
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్షం ముసుగులో రాహుల్.. ఉన్నతస్థాయి దేశ ద్రోహిలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. అమెరికాకు చెందిన ఏజెన్సీలు, బిలియనీర్ జార్జ్ సోరోస్‌లతో రాహుల్‌ను పోల్చుతూ బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నవేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారని, దేశాన్ని అస్థిరపర్చేందుకు వారు కుట్రలు పన్నుతున్నారని సాంబిత్ పాత్రా మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్, ఆయన మద్దతున్న ఓసీసీఆర్పీ మధ్య ఓ ముక్కోణపు బంధం ఉందని విమర్శించారు. రాహుల్ దేశానికి ద్రోహం చేస్తున్నాడని, సోరోస్ స్క్రిప్ట్ ఇక్కడ అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర
‘త్రిభుజానికి ఒకవైపు అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్, అమెరికాకు చెందిన కొన్ని ఏజెన్సీలు, మరోవైపు సొరేస్ మద్దతున్న OCCRP పేరుతో పెద్ద న్యూస్ పోర్టల్ ఉన్నాయి. త్రిభుజం చివరి మూలలో రాహుల్ గాంధీ, ‘ఉన్నత స్థాయి ద్రోహి’ అని అనడానికి నేను భయపడను. లోక్‌సభలో ప్రతిపక్ష నేతను దేశద్రోహి అనడానికి తనకు ఎలాంటి సందేహం లేదు.
సోరోస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఓసీసీఆర్‌పీ ఆదేశాలను పాటిస్తున్నారు. రాహుల్, సోరోస్ ఇద్దరూ ఒకటే. ఒకరు బాధ పడితే మరొకరు కలత చెందుతారు. తన అజెండాలను నెరవేర్చుకోవాలని ఆ బిలియనీర్ కోరుకుంటున్నారు. ఆయనకు రాహుల్ సాయం చేస్తున్నారు. దేశ ప్రయోజనాలకు ముప్పుతేవడమే వారిద్దరికీ కావాలి. దేశాన్ని విభజించాలని చూసేవారు ప్రగతిని చూడలేరు.’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment