
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై(Lok Sabha Speaker Om Birla) ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు. నేను మాట్లాడితే ఆయన పారిపోతున్నారని’ ఎద్దేవా చేశారు.
లోక్‌సభలో తన ప్రసంగంపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘సభలో స్పీకర్ ఓం బిర్లా తాను మాట్లాడేందుకు అనుమతించడం లేదని, కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదని అన్నారు.
‘ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని ఆయన్ని అభ్యర్థించాను. కానీ అతను (స్పీకర్) పారిపోయాడు. ఇది సభను నడపడానికి మార్గం కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా స్పీకర్ నా గురించి అసత్యాలు మాట్లాడుతున్నారు. సభను వాయిదా వేస్తున్నారు. ఇదంతా ఎందుకు.
ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించడానికి అవకాశం ఇవ్వడమే ఈ సమావేశం ఉద్దేశ్యం. నేను లేచి నిలబడినప్పుడల్లా నాకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మేం ఏం చెప్పాలని అనుకుంటున్నామో అది చెప్పాలి. అందుకు మైక్ ఇవ్వాలి కదా. ఇవ్వడం లేదు. నేను ఏం చేయలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాను. అరె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 7-8 రోజులుగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
లోక్‌సభలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోంది. ఆ రోజు కూడా అంతే ప్రధాని మోదీ కుంభమేళా గురించి మాట్లాడారు. ఆ సమయంలో నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నాను. కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ విధానం ఏంటో నాకు తెలియదు. కానీ మమ్మల్ని మాట్లాడటానికి అనుమతించడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.