న్యూఢిల్లీ : సామాన్యులకు వాత పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ఈ భారత్ బంద్‌కు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ మినహా మిగతా అన్ని విపక్ష పార్టీలు ఈ బంద్‌ను చేపడుతున్నాయి. ఈ బంద్ ప్రభావంతో దేశమంతా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బిహార్‌లో ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌తో ఓ చిన్నారి మృతి చెందింది. ట్రాఫిక్ జామ్‌లో అంబులెన్స్ చిక్కుకోవడంతో, ఈ సంఘటన ఏర్పడింది. కాంగ్రెస్, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఈ బంద్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఢిల్లీలో విపక్షాలతో కలిసి కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది.
చాలా ప్రాంతాల్లో దుకాణాలు స్వచ్ఛందంగానే మూతపడ్డాయి. పలుచోట్ల రైలు రోకోలు జరిగాయి. బంద్ ప్రభావంతో రైళ్లు నిలిచిపోవడంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు రోకోలు చేస్తున్న నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయడం, ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు బైక్ ర్యాలీలను కూడా చేపట్టారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని, పెరుగుతున్న ధరలను తగ్గించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ వైఫల్యం వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కర్ణాటక, ఒడిశాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వారణాసిలో వినూత్న రీతిలో బంద్ చేపట్టారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ఈ బంద్ చేపట్టారు. యూపీలో బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ బంద్‌తో, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా భేటీ అయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై అమిత్ షా మంత్రితో చర్చించారు.
మోదీ సర్కార్ గద్దె దించాలి...
‘పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అయినా ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదు. ముఖ్యమైన అన్ని అంశాలపై మోదీ మౌనం పాటిస్తూ ఉంటారు. ప్రజల సమస్యలను పట్టించుకోరు. విపక్షాలు ఏకమైన మోదీ సర్కార్‌ను గద్దె దించాలి’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాలుగేళ్ల పాలనలో సామాన్యుడు నష్టపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో పాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలు విపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును విపక్షాలు ముక్త కంఠంతో నిరసించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు దద్ధరిల్లుతున్నాయ్...
తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఈ బంద్‌కు పలు పార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్ సందర్భంగా విజయవాడలో చాలా వరకు స్కూళ్లు, దుకాణాలు స్వచ్చందంగా మూసివేశారు.
శ్రీకాకుళంలో బంద్ పాక్షికంగా కనిపించింది. తెల్లవారు జామునుంచే బస్సులు రోడ్లపై కనిపించాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి దాదాపు శ్రీకాకుళంలానే కనిపించింది. ఇక్కడ కూడా బస్సులు తెల్లవారుజాము నుంచే తిరగడం ప్రారంభించాయి. అడ్డుకోవాలని ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్తలు బస్సు డిపోల బయట బైటాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశాయి.తిరుపతిలో శ్రీవారి భక్తులను తిరుమలకు చేరవేసే బస్సులు మినహా మరేవీ నడవడం లేదు. విశాఖ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ తదితర ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు, నినాదాలు చేస్తున్నారు. మోదీ పాలన సామాన్యులకు భారంగా మారిందని కాంగ్రెస్ పార్టీ నేతలన్నారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, ఇతర పన్నులు, ఎక్స్చేంజ్ డ్యూటీ తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment