियों के आरक्षण विरोधी षडयंत्र एवं इसे निष्प्रभावी बनाकर अन्ततः खत्म करने की मिलीभगत के कारण 1 अगस्त 2024 को SC/ST के उपवर्गीकरण व इनमें क्रीमीलेयर सम्बंधी मा. सुप्रीम कोर्ट के निर्णय के विरुद्ध इनमें रोष व आक्रोश।— Mayawati (@Mayawati) August 21, 2024 -
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్‌లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
Agneepath Scheme: భారత్ బంద్ పాక్షికమే!
న్యూఢిల్లీ/పట్నా: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పలువురు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు సోమవారం పెద్దగా స్పందన లభించలేదు. ముందస్తు చర్యలు, భద్రత నడుమ .. బంద్ పాక్షికంగా సాగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైళ్లు, వాహనాల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. యువకులు రోడ్లపై బైఠాయించగా, అదుపులోకి తీసుకున్నారు అంతే. అయితే.. చాలా రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామైంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, అస్సాం, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో ఇటీవలి అనుభవాల దృష్ట్యా భద్రతను పటిష్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. దుకాణాలు, వ్యాపార వాణజ్య సంస్థలు యథావిధిగా కార్యకలాపాలు సాగించాయి. అగ్నిపథ్‌పై నిరసనల, ఆందోళనల కారణంగా.. రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సోమవారం దేశవ్యాప్తంగా 612 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు రైల్వే శాఖ తెలియజేసింది. 602రెళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. మంగళవారం కూడా జాగ్రత్తలు పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 24న సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలు అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో ఈ నెల 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ప్రకటించారు. వాటిలో యువత, పౌర సమాజం ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తామన్నారు. బీకేయూ నేతృత్వంలో 30న తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలనూ 24నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం మూసివేయాలని నిర్ణయించాము. పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కారణంగా 20జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. పంజాబ్‌లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసుల అలర్ట్ ప్రకటించారు. యూపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. జైపూర్, నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. All schools in Jharkhand will remain closed today in view of the #BharatBandh protests. #AgnipathProtests #AgnipathScheme https://t.co/I2m9R2IM59 — India.com (@indiacom) June 20, 2022 ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే లవ్ ఎఫైర్.. సెక్స్ రాకెట్ బట్టబయలు -
మహోద్యమానికి మద్దతివ్వండి
నేడు భారతదేశం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతు న్నది. డెబ్బై ఐదు ఏళ్ల భారతదేశ స్వాతంత్య్ర సంస్మరణగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరుతో భారతదేశ స్వావలంబన ఆవిష్కరణకు పూను కున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ బదులు ‘ఆత్మనిర్బల్ భారత్’గా మార్చి వేస్తున్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశ ప్రజల కష్టంతో, చెమట చుక్కలతో పెద్దల దార్శనికతతో సంపాదించిన ప్రభుత్వరంగ ఆస్తు లను మొత్తాన్నీ అధికారికంగానే అమ్మకానికి పెట్టారు. బహిరంగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ప్రపంచ స్థాయిలోని అన్ని కార్పొరేట్ సంస్థలకు భారతదేశ ప్రభుత్వరంగ సంస్థలను, దేశ సంపదను... ‘ప్రైవేటీకరణ ’, ‘పెట్టుబడుల ఉపసంహరణ’, ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్’ పేరుతో అమ్మకానికి పెడు తున్నారు. ప్రపంచంలో ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే మనదేశం నిలబడగలిగింది. మోదీ ప్రధాని కాకముందే ప్రపంచంలోని 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందనే విషయం మరువరాదు. చేసిన ప్రమాణం ఏమయ్యింది? ‘హై సౌగంధ ముఝే ఇస్ మిట్టీకి, మై దేశ్ నహీ బిక్నా దూంగా’(దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనివ్వనని దేశమాతపై ప్రమాణం చేసి చెబుతున్నాను) అంటూ నాటకీయ హావభావాలతో మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేకసార్లు అన్నారు. ఈ రోజు అందుకు భిన్నంగా జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని కొద్దిమంది పారిశ్రామిక వేత్తలకు అతి తక్కువ ధరలతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తున్నారు. స్వాతంత్య్ర తొలిదినాల్లో భారతదేశంలో కేవలం ఐదు ప్రభుత్వరంగ సంస్థలు రూ. 29 కోట్ల మూలధనంతో ఉండేవి. 2019 మార్చి నాటికి ఆ సంస్థల సంఖ్య 348కి చేరింది. వాటి మూలధనం రూ. 31,17,000 కోట్లయింది. ఇవి కేంద్ర ఖజానాకు రూ. 3,76,000 కోట్లు ప్రతి ఏడాదీ ఆదాయం సమకూరుస్తున్నాయి. ఐతే నీతి ఆయోగ్ సిఫార సులకు అనుగుణంగా 2021–22 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్వహణలో ఉన్న 300 ప్రభుత్వరంగ సంస్థలను కేవలం 24 పరిశ్రమలుగా కుదిస్తామని పార్లమెంట్లో ప్రకటన చేశారు. అలాగే రూ. 40 లక్షల కోట్లకు పైగా ఆస్తులున్న 58 బీమా రంగంలో ఉన్న సంస్థలనూ తెగనమ్మే పనిలో ఉంది కేంద్రం. గత ఐదేళ్లలో ఎల్ఐసీ ఒక్కటే రూ. 28,200 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసీని భారతదేశ బంగారు బాతుగా అభివర్ణిస్తారు. ఈనాడు ఎల్ఐసీని కూడా పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుల ఆస్తుల విలువ దాదాపు రూ. 40 లక్షల వేల కోట్లు ఉంటుంది. మోదీ ప్రభుత్వం 28 ప్రభుత్వ బ్యాంకులను విలీనాల ద్వారా 12కు కుదించింది. 1921– 22లో బ్యాంకులకు రూ. 1.58 లక్షల కోట్ల నిర్వహణ (ఆపరేటివ్) నికర లాభాలు వచ్చాయి. ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు డివిడెండ్ పేరుతో బ్యాంకులు చెల్లిస్తున్నాయి. అటువంటి కామధేను లాంటి బ్యాంకులలో మరో ఎనిమిదింటిని ప్రైవేటీకరించి, కేవలం 4 ప్రభుత్వ బ్యాంకులకు తగ్గిస్తారు. పేదవాడి గుండె చప్పుడు అయిన రైల్వే పరిశ్రమలో కూడా ప్రైవేటీకరణ ప్రారంభమైంది. నాలుగు రంగాలే వ్యూహాత్మకమా? 2021–22 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పథకం ప్రకారం కేవలం నాలుగు రంగాలను వ్యూహాత్మక రంగాలుగా పేర్కొన్నారు. అవి 1). అణు ఇంధనం, స్పేస్ అండ్ డిఫెన్స్, 2). ట్రాన్స్‌పోర్టు అండ్ టెలికమ్యూనికేషన్, 3). పవర్, పెట్రోలియం, కోల్, ఖనిజాలు, 4). బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు. ఈ నాలుగు రంగాలలో మాత్రమే వ్యూహాత్మకంగా అతి తక్కువ వాటాను అంటే 2 నుంచి 3 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. అలాగే బ్రిటీష్ కాలం నుంచి ఉన్న 44 కార్మిక చట్టాలలోని కీలకమైన 29 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి, సమ్మెచేయలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. న్యాయ సహాయం కూడా అందని విధంగా చేసి ప్రభుత్వరంగ సంస్థల నుంచి ప్రభుత్వ సర్వీసు సెక్టార్ వరకు అన్ని రంగాలలో కార్మికులను రోడ్లపైకి తెస్తున్నారు. అలాగే 2015– 16లో 8.5గా ఉన్న పీఎఫ్ వడ్డీ రేటును 8.1కు తగ్గించడం జరిగింది. దీని ప్రభావం దేశంలో ఉన్న కోట్లాది మంది పెన్షనర్లపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ వలన ఇకపైన ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండవు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులే మిగులుతారు. ప్రైవేటీకరణను గట్టిగా సమర్థించే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సైతం ప్రైవేటీకరణ వలన ఉద్యోగాలు కోల్పోవడం తప్పనిసరిగా జరుగుతుందనిపేర్కొన్నారు. మొత్తంగా దేశంలోని కేవలం ఒక్క శాతం మినహా 140 కోట్ల మంది భవిష్యత్తును పణంగా పెట్టి దేశాన్ని అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోదీకీ, ఆయన ప్రభుత్వా నికీ... ఆ అధికారం ఎవరిచ్చారు? (క్లిక్: ఆ ఒప్పందం సఫలం కావాలంటే...) ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని అడ్డు కోకుంటే ఇప్పటికే ఆకలి సూచీ పట్టికలో 116 దేశాల్లో 101 స్థానంలో ఉన్న భారతదేశం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. ఆకలి చావులతో కూడిన కరవు దేశంగా మారే ప్రమాదం ఉన్నది. ఒక్క శాతం మంది చేతిలో 90 శాతం సంపద పేరుకుపోతే అది అభివృద్ధి కాదు. అంతులేని అసమానతల ప్రతీక! ఈ నేపథ్యంలో దేశంలో ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. దేశాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే రైతాంగ తరహా మహా కార్మిక ఉద్యమానికి దేశం సన్నద్ధం కావాలి. (క్లిక్: ఈ విజయం ఎలా సాధ్యమైంది?) - కూనంనేని సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
అత్యవసర సేవలపై సమ్మె ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెతో అత్యవసర సేవలకు అంతరాయం కలిగేలా కన్పిస్తోంది. రవాణా, బ్యాంకింగ్, రైల్వేలు, విద్యుత్‌పై ప్రభావం పడనుంది. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. వ్యవసాయ, తదితర రంగాల కార్మికులూ పాల్గొంటారన్నారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, ఆదాయ పన్ను, బ్యాంకులు, బీమా రంగాల కార్మిక సంఘాలు సమ్మె నోటీసులివ్వగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ చర్యలను, కార్మిక చట్టాల మార్పులను వెనక్కి తీసుకోవాలన్నది వీటి డిమాండ్. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరుతున్నాయి. సమ్మె నేపథ్యంలో జాతీయ గ్రిడ్‌లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. -
Fact Check: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..?
డిసెంబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం భారత్ బంద్ ప్రకటించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొందరు నిజమో కాదో అని తెలుసుకోకుండా ఇతరులకు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ పోస్ట్ నకిలీదని స్పష్టం చేసింది. "సోషల్ మీడియాలో వైరల్ చిత్రంలో డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ ప్రకటించినట్లు పేర్కొన్నారు! కానీ, ఏ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదు. దయచేసి అటువంటి తప్పుదోవ పట్టించే చిత్రాలు లేదా సందేశాలను షేర్ చేయవద్దు" అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ ట్వీట్ చేసింది. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవతున్న సమయంలో ఈ నకిలీ సందేశం ప్రసారం అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కోరింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్సైట్. నిజనిర్ధారణ విషయాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది. सोशल मीडिया पर वायरल एक #फर्जी तस्वीर में दावा किया जा रहा है कि 31 दिसंबर तक भारत बंद का ऐलान कर दिया गया है! #PIBFactCheck ▶️ केंद्र सरकार द्वारा #लॉकडाउन के संबंध में ऐसी कोई घोषणा नहीं की गई है। ▶️ कृपया ऐसी भ्रामक तस्वीरों या संदेशों को साझा न करें। pic.twitter.com/BT1Tfxoebr — PIB Fact Check (@PIBFactCheck) December 23, 2021 (చదవండి: జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!) -
భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఉత్తర భారతంలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పలు రైళ్లు రద్దు కావడం, రహదారుల దిగ్బంధనం, ధర్నాలు కనిపించాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ బంద్‌లో ఘర్షణలు జరగలేదు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, పశ్చిమ యూపీతో పాటు కేరళ, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో బంద్ ప్రభావం కనిపించింది. 40 రైతు సంఘాలతో కూడిన కిసాన్ సంయుక్త మోర్చా ఈ బంద్‌ను నిర్వహించింది. తమ పిలుపునకు 23కుపైగా రాష్ట్రాల్లో అనూహ్య, చరిత్రాత్మక స్పందన లభించిందని, అవాంఛనీయ సంఘటన జరగలేదని మోర్చా తెలిపింది. రైతు ఆందోళనలు ఆరంభమై 10 నెలలు అవుతున్న వేళ తాము తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ సహకారం లభించిందని తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ఉత్తర భారతదేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అనేక రైళ్లు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగింది. పలుప్రాంతాల్లో ధర్నాల కారణంగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ పరిసర నగరాలపై బంద్ ఎక్కువ ప్రభావం చూపింది. పంజాబ్‌లో బంద్ అధిక శాతం విజయవంతమైంది. హరియాణాలోని సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్ రహదారులను రైతులు దిగ్బంధించారు. బంద్‌కు కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్‌పార్టీలు, స్వరాజ్ ఇండియా, ఆర్జేడీ మద్దతునిచ్చాయి. బంద్‌కు మద్దతు ఇవ్వమని టీఎంసీ తెలిపింది, అయితే రైతు ఆందోళనకు మద్దతిస్తామని పేర్కొంది. భారత్ బంద్‌తో దేశవ్యాప్తంగా 50 రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయని రైల్వే అధికారులు చెప్పారు. బంద్ అనంతరం అన్ని సర్వీసులను పునరుద్ధరించామన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల రైల్‌రోకోలు జరిగాయని, దీంతో సుమారు 50 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చర్చలే శరణ్యం: తికాయత్ రైతు సమస్యలకు పరిష్కారం కోర్టుల్లో దొరకదని, చర్చలే సమాధానమని రైతు నేత రాకేశ్ తికాయత్ అభిప్రాయపడ్డారు.తమ ఆందోళనలు ఎలా ముగుస్తాయో తెలియదని, కానీ దేశీయ యువత తమతో చేతులు కలిపిందని చెప్పారు. తినే తిండిని మార్కెట్ వస్తువుగా మార్చకుండా ఉండడానికే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. చట్టాల ఉపసంహరణతోనే ఈ ఆందోళనలు ముగుస్తాయని స్పష్టం చేశారు. చట్టాల రద్దు, వ్యవసాయ రంగ ప్రైవేటీకరణను ఆపడం, మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కూడా రైతుల ప్రధాన డిమాండన్నారు. ప్రజలకు ఒక్కరోజు ఇబ్బందులు కలిగిఉండొచ్చని, కానీ రైతుల కోసం మర్చిపోవాలని కోరారు. ఇప్పటివరకు చట్టాలకు సంబంధించి ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. -
TS: ఎక్కడికక్కడ అరెస్టులు.. భారత్ బంద్ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, లేబర్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన భారత్ బంద్ రాష్ట్రంలో ప్రశాంతంగా సాగింది. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు సోమవారం నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమం అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసింది. ఆదివారం రాత్రి నుంచే జోరుగా వర్షం కురుస్తుండటంతో సోమవారం ఉదయం ఆందోళనకారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు ఇబ్బందిపడ్డారు. పోలీసులు ఉదయం నుంచే అఖిలపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడంతోపాటు ఆందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. జాతీయస్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా ఉద యం నుంచే కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీతో పాటు పలు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్రంలోని బస్‌డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఉదయం 10 గం. తర్వాత రాష్ట్రంలోని చాలా ప్రాం తాల్లో బస్సుల రాకపోకలు యథావిధిగా సాగా యి. అయితే, ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తెరచినా విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు అక్కడకు చేరుకుని మూసివేయించారు. ఉదయం 10 గంటల తర్వాత వాణిజ్య దుకాణాలు యథావిధిగా నడిచాయి. మాల్స్, మార్కెట్లు కూడా పలుచోట్ల ఉదయం నుంచే కార్యకలాపాల్లో నిమగ్నంకాగా, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆం దోళనకారులు మూసివేయించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పార్టీలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నినాదాలు చేశాయి. ఈ బంద్‌లో పాల్గొన్న ముఖ్య నేతలనూ పోలీసులు అరెస్టు చేసి.. కొంతసేపటి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. బంద్‌లో భాగంగా ప్రతిపక్షాల రాస్తారోకోతో ఖమ్మం బైపాస్ రోడ్డులో బారులు తీరిన వాహనాలు ఎక్కడికక్కడ నిర్బంధం... బంద్ సందర్భంగా పలువురు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలను సోమవారం ఉదయాన్నే గృహ నిర్బంధం చేశారు. ఉప్పల్ బస్‌డిపో ఎదుట జరిగిన ఆందోళనలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత అజీజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. హయత్‌నగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడా వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకులు జూల కంటి రంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, మధుయాష్కీ గౌడ్, మల్రెడ్డి రాంరెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దన్ తదిత రులు ర్యాలీ నిర్వహించారు. వీరిని అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కోదండరాం దుస్తులు చినిగిపోయాయి. శంషాబాద్ వద్ద సీపీఐ నేత నారాయణ, పుల్లూరు టోల్గేట్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పెబ్బేరు వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి, మేడ్చల్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ముంబై హైవేపై మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, బంజా రాహిల్స్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, తుక్కుగూడ వద్ద ఏఐసీసీ కార్య దర్శి వంశీచందర్‌రెడ్డి ఆందోళనలో పాల్గొనగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరా బాద్– విజయవాడ, హైదరాబాద్– శ్రీశైలం, హైద రాబాద్–బెంగళూర్ వెళ్లే జాతీయ రహదారులు రాస్తారోకోలతో స్తంభించిపోయాయి. హైదరాబా ద్లో ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు యథావిధిగా నడిచాయి. పలు ప్రాంతాల్లో బంద్ ఇలా... ►సిద్దిపేట జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. పలుచోట్ల ప్రతిపక్షాల కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. ►నల్లగొండ బస్‌స్టాండ్ ఎదుట బైఠాయించిన అఖి లపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్య క్షుడు చెరకు సుధాకర్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉమ్మడి నల్లగొండ పరిధి లోని మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ, నకిరేకల్ ప్రాం తాల్లో ఆందోళనకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నారా యణపేటలో మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. మిగతా మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉదయం 10 నుంచే బస్సులు నడిచాయి. పలు షాపులు, హోటళ్లు, వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణంగా సాగింది. సోమవారం తెల్లవారుజాము నుంచే అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. జోరు వర్షంలో సైతం ఖమ్మం ఆర్టీసీ బస్‌డిపో, బస్టాండ్, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం బస్‌డిపోల ఎదుట బైఠాయించారు. దీంతో మధ్యాహ్నం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 610 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొన్ని బస్సులను నడిపారు. ►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నా యకులను పోలీసులు అరెస్టు చేశారు. యాచా రం, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, ఆది భట్ల ప్రాంతాల్లో పోలీసులు వారిని అదుపులో కి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగా రెడ్డిని ఉదయమే గృహ నిర్బంధం చేశారు. ►ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాం తంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పట్టణాల్లో దుకాణాలు కొంత ఆలస్యంగా తెరిచారు. కాం గ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు చేస్తూ వ్యాపార సముదాయాలను మూసేయిం చారు. మధ్యాహ్నం తరువాత దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు తెరుచుకున్నాయి. ఆ చట్టాలు రద్దు చేయాలి.. ‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశాన్ని పెట్టుబడిదారు లకు తాకట్టు పెట్టి తెగన మ్మేందుకు సిద్ధమయ్యారు. రైతు చట్టాలను నిరసిస్తూ నాడు మంత్రి కేటీఆర్ కూడా బంద్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు ఢిల్లీ పిలుపుతో కేసీఆర్ అక్కడ విందులో పాల్గొన్నారు. అందరికి ఉద్యోగాలు వచ్చే వరకు, నోటిఫికేషన్ ఇచ్చే వరకు కేసీఆర్ ఫ్లెక్సీలకు లిక్కర్‌తో అభిషేకం చేయాలి. ప్రతి బార్ షాపు ముందు కేసీఆర్ బొమ్మ పెట్టాలి’. – టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మోదీ సర్కార్‌పై వ్యతిరేకతతో... దేశంలో ఆరు రాష్ట్రాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. రైతు ప్రభుత్వం అని చెప్పు కుంటున్న తెలంగాణ సర్కా ర్ మద్దతు ఇవ్వడం లేదు. ఈ బంద్ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం కాదు.. మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలే ప్రకటిం చింది. – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆ అధికారం లేదు... నిరసన హక్కును నియంత్రించే అధికారం తప్ప.. నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. నిరసన ప్రజల హక్కు, దాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోర్టు లు తీర్పిచ్చినా సర్కార్ పట్టించుకో వడంలేదు. నిరసనకారులను అరెస్ట్ చేస్తుండటా న్ని చూస్తే కేంద్రంతో రాష్ట్ర సర్కార్ కుమ్మకైనట్లు అర్థమవుతోంది. – టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆ చట్టాలు రైతులకు ఉరితాళ్లు కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు అదానీ, అంబానీకి బానిసలుగా మార్చేవి మాత్రమే. మోదీకో హటావో.. దేశ్‌కో బచావో అన్నది ఇప్పుడు అత్యవసరం. – సీపీఐ జాతీయ నేత నారాయణ -
ఏపీ: ‘భారత్ బంద్’ ప్రశాంతం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో భారీవర్షం కురుస్తున్న వేళ పటిష్ట బందోబస్తు మధ్య రాష్ట్రంలో సోమవారం ‘భారత్ బంద్’ ప్రశాంతంగా ముగిసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరిగిన దేశవ్యాప్త బంద్‌లో రాజకీయ పార్టీలు తమ జెండాలను పక్కనబెట్టి రైతు సంక్షేమమే అజెండాగా పాల్గొన్నాయి. జన ప్రయోజనమే తమ ప్రాధాన్యత అని నినదించాయి. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతు తెలపడంతో బస్సులు, బడులు బంద్ అయ్యాయి. దారులు మూసుకుపోయాయి. రైళ్లు రద్దయ్యాయి. వాణిజ్య సముదాయాలు, వ్యాపారకేంద్రాలు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతోపాటు భారీవర్షం కూడా తోడవడంతో అత్యవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు రాలేదు. సినీ థియేటర్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పాడేరు ఏజెన్సీలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంబులెన్స్, డాక్టర్లు.. ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలిపినట్టు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వర్షాలను లెక్కచేయకుండా ఉదయం ఏడు గంటలకే వామపక్షాల, కార్మికసంఘాల నేతలు ఆందోళనకారులతో కలిసి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయవద్దని కోరుతూ భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుపతిలో రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. కార్మిక కర్షక మైత్రి, లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని, సాగురంగాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కాపాడాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని, లేబర్ కోడ్లను రద్దుచేయాలని, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. భారత్ బంద్కున్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను, వైరుధ్యాలను పక్కనబెట్టి బంద్‌లో పాల్గొన్నాయి. రైతుసంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్షంలోనే విశాఖలో బంద్ కొనసాగింది. నిరసనకారులు రోడ్లపై బైఠాయించి బంద్‌లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోను బంద్ విజయవంతమైంది. పలుచోట్ల వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలిపారు. రైతుల గుండెచప్పుడు ఢిల్లీకి వినిపించడంలో సహకరించినందుకు ధన్యవాదాలని కిసాన్ మోర్చా నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉంది. రైతు సంఘాల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం – వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి సాక్షి, అమరావతి: రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారత్ బంద్
-
Bharat Bandh: బెంగళూరు డీసీపీ కాలిపై నుంచి దూసుకెళ్లిన కారు
Bharat Bandh Highlights: బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారత్ బంద్ ర్యాలీలో భాగంగా కారులో వెళుతున్న నిరసనకారుడు.. తన కారును డీసీపీ ధర్మేందర్ కుమార్ మీనా పాదాల మీదుగా తీసుకెళ్లాడు. బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ డీసీపీ మీనా.. గోరగుంటెపాళ్య వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత నిరసనకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో డీసీపీ కాలుకి గాయలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికైత్ మండిపడ్డారు. పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించడం లేదని విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ తన మ్యానిఫెస్టోలో చెరకు ధరను రూ. 375-రూ. 450 కి పెంచుతానని హామీ ఇచ్చాడని అయితే అతను దానిని రూ. 25 మాత్రమే పెంచారని అన్నారు. పోలీసుల బారికేడ్లను పగలగొట్టిన రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నేపధ్యంలో తమిళనాడు నిర్మానుష్యంగా మారింది. చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలో పోలీసులతో ఘర్షణ పడిన రైతులు పోలీసుల బారికేడ్లను పగలగొట్టారు. దీంతో పరిస్థితి చెయ్యి దాటింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Protesters agitating against the three farm laws break police barricade in Anna Salai area of Chennai, in support of Bharat Bandh called by farmer organisations today; protesters detained by police pic.twitter.com/iuhSkOeGFV — ANI (@ANI) September 27, 2021 గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దు: రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రవేశించే వాహనాలను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేరళ: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేరళలో భారత్ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైతుల నిరసనకు మద్దతుగా.. తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్ బంద్‌లో పాల్గొన్నాయి. ఢిల్లీ- అమృత్సర్: ఢిల్లీ- అమృత్సర్ జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు నడుంబిగించాయి. పంజాబ్- హర్యానా: భారత్ బంద్‌లో భాగంగా పంజాబ్-హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను వేసివేసినట్లు ఓ రైతు మీడియాతో పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్: ఘజిపూర్ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల నిరసనలతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఘజిపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌ను కొనసాగుతోంది. భారత్ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీలోని విజయవాడ బస్టాండ్ ఎదుట వామపక్ష, కాంగ్రెస్ పార్టీల ఆందోళన చేపట్టాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వామపక్ష పార్టీల బంద్‌కు వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వర్షం సైతం లెక్క చేయకుండా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళన చేస్తున్నారు. -
కొనసాగుతున్న భారత్ బంద్
-
భారత్‌బంద్‌కు వైఎస్ షర్మిల మద్దతు
సాక్షి, హైదరాబాద్: రైతు చట్టాలను రద్దు చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించనున్న భారత్‌బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. శనివారం ఈ మేరకు ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్ భరత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులను కోరారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ఎండగట్టాలని విజ్ఞప్తిచేశారు. మోసకారి ప్రభుత్వం తల వం చేందుకు తాను పాదయాత్రను చేపట్టబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పేదోడి పొట్టకొట్టే రాబందుల రెక్కలు తుంచేందుకు, ప్రజలను పీడించే పాలకుల భరతం పట్టేందుకు వస్తున్నా.. అని షర్మిల అన్నారు. చదవండి: (నేడే భారత్ బంద్) -
ఆంధ్రప్రదేశ్: నేటి బంద్‌కు సర్వం సన్నద్ధం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు సోమవారం తలపెట్టిన భారత్ బంద్‌కు రాష్ట్రంలో పూర్తి సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం.) ప్రకటించింది. బంద్‌కు అధికార వైఎస్సార్సీపీ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బంద్‌లో పాల్గొంటున్నట్టు తెలిపాయి. బంద్‌కు సహకరిస్తామని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను నిలిపేస్తున్నారు. విద్య, వాణిజ్య, వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. సినిమా హాళ్లలో ఉదయం పూట ఆటలు రద్దుచేస్తున్నట్టు సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే నోటీసు బోర్డులు పెట్టాయి. లారీలు, ఆటోలను తిప్పబోమని ఆయా సంస్థలు ప్రకటించాయి. రవాణా పూర్తిగా స్తంభించనున్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ఎస్.కె.ఎం. బాధ్యులు వై.కేశవరావు, రావుల వెంకయ్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ బంద్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో జరిగే బంద్‌తోనైనా కనువిప్పు కలగాలని, అందుకుబంద్ సరైన అవకాశమన్నారు. బంద్ ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ 10 నెలలుగా సాగుతున్న పోరాటానికి మద్దతుతోపాటు ఆ చట్టాల రద్దు కోసం, కోట్లాదిమంది కార్మికుల ప్రయోజనాలను కాలరాసేలా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరుతోంది. ప్రతి పంటకు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని పెంచాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పి మాట తప్పడాన్ని నిరసిస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయవద్దని నినదిస్తోంది. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేయడాన్ని విమర్శించింది. బంద్‌పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు, ప్రజాసంఘాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. అన్ని వర్గాల మద్దతు కూడగట్టాయి. ఈ బంద్‌కు బీజేపీ మినహా ప్రధాన పార్టీలన్నీ మద్దతునిచ్చాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం స్వచ్ఛందంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపేసింది. ప్రతిపక్ష టీడీపీ తన శ్రేణులను బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. బంద్‌ను జయప్రదం చేసేందుకు వామపక్షాలు 15 రోజులుగా పలు కార్యక్రమాలను నిర్వహించాయి. నేడు పాఠశాలలకు సెలవు భారత్ బంద్‌కు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. ఈ సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్స్ కోచింగ్‌కు ఎంపిక పరీక్ష వాయిదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు సోమవారం జరగాల్సిన ఎంపిక పరీక్షను బంద్ కారణంగా వాయిదా వేసినట్టు ఏపీ స్టడీ సర్కిల్ సంచాలకుడు ఉసురుపాటి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత కోచింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,573 మంది దరఖాస్తు చేశారని, వీరికి సోమవారం నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేశామని పేర్కొన్నారు. ఏపీపీజీఈసెట్‌లో నేటి పరీక్షలు వాయిదా భారత్ బంద్ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ఏపీపీజీఈసెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సెట్ చైర్మన్, కన్వీనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేశామని, ఇదే సెట్‌కు సంబంధించి మంగళ, బుధవారాల్లో జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వివరించారు. వార్డు సభ్యులకు శిక్షణ 29 నుంచి.. పంచాయతీ వార్డు సభ్యులకు సోమవారం నుంచి జరగాల్సిన శిక్షణ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర తుపాను ప్రభావం, భారత్ బంద్ నేపథ్యంలో 2 రోజులు వాయిదా వేసినట్టు ఏపీ ఎస్ఐఆర్డీ డైరెక్టర్ జె.మురళి తెలిపారు. ఈనెల 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. -
నేడే భారత్ బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆందోళనను రాష్ట్రంలో విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్(న్యూడెమొక్రసీ), లిబరేషన్, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీతో పాటు పలు ప్రజా సంఘాలు ఈ బంద్‌లో పాల్గొననున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ను విజయవంతం చేసేలా ఆయా పార్టీలు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్నాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రజాసంఘాలు, పార్టీల అనుబంధ సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించాయి. రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలని ఇప్పటికే పలు పార్టీలు కోరాయి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని, ప్రజల కోసం జరుగుతున్న ఈ బంద్‌లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశాయి. బంద్‌లో పాల్గొనే ముఖ్యనేతలు... ►వరంగల్ హైవేపై బోడుప్పల్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. ►హయత్‌నగర్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి. ►బెంగళూర్ హైవేపై శంషాబాద్ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి. ►బెంగళూర్ హైవేపై పుల్లూరు టోల్గేట్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్. ►బెంగళూర్ హైవేపై పెబ్బేరు వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి. ►శ్రీశైలం హైవేపై తుక్కుగూడ వద్ద మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి. కాంగ్రెస్ శాసనసభ్యుల నిరసన... బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ శాసనసభ్యులు అసెంబ్లీ వరకు నిరసనగా రానున్నారు. ట్యాంక్‌బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండ్లపై వచ్చి శాసనసభ సమావేశాల్లో పాల్గొననున్నారు. పెట్రో ధరలు, నిత్యావస సరుకుల ధరల పెంపుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైకిల్‌పై అసెంబ్లీకి రానున్నారు. బంద్‌ను విజయవంతం చేయాలి.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై నిర్వహిస్తోన్న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలి. ఈ బంద్‌లో అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రజలను భాగస్వాములను చేసి ఆందోళనను సక్సెస్ చేయాలి. కాంగ్రెస్‌కు చెందిన డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇతర పార్టీలను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. అలాగే ఈనెల 30న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలి’. – టీపీసీసీ చీఫ్ రేవంత్ నేడు బస్సులు యథాతథం... రాష్ట్రంలో సోమవారం బస్సులు య«థావిధిగా నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులంతా విధులకు హాజరవుతారని, సాధారణ రోజుల్లో తరహాలోనే ఆర్టీసీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సుల వేళలను మాత్రం మార్పు చేశారు. ఏపీకి వెళ్లే బస్సులను ఆదివారం సాయంత్రం ఏడు తర్వాత నిలిపేశారు. అయితే 10 ఆర్టీసీ సంఘాలతో కూడిన జేఏసీ మాత్రం సమ్మెకు మద్దతు ప్రకటించింది. అయితే బస్సులను ఆపబోమని, విధులకు హాజరవుతామని జేఏసీ నేత వీఎస్‌రావు, రాజిరెడ్డి తెలిపారు. -
దేశ హితం కోసం కలిసి ఉద్యమిద్దాం
అవినీతి, దోపిడీ గుణం, అధికార దర్పం తలకెక్కిన నియంతల కబంధహస్తాల నుండి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దండు కడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళను తరిమికొట్టిన స్వాతంత్య్ర సంగ్రామం, రజాకార్లను తరిమికొట్టిన తెలంగాణ సాయుధ పోరాటాలే స్ఫూర్తిగా భారత్ బంద్‌లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 19 రాజకీయ పార్టీలు దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చాయి. దీనికి భారతదేశ రాజకీయాల గతిని మార్చే శక్తి ఉంది. గతంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగినప్పటికీ దీనికి ఓ ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏడేండ్లలో బీజేపీ దేశాన్ని ఆగం చేసిన తీరూ, జాతీయ ఆస్తులను ఒక్కరిద్దరు బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టిన వైనం, అమలు కాని ఎన్నికల హామీలు, అడ్రస్ లేని అచ్ఛే దిన్, పెరిగిన నిరుద్యోగం, తగ్గిన జీడీపీ, పెగాసస్ గూఢచర్యం, రఫేల్ కుంభకోణం, కరోనా వైఫల్యాలు, రైతుల పాలిట శాపంగా మారిన నల్ల వ్యవసాయ చట్టాలు తదితర ప్రజావ్యతిరేక విధానాల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవటానికి కలిసికట్టుగా నడుం బిగిస్తున్న సందర్భమిది. నాడు కాంగ్రెస్ హయాంలో 10 శాతం వృద్ధిరేటు సాధించిన జీడీపీ, ఇపుడు మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్ల తిరోగమనంలో 0 శాతం కంటే తక్కువగా నమోదయింది. బంగ్లాదేశ్ కంటే వెనుకబడిన పరిస్థితి. 60% చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడితే వాటిని గాలికి వదిలేసి, 72 వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద కార్పొరేట్ కంపెనీలకు పంచి పెట్టారు. 70 ఏండ్లలో కాంగ్రెస్ దేశాన్ని; భారత రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, భారత్ పెట్రోలియం, ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల వంటి జాతీయ ఆస్తులను నిర్మిస్తే, మోదీ 7 ఏండ్లలో వాటిని తన అనుయాయులకు అమ్మేస్తున్నాడు. ఎన్నికల సందర్భంగా, యువతకు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. పార్లే–జీ బిస్కెట్ తయారీ సంస్థ మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఫోర్డ్కార్ల పరిశ్రమ దేశం వదలి పోయింది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు, యువతకు ఉద్యోగాలు కావాలని అడిగితే, అమిత్ షా పకోడీ షాపులు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరుల జీవితాలలోకి తొంగి చూస్తున్నది. పెగాసస్ అనే సాఫ్ట్వేర్ వాడి దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసి, కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారనే అంశంపై, పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్తంభించిపోయాయి. మెజారిటీ ప్రజల మద్దతుతో ఏర్పడిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలను కూల్చి, కాంగ్రెస్ శాసనసభ్యులను చీల్చి, అనైతికంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు మోదీ–షా ద్వయం. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఈ కుట్రలకు కాంగ్రెస్ కూటమి అధికారం కోల్పోయింది. కానీ రాజస్తాన్‌లో బీజేపీ పాచిక పారలేదు. ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాలను తెచ్చి, రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయంచుకునే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయ కల్పన) బిల్లు–2020 సెక్షన్–13 ప్రకారం, ఈ చట్టం అమలు క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మరియు ఏ ఇతర వ్యక్తులపైనగాని కేసులు వేయరాదు. సెక్షన్–15 ప్రకారం, ఈ చట్టం అమలు క్రమంలో తలెత్తిన వివాదాలు సివిల్ కోర్టు విచారణ పరిధిలోకి రావు. ఈ రెండు నిబంధనలూ రాజ్యాంగ విరుద్ధమైనవి. కాంట్రాక్టు వ్యవసాయం రైతుల స్వేచ్ఛను హరించే యత్నం. తమ గొంతు నొక్కే చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ పొలిమేరలలో ఆందోళన చేస్తే, ఆ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. 2014లో ఉన్న ధరలు 2021 వరకు 200 శాతం పెరిగాయి. ప్రపంచంలో ఎక్కడా సాధ్యపడని ఒక వింత మోదీ హయాంలో ఆవిష్కృతమైంది. నిత్యావసరమైన ఉల్లిగడ్డ, సౌకర్యమైన పెట్రోలు, విలాసమైన బీరు... ఈ మూడూ ఒకే ధర రూ.100కు దొరుకుతున్నాయి. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దేశ హితం కోరుకునే పార్టీలు, మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, ప్రజలు పాల్గొని భారత్ బంద్‌ను విజయవంతం చేయాలి. అది మన బాధ్యత. కొనగాల మహేష్ వ్యాసకర్త ఏఐసీసీ సభ్యులు ‘ మొబైల్: 9866 776999 (నేడు జరగనున్న ‘భారత్ బంద్’ సందర్భంగా) -
'భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు': రేపు బస్సులు తిరగవు
సాక్షి, కృష్ణా జిల్లా: వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నడవవు. ఆ తర్వాత నుండి బస్సులు యధావిధిగా తిరుగుతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతు సంఘాలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని, రైతు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రాన్ని కోరుతున్నాం’ అని పేర్ని నాని విన్నవించారు. చదవండి: (26న ‘గులాబ్’ తుఫాన్.. నేడు, రేపు భారీ వర్షాలు) -
భారత్ బంద్ పాక్షికం
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం పంజాబ్, హరియాణా మినహా మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా విజయవంతమైంది. పంజాబ్, హరియాణాల్లో రోడ్డు, రైలు రవాణాను రైతులు అడ్డుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హైవేలను దిగ్బంధించారు. రైళ్లను అడ్డుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న రైతు ఉద్యమానికి 4 నెలలు పూర్తయిన సందర్భంగా రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ కారణంగా 4శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని, 35 ప్యాసెంజర్ రైళ్లను, 40 గూడ్స్ రైళ్లను రైతులు అడ్డుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూపీలోని బల్లియాలో 20 మంది సీపీఐఎంఎల్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రభావం ఢిల్లీపై పెద్దగా లేదు. -
భారత్ బంద్ విజయవంతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో పోరాడుతున్న రైతుల పిలుపు మేరకు శుక్రవారం భారత్ బంద్ నిర్వహించారు. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోనూ బంద్‌ను తలపెట్టిన పలు ప్రధాన పక్షాలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీజేపీ, జనసేన మినహా వైఎస్సార్సీపీ, వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు సంఘీభావంగా నిలిచాయి. లారీ అసోసియేషన్, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి బంద్‌లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు రోడ్లపై రాస్తారోకో, ధర్నాలతో నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు విడనాడాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనకారులు నినదించారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు, హోటల్స్, వర్తక, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. విజయవాడ బస్టాండ్ వద్ద బోసిపోతున్న పోలీస్ కంట్రోల్ రూం సెంటర్ ► విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీఎస్) వద్ద ధర్నా చేపట్టారు. బంద్ సందర్భంగా పలువురు నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ► గుంటూరులో వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ► కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద మధ్యాహ్నం తర్వాత కూడా ఆర్టీసీ బస్సులను బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ► అనంతపురం, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పలు పార్టీలు, కార్మీక సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహించారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భీమవరంలో బస్సులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంద్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమవరం శివారున ఉన్న తిరుమల విద్యా సంస్థకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. క్లాసులు జరగకపోయినా హాస్టల్లో విద్యార్థులు చదువుకోవడాన్ని గమనించిన భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కొంత వాగ్వాదం జరగడంతో విద్యా సంస్థకు చెందిన బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానికులు జోక్యం చేసుకని సర్దుబాటు చేశారు. రాళ్లు రువ్వడంపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిలో గుండు కొట్టించుకుని నిరసన తెలుపుతున్న ఉద్యమకారులు బంద్‌కు మావోయిస్టు పార్టీ మద్దతు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్టు మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణేష్ ఆడియో విడుదల చేశారు. మావోయిస్టులు ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటారని, బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో మారుమోగిన విశాఖ సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జరిగిన పలు నిరసన కార్యక్రమాల్లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’, ‘విశాఖ ఉక్కు – ప్రైవేటీకరణ వద్దు’ అంటూ ఆందోళనకారులు నినదించారు. జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థలు, వాణిజ్య, వర్తక సముదాయాలు, దుకాణాలు మూతపడ్డాయి. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు డిపోలకే పరిమితమయ్యాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూసీ, సీఎఫ్ఐటీయూ, టీఎన్టీయూసీ , డీవైఎఫ్ఐ, ఐవైఎఫ్, ఏపీ మహిళా సమాఖ్య, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, ఏఐడీఎస్వో, పీడీఎస్‌వో నాయకులు నిరసనలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగర, రూరల్ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు. విశాఖపట్నం మద్దిలపాలెం డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ► గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. హెచ్‌పీసీఎల్ గేటు వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేతలు నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.మోకాళ్లపై నిరసన తెలిపారు. ► గాజువాక, లంకెలపాలెం, కూర్మన్నపాలెం, షీలానగర్, పెదగంట్యాడ ప్రాంతాల్లో ఆయా వైఎస్సార్సీపీ పార్టీల నేతలు, అఖిలపక్ష కారి్మక సంఘాల నేతలు కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్దిలపాలెం కూడలిలో నిరసన చేపట్టి, వెంకోజిపాలెం వరకు ప్రదర్శన కొనసాగించారు. ► హుకుంపేట, అరకులోయ జంక్షన్, పాడేరు, అనకాపల్లి మెయిన్‌రోడ్ జంక్షన్లో రాస్తారోకోలు నిర్వహించారు. -
భారత్ బంద్ ప్రశాంతం
సాక్షి నెట్వర్క్: అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో వివిధ సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడక్కడా రోడ్లపై బైఠాయించడమే కాకుండా, పలుచోట్ల దుకాణాలు మూసేయించారు. హన్మకొండలో పీడీఎస్‌యూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ సందర్భంగా పోలీసులు బస్టాండ్ల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. కరీంనగర్లో ఆందోళనలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. మెదక్‌లోనూ రోడ్డుపై బైఠాయించిన వామపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
ఏపీ: డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపు నిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇదే రోజున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా బంద్ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక రూపాల్లో నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. అంబులెన్స్, అత్యవసర సేవలు మినహా నేడు ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బస్సులు రోడ్డెక్కనున్నాయి. కాగా, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాలుపంచుకుంటున్నాయి. బీజేపీ, జనసేన మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ బంద్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. గ్రేటర్ విశాఖలో సైతం ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా పాఠశాలలు, కళాశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. అదే విధంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు సైతం బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్చందంగా మూతపడ్డాయి. మద్దిలపాలెం, గాజువాక జంక్షన్లో వామపక్షాలు నిరసనలు చేపట్టగా.. చిత్తూరు జిల్లాలో సైతం వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, సాగుచట్టాలను రద్దు చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బంద్ నేపథ్యంలో డీజీపీ సవాంగ్ అవసరమైన చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లను డీజీపీ ఆదేశించారు. చదవండి: నేడే భారత్ బంద్ -
నేడే భారత్ బంద్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్ బంద్ లేదు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్బీర్ సింగ్ చెప్పారు. పలు ట్రేడ్ యూనియన్లు, సంఘా లు తమ బంద్‌కు మద్దతు తెలిపాయన్నారు. అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు. మేం పాల్గొనం రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో తాము పాల్గొనమని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని సమాఖ్య పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే కిసాన్ మోర్చా మాత్రం పలు యూనియన్లు, పార్టీలు, సంఘాలు తమకు మద్దతు ఇచ్చినట్లు చెబుతోంది.బంద్ ప్రభావం పంజాబ్, హర్యానాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుందని కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాలని ట్రేడర్ల సమాఖ్యలకు రైతులు విజ్ఞప్తి చేశారని, సాగు చట్టాలు ట్రేడర్లపై కూడా పరోక్షంగా నెగెటివ్ ప్రభావం చూపుతాయని చెప్పారు.