
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ తడబడింది.
సీఎస్‌కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ డకౌటై నిరాశపరిచగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
అరంగేట్రం ఆటగాడు రాబిన్ మింజ్ (3) తేలిపోయాడు. నమన్ ధిర్ 17, సాంట్నర్ 11 పరుగులు చేయగా.. ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4) ఐపీఎల్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖలీల్ అహ్మద్ (4-0-29-3) సత్తా చాటాడు. వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఇల్లిస్ తలో వికెట్ తీశారు.
స్లో ట్రాక్‌పై ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే ఆదిలోనే వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని 2 పరుగులకే ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రుతు 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబై చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు.
మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రుతురాజ్ ఔటయ్యాక సీఎస్‌కే కాస్త తడబడింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చినట్లు కనిపించాడు. ఈ దశలో విల్ జాక్స్, నమన్ ధిర్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సీఎస్‌కే ఆటగాళ్లను కట్టడి చేసి పరుగులు రానివ్వకుండా చేశారు.
అయితే అప్పటిదాకా అద్బుతంగా బౌలింగ్ చేసిన విజ్ఞేశ్ పుథుర్‌ను 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు దించి ముంబై కెప్టెన్ స్కై పెద్ద తప్పు చేశాడు. ఆ ఓవర్‌లో రచిన్ చెలరేగిపోయి 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లోనే ముంబై ఓటమి ఖరారైపోయింది. 19వ ఓవర్‌లో నమన్ ధిర్ జడ్డూ వికెట్ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చినా చివరి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ధోని సూర్యకుమార్‌ను మెరుపు స్టంపింగ్ చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ స్పందిస్తూ.. మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అయినా మా కుర్రాళ్ల పోరాటం ప్రశంసనీయం. యువకులకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఇండియన్స్ ప్రసిద్ధి చెందింది . ఎంఐ స్కౌట్స్ ఏడాదిలో 10 నెలలు టాలెంట్‌ను వెతికే పనిలో ఉంటారు. విజ్ఞేశ్ పుథుర్ దాని ఫలితమే. తొలి మ్యాచ్‌లోనే విజ్ఞేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి తిరిగి తమను మ్యాచ్‌లోకి తెచ్చాడు.
ఆట లోతుగా సాగితే అతని కోసమని ఓ ఓవర్‌ను స్పేర్‌గా ఉంచాను. అది మిస్ ఫైర్ అయ్యింది. 18వ ఓవర్ విజ్ఞేశ్‌కు ఇచ్చి తప్పు చేశాను. మ్యాచ్ జరుగుతుండగా మంచు ప్రభావం లేదు. కానీ కాస్త జిగటగా ఉండింది. రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం మ్యాచ్‌ను మా నుండి దూరం చేసింది. ఇది తొలి మ్యాచే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నాడు. కాగా, ముంబై తమ రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 29న అహ్మదాబాద్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment