
Photo Courtesy: BCCI/IPL
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings).. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నుంచి చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్‌కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.
అతడు మైదానంలో అడుగుపెట్టాడంటే ప్రేక్షకులు ఇంకెవరినీ పట్టించుకోరు. ముఖ్యంగా తలా బ్యాట్‌తో రంగంలోకి దిగాడంటే.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమ జట్టు ఆటగాడైనా సరే అవుటై.. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తారు. అయితే, ఒక్కోసారి ఈ వీరాభిమానం వల్ల ధోని సొంత జట్టు ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు.
ధోని క్రేజ్ వల్ల ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. దీనికి ‘తలా’నే స్వయంగా స్వస్తి పలకాలని రాయుడు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. ధోని ఒక్కడి చుట్టే జట్టును అభివృద్ధి చేసిన చెన్నై.. కొత్త ఆటగాళ్లకు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. కేవలం ధోని ఒక్కడినే నమ్ముకున్న చెన్నై యాజమాన్యం.. అతడి నిష్క్రమణ తర్వాత ఇబ్బందులపాలు కాకతప్పదని చెప్పుకొచ్చాడు.
రచిన్ రవీంద్రపై విమర్శలు
కాగా ఐపీఎల్-2025లో చెన్నై శుభారంభం చేసిన విషయం తెలిసిందే. సొంతమైదానం చెపాక్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో భాగంగా యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్)తో కలిసి ధోని క్రీజులో ఉన్నాడు.
పందొమ్మిదవ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో మరుసటి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్‌కేను గెలుపుతీరాలకు చేర్చాడు. దీంతో చెన్నై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ నేపథ్యంలో చెన్నై విజయానికి సంతోషిస్తూనే రచిన్‌ను కొంతమంది పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వలేదంటూ అతడిని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఇక సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌లో ఇదే వేదికపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం తలపడనుంది.
బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
ఈ నేపథ్యంలో ధోని క్రేజ్ గురించి అంబటి రాయుడు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విచిత్రమైన విషయం. చాలా మంది సీఎస్‌కే కంటే ముందు ధోని అభిమానులు. కానీ వారి అభిమానం వల్ల కొత్త ఆటగాళ్లు చాలాసార్లు ఇబ్బంది పడాల్సివస్తోంది.
ధోని రాగానే బిగ్గరగా అరుస్తారు. వేరే వాళ్లకు అది అసౌకర్యంగా ఉంటుంది. ఫ్రాంఛైజీ అతడి చుట్టూనే జట్టును నిర్మించింది. చాలా ఏళ్లుగా అతడినే హైలైట్ చేస్తూ వస్తోంది. అందుకే ‘తలా’గా అతడు ప్రసిద్ధి పొందాడు.
చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవు
అతడంటే చాలా మందికి పిచ్చి ప్రేమ. అందుకే తమ జట్టు ఆటగాళ్లనే అవుట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. దీంతో చాలా మంది ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. వాళ్లు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు కానీ ఇదే సత్యం. దీనికి ధోని మాత్రమే చెక్ పెట్టగలడు.
ఆయన బయటకు వచ్చి.. ‘వీళ్లంతా మన వాళ్లే.. నాలాగే బ్యాటింగ్ చేసేందుకు వస్తారు. వాళ్లను కూడా నాలాగే ఆదరించండి’ అని చెప్పాలి. లేదంటే.. చెన్నై ఆటగాళ్లకే కాదు.. భవిష్యత్తులో చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవు.
స్టేడియం నిండిపోవడానికి, జనాన్ని పోగు చేయడానికి ధోని క్రేజ్ ఉపయోగపడుతుంది. ఫ్రాంఛైజీ కూడా ఎప్పుడూ అతడి మీదే ఫోకస్ ఉంచుతుంది. బ్రాండ్ వాల్యూ కోసం అలా చేస్తుంది. కానీ .. ఆ తర్వాత.. ధోని జట్టుతో లేకుంటే.. అప్పుడు పరిస్థితి ఏమిటి?.. కాబట్టి వాళ్లు కాస్త విశాలంగా ఆలోచించాలి’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్