MI vs CSK
-
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings).. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నుంచి చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.అతడు మైదానంలో అడుగుపెట్టాడంటే ప్రేక్షకులు ఇంకెవరినీ పట్టించుకోరు. ముఖ్యంగా తలా బ్యాట్‌తో రంగంలోకి దిగాడంటే.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమ జట్టు ఆటగాడైనా సరే అవుటై.. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తారు. అయితే, ఒక్కోసారి ఈ వీరాభిమానం వల్ల ధోని సొంత జట్టు ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు.ధోని క్రేజ్ వల్ల ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. దీనికి ‘తలా’నే స్వయంగా స్వస్తి పలకాలని రాయుడు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. ధోని ఒక్కడి చుట్టే జట్టును అభివృద్ధి చేసిన చెన్నై.. కొత్త ఆటగాళ్లకు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. కేవలం ధోని ఒక్కడినే నమ్ముకున్న చెన్నై యాజమాన్యం.. అతడి నిష్క్రమణ తర్వాత ఇబ్బందులపాలు కాకతప్పదని చెప్పుకొచ్చాడు.రచిన్ రవీంద్రపై విమర్శలుకాగా ఐపీఎల్-2025లో చెన్నై శుభారంభం చేసిన విషయం తెలిసిందే. సొంతమైదానం చెపాక్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి ఈ సీజన్లో బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో భాగంగా యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్)తో కలిసి ధోని క్రీజులో ఉన్నాడు.పందొమ్మిదవ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో మరుసటి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను గెలుపుతీరాలకు చేర్చాడు. దీంతో చెన్నై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.ఈ నేపథ్యంలో చెన్నై విజయానికి సంతోషిస్తూనే రచిన్‌ను కొంతమంది పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వలేదంటూ అతడిని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఇక సీఎస్కే తదుపరి మ్యాచ్‌లో ఇదే వేదికపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం తలపడనుంది.బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!ఈ నేపథ్యంలో ధోని క్రేజ్ గురించి అంబటి రాయుడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విచిత్రమైన విషయం. చాలా మంది సీఎస్కే కంటే ముందు ధోని అభిమానులు. కానీ వారి అభిమానం వల్ల కొత్త ఆటగాళ్లు చాలాసార్లు ఇబ్బంది పడాల్సివస్తోంది.ధోని రాగానే బిగ్గరగా అరుస్తారు. వేరే వాళ్లకు అది అసౌకర్యంగా ఉంటుంది. ఫ్రాంఛైజీ అతడి చుట్టూనే జట్టును నిర్మించింది. చాలా ఏళ్లుగా అతడినే హైలైట్ చేస్తూ వస్తోంది. అందుకే ‘తలా’గా అతడు ప్రసిద్ధి పొందాడు.చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవుఅతడంటే చాలా మందికి పిచ్చి ప్రేమ. అందుకే తమ జట్టు ఆటగాళ్లనే అవుట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. దీంతో చాలా మంది ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. వాళ్లు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు కానీ ఇదే సత్యం. దీనికి ధోని మాత్రమే చెక్ పెట్టగలడు.ఆయన బయటకు వచ్చి.. ‘వీళ్లంతా మన వాళ్లే.. నాలాగే బ్యాటింగ్ చేసేందుకు వస్తారు. వాళ్లను కూడా నాలాగే ఆదరించండి’ అని చెప్పాలి. లేదంటే.. చెన్నై ఆటగాళ్లకే కాదు.. భవిష్యత్తులో చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవు.స్టేడియం నిండిపోవడానికి, జనాన్ని పోగు చేయడానికి ధోని క్రేజ్ ఉపయోగపడుతుంది. ఫ్రాంఛైజీ కూడా ఎప్పుడూ అతడి మీదే ఫోకస్ ఉంచుతుంది. బ్రాండ్ వాల్యూ కోసం అలా చేస్తుంది. కానీ .. ఆ తర్వాత.. ధోని జట్టుతో లేకుంటే.. అప్పుడు పరిస్థితి ఏమిటి?.. కాబట్టి వాళ్లు కాస్త విశాలంగా ఆలోచించాలి’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్ -
విఘ్నేశ్‌ను సత్కరించిన నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్
ముంబై ఇండియన్స్ యువ సంచలనం విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur)పై ఆ జట్టు యజమాని నీతా అంబానీ ప్రశంసలు కురిపించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడావని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ‘బెస్ట్ బౌలర్’ బ్యాడ్జ్‌ను నీతా అంబానీ (Nita Ambani) విఘ్నేశ్‌కు అందించారు.కాగా ఐపీఎల్-2025 మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం (మార్చి 23) మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక కాగా.. టాస్ గెలిచిన రుతురాజ్ సేన తొలుత బౌలింగ్ చేసింది.నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు స్టార్ బ్యాటర్లు విఫలం కావడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (Rohit sharma) డకౌట్ కాగా.. రియాన్ రెకెల్టన్ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 11 రన్స్ మాత్రమే చేయగా.. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29, తిలక్ వర్మ 31, దీపక్ చహర్ 28(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టార్గెట్‌ను సులువుగానే పూర్తి చేస్తుందని అంతా భావించారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53) అద్భుత అర్ధ శతకాలు సాధించారు. అయితే, మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువెళ్లింది మాత్రం ముంబై అరంగేట్ర బౌలర్ విఘ్నేశ్ పుతూర్ అని చెప్పవచ్చు. స్పిన్ మాయాజాలంతోరుతురాజ్తో పాటు శివం దూబే(9), దీపక్ హుడా(3) వికెట్లను విఘ్నేశ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో సీఎస్కే మూడు కీలక వికెట్లను కూల్చి సత్తా చాటాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు పరాజయం తప్పలేదు. తాజా ఎడిషన్ ఆరంభ సీజన్లో చెన్నై చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ముంబై ఓటమిని చవిచూసింది.విఘ్నేశ్ ఎక్కడ?అయితే, విఘ్నేశ్ ప్రదర్శన మాత్రం జట్టు యాజమాన్యానికి సంతృప్తినిచ్చింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూమ్‌కి వెళ్లిన ముంబై జట్టు యజమాని నీతా అంబానీ విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ‘‘ఈరోజు మొదటి అవార్డును మన యువ స్పిన్నర్.. ముంబై ఇండియన్స్‌కు తొలిసారిగా ఆడిన విఘ్నేశ్‌కు ఇస్తున్నా. విఘ్నేశ్ ఎక్కడ?’’ అంటూ అక్కడున్న ఆటగాళ్లను అడిగారు.ఇంతలో గుంపులో నుంచి పరిగెత్తుకు వచ్చిన విఘ్నేశ్‌కు నీతా అంబానీ స్వయంగా బ్యాడ్జ్ తొడిగారు. అద్భుతంగా ఆడావు అంటూ అతడికి కితాబు ఇచ్చారు. ఈ పరిణామంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బపోయిన విఘ్నేశ్ నీతా అంబానీ పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశాడు.థాంక్యూ సూర్య భాయ్‘‘నాకు మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చిన ముంబై ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు. అసలు ఇలా నేను స్టార్లతో కలిసి ఆడతానని అస్సలు ఊహించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము గెలవలేకపోవడం మాత్రం కాస్త బాధగా ఉంది.మా జట్టు మొత్తానికి థాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా సూర్య భాయ్ నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. అందుకే నేను ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. నాకు అండగా ఉన్నందుకు థాంక్యూ భయ్యా’’ అని విఘ్నేశ్ పుతూర్ సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్షేర్ చేయగా వైరల్‌గా మారింది.కాగా కేరళకు చెందిన విఘ్నేశ్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇంత వరకు డొమెస్టిక్ క్రికెట్లోనూ అరంగేట్రం చేయలేదు. అయితే, అతడిలోని ప్రతిభను గుర్తించిన ముంబై ఫ్రాంఛైజీ మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోనిLocal Kerala talent ➡️ MI debut in a big game ➡️ Wins the Dressing Room Best Bowler 🏅Ladies & gents, Vignesh Puthur! ✨#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #CSKvMI pic.twitter.com/UsgyL2awwr— Mumbai Indians (@mipaltan) March 24, 2025 -
IPL 2025: దీపక్ చాహర్‌ను 'కట్టప్ప'తో పోల్చిన అతని సోదరి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే విజేతగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. సీఎస్కే మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) సీఎస్కేకు దడ పుట్టించాడు. విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో ఈ ముగ్గురు సత్తా చాటినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇదిలా ఉంటే, గత ఏడు సీజన్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటి ఆతర్వాత బౌలింగ్‌లో పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్‌కు దిగిన చాహర్ 15 బంతులు ఎదర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాహర్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. అనంతరం బౌలింగ్‌లోనూ చాహర్ ఆదిలోనే సీఎస్కేను దెబ్బకొట్టాడు. చాహర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సీఎస్కే ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ 2 ఓవర్లలో వికెట్ తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు.చాహర్ ముంబై ఇండియన్స్ తరఫున గ్రాండ్‌గా అరంగేట్రం చేయడాన్ని అతని సోదరి మాల్తి చాహర్ ఓ హాస్యాస్పదమైన మీమ్ షేర్ చేయడం (సోషల్‌మీడియాలో) ద్వారా సెలబ్రేట్ చేసుకుంది. చాహర్ తన పాత జట్టుకు (సీఎస్కే) వ్యతిరేకంగా అద్భుతంగా ఆడినందుకు సరదాగా ట్రోల్ చేసింది. Malti Chahar's Instagram story. pic.twitter.com/1bfxj4kcU4— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025చాహర్‌ను "బాహుబలి" సినిమాలోని కట్టప్ప పాత్రతో పోల్చింది. ఆ సినిమాలో హీరో ప్రభాస్‌ను (అమరేంద్ర బాహుబలి) అతని మామ కట్టప్ప వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ కూడా కట్టప్పలా తనను ధీర్ఘకాలంగా అక్కున చేర్చుకున్న సీఎస్కేను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని అర్దం వచ్చేలా మాల్తి సరదాగా ఓ మీమ్‌ను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ రెండు పేర్లను విడివిడిగా చూడటం కష్టం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై నిలవడానికి ప్రధాన కారణం ధోని. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలు మొదలు.. మైదానంలో అమలు చేసే ప్రణాళికల వరకు అంతా తానే!ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ దిగ్గజ కెప్టెన్.. గతేడాది సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొన్నాడు. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను తన వారసుడిగా ఎంపిక చేశాడు. అయితే, మైదానంలో రుతుకు సూచనలు ఇస్తూ అతడికి దిశానిర్దేశం చేసే పాత్రలో ధోని ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రెప్పపాటులో స్టంపౌట్లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే ధోని 43 ఏళ్ల వయసులోనూ.. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. మెరుపు వేగంతో స్టంపౌట్లు చేయడంలోనూ దిట్ట. ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి పోరులో ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను రెప్పపాటులో స్టంపౌట్ చేసి ఔరా అనిపించాడు.𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡📹 Watch #CSK legend's jaw-dropping reflexes behind the stumps 🔥Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8— IndianPremierLeague (@IPL) March 23, 2025ఇక మిచెల్ సాంట్నర్ వికెట్‌కు సంబంధించి.. డీఆర్ఎస్ విషయంలోనూ రుతును సరైన సమయంలో అలర్ట్ చేసి.. జట్టుకు వికెట్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే సీఎస్కేను, ధోనిని వేరువేరుగా చూడలేము అనేది!అలా అయితే.. నాతో నయాపైసా ఉపయోగం ఉండదుఅయితే, ఈ మ్యాచ్‌కు ముందు ధోని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఒకవేళ తాను వికెట్ కీపర్‌గా బరిలోకి దిగకపోతే.. జట్టులో ఉండీ ఏమాత్రం ఉపయోగం లేదంటూ.. ఈ ఫైవ్టైమ్ చాంపియన్ అన్నాడు. జియోహాట్‌స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ ఆటగాడిగా కొనసాగడం అతిపెద్ద సవాలు.ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఒకవేళ నేను కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించకపోతే.. మైదానంలో నేను ఉండీ నయాపైసా ఉపయోగం ఉండదు. ఎందుకంటే.. వికెట్ల వెనుక నుంచే నేను మ్యాచ్ పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటాను.వికెట్ల వెనుక నుంచి విశ్లేషించగలుగుతాబౌలర్ ఎలా బంతిని వేస్తున్నాడు? పిచ్ స్వభావం ఎలా ఉంది?.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలి? వంటి విషయాలన్నీ ఆలోచించగలను. ముఖ్యంగా మొదటి ఆరు ఓవర్లలో కొత్త బంతి ఎలాంటి ప్రభావం చూపుతోందని గమనిస్తా.ఆ తర్వాత పరిస్థితులు ఏవిధంగా మారుతున్నాయి? బౌలర్లను మార్చాలా? లేదంటే ప్రణాళికలు మార్చాలా? లాంటి అంశాల గురించి కెప్టెన్‌కు సరైన సందేశం ఇవ్వగలుగుతా. ఉత్తమ బంతికి బ్యాటర్ సిక్సర్ బాదాడా?లేదంటే.. చెత్త బంతికి షాట్ కొట్టాడా? అన్నది వికెట్ల వెనుక నుంచి విశ్లేషించగలుగుతా’’ అని ధోని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని.. గతేడాది నుంచి వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.బౌలర్ల విజృంభణఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై ముంబైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. సొంతమైదానం చెపాక్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రుతుసేన తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా ముంబైని 155 పరుగులకే కట్టడి చేసింది.రచిన్, రుతు హాఫ్ సెంచరీలులక్ష్య ఛేదనలో ఓపెనర్ రచిన్ రవీంద్ర అర్ధ శతకం(45 బంతుల్లో 65 నాటౌట్)తో చెలరేగగా.. కెప్టెన్ రుతురాజ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 53)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు ఉండగానే టార్గెట్ పూర్తి చేసిన చెన్నై.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. ముంబైని స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ నూర్ అహ్మద్ (4/18)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా.. అజేయంగా నిలిచాడు. -
కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ముంబై ఇండియన్స్ (MI)మధ్య పోరు అని చెప్పవచ్చు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్-2025లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన తీరు ఇందుకు నిదర్శనం.ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే స్టార్లు రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53)ల మెరుపులు.. మహేంద్ర సింగ్ ధోని మెరుపు స్టంపింగ్‌లతో పాటు.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ కుర్రాడు హైలైట్‌గా నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ధోని చేత ప్రశంసలు అందుకున్నాడు.ఇంతకీ ఎవరా ప్లేయర్?అతడిపేరు విఘ్నేశ్ పుతూర్. లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ కుర్ర బౌలర్ స్వస్థలం కేరళలోని మలప్పురం. పదకొండేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన విఘ్నేశ్.. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దృష్టిని ఆకర్షించాడు.అతడి ప్రతిభకు ఫిదా అయిన ముంబై యాజమాన్యం.. ఇంతవరకు కేరళ తరఫున కనీసం దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టకపోయినప్పటికీ... ఐపీఎల్ కాంట్రాక్టు ఇచ్చింది. రూ. 30 లక్షలకు ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసింది.ఈ క్రమంలో పద్దెనిమిదవ ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా సీఎస్కేతో పోరు సందర్భంగా విఘ్నేశ్‌ను బరిలోకి దించింది. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన ఈ స్పిన్ బౌలర్.. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే (9), దీపక్ హుడా (3) రూపంలో మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.చెన్నై చేతిలో ముంబై సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందా? అనే పరిస్థితి నుంచి .. చివరి ఓవర్ దాకా మ్యాచ్ సాగేలా చేయడంలో విఘ్నేశ్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అతడి భుజం తట్టి శెభాష్ అంటూ తలా.. ఈ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.The men in 💛 take home the honours! 💪A classic clash in Chennai ends in the favour of #CSK ✨Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/ZGPkkmsRHe— IndianPremierLeague (@IPL) March 23, 2025 తండ్రి ఆటో డ్రైవర్.. కొడుకు ఐపీఎల్ స్టార్అన్నట్లు విఘ్నేశ్ పుతూర్ తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే ఆయన.. కొడుకులోని ప్రతిభను గుర్తించి క్రికెట్ ఆడేలా ప్రోత్సహించాడు. కేరళ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో మీడియం పేసర్ బౌలర్ నుంచి స్పిన్నర్‌గా మారిన విఘ్నేశ్ ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. కలకాలం గుర్తుండిపోతుంది!‘‘ధోని.. విఘ్నేశ్ పుతూర్ భుజం తట్టి అభినందించాడు. నాకు తెలిసి తన జీవితకాలం ఈ కుర్రాడు ఈ సంఘటనను గుర్తుంచుకుంటాడు’’- కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును.. విఘ్నేశ్ పుతూర్‌కు ఇది లైఫ్‌టైమ్ మొమరీగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, ఈ సీజన్లో బౌలర్‌గా తనదైన ముద్ర వేయగలిగితే.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాలో చోటు సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో.. త్వరలోనే విఘ్నేశ్ కూడా చేరే అవకాశాలను కొట్టిపారేయలేము!! ఏమంటారు?!ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై👉టాస్: చెన్నై.. తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 155/9 (20)👉చెన్నై స్కోరు: 158/6 (19.1)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/18).చదవండి: జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి? -
IPL 2025: రోహిత్, పోలార్డ్ తర్వాత సూర్యకుమార్
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ 209 ఇన్నింగ్స్‌ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. పోలార్డ్ 171 ఇన్నింగ్స్‌ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్‌ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్‌ల్లో 2416 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్‌లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17), సాంట్నర్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్కే బౌలర్లలో అశ్విన్, ఇల్లిస్ కూడా తలో వికెట్ తీశారు.ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదర్కొని డకౌటైన హిట్‌మ్యాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా నిలిచాడు. ఈ చెత్త రికార్డును రోహిత్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్‌లతో కలిసి షేర్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్లో ఇప్పటివరకు 18 సార్లు ఖాతా తెరవకుండా నిష్క్రమించారు. రోహిత్ 253 ఇన్నింగ్స్‌ల్లో 18 సార్లు డకౌట్ కాగా.. మ్యాక్సీ 129, డీకే 234 ఇన్నింగ్స్‌ల్లోనే 18 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే ముంబైపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటర్ల వైఫల్యం కారణంగా 155 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి ముంబైకి కళ్లెం వేశాడు. పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా రాణించి 3 వికెట్లు తీశాడు. ఇల్లిస్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత పుంజుకుంది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53) మెరుపు అర్ద సెంచరీలు సాధించి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినప్పటికీ అద్భుతంగా ప్రతిఘటించింది. స్వల్ప స్కోర్‌ను కాపాడుకనేందుకు ముంబై బౌలర్లు విశ్వప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
IPL 2025: మా పోరాటం ప్రశంసనీయం.. రుతురాజ్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు: సూర్యకుమార్
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ తడబడింది. సీఎస్కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ డకౌటై నిరాశపరిచగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అరంగేట్రం ఆటగాడు రాబిన్ మింజ్ (3) తేలిపోయాడు. నమన్ ధిర్ 17, సాంట్నర్ 11 పరుగులు చేయగా.. ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4) ఐపీఎల్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖలీల్ అహ్మద్ (4-0-29-3) సత్తా చాటాడు. వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఇల్లిస్ తలో వికెట్ తీశారు.స్లో ట్రాక్‌పై ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని 2 పరుగులకే ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రుతు 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబై చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రుతురాజ్ ఔటయ్యాక సీఎస్కే కాస్త తడబడింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చినట్లు కనిపించాడు. ఈ దశలో విల్ జాక్స్, నమన్ ధిర్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సీఎస్కే ఆటగాళ్లను కట్టడి చేసి పరుగులు రానివ్వకుండా చేశారు. అయితే అప్పటిదాకా అద్బుతంగా బౌలింగ్ చేసిన విజ్ఞేశ్ పుథుర్‌ను 18వ ఓవర్లో బౌలింగ్‌కు దించి ముంబై కెప్టెన్ స్కై పెద్ద తప్పు చేశాడు. ఆ ఓవర్లో రచిన్ చెలరేగిపోయి 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లోనే ముంబై ఓటమి ఖరారైపోయింది. 19వ ఓవర్లో నమన్ ధిర్ జడ్డూ వికెట్ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చినా చివరి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ధోని సూర్యకుమార్‌ను మెరుపు స్టంపింగ్ చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ స్పందిస్తూ.. మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అయినా మా కుర్రాళ్ల పోరాటం ప్రశంసనీయం. యువకులకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఇండియన్స్ ప్రసిద్ధి చెందింది . ఎంఐ స్కౌట్స్ ఏడాదిలో 10 నెలలు టాలెంట్‌ను వెతికే పనిలో ఉంటారు. విజ్ఞేశ్ పుథుర్ దాని ఫలితమే. తొలి మ్యాచ్‌లోనే విజ్ఞేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి తిరిగి తమను మ్యాచ్‌లోకి తెచ్చాడు. ఆట లోతుగా సాగితే అతని కోసమని ఓ ఓవర్‌ను స్పేర్‌గా ఉంచాను. అది మిస్ ఫైర్ అయ్యింది. 18వ ఓవర్ విజ్ఞేశ్‌కు ఇచ్చి తప్పు చేశాను. మ్యాచ్ జరుగుతుండగా మంచు ప్రభావం లేదు. కానీ కాస్త జిగటగా ఉండింది. రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం మ్యాచ్‌ను మా నుండి దూరం చేసింది. ఇది తొలి మ్యాచే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నాడు. కాగా, ముంబై తమ రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 29న అహ్మదాబాద్‌లో జరుగనుంది. -
CSK Vs MI: సీఎస్కేతో మ్యాచ్.. హిట్‌మ్యాన్‌కు జోడీ ఎవరు..?
ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 23) రాత్రి (7:30 గంటలకు) రసవత్తర సమరం జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటున్నాయి. క్రికెట్లో ఈ రెండు జట్ల మ్యాచ్‌ను ఎల్ క్లాసికోగా పిలుస్తారు. ఈ మ్యాచ్‌పై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్లో ముంబై, సీఎస్కే జట్లు అత్యంత విజయవంతమైన జట్లు. ఈ రెండు జట్లు చెరో ఐదు సార్లు టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు నేటి మ్యాచ్‌తో ఆరో టైటిల్ వేటను ప్రారంభిస్తాయి.నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నిషేధం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. సీఎస్కే విషయానికొస్తే.. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు.తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కూడా అందుబాటులో లేవు. గాయం నుంచి బుమ్రా ఇంకా కోలుకోలేదు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుది జట్టు కూర్పును పరిశీలిస్తే.. ఓపెనర్‌గా రోహిత్ శర్మ వస్తాడు. హిట్‌మ్యాన్‌ను జత ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. విల్ జాక్స్ లేదా ర్యాన్ రికెల్టన్లలో ఎవరో ఒకరు హిట్‌మ్యాన్‌తో పాటు బరిలోకి దిగుతారు. వన్ డౌన్ తిలక్ వర్మ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో ప్లేస్‌లో నమన్ ధిర్ రావడం ఖరారైంది. నేటి మ్యాచ్‌తో రాబిన్ మింజ్ ఐపీఎల్ అరంగేట్రం చేయవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా మిచెల్ సాంట్నర్, కర్ణ శర్మ బరిలో ఉంటారు. పేసర్లుగా దీపక్ చాహర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.సీఎస్కే విషయానికొస్తే.. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే బరిలో నిలిచే అవకాశం ఉంది. వన్‌డౌన్‌లో రచిన్ రవీంద్ర, ఆతర్వాత దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్) బరిలోకి దిగవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్, పేసర్లుగా సామ్ కర్రన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.హెడ్ టు హెడ్ రికార్డ్స్‌ను పరిశీలిస్తే.. ఐపీఎల్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో సీఎస్కే 17, ముంబై 20 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్చెన్నై సూపర్ కింగ్స్..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్.