
విఘ్నేశ్‌ను సత్కరించిన నీతా అంబానీ (Photo Credit: MI X)
ముంబై ఇండియన్స్ యువ సంచలనం విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur)పై ఆ జట్టు యజమాని నీతా అంబానీ ప్రశంసలు కురిపించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడావని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ‘బెస్ట్ బౌలర్’ బ్యాడ్జ్‌ను నీతా అంబానీ (Nita Ambani) విఘ్నేశ్‌కు అందించారు.
కాగా ఐపీఎల్-2025 మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం (మార్చి 23) మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక కాగా.. టాస్ గెలిచిన రుతురాజ్ సేన తొలుత బౌలింగ్ చేసింది.
నామమాత్రపు స్కోరు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు స్టార్ బ్యాటర్లు విఫలం కావడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (Rohit sharma) డకౌట్ కాగా.. రియాన్ రెకెల్టన్ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 11 రన్స్ మాత్రమే చేయగా.. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29, తిలక్ వర్మ 31, దీపక్ చహర్ 28(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టార్గెట్‌ను సులువుగానే పూర్తి చేస్తుందని అంతా భావించారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53) అద్భుత అర్ధ శతకాలు సాధించారు. అయితే, మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువెళ్లింది మాత్రం ముంబై అరంగేట్ర బౌలర్ విఘ్నేశ్ పుతూర్ అని చెప్పవచ్చు.
స్పిన్ మాయాజాలంతో
రుతురాజ్‌తో పాటు శివం దూబే(9), దీపక్ హుడా(3) వికెట్లను విఘ్నేశ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో సీఎస్‌కే మూడు కీలక వికెట్లను కూల్చి సత్తా చాటాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు పరాజయం తప్పలేదు. తాజా ఎడిషన్ ఆరంభ సీజన్‌లో చెన్నై చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ముంబై ఓటమిని చవిచూసింది.
విఘ్నేశ్ ఎక్కడ?
అయితే, విఘ్నేశ్ ప్రదర్శన మాత్రం జట్టు యాజమాన్యానికి సంతృప్తినిచ్చింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూమ్‌కి వెళ్లిన ముంబై జట్టు యజమాని నీతా అంబానీ విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ‘‘ఈరోజు మొదటి అవార్డును మన యువ స్పిన్నర్.. ముంబై ఇండియన్స్‌కు తొలిసారిగా ఆడిన విఘ్నేశ్‌కు ఇస్తున్నా. విఘ్నేశ్ ఎక్కడ?’’ అంటూ అక్కడున్న ఆటగాళ్లను అడిగారు.
ఇంతలో గుంపులో నుంచి పరిగెత్తుకు వచ్చిన విఘ్నేశ్‌కు నీతా అంబానీ స్వయంగా బ్యాడ్జ్ తొడిగారు. అద్భుతంగా ఆడావు అంటూ అతడికి కితాబు ఇచ్చారు. ఈ పరిణామంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బపోయిన విఘ్నేశ్ నీతా అంబానీ పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశాడు.
థాంక్యూ సూర్య భాయ్
‘‘నాకు మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చిన ముంబై ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు. అసలు ఇలా నేను స్టార్లతో కలిసి ఆడతానని అస్సలు ఊహించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము గెలవలేకపోవడం మాత్రం కాస్త బాధగా ఉంది.
మా జట్టు మొత్తానికి థాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా సూర్య భాయ్ నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. అందుకే నేను ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. నాకు అండగా ఉన్నందుకు థాంక్యూ భయ్యా’’ అని విఘ్నేశ్ పుతూర్ సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌షేర్ చేయగా వైరల్‌గా మారింది.
కాగా కేరళకు చెందిన విఘ్నేశ్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇంత వరకు డొమెస్టిక్ క్రికెట్‌లోనూ అరంగేట్రం చేయలేదు. అయితే, అతడిలోని ప్రతిభను గుర్తించిన ముంబై ఫ్రాంఛైజీ మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
Local Kerala talent ➡️ MI debut in a big game ➡️ Wins the Dressing Room Best Bowler 🏅
Ladies & gents, Vignesh Puthur! ✨#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #CSKvMI pic.twitter.com/UsgyL2awwr— Mumbai Indians (@mipaltan) March 24, 2025