
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
రోహిత్ 209 ఇన్నింగ్స్‌ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. పోలార్డ్ 171 ఇన్నింగ్స్‌ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్‌ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్‌ల్లో 2416 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే, సీఎస్‌కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్‌లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17), సాంట్నర్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో అశ్విన్, ఇల్లిస్ కూడా తలో వికెట్ తీశారు.
ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్‌కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్‌కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్‌కేకు దడ పుట్టించాడు. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్‌కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది.