ప్రమాదకర ధోరణి | Violent Protest During Bharat Bandh By Dalits In India | Sakshi
Sakshi News home page

ప్రమాదకర ధోరణి

Published Wed, Apr 4 2018 12:18 AM | Last Updated on Wed, Apr 4 2018 12:28 AM

Violent Protest During Bharat Bandh By Dalits In India - Sakshi

సమస్య వచ్చిపడినప్పుడు నాన్చుడు ధోరణి అవలంబిస్తే ఫలితం ఎలా ఉంటుందో  ఉత్తరభారతంలో సోమవారం జరిగిన ఉదంతాలు రుజువు చేశాయి. ‘భారత్‌ బంద్‌’ పలు రాష్ట్రాలను రణక్షేత్రాలుగా మార్చింది. 9మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, వందలమంది గాయపడ్డారు. భారీయెత్తున విధ్వంసం చోటుచేసుకుంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు, పోలీసులు విఫలమైనప్పుడు నిరసనలు కట్టుదాటడం రివాజే. కానీ ఈసారి జరిగింది అది కాదు. దళితులు, వారిని వ్యతిరేకించేవారి మధ్య ఘర్షణలు జరిగాయి. తాము ఒకటి రెండుచోట్ల గాల్లోకి మాత్రమే కాల్పులు జరిపామని పోలీసులు చెబుతుంటే, చనిపోయినవారంతా తూటా గాయాల వల్లే కన్నుమూశారు. చానళ్లు చూపిన దృశ్యాల్లో ప్రైవేటు వ్యక్తి ఒకరు ఆందోళనకారుల్ని గురిచూసి కాల్చినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. రాజస్తాన్‌లోని కరౌలీ జిల్లా హిందువాన్‌ నగరంలో తొలినాటి బంద్‌ను నిరసిస్తూ ఆధిపత్య కులాలకు చెంది నవారు మంగళవారం బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఇద్దరు దళిత ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టారు.

ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం వేధింపులకు ఆయుధంగా మారుతున్నదని, అది దుర్వినియోగమవుతున్నదని గత నెల 20న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి, ఆ కేసుల్లోని నిందితుల అరెస్టుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసిన నాటి నుంచీ దళిత వర్గాల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనబడుతూనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని దాదాపు అన్ని పార్టీలూ డిమాండు చేశాయి. బీజేపీలోని దళిత ఎంపీలు సైతం దీనితో శ్రుతి కలిపారు. కేంద్రం సైతం సోమవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. కానీ పదిహేను రోజులపాటు  కేంద్రం వైఖరేమిటో ప్రభుత్వంలోని వారెవరూ చెప్పలేకపోయారు. దళితుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని అంచనా వేయడంలో వైఫల్యం చెందడంవల్ల దురదృష్టకర పరిణామాలు ఏర్పడ్డాయి.

ఏ ప్రధాన రాజకీయ పార్టీ ‘భారత్‌ బంద్‌’కు పిలుపునివ్వలేదన్న సంగతిని ఇక్కడ గుర్తుంచుకోవాలి.  ఉత్తరప్రదేశ్‌ డీజీపీయే ఈ మాట చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రెండురోజులకు జాతీయ దళిత సంస్థల సమాఖ్య(ఎన్‌ఏసీడీఓఆర్‌) తొలిసారి ఈ బంద్‌ పిలుపునిస్తే అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య(ఏఐడీఆర్‌ఎఫ్‌), ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘాలు, మరికొన్ని ఇతర సంస్థలు దానితో గొంతు కలిపాయి. ఆ తర్వాతే బీఎస్‌పీ తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి.  

బంద్‌ పిలుపులు దేశంలో కొత్తగాదు. తమ ఆగ్రహాన్నీ, అసంతృప్తినీ వ్యక్తం చేయడానికి, పాలకుల మెడలు వంచడానికి, సమస్యపై పాలకులు దృష్టి సారించేలా చేయడానికి దాన్నొక ఆయుధంగా వాడుకోవడం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్నదే. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఈ మార్గాన్ని అవలంబిస్తూనే ఉంటాయి. కానీ బంద్‌కు మద్దతుగా దళిత శ్రేణులు ఒకపక్క ఊరేగింపులు తీస్తుం డగా...ఆ బంద్‌ను నిరసిస్తూ మరికొన్ని గుంపులు రంగంలోకి దిగాయి. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకటి రెండు చోట్ల గాల్లోకి కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు.

మరైతే మృతుల్లో అత్యధికులు బుల్లెట్‌ గాయాలతో ఎలా మరణించారు? ఉద్యమానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ఈ పని చేశాయా లేక దళిత శ్రేణులతో తలపడేందుకు వీధుల్లోకొచ్చినవారు ఈ కాల్పులకు తెగబడ్డారా అన్నది తేలాలి. మరణించిన 9మందిలో ఏడుగురు దళితులే కావడం వల్ల ఇది ప్రత్యర్థివర్గాల పనికావొచ్చునన్న సందేహాలు సహజంగానే తలెత్తుతాయి.  సమస్య ఎదురైనప్పుడు సకాలంలో స్పందించడం ప్రభుత్వాల కనీస ధర్మం. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు విషయంలో కేంద్రం సాచివేత ధోరణి అవ లంబించినట్టే, సోమవారంనాటి బంద్‌ తీవ్రతను అంచనా వేయడంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

ప్రధాన పార్టీలు ఇచ్చిన బంద్‌ పిలుపు కాదు గనుక దీని ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేసి ఉంటే అక్కడి ప్రభుత్వాలు తమ తమ ఇంటెలిజెన్స్‌ సంస్థలను ప్రక్షాళన చేసు కోవడం ఉత్తమం. ఈ బంద్‌ను ప్రతిఘటించాలని ఆధిపత్య కులాలవారు నిర్ణయిం చిన సంగతిని కూడా ఈ సంస్థలు పసిగట్టలేకపోయాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్వీటర్‌ వంటి సామాజిక మాధ్యమాల ప్రభావం అమితంగా ఉన్న ఈ కాలంలో ఎలాంటి సమాచారమైనా, సందేశమైనా క్షణాల్లో లక్షలమందికి సులభంగా చేరు తుందని గూఢచార విభాగాలు గుర్తించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

హింసకు దిగినవారెవరు... వారి ఉద్దేశాలేమిటన్న సంగతలా ఉంచితే ప్రధాన రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండానే వేలాదిమంది దళితులు వీధుల్లోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ రక్షణకుద్దేశించిన చట్టం తగినంత ఆసరా ఇవ్వలేకపోతున్నదని, సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానంగా అది మరింత నీరు గారుతుందని వారు ఆందోళన చెంది ఉండొచ్చు. వాదప్రతివాదాల సమయంలో ప్రభుత్వం తరఫున సమర్ధవంతమైన వాదన వినిపించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. గత అయిదేళ్లలో దళితులపై దాడులు బాగా పెరిగాయని నిరుడు విడుదలైన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో లెక్కగట్టింది. 2009–15 మధ్య ఈ చట్టం కింద తప్పుడు కేసుల పెట్టడం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది.

వీటిని విస్మరించి శిక్షల శాతం తక్కువగా ఉన్నదన్న కారణంతో చట్టం దుర్వినియోగమవుతున్నదన్న నిర్ణయానికి రావడం సబబు కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు స్టే ఇవ్వడానికి నిరాకరించినా, తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది గనుక ఈసారైనా అవసరమైన గణాంకాలతో సమర్ధవంతమైన వాదనలు వినిపించి దళితుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడటం ముఖ్యం. ఈ దిశగా కేంద్రం అడుగులేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement