IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన రోహిత్‌ శర్మ | IPL 2025: Rohit Sharma Equals Unwanted Record For Duck Against CSK | Sakshi
Sakshi News home page

IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన రోహిత్‌ శర్మ

Published Mon, Mar 24 2025 10:56 AM | Last Updated on Mon, Mar 24 2025 11:16 AM

IPL 2025: Rohit Sharma Equals Unwanted Record For Duck Against CSK

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదర్కొని డకౌటైన హిట్‌మ్యాన్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా నిలిచాడు. 

ఈ చెత్త రికార్డును రోహిత్‌.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌లతో కలిసి షేర్‌ చేసుకున్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 18 సార్లు ఖాతా తెరవకుండా నిష్క్రమించారు. రోహిత్‌ 253 ఇన్నింగ్స్‌ల్లో 18 సార్లు డకౌట్‌ కాగా.. మ్యాక్సీ 129, డీకే 234 ఇన్నింగ్స్‌ల్లోనే 18 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. సీఎస్‌కే ముంబైపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై బ్యాటర్ల వైఫల్యం కారణంగా 155 పరుగులకే పరిమితమైంది. 

సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 4 వికెట్లు తీసి ముంబైకి కళ్లెం వేశాడు. పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ కూడా రాణించి 3 వికెట్లు తీశాడు. ఇల్లిస్‌, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో తిలక్‌ వర్మ (31) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (29), దీపక్‌ చాహర్‌ (28 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం ఛేదనకు దిగిన సీఎస్‌కే ఆదిలోనే ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (2) వికెట్‌ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత పుంజుకుంది. రచిన్‌ రవీంద్ర (65 నాటౌట్‌), కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (53) మెరుపు అర్ద సెంచరీలు సాధించి సీఎస్‌కేను గెలిపించారు. రుతురాజ్‌ 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి సీఎస్‌కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 

ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినప్పటికీ అద్భుతంగా ప్రతిఘటించింది. స్వల్ప స్కోర్‌ను కాపాడుకనేందుకు ముంబై బౌలర్లు విశ్వప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా అరంగేట్రం​ స్పిన్నర్‌ విజ్ఞేశ్‌ పుథుర్‌ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఓ దశలో సీఎస్‌కేకు దడ పుట్టించాడు. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్‌ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement