కాంగ్రెస్‌ను చూస్తే జాలేస్తోంది.. మా హ్యాట్రిక్‌ ఖాయం: లోక్‌సభలో ప్రధాని మోదీ | PM Narendra Modi Fire On Congress Party Lok Sabha Updates | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను చూస్తే జాలేస్తోంది.. మా హ్యాట్రిక్‌ ఖాయం: లోక్‌సభలో ప్రధాని మోదీ

Published Mon, Feb 5 2024 5:46 PM | Last Updated on Mon, Feb 5 2024 7:01 PM

PM Narendra Modi Fire On Congress Party Lok Sabha Updates - Sakshi

ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సాక్షిగా కాం‍గ్రెస్‌ను, రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేసి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని.. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే ఆ పార్టీ పాకులాడుతోందని..  పదేళ్ల కకాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారాయన. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. సభకు సెంగోల్ తీసుకొచ్చే కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించాం. పార్లమెంట్ ఔన్నత్యానికి సెంగోల్ జోడించాం. విపక్షాలు కూడా చాలా కాలం అదే స్థానంలో ఉంచాలని తీర్మానించుకున్నాయి. అందుకు సభకు నా ధన్యవాదాలు. బీజేపీ పై పోటీ చేయడానికి విపక్షాలు భయపడుతున్నాయి. కొంత మంది పోటీ చేసే స్థానాలు మార్చుకుంటున్నారు. ఈసారి కొందరు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారు. మీ ఆలోచనా తీరును దేశం గమనిస్తోంది. విపక్షాల ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణం. 

.. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదు. తోటి విపక్షాలను కాంగ్రెస్ ఎదగనివ్వడం లేదు. కాంగ్రెస్ నేతలు కొందరు కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. కాంగ్రెస్ ఒకే ప్రొడెక్ట్ ను మాటిమాటికీ లాంచ్ చేస్తోంది. వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం. అమిత్ షా, రాజ్ నాథ్, నేను వారసత్వ రాజకీయాలు చేయలేదు. అన్ని నిర్ణయాలు ఒకే కుటుంబం తీసుకోవడం కుటుంబ పాలన. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పుకాదు. కానీ వాళ్లే పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదు. ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం మాదే

కాంగ్రెస్‌ తీరు మారడం లేదు
దేశాన్ని విభజించడమే విపక్షాల పని. ఇలా ఎంతకాలం ఇలా  చేస్తారు?. ఎన్నాళ్లీ మైనారిటీ రాజకీయాలు? అంటూ అధీర్ రంజన్ చౌదరిను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రశ్నించారు. మేం అభివృద్ధి నినాదం చేస్తే.. కాంగ్రెస్‌ క్యాన్సిల్‌ నినాదం తలెత్తుంది. మేం ఎలాంటి అభివృద్ధి చేసినా క్యాన్సిల్‌ అంటున్నారు. ఇంకా ఎంత కాలం ఈ విద్వేషం మీ గుండెల్లో ఉంచుకుంటారు. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు మానడం లేదు. ఒక కుటుంబం కోసం పార్టీ పని చేస్తే దానిని కుటంబ పాలనగానే మేం భావిస్తాం. కాంగ్రెస్‌ది కుటుంబ రాజకీయం. ఒకే కటుంబం చుట్టూ తిరుగుతుంది. వారసత్వ రాజకీయాలతో దేశానికి నష్టం. కుటుంబ పాలన వల్ల దేశం ఎంత నష్టపోయిందో.. కాంగ్రెస్‌ నాయకులు కూడా అంతే నష్టపోయారు.  ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. చాలామంది కాంగ్రెస్‌ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదు.

జాలేస్తోంది.. విపక్షాలకిదే నా సలహా
కాంగ్రెస్‌ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టం. ఒకే ప్రొడక్టును కాంగ్రెస్‌ పదే పదే రీలాంచ్‌ చేస్తోంది. కాంగ్రెస్‌ దుకాణం ఒక్క నాయకుడి కోసమే. వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయి. కాంగ్రెస్‌ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోంది. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరు.  తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్‌ చేస్తోంది. తోటి విపక్ష పార్టీలను కూడా ఎదగనీయడం లేదు. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారడం లేదు. విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయి. అందుకు విపక్షాలకు నా ధన్యవాదాలు. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుంది. కూటమి(ఇండియా) కుదుపులకు లోనైంది. విపక్షాల సంకల్పానికి నేను సలహా ఇస్తున్నా. ఎన్నికలొస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండంటూ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ చురకలంటించారాయన.

2014 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. పదేళ్ల కిందట ప్రపంచంలోని 11వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది. ఎవరేం అనుకున్నా మా హ్యట్రిక్‌ విజయం గ్యారెంటీ. ఈ మూడో టెర్మ్‌లో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ..   అని ప్రధాని మోదీ ప్రసంగించారు.

కాంగ్రెస్‌ దేశ ప్రజల్ని అవమానించింది.. 
దేశ సామర్థ్యంమీద కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. ఆ పార్టీని నడిపించే కుటుంబం భారతీయుల్ని చిన్నచూపు చూసింది. నెహ్రూ, ఇందిరలు దేశ ప్రజల్ని అవమానించారు. భారతీయులు కష్టపడరని ఎర్రకోట సాక్షిగా నెహ్రూ అన్నారు. యూరప్‌, చైనాలతో పోలిస్తే భారతీయులు అంతకష్టపడరని నెహ్రూ అన్నారు. అమెరికా, జపాన్‌, చైనా పౌరులతో పోలిస్తే.. భారతీయుల నైపుణ్యం తక్కువనీ నెహ్రూ అన్నారు. అలాగే భారతీయుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువని ఎర్ర కోట సాక్షిగా ఇందిరాగాంధీ చెప్పారు.

కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుందేమో!
పదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ది చేయాలంటే కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుందేమో. నాలుగు కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇచ్చాం. సానిటేషన్‌ కవరేజ్‌ వంద శాతానికి పెంచాం. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను తొలగించాం. చంద్రయాన్‌-3తో విజయం సాధించాం. ఒలింపిక్స్‌లో సత్తా చాటాం. అన్ని రంగాల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లును చట్టంగా మార్చాం. బడ్జెట్‌లో రైతులకు ఎక్కువ నిధులిచ్చాం. యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించాం. ఇదేపని కాంగ్రెస్‌ చేయాలంటే 70 ఏళ్లు పట్టేది. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించాం. భగవాన్‌ రాముడు తన సొంతింటికి వచ్చాడు. అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అభివృద్ధి చేశాం.

మాకు అదే ముఖ్యం
ఖాదీని, చేనేతను కాంగ్రెస్‌ ప్రజలకు దూరం చేస్తే.. మేం దగ్గర చేశాం. ప్రభుత్వంలో ఓబీసీ నేతలు లేరని కాంగ్రెస్‌ అంటోంది. కాంగ్రెస్‌ ఓబీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. కర్పూరి ఠాకూర్‌ లాంటి వెనకబడిన వర్గాల వారికి మేం భారతరత్న ఇచ్చాం. కానీ, కర్పూరిని కాంగ్రెస్‌ అవమానించింది. ఆయన్ని గద్దె దించడానికి కాంగ్రెస్‌ యత్నించింది. మాకు ఓట్లు ముఖ్యం కాదు ప్రజల హృదయాలు ముఖ్యం. 

మళ్లీ మా సర్కారే
వంద రోజుల్లో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడబోతుంది.  అబ్‌కీ బార్‌ మోదీకి సర్కార్‌. బీజేపీకి సొంతంగా 370కిపైగా సీట్లు వస్తాయి. ఎన్డీయేకు వందకు పైగా సీట్లు వస్తాయి.. మూడో టర్మ్‌లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నాం. సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయి. మూడో టర్మ్‌లో వెయ్యేళ్ల అభివృద్ధికి సరిపడా పునాదులు వేస్తాం. దేశ ప్రజలు మా పాలనను వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారు అని ప్రధాని మోదీ ప్రసంగించారు.

రాజకీయావసరాలకు దర్యాప్తు సంస్థలా?
కేసులపై తీర్పులు కోర్టులు ఇస్తాయి. దర్యాప్తు సంస్థలపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈడీ దాడులతో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్‌ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో దర్యాప్తు సంస్థలున రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ కేవలం రూ.5 వేల కోట్లే సీజ్‌ చేసింది. మా హయాంలో లక్ష కోట్ల అవినీతి సొమ్మును బయటకు తీశాం. విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. అవి స్వతంత్రంగా తమ చేసుకుంటూ పోతున్నాయి. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేది లేదు అని ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించగానే.. ఎన్డీయే ఎంపీలంతా నిలవడి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement