నిండు సభలో రాహుల్‌ పిల్ల చేష్టలు!: ప్రధాని మోదీ | PM Narendra Modi Fires On Rahul Gandhi At Lok Sabha, More Details Inside | Sakshi
Sakshi News home page

PM Modi: నిండు సభలో రాహుల్‌ పిల్ల చేష్టలు!

Published Wed, Jul 3 2024 3:56 AM | Last Updated on Wed, Jul 3 2024 12:31 PM

PM Narendra Modi Fires On Rahul Gandhi At Lok Sabha

సానుభూతి కోసం సభలో వెక్కిళ్లు 

లోక్‌సభలో రాహుల్‌పై ప్రధాని వాగ్బాణాలు 

ఆయన అబద్ధాలు చెప్పారని ఆరోపణ 

కఠిన చర్యల కోసం స్పీకర్‌కు విజ్ఞప్తి 

కాంగ్రెస్‌ ఫక్తు ‘పరాన్నజీవి పార్టీ’ 

భాగస్వాముల పుణ్యాన 99 సీట్లు 

అయినా గెలిచినట్టు అహంకారం

న్యూఢిల్లీ: విపక్ష నేత రాహుల్‌గాందీపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లోక్‌సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సభలో చేసిన ప్రసంగంలో ఆయన ఆద్యంతం సానుభూతి కోసమే పాకు లాడారంటూ ఆక్షేపించారు. ‘‘నిండు సభలో రాహుల్‌ పిల్ల చేష్టలకు పాల్పడ్డారు. పచ్చి అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించారు’’ అని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం బదులిచ్చారు. 

రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగంలో విపక్ష నేతను అంశాలవారీగా ఏకిపారేశారు. కేంద్రం ఉసిగొల్పినందుకే తనపై క్రిమినల్‌ కేసులు పెట్టారన్న రాహుల్‌ అభియోగాలను ప్రస్తావిస్తూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘‘తనను అలా కొట్టారు, ఇలా కొట్టారంటూ రాహుల్‌ నిండు సభలో ఏడుపు లంకించుకున్నారు. సానుభూతి కోసం కొత్త డ్రామాకు తెర తీశారు. వెక్కిళ్లు పెట్టి రోదించారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్‌ది చిన్న పిల్లాడి బుద్ధి. పలుమార్లు ఎంపీగా ఎన్నికైనా పిల్ల చేష్టలు పోలేదు. 

ఏ విషయాన్నీ సరిగా విడమర్చి చెప్పే సామర్థ్యం లేదు. వ్యవహార జ్ఞానమూ శూన్యం. దీనికి తోడు ఆయనలో తరచూ పిల్ల చేష్టలు శ్రుతి మించుతుంటాయి. అలాంటప్పుడు నిండు సభలో ఎవరిని పడితే వారిని కౌగిలించుకుంటారు. సభలో కూర్చుని కన్ను కొడతారు’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘ఓబీసీలను దొంగలన్నందుకు దోషిగా తేలి శిక్షకు గురైన వ్యక్తి రాహుల్‌. స్వాతంత్య్ర యోధుడు వీర్‌ సావర్కర్‌ను అవమానించినందుకు, దేశంలోనే అతి పెద్ద పార్టీ అధ్యక్షున్ని హంతకుడన్నందుకు, మరెందరో నేతలు, అధికారులు, సంస్థలపై అబద్ధాలు చెప్పినందుకు పరువు నష్టం దావాలు ఎదుర్కొంటున్న వ్యక్తి. 

ఏకంగా సర్వోన్నత న్యాయస్థానానికే బాధ్యతారహితమైన వాంగ్మూలమిచ్చి, అందుకు క్షమాపణలు చెప్పిన చరిత్ర రాహుల్‌ది. వేలాది కోట్ల అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్నారు’’ అంటూ దుమ్మెత్తిపోశారు. పిల్ల చేష్టలను పోగొట్టి రాహుల్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుతున్నట్టు చెప్పారు. అయితే, ‘‘రాహుల్‌ తీరును బాల్య చేష్టలుగా భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోరాదు. సభలో ఆయన ప్రవర్తన వెనక తీవ్ర దురుద్దేశాలున్నాయి. సాటిలేని మన దేశ పరంపరకు అవి చెరగని మచ్చ’’ అంటూ విమర్శలు గుప్పించారు. 

వీటిపై దేశ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ‘‘మీరు సహృదయులు. అవమానాలను కూడా నవ్వుతూ సహిస్తారు. కానీ సభలో నిన్నటి దారుణాలను సీరియస్‌గా తీసుకుని వాటికి అడ్డుకట్ట వేయాల్సిందే. అప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలం. 

సభ గొప్పదనాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. సభలో రాహుల్, కాంగ్రెస్‌ నేతల అబద్ధాల పరంపరపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశమంతా కోరుతోంది’’ అన్నారు. మోదీ ప్రసంగం పొడవునా విపక్ష నేతలు నిరసనలతో హోరెత్తించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడుతూనే ‘మణిపూర్‌’, ‘మణిపూర్‌’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పదేపదే నిలువరించినా వారు వెనక్కు తగ్గలేదు. 

కాంగ్రెస్‌ బతుకంతా అబద్ధాలే 
దేశంలో ఆర్థిక అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు.‘‘ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మరోసారి సుస్థిరతకు పట్టం కట్టారు. మా పదేళ్ల పాలన చూసిన మరోసారి ఆశీర్వదించారు. కాంగ్రెస్‌కు వరుసగా మూడో లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 100 సీట్లు కూడా దాటలేదు. ఇంత దారుణమైన ఓటమి మూటగట్టుకున్నా ఇంకా అహంకారమే ప్రదర్శిస్తోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏను ఓడించామన్న భావనను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది’’ అన్నారు. 

అబద్ధాలన్నే కాంగ్రెస్‌ తన రాజకీయ ఆయుధంగా మార్చుకుందంటూ ఆక్షేపించారు. రాజ్యాంగంపై, రిజర్వేషన్లపై కూడా కాంగ్రెస్‌ నిత్యం అబద్ధాలు చెబుతూ వస్తోందన్నారు. ‘‘నిజాలను దేశ ప్రజల ముందు ఉంచుతున్నా. ఎమర్జెన్సీ సందర్భంగా దేశంపై కాంగ్రెస్‌ రాచరికాన్ని రుద్దింది. వ్యవస్థలన్నింటినీ క్రూరంగా అపహాస్యం చేసింది. ప్రభుత్వాలను కూలదోసింది. మీడియాను అణిచేసింది. రాజ్యాంగానికీ తూట్లు పొడిచింది. మనిషి రక్తం రుచి చూసిన పులి మాదిరిగా కాంగ్రెస్‌ నోటికి అబద్ధాల రక్తం నిండుగా అంటింది. ఈవీఎంలపై అబద్ధాలు. రాజ్యాంగంపై అబద్ధాలు. 

రిజర్వేషన్లపైనా అబద్ధాలు. గతంలో రాఫెల్‌ ఒప్పందంపైనా అబద్ధాలు. ఎల్‌ఐసీపైనా అబద్ధాలు. బ్యాంకులపైనా అబద్ధాలు. ఉద్యోగులను కూడా ప్రభుత్వంపై రెచ్చగొట్టే ప్రయత్నాలు. చివరికి అగ్నివీర్‌ పథకంపైనా నిన్న నిండుసభలో రాహుల్‌ పచ్చి అబద్ధాలు చెప్పారు. రైతులకు కేంద్రం కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి బాధ్యతారహిత చేష్టలతో కాంగ్రెస్‌ నేతలు రాజ్యాంగంతో చెలగాటమాడుతున్నారు. ఇది దారుణం. 60 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీ, అనుభవజు్ఞలైన నేతలెందరో ఉన్న పార్టీ ఇలా అబద్ధాలకు తెగబడుతుండటం, ఇంతటి తప్పుదారిలో వెళ్తుండటం దేశానికి చాలా ప్రమాదకరం’’ మోదీ అన్నారు. 

సైన్యాన్ని బలహీనపరిచే కుట్రలు 
యువత సైన్యంలో చేరకుండా చూసేందుకు, సైనిక దళాలను బలహీనపరిచేందుకు రాహుల్‌ కుట్ర పన్నుతున్నారని మోదీ ఆరోపించారు. అందుకే అగ్నిపథ్‌ పథకంపై పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఆయన ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘మన సైన్యం బలోపేతం కావడాన్ని కాంగ్రెస్‌ ఎన్నడూ భరించలేదు. ఆ పార్టీ హయాంలో కాలానుగుణంగా సంస్కరణలకు నోచుకోలేక సైన్యం ఇక్కట్లు పడింది’’ అని ఆరోపించారు. ‘‘భద్రతాపరంగా సున్నితమైన ఈ విషయంపై బహిరంగంగా ఇంతకంటే చెప్పలేం. అందుకే నా నోటికి తాళం పడింది’’ అని మోదీ అన్నారు. 

హిందువులపై భారీ కుట్రలు 
రాహుల్‌ వ్యాఖ్యలపై మోదీ ధ్వజం 
వాటిని దేశం ఎప్పటికీ మరవబోదు 
హిందూ మతాన్నే కించపరిచే ప్రయత్నం 
హిందువులంటే కాంగ్రెస్‌కు నిలువెల్లా విద్వేషం 
హిందువులను హేళన చేయడం ఫ్యాషనైంది: ప్రధాని 

రాహుల్‌ ‘హిందూ’ వ్యాఖ్యలపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులంటే కాంగ్రెస్‌కు చెప్పలేనంత విద్వేషమని ఆరోపించారు. అందుకే వారిపై ఆ పార్టీ భారీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరికీ స్పష్టంగా చెప్పదలచానన్నారు. ‘‘హిందువులు సహనానికి మారుపేరు. అలాంటి వారిని హింసావాదులంటారా? ఇదా మీ సంస్కారం? ఇదేనా మీ చరిత్ర? ఇదేనా మీ భావజాలం? హిందువుల పట్ల మీకింతటి విద్వేషమా?! హిందువులపై రాహుల్‌ విద్వేషపు వ్యాఖ్యలను దేశం వందల ఏళ్లు గడిచానా మర్చిపోదు. 

వారిని ఎన్నటికీ క్షమించబోదు’’ అంటూ మండిపడ్డారు. ‘‘విపక్షాలు కొత్తగా హిందూ ఉగ్రవాదం అనే మాటలను తెరపైకి తెచ్చాయి. హిందూ ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చాయి. పైగా అందుకు చప్పట్లు చరుచుకున్నాయి’’ అంటూ దుయ్యబట్టారు. హిందూ పరంపరను, హిందూ సమాజాన్ని, హిందూ వారసత్వాన్ని, సంస్కృతిని కించపరిచేందుకు, తక్కువ చేసి చూపించేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ ఆరోపించారు. ‘‘ఆ క్రమంలోనే హిందువులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారు. 

సభలో ప్రధాని ప్రసంగాన్ని వింటున్న రాహుల్‌గాంధీ 

హిందువులను కించపరచడం, హేళన చేయడం వీళ్లకు ఫ్యాషన్‌గా మారింది’’ అంటూ మండిపడ్డారు. ‘‘హిందువులపై విపక్ష నేత చేసిన అవమానకర వ్యాఖ్యలు యాదృచ్ఛికమేనా, లేక ఏదైనా భారీ కుట్రలో భాగమా? దీనిపై హిందూ సమాజం కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది’’ అని అభిప్రాయపడ్డారు. రాహుల్‌ సోమవారం సభలో శివుని చిత్రపటాన్ని ప్రదర్శించడాన్ని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. 

‘‘హిందూ సంస్కృతిలో ఈశ్వరారాధన కేవలం దర్శనం కోసం మాత్రమే తప్ప స్వార్థం కోసమో, ఇలా ప్రదర్శన కోసమో కాదు. కానీ కాంగ్రెస్‌ వాళ్లేమో మన దేవీ దేవతలను ఇలా అవమానిస్తున్నారు. స్త్రీ శక్తిని దేశంలో అనాది నుంచి పూజిస్తూ వస్తున్నాం. అలాంటి శక్తిని వినాశనం చేస్తామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో మొత్తం దేశ ప్రజల మనసులనే గాయపరిచారు. వీరిని దేశం ఎన్నటికీ క్షమించబోదు!’’ అన్నారు. 

అంబేడ్కర్‌పై నెహ్రూ కుట్రలు... 
రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ బద్ధ విరోధి 
దేశంలోని దళిత, వెనకబడ్డ వర్గాలకు కాంగ్రెస్‌ తీరని అన్యాయం చేసిందని మోదీ విమర్శించారు. దీన్ని సహించలేకే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అప్పట్లో నెహ్రూ కేబినెట్‌కు రాజీనామా చేశారన్నారు. ‘‘దళితులకు నెహ్రూ చేసిన అన్యాయాలను అంబేడ్కర్‌ ఏకిపారేశారు. వెనకబడ్డ వర్గాలపై నెహ్రూ ప్రభుత్వ ఉపేక్షను భరించలేకే రాజీనామా చేస్తున్నట్టు స్పష్టంగా ప్రకటించారు. దాంతో అంబేడ్కర్‌పై నెహ్రూ కక్షగట్టారు. ఆయన రాజకీయ జీవితాన్నే సర్వనాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కుట్రపూరితంగా అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించారు. 

ఆయన ఓటమికి నెహ్రూ పండుగ చేసుకున్నారు. ఆ ఆనందాన్ని ఒక లేఖలో స్పష్టంగా రాసుకొచ్చారు. మరో దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌కు కూడా కాంగ్రెస్‌ తీరని అన్యాయమే చేసింది. ఎమర్జెన్సీ తర్వాత జగ్జీవన్‌రామ్‌కు ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఇందిరాగాంధీ మోకాలడ్డారు. ‘‘ఏదేమైనా ఆయన ప్రధాని కావడానికి వీల్లేదు. లేదంటే ప్రధాని పదవిని జీవితాంతం వదలబో’రన్నారు. ఇది ఒక పుస్తకంలో స్పష్టంగా ఉంది. చౌదరీ చరణ్‌సింగ్‌తోనూ ఇందిర ఇలాగే వ్యవహరించారు. 

వెనకబడ్డ వర్గాలకు చెందిన సీతారాం కేసరిని తీవ్రంగా అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది’’ అంటూ సోదాహరణంగా చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ ఆది నుంచీ బద్ధ విరోధేనని మోదీ ఆరోపించారు. ‘‘రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నెహ్రూ అప్పట్లో సీఎంలకు లేఖలు రాశారు. మండల్‌ కమిషన్‌ నివేదికను ఇందిర ఏళ్లపాటు తొక్కిపెట్టారు. రాజీవ్‌గాంధీ కూడా విపక్ష నేతగా రిజర్వేషన్లను నిండు సభలోనే బాహాటంగా వ్యతిరేకించారు’’ అన్నారు. 

నీట్‌ లీకేజీపై... 
నీట్‌ తరహా లీకేజీలు పునరావృతం కాకుండా కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని మోదీ చెప్పారు.‘‘ లీకేజీ బాధ్యులను వదిలేది లేదు. విద్యార్థుల భవితతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోం. దేశమంతటా అరెస్టులు కొనసాగుతున్నాయి. దోషులపై ఇప్పటికే కఠినమైన కొత్త చట్టం కింద అభియోగాలు మోపాం. అవినీతిని ఉపేక్షించేది లేదని 2014లో తొలిసారి గెలిచినప్పుడే స్పష్టంగా చెప్పాం. అందుకు కట్టుబడి ఉన్నాం’’ అన్నారు. 

మోదీ మాటల తూటాలు 
రాహుల్‌పై... 
– అనగనగా ఒక బాలుడు. తనకు 99 మార్కులు వచ్చాయంటూ అందరికీ మిఠాయిలు పంచుతున్నాడు. టీచర్‌ వచ్చి నీకు 99 వచ్చింది 100కు కాదు, 543కు అని చెప్పినా ఆగడం లేదు! ఫెయిలవడంలో కూడా ప్రపంచ రికార్డు సృష్టించాడని ఆ పిల్లాడికి అర్థమయ్యేలా ఎవరు చెప్పాలి!? 
– ‘‘తుమ్‌ సే నా హో పాయెగా (కాంగ్రెస్‌ను గెలిపించడం ఇక నీ తరం కాదు)’’ అని ఎన్నికల తీర్పు ద్వారా దేశమంతా రాహుల్‌కు స్పష్టంగా చెప్పింది. 

కాంగ్రెస్‌పై... 
– కాంగ్రెస్‌ ఓ పరాన్నజీవి! ఈ ఎన్నికల్లో అది గెలిచిన 99 లోక్‌సభ సీట్లలో అత్యధికం భాగస్వామ్య పార్టీల ఓట్ల పుణ్యమే! గణాంకాల ఆధారంగా ఈ మాట చెబుతున్నా. ఒంటరిగా పోటీ చేసిన 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటు శాతం దారుణంగా తగ్గిపోయింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 66 సీట్లలో పోటీ చేస్తే నెగ్గింది కేవలం రెండు! బీజేపీతో నేరుగా తలపడ్డ చోట్ల కాంగ్రెస్‌ విజయ శాతం కేవలం 26! కానీ బలమైన ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టిన రాష్ట్రాల్లో మాత్రం పోటీ చేసిన సీట్లలో ఏకంగా సగం గెలిచింది! కనుక ఇకపై కాంగ్రెస్‌కు ‘పరాన్నజీవి పార్టీ’ అనే పేరు స్థిరపడటం ఖాయం. దీనిపై కాంగ్రెస్‌ భాగస్వాములు ఇప్పటికైనా విశ్లేషణ చేసుకున్నారో లేదో! ఈ ఎన్నికల ఫలితాలు వాటికి కూడా ఓ సందేశం. 

– వాస్తవాలిలా ఉన్నా కాంగ్రెస్‌ నేతల స్టేట్‌మెంట్లు మాత్రం షోలే సినిమాలో కామెడీ సీన్‌ను మించిపోతున్నాయి. వరుసగా మూడుసార్లు ఓడినా నైతిక విజయం తమదేనంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. 13 రాష్ట్రాల్లో జీరో సీట్లొచ్చినా హీరోలమని చెప్పుకు తిరుగుతున్నారు. మొత్తంగా పార్టీని నిండా ముంచి కూడా, ఇంకా ఊపిరితోనే ఉంది లెమ్మంటూ సంబరపడుతున్నారు! 

– మహిళలకు ప్రతి నెలా రూ.8,500 ఇస్తామంటూ కాంగ్రెస్‌ పచ్చి అబద్ధాలు చెప్పింది. ఆ డబ్బులొచ్చాయా వాళ్లు జూలై 1న తమ బ్యాంకు ఖాతాలు చెక్‌ చేసుకున్నారు. ఆ మహిళల శాపనార్థాలు కాంగ్రెస్‌ను సర్వనాశనం చేయనున్నాయి. జూలై 1ని దేశమంతా ఖటాఖట్‌ దినంగా జరుపుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement