IPL 2025: దీపక్‌ చాహర్‌ను 'కట్టప్ప'తో పోల్చిన అతని సోదరి | IPL 2025 CSK VS MI: Deepak Chahar Sister Malti Sets Social Media Ablaze With A Hilarious Post | Sakshi
Sakshi News home page

IPL 2025: దీపక్‌ చాహర్‌ను 'కట్టప్ప'తో పోల్చిన అతని సోదరి

Published Mon, Mar 24 2025 1:31 PM | Last Updated on Mon, Mar 24 2025 2:56 PM

IPL 2025 CSK VS MI: Deepak Chahar Sister Malti Sets Social Media Ablaze With A Hilarious Post

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజేతగా నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. సీఎస్‌కే మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. తిలక్‌ వర్మ (31) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (29), దీపక్‌ చాహర్‌ (28 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (4-0-18-4), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-29-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ముంబైని కట్టడి చేశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో రచిన్‌ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్‌కేను గెలిపించారు. రుతురాజ్‌ 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి సీఎస్‌కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 

ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం​ స్పిన్నర్‌ విజ్ఞేశ్‌ పుథుర్‌ (4-0-32-3) సీఎస్‌కేకు దడ పుట్టించాడు. విజ్ఞేశ్‌తో పాటు విల్‌ జాక్స్‌ (4-0-32-1), నమన్‌ ధిర్‌ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్‌ ఓవర్లలో ఈ ముగ్గురు సత్తా చాటినా అప్పటికే జరగాల్సిన నష్టం​ జరిగిపోయింది.

ఇదిలా ఉంటే, గత ఏడు సీజన్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన దీపక్‌ చాహర్‌ ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో చాహర్‌ తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటి ఆతర్వాత బౌలింగ్‌లో పర్వాలేదనిపించాడు. 

ఇన్నింగ్స్‌ చివర్లో బ్యాటింగ్‌కు దిగిన చాహర్‌ 15 బంతులు ఎదర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాహర్‌ బ్యాట్‌ ఝులిపించకపోయుంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఈ మాత్రం స్కోర్‌ కూడా చేయలేకపోయేది. అనంతరం బౌలింగ్‌లోనూ చాహర్‌ ఆదిలోనే సీఎస్‌కేను దెబ్బకొట్టాడు. చాహర్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే సీఎస్‌కే ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠిని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో చాహర్‌ 2 ఓవర్లలో వికెట్‌ తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

చాహర్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున గ్రాండ్‌గా అరంగేట్రం చేయడాన్ని అతని సోదరి మాల్తి చాహర్‌  ఓ హాస్యాస్పదమైన మీమ్‌ షేర్ చేయడం (సోషల్‌మీడియాలో) ద్వారా సెలబ్రేట్‌ చేసుకుంది. చాహర్‌ తన పాత జట్టుకు (సీఎస్‌కే) వ్యతిరేకంగా అద్భుతంగా ఆడినందుకు సరదాగా ట్రోల్ చేసింది. 

చాహర్‌ను "బాహుబలి" సినిమాలోని కట్టప్ప పాత్రతో పోల్చింది.  ఆ సినిమాలో హీరో ప్రభాస్‌ను (అమరేంద్ర బాహుబలి) అతని మామ కట్టప్ప వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. ఈ మ్యాచ్‌లో చాహర్‌ కూడా కట్టప్పలా తనను ధీర్ఘకాలంగా అక్కున చేర్చుకున్న సీఎస్‌కేను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని అర్దం వచ్చేలా మాల్తి సరదాగా ఓ మీమ్‌ను పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement