సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. భారత్ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల పోరాటం న్యాయబద్ధమైనది, వారి డిమాండ్స్‌కు టీఆర్‌ఎస్ పార్టీ మద్దతినిస్తుందని ఆదివారం ఓ ప్రకటన ద్వారా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. (చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు)
ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు జరిగాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. అయినప్పటికీ.. ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మంగళవారం నాటి బంద్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున రైతులు దేశ రాజధానికి చేరకుంటున్నారు.
విపక్షాల మద్దతు..
8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్‌ఎస్‌పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్‌కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment