అనంతపురంలో వివిధ యూనియన్ల ర్యాలీ
సాక్షి, అమరావతి/ నెట్‌వర్క్: కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన భారత్ బంద్ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. అన్నదాతకు అండగా తలపెట్టిన బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా సంఘీభావం ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వామపక్షాలతో పాటు రైతు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డుపైకి వచ్చిన ర్యాలీలు, ధర్నాలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి.
రాష్ట్ర సరిహద్దులో ట్రాక్టర్లతో నిరసన
విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేటకు సమీపంలోని రాష్ట్ర సరిహద్దు వద్ద రైతులు ట్రాక్టర్లతో నిరసనకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ లెనిన్ సెంటర్‌లో వ్యవసాయ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ నాగళ్లు, గొర్లు వంటి వ్యవసాయ పనిముట్లతో వినూత్న ప్రదర్శన నిర్వహించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్‌బీఎస్) ఎదుట వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించాయి. తిరుపతిలోనూ ప్రజలు బంద్ పాటించగా.. తిరుమలకు మినహాయింపు ఇవ్వడంతో తిరుపతి–తిరుమల మధ్య రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.
గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో మానవహారం
వరి కంకులతో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
అనంతపురంలో సీపీఐ నాయకులు ఎడ్లబండ్లపై తిరుగుతూ నిరసన తెలియజేశారు. సీపీఎం నాయకులు టవర్‌క్లాక్ వద్ద రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంబేడ్కర్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మపై వరి కంకులు వేసి దహనం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.
వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్
నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు.. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అఖిల భారత కిసాన్ సభ ఉçపాధ్యక్షులు రావుల వెంకయ్య, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, న్యూ డెమోక్రసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం
ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతాన్నే అనుసరించే తెలుగుదేశం పార్టీ భారత్ బంద్ విషయంలోనూ అదే వైఖరిని అవలంబించింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికిన టీడీపీ.. మరోవైపు తాము రైతుల పక్షమన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ, ఇతర ప్రాంతాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు మాజీ మంత్రులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మాట్లాడటం విస్మయం కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment