
‘ఆర్గనైజర్’ కథనంపై రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం క్రైస్తవ సంస్థల ఆస్తులేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ బిల్లులోని అనేక అంశాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నడిచే ‘ఆర్గనైజర్’లోని కథనాన్ని ఉదహరించారు.
కాథలిక్ సంస్థలకు దేశవ్యాప్తంగా 7 కోట్ల హెక్టార్ల భూములున్నాయని, ఇంత భారీగా భూములున్న ప్రభుత్వేతర సంస్థ ఇదేనంటూ అందులో పేర్కొన్నారని రాహుల్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ కన్ను ఇప్పుడిక కాథలిక్ భూములపై పడినట్లు ఈ కథనంతో అర్థమవుతోందని ఆరోపించారు. ముస్లిం వర్గం ఆస్తులే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు ఇతర వర్గాలకు లక్ష్యంగా చేసుకోవడానికి ఒక ఉదాహరణగా ఉంటుందని రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
అతి త్వరలోనే క్రైస్తవుల ఆస్తులపై ఆర్‌ఎస్‌ఎస్ దృష్టి పడనుందని ఆయన జోస్యం చెప్పారు. ‘ఇటువంటి దాడుల నుంచి మనకు రక్షణ కల్పించే ఏకైక సాధన రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం కలిసికట్టుగా పరిరక్షించుకుందాం’అని పిలుపునిచ్చారు. ఇండియన్ చర్చ్ యాక్ట్–1927 ప్రకారం బ్రిటిషర్ల పాలనలో కాథలిక్ సంస్థలు అత్యధికంగా భూములు సంపాదించుకున్నట్లు ఆర్గనైజర్ కథనం పేర్కొంది. అయితే, వలస పాలనలో లీజుకిచ్చిన భూములను చర్చి ఆస్తులుగా పరిగణనలోకి రావంటూ 1965లో భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది.